Saturday, 15 December 2018

10801 - 10900

10801. దాహం తీర్చేందుకో ఋతువు రావాలి..
ప్రేమ ప్రవాహమై నిన్ను తడపాలంటే..
10802. కాలంతో పనేముందిప్పుడు..
మంచి పనికని ముందడుగు వేయాలనుకున్నాక..
10803. ధనుర్మాసం మొదలయ్యిందిగా..
ముగ్గులతో పాటు కీర్తనలతో నిన్నాకట్టేందుకు..
10804. పన్నీరు కురిసినందుకున్నా..
నీ నవ్వులజల్లని నే గమనించనప్పుడు..
10805. జ్ఞాపకం పరిపాటయ్యింది..
మౌనాన్నిలా ఆవహిస్తూ..
10806. మౌనమెటో పారిపోతుంది..
నీ పలకరింపుతో ఎద పులకరించినప్పుడల్లా..
10807. ఊపిరాగిపోతున్న క్షణాలవి..
ఊహల సరిహద్దుల్లో మనము నిలబడ్డవి..
10808. భావాల ఊరేగింపది..
అక్షరాల గుంపు అమాంతంగా చుట్టుముట్టినది..
10809. అమృతమెంత తాగాలో నేను..
అమరమై నీలో మిగిలిపోవాలంటే..
10810. నిద్దుర కరువవుతుందా కోయిలకు..
ఋతువులన్నిటా నిన్నే పాడుకుంటూ..
10811. కలలన్నీ కథలుగా మార్చేసా..
మన కబుర్లుగా మలచుకోవచ్చని..
10812. నియమాలెన్నున్నా మార్చుకుంటా..
నా జాబిలి నువ్వవుతావని మాటిచ్చావుగా..
10813. నా నవ్వులు సంగీతాలేగా..
నీలో జీవనోత్సాహాలు నింపుతున్నాయంటే..
10814. జ్ఞాపకాలను పాతిపెట్టేసా..
కొత్త పాటను పాడాలనే నిర్ణయంలో..
10815. అనుభూతుల రసాన్ని తాగాలనిపిస్తుంది..
నీ అక్షరాలందుకే దాచుకుంటుంటా..
10816. నిన్నటి పున్నమి నేటికి అమావస్యయింది..
స్వప్నాలను పొదగడం మానేసా నేనందుకే..
10817. దాచుకోలేనిక మనసు భావాలు..
నా కన్నులిలా చెమరిస్తుంటే..
10818. మార్దవం మొలకెత్తిందిలా..
నీ భావాలజల్లు నాపై కురవగానే..
10819.అనుభూతి లెక్క తేలకుంది..
ప్రేమ పరిమళం రెట్టింపైనందుకేమో..
10820. ఎగురుతున్న వర్ణాలెన్నో నాలోన..
సీతాకోకచిలుకలా మారిందేమో మనసు..
10821. నువ్వెప్పుడూ గోలవే..
మన అనురాగాన్ని అద్భుతంగా ఆలపిస్తూ..
10822. కనురెప్పలు మూసుకున్నానలా..
మోయలేని హాయిని మదికి కానుకిచ్చేలా..
10823. ఎప్పుడుపడితే అప్పుడు ఆరగించకలా..
అందం అలలై తుళ్ళిపడేలా..
10824. క్షణాల్ని పదేపదే మీటకలా..
నిశ్శబ్ద జపాన్ని చేస్తుంటాయవి..
10825. నా కలలకీ పరిమళమెక్కడిదో..
నిన్ను మాలికగా రాయమనేమో..
10826. నువ్వూ నేనూ కలుసుకోనేలేదు..
వానొచ్చి వృధా అయిపోయింది..
10827.
మదిలో చోటిచ్చా నీకు..
ఏకాంతంలో మనం కలిసుండొచ్చనే..
10828. మధువొలకబోసానెప్పుడో..
పున్నమి కోసం ఎదురుచూస్తున్నావని తెలీక..
10829. అందుకున్న అభినందన నిజమేగా..
నీ మనసిటు పరుగులెత్తిందంటే..
10830. శాంతినెక్కడో వెతుకుతావు..
నీ ప్రశాంతతలో నేనున్నానని తెలుసుకోక..
10831. మురిపాలు బానే పోగుచేస్తావు..
నా అలుకలేమాత్రం పట్టించుకోనట్టు..
10832. మాధుర్యమంటే మనసుదే..
వసంతం తిరిగొస్తుందని ఇన్నాళ్ళు వేచినందుకు..
10833. కాలమెందుకు భారంగా నడుస్తుందో..
చలికి వణుకుతున్నది నేనయితే..
10834. మనసుకి పనేముంది..
నీమీద అలిగినప్పుడల్లా మౌనాన్ని నటించడమే..
10835. ఆగనంటూ జ్ఞాపకాలు..
ఈ శీతలవేళ కాలాన్ని రెచ్చగొడుతూ..
10836. నా నవ్వులెంతిష్టమో నీకు..
విరిసే పువ్వులతోనే పోలుస్తుంటావెప్పుడూ..
10837. తలపలా కరిగిపోయింది..
నిశ్శబ్దాన్ని భరించలేక నే నిద్రపోగానే..
10838. ఎన్నోసార్లు జన్మించాలనిపిస్తుంది..
కొన్ని జ్ఞాపకాలనలా నెమరేస్తూ మనసుంటుంటే..
10839. విరహమసలు నాకెందుకు..
కన్నుల్లో మెరుపుగా నువ్వలా వెలుగుతుంటే..
10840. ఏకాకితనాన్ని భరించలేను..
నిత్యం నీ అలికిడి వినబడాల్సిందే..
10841. వసంతానికని తొందరెందుకు..
చల్లని మేఘం హేమంతమై కదిలేంతవరకూ..
10842. ఆత్మీయతను దాచేసుకున్నా..
నిన్నో ఇష్టంగా పరిచయించడం దేనికని..
10843. కన్నీటికెంత బలముందో..
కరుగుతున్న హృదయాన్ని ఓదార్చేంత ప్రేమలో..
10844. నీ తలపులే నా రాగాలు..
మౌనాన్ని గానంగా మార్చిన సరదాలు..
10845. ఉషస్సుతో మొదలైంది చురుక్కు..
చెలికాడు చేరువైన కిసుక్కు..
10846. చేజారిన క్షణాలివేగా..
నిశ్శబ్దం మన నడుమొచ్చి చేరినప్పట్నుంచి...
10847. ఆత్మీయమయ్యింది కలమే..
కలలన్నింటినీ మర్చిపోకుండా కాగితంపైన రాస్తూ..
10848. కన్నులు కావడులే..
ఆనందాన్ని కన్నీటినీ సమంగా మోస్తున్నాయవి..
10849. ఆ మలుపులో మొదలైన విరహం..
ప్రేమను దూరం చేసిన నరకం..
10850. మనసు అలిగిందందుకే..
తనకి చెప్పకుండా నిన్ను ప్రేమించానని..
10851. ఆ గుండె తడారదెప్పటికీ..
అమృతం తాగిన మనసక్కడ..
10852. లెక్క తప్పుతున్న జీవితాలెన్నో..
మనసులు కలుపుకోలేని అసూయలలో...
10853. మరలిపోయింది విషాదం..
మనల్ని కలిపిన ఆనందానికి ఋజువుగా..
10854. మనసు గిలిగింతలు అడగకిప్పుడు..
మేను మెలికలతో తుళ్ళిపోతుంది..
10855. ఎప్పుడొచ్చిందో స్వేచ్ఛ..
అక్కడో పక్షి ఎగురుతున్న సవ్వడి..
10856. మధువనానికి చేరువైనప్పుడనుకున్నా..
నీ నవ్వుల పరిమళమే నన్నాకర్షించిందని..
10857. తొలిపరిచయం హృద్యంగమం..
నిశ్చయమైందిగా సంగమం..
10858. మూతబడనంటూ కన్నులు..
అలుకలోని నన్ను నువ్వు చేరదీసేవరకూ..
10859. గెలిచి తీరాల్సిందే జీవితం..
ఓటమెంత తరుముకొస్తున్నా వెనువెంట..
10860. నా మనసు వికసించింది నిజమే..
నువ్వు సంపెంగి పరిమళాన్ని తలచినప్పుడు..
10861. చెక్కిళ్ళెప్పుడూ నీ పరమే..
చిత్తమెంత ఆధీనం తప్పినా..
10862. పదిలమే నీ జ్ఞాపకాలు..
నా ప్రాణం వీగిపోయేంతవరకూ..
 
10863. జగమెప్పుడో జరిగిపోయింది..
నీ జతలో జన్మను తరించమంటూ..
10864. కన్నీటి రుచి మార్చు త్వరగా..
నీ పలుకులు పల్లవిగా మార్చుకోవాలనుంది..
10865. కన్నీటిలో నానలేక ఛస్తున్నా..
మనసుపెట్టి పన్నీరెందుకు కురిపించవో..
10866. మరచిపోయా గతమంతా..
నీ జతలో కొత్తగా జన్మెత్తినట్టుంటే..
10867. కొన్ని ప్రేమలంతే..
హృదయంలో మాత్రమే సజీవమై వెలుగుతుంటాయి..
10868. నీ మనసు తడి తెలిసింది..
పెదవులు సరికొత్తగా ప్రేమను ప్రవచించగానే..
10869. సముద్రానికెన్నడో దూరమయ్యాను..
కన్నీటిరుచికి సరిపోలిందని..
10870. ఎటుచూసినా నీటికి ఎద్దడే..
నింగీనేలా దాహాన్ని కూడబలుక్కున్నట్టు..
10871. విహరించలేని పక్షినయ్యా..
రెక్కలు తెగిన అవకరమొకటి తోడయ్యిందిగా..
10872. తపనల తీయందనమే..
మనసునింకా మాయజేస్తూ..
10873. కన్నీటిని చల్లావెందుకో..
చీకట్లో నేనులిక్కిపడేలా..
10874. మనసప్పుడే ఘనీభవించింది..
దిగులు మేఘమైనందుకే..
10875. రెప్పలు రాల్చేసిన క్షణాలేగానవి..
కన్నీటిని కవితలుగా రాయమంటావా..
10876. రాయిగానే మిగిలిపోతున్నా.. 
దేవతనై నీలో కొలువుండే అదృష్టంలేక..
10877. పండగెప్పుడో పాతబడింది..
తాజా తలపులతో నన్ను కొలవనందుకు..
10878. వరదంటే ఏమోననుకున్నా..
ఆమె కన్నీటితో ముంపొచ్చిందని తెలీక..
10879. తలపులను వదలవెప్పుడూ..
అడుగడుక్కీ  నన్ను వెంటాడే నీడవుతూ..
10880. ఊపిరి నిలిచిపోవడం తెలుస్తోందిప్పుడు..
చూపులకందనంత దూరం జరిగావెందుకో..
 
10881. ఆనందాల కోటలో నేనుంటున్నా..
అవమానాలేవీ వినబడనంత ఎత్తులో..
10882. తపించేందుకు తొందరపెడతావు..
నిద్రొచ్చిందని అబద్దమాడమంటూ..
10883. నే విరిచిన పెదవి హరివిల్లయింది..
వానెప్పుడు కురిసిందో నీలో మరి..
10884. పాటలు పదివేలయ్యాయి..
నీ మాటలు మదిలో దాచుకున్నందుకే..
10885. తలపలా తరుముతూనే ఉంది..
చనువుగా చొరబడేందుకు ఒప్పుకోగానే..
10886. పల్లవులు పదివేలు..
పదాలన్నీ గుమిగూడి మదిని ముట్టడించాక..
10887. స్వప్నాలన్నవి సుదూరమే..
నిద్దుర కరువైనందుకు..
10888. ప్రతిధ్వనిస్తున్న అలజడి..
నువ్వు దూరమైన మదిలోని చప్పుడదేమో..
10889. ఆత్మానందమది నిజమే..
విత్తులుగా చల్లిన విశేషాలు ఫలించినందుకే..
10890. అంతమయ్యే కలలేవీ లేవిక్కడ..
కలమందుకుని నే రాసేస్తున్నాగా..
10891. మనోనేత్రానికి చూపొచ్చింది..
మౌనముద్రందుకే మారింది..
10892. తరుగుతున్న క్షణాలు..
నీకు దూరమవుతున్న నా ఆశల్లా..
10893. చినుకల్లే మొదలైన చెలిమే..
చిరునవ్వుల్లో నన్ను ముంచుతుందిప్పుడు..
10894. కాలాన్ని కదిలించవా..
మనసుగదిలో చీకటి ప్రవేశించి పోనంటుంది..
10895. వలపు వానందుకే కురిపించేసా..
తడిచినంతసేపూ నన్నే తలపోస్తావని..
10896. మృదువైన పరిమళాలవి..
జీవితమందుకే నవ్వడం నేర్చుకుంది చానాళ్ళకి..
10897. చూపు మసకేసినప్పుడనుకున్నా..
గతమింకా కన్నీటిని వర్షించడం ఆపలేదని..
10898. సుమూహర్తం దగ్గరయ్యింది..
ప్రేమించుకున్న స్వరాలకు బాణీలు కట్టేందుకు..
10899. ఇద్దరమూ గెలిచి తీరాల్సిందే ప్రేమలో..
కవనమై లోకంలో పదికాలాలు నిలవాలంటే..
10900. వేణువై విచ్చేసావందుకేగా..
నా పెదవుల్లో రాగమై మెదలాలని..

10701 - 10800

10701. ఏకాంతానికని ఎదురుచూస్తున్నా..
ఊహలు తోడైతే కాసేపలా విహరిద్దామని..
10702. నిరంతరాయంగా నాలో భావాలు..
నిన్ను పదాలతో అర్చించాలనుకోగానే..
10703. ఒంటరితనాన్ని ఏమార్చలేకున్నా..
నీ పిచ్చిలో నన్నుంచి విరహించమన్నందుకు..
10704. సప్తస్వరాలు కలిపా నా నవ్వులో..
సంగీతమంటే నువ్వు ప్రాణం పెడతావనే..
10705. నిశ్శబ్దమెన్ని పాటలు నేర్చిందో..
జ్ఞాపకాలను అదేపనిగా పాడుతోంది..
10706. లేలేత వెన్నెలంటే ఇదేనేమో..
కన్నులదోనెల్లో ప్రేమై విరుస్తుంది..
10707. నా నవ్వులేనవి..
నిండు వసంతమై నిన్ను అభిషేకించాయంటే..
10708. నిన్ను రాయలనే తపన నాకెప్పుడూ..
నీలో సంతోషం పరిమళిస్తే చూడాలని..
10709. కార్తీకం జ్వలిస్తోంది..
నా కన్నుల్లో దీపాలనెప్పుడు చూసిందో..
10710. నాలో అలంకారం..
నిన్నో కవిగా నిలబెట్టాలనే సదుద్దేశ్యం..
10711. నిశ్శబ్దం పిలుస్తోంది..
కలల సవ్వడిని ఆలకించేందుకు రమ్మంటూ..
10712. సహజీవనమెందుకో శూన్యంతో..
నా తలపులెన్నో నీకు కానుకిచ్చినా..
10713. కథలెన్నయినా చెప్తావు..
ఒక్కసారీ కలలో దర్శనం ఇవ్వలేకపోయినా..
10714. కంచికనే మొదలయ్యా..
మధ్యలో చేయి చాయి నిలబడ్డావెందుకో..
10715. తెరలుతెరలుగా నాలో నవ్వు..
విషాదం వలసపోయిన ఆనందానికేమో..
10716. మౌనం రాగమైనట్టుంది..
గుండె వణుకుతున్న సవ్వడి వినిపిస్తోందిగా..
10717. ఉనికి కోల్పోయిన కల..
నే నిద్రకు దూరమైనప్పటినుండీ..
10718. మనసు గాలిలో తేలుతోంది..
మౌనం వలసపోయి మాటొచ్చిందనే..
10719. ఋతువులెన్ని మారితేనేముంది..
నువ్వూనేనూ కలిసినప్పుడంతా పండుగ సందడేగా..
10720. ఋతువులు మరచిన కోయిల నేను..
నువ్వెదురైతే నోరారా పాటలు పాడుకుంటూ..
10721. నా పదాల లాలస మొదలయ్యింది..
నీ పెదాల గుసగుసలకు సమాధానమివ్వాలని..
10722. మైమరచిపోతూనే నేనుంటాలే..
నీ నవ్వులే నాలో ప్రవహిస్తుంటే..
10723. అంతమవని ఆకాశం నువ్వు..
అనంతమై నేను విస్తరిస్తున్నానందుకే..
10724. సౌందర్యాన్ని వెతుకుతావేంటో కన్నీటిలో..
ముసురుకున్న మనసుని ఓదార్చకుండా..
10725. రేయైతే నీవే...
అందని చందమామలా కలలోకి మాత్రమొస్తావు..
10726. పున్నమని గుర్తొచ్చిందిప్పుడే..
ప్రకృతిని నువ్వు పొగడటం మొదలెట్టగానే..
10727. కనులలో నిన్ను బంధించుకున్నా..
మనసైనప్పుడల్లా చూసుకోవాలనే అత్యాశతో..
10728. కన్నీటిని గుండెలో దాచుకున్నా..
ఆనందమొక్కటే నీకు పంచిపెట్టాలని..
10729. వెన్నెలంతా నీ మీదే గుప్పిస్తుంటా..
నా నవ్వులే నీలో ప్రతిథ్వనించాలని..
10730. నేనో జరిగిపోయిన క్షణాన్ని..
గిలిగింతనై నీలో మెదులుతుంటానంతే..
10731. పోగులు పెట్టాలనుంది గతాన్ని..
జ్ఞాపకాల వలలో అల్లడిపోలేక..
10732. అపరిచితమయ్యావెప్పుడో..
కలలో తీరందాటి అదృశ్యమైనప్పుడే..
10733. మసక మసకగా ఆశలు..
జీవితం తప్పిపోయి చానాళ్ళైనట్టుంది..
10734. కాలాన్ని తిట్టిపోయక తప్పట్లేదు.. 
అమాయకత్వం నటించడం నేర్పనందుకు..
10735. మనసందుకే మౌనవించింది..
ముచ్చటైన పరిమళాన్ని ఆస్వాదించడంలో మునిగి..
10736. అనేకమైపోయా నేను..
ఒక్కో మాదిరిగా హృదయాన్ని తడుముకొని..
10737. అందమైన వెలుగప్పుడే ముగిసిపోయింది..
మనసు నిశ్శబ్దాన్ని కప్పుకోగానే..
10738. కదిలిపోక తప్పదేమో..
తృప్తినిచ్చే ముగింపు మృత్యువని తెలియగానే..
10739. రేపటిలోకి అడుగేస్తున్నా..
నీ జ్ఞాపకాలు వెన్నెలదారులై ఆహ్లాదమిస్తుంటే..
10740. రేపటిలోకి అడుగేస్తున్నా..
నీ జ్ఞాపకాలు వెన్నెలదారులై ఆహ్లాదమిస్తుంటే..
10741. మరువాన్నెందుకు మరిచిపోతుంటావో..
మల్లెలతోనవి జతకట్టడం ఇష్టం లేనట్టుగా..
10742. చూపులతో గుచ్చుతావెందుకలా అనుక్షణమూ..
మనసులో ప్రేమను దాచుకుంటూనే..
10743. ఊసులూ ఊహలూ ఒకటయ్యాయిలా..
కలిసిన ఆశలు కలబోసుకున్నందుకేగా..
10744. కలల్లోకి తొంగిచూడకలా..
కేరింతలన్నీ కులుకులయ్యేలా..
10745. మౌనం రాగమైనట్టుంది...!
మనసు కోయిల నిన్ను పాడుతుంటే..
10746. మౌనం రాగమైనట్టుంది...!
నీ వలపు ఉచ్ఛ్వాసతో నా అలుక కరిగిపోతుంటే..
10747. మౌనం రాగమైనట్టుంది...!
గ్రీష్మంలో హేమంతాన్ని ప్రకృతి ప్రదర్శించగానే..
10748. అపురూప క్షణాల ఆయువు పెంచుకున్నా..
గుండెల్లో మన పరిచయాన్ని ముద్రించుకొని..
10749. మునుపటి కోయిలనే నేను..
వసంతమొస్తే వాలేందుకు సిద్ధమవుతూ..
10750. స్వర్గం నిజమేననిపిస్తుంది..
నీ కౌగిలిలో ఇమిడిపోయిన సౌఖ్యానికి..
10751. వియోగాన్నీ ప్రేమిస్తున్నానిప్పుడు..
మన అనుభూతి స్మృతులను ఆహ్లాదిస్తూ..
10752. మనసు పారేసుకున్నానందుకే..
నీ పెదవులతో ఒక్కసారి కలవగానే..
10753. ఐశ్వర్యం నిజమే..
అతని మనసుని మాత్రం నింపలేకపోయింది..
10754. వైరాగ్యం తప్పనిసరైంది..
ఉత్సాహం వలసపోయిందని..
10755. విచిత్రమేనంటాను..
నవ్వులూ వెన్నెల్లూ తప్ప నాలో నువ్వేం చూడలేదంటే..
10756. మనసిచ్చినందుకే మనమయ్యాం..
నేనంటే నువ్వని తెలుసుగా అందరికీ..
10757. ఋతువులు మరచిన కోయిల నేను..
నీ పలకరింపుతో పాటలు పాడేస్తూ..
10758. బరువెక్కుతున్న కనురెప్పలు..
ఇన్నాళ్ళకి మనసు విశ్రాంతి కోరుతున్నట్టుంది..
10759. పగటికలలు కంటావనే ఊరుకున్నా..
రేయంతా ఊహలతో సతమతమవుతావని..
10760. వసంతంతో పనేముందిలే మనకు..
మనసెప్పుడూ పరిమళిస్తూనే ఉంటుంటే..
10761. పుచ్చుకోవడం బాగుంది..
నీ మనసుని తర్జుమా చేసుకున్నప్పుడల్లా..
10762. భావాలకెంత మిడిసిపాటో..
నిన్ను రాసి బంగారమై మెరిసాయని..
10763. ఆనందం భాష్పమయ్యింది నిజమే..
సంతోషాన్ని కన్నుల్లో ఒలికిస్తూ..
10764. మనసివ్వాలనుకున్నానందుకే..
నా గుండెవాకిలి తోసుకు నువ్వొచ్చావని..
10765. మనసు విరిగిందలా..
ముక్కలైన ఆశలన్నిటా మౌనం మొలకెత్తేలా..
10766. ఎన్ని కావ్యాలు రాయాలో నేను..
నీ మాటలు మనసులో దాచుకుంటూ..
10767. చూపులతో చుంబించొద్దన్నానా..
నగుమోము నలుసైపోయేలా నలుగురిలో నీవల్ల..
10768. హేమంతాన్నందుకే పట్టించుకోడం మానేసా..
శిశిరాన్ని దరి చేర్చుకుందామని..
10769. ప్రణయమని ప్రకటించకలా..
ఆనందాన్ని ఇప్పటికిప్పుడు ఇచ్చి పుచ్చుకొనేలా..
10770. శరత్తుని పట్టించుకోవెందుకో..
హేమంతాన్ని చామంతులేసి మరీ ఆహ్వానిస్తూ..
10771. పగటికలలోకెందుకు పిలిచావో..
చిరునవ్వుతూ నీ మదిలోకి అడుగేయమని..
10772. నిజమెంతో తెలుసుకోవాలిప్పుడు..
కొన్ని రాగాలు నిన్ను గుర్తుపట్టమంటూ..
10773. నిశ్వసించడం మానేయాలప్పుడు..
నువ్వు జారిపోతావేమోననే బెంగ మొదలైతే..
10774. సరాగాలు మొదలెట్టకలా..
నాలో గమకాలు తమకాలుగా మారిపోయేలా..
10775. వాస్తవాన్ని ఒప్పుకుంటున్నా..
నిన్ను విస్మరిస్తే మనసు మాటినదని..
10776. ముఖచిత్రం నాదేగా..
ముందుమాటలో నా చిరునవ్వు ఇంకెందుకని..
10777. నువ్వూ నేనూ తమకం..
ప్రత్యేకం కనుకనేగా పరవశం..
10778. అదో ప్రత్యేకమైన కల..
నీలాలు నదులై ప్రవహించాయంటే..
10779. ప్రేమఋతువందుకే ప్రత్యేకం..
మనసు ఎడారైన ఇసుకపూలు పూయిస్తుందని..
10780. తూచడం మానేసా భావాల్ని..
అప్పుడప్పుడూ ఊహని మించిపోతున్నాయని..
10781. మనసందుకే దాచేసుకున్నా..
నాకోసం గుడికట్టి పూజలకే అంకితమైపోతావని..
10782. నీరవం నన్నలరిస్తోంది..
ఒక రాగం హృదయాన్ని మీటినట్టవుతూ..
10783. మనసు అంబరాన్నందుకున్నట్టే..
నీ సుప్రభాతాలు నాతో వికసించుకున్నావుగా..
10784. ఆదమరపు నిత్యమైంది..
నీ స్తుతిలో నేను మైమురుస్తూ..
10785. భావాల కరువు తీరిపోయింది..
మాటలన్నీ మనవే రాస్తున్నాక..
10786. మధురకవిలా మారిపోయావు..
నా కంటినవ్వులనే కొంటెగా ఆరాధిస్తూ..
10787. మనసులో విషాదం..
జీవితాంతం ముద్రించుకున్న నీ జ్ఞాపకం..
10788. నీ అలుకలెంత తీయనివో..
నాలో అనురాగమలా రెట్టింపయ్యేట్టు..
10789. అందం అపూర్వమైంది..
అలుకలోని నన్ను నువ్వు కరిగిస్తూండగానే..
10790. ఆయువు తీరిపోతేనేమి..
సుమమై జన్మెత్తినందుకు పరిమళం శాశ్వతమయ్యిందిగా..
10791. నీ జ్ఞాపకమో పులకరింపు..
నెమరేసినప్పుడల్లా మనసు పరిమళిస్తుంటే..
10792. సమ్మోహనం నిజమే..
నీ రాకతో చిగురాశ మొలకెత్తిందంటే..
10793. పదాలకు తొందరెక్కువైంది..
కాసేపైనా నిన్ను గమ్మత్తులోకి తీసుకుపోవాలని..
10794. ఎన్ని మలుపులు తిరిగేదో జీవితం..
నువ్విప్పటికి కలిసుండకపోతే నా పయనంలో..
10795. నలుగురు మెచ్చే అనుభూతులేగా మనవన్నీ..
మనసు మాలికలై గుండెవాకిలిని తోసుకొస్తుంటే..
10796. కథనే రాయమన్నాగా..
నిత్యం వేకువై నిన్ను మేలుకొల్పుతానంటూ..
10797. మనసెప్పుడూ అద్వైతమే..
ఎంత చదివినా అర్ధంకాక మిగిలిపోతూ..
10798. ముచ్చట్లకింకా సమయం రాలేదు..
మూఢాలు మూడురోజులని ముక్తాయింపు..
10799. అమరత్వం సిద్ధించినట్టేగా..
ఒకరికొకరు ఒకరిలోఒకరు ఒక్కటిగా లీనమైనామంటే..
10800. నానార్ధాలు వెతికే తీరికలేదిప్పుడు..
కలలు కనేందుకు సమయమవుతుంటే..

 

10601 - 10700

10601. నాలో నేను మాయమైనప్పుడే అనుకున్నా..
నాకు తెలీకుండా ఎవరో చేరుంటారని..
10602. పరిమళిస్తున్న క్షణాలలో నేనుండిపోయా..
జ్ఞాపకాన్ని కవిత్వంగా రాద్దామని..
10603. కొన్ని ప్రవాహాలంతే..
వాక్యాలన్నీ కలిసిన కవితల్లా ఉరకలేస్తాయి..
10604. ఆకాశాన్ని చుట్టాలనుకున్నందుకేమో..
మనసుకి రెక్కలు మొలవడం చూసుకుంటున్నా...
10605. గాలి కలవరింతలు..
నీ సందేశాన్నేదో నాకు చేరవేస్తున్నట్టుగా...
10606. నా భావంలోని అనుభూతివే నీవు..
మనసులో తచ్చాడే ఆనందానికి ప్రతీకవు..
10607. నన్ను నీలో గుర్తించవెప్పటికీ..
జ్ఞాపకాలను వెతుక్కొనే పనిలోపడి..
10608. నిండుగోళాలతో నన్ను పోల్చకు..
నీపై ఒక్కసారైనా కురవకుండానే..
10609. అందుకున్నాలే పరవశాలు..
కొన్ని అనుభూతులైనా గాలి మోసుకొచ్చిందనే..
10610. విలపించడం నేర్చింది మనసు..
పదేపదే శూన్యాన్ని వెతుక్కుంటూ..
10611. ఒక్క జ్ఞాపకం చాలుగా..
నీతో సహజీవనాన్ని కొనసాగించేందుకు..
10612. నిశ్శబ్దం నేస్తమయ్యిందిప్పుడు..
కురుస్తున్న విషాదపు శబ్దాన్ని ఆలకిస్తున్నందుకు..
10613. వెన్నెల కరిగినప్పుడనుకున్నాను..
నీ కవితలోని పున్నమి వెచ్చనయ్యుంటుందని..
10614. నాకు నేను స్పందించుకున్నా..
నాలోని నిన్ను కలుసుకోగానే..
10615. వెనక్కు రానంటోంది కాలం..
ఉన్నప్పుడు దుర్వినియోగమయ్యిందని  తెలుసుకొని..
10616. నన్ను గెలిపించడం కోసమేగా..
ఆటపాటలన్నింటికీ అన్యాయంగా దూరమయ్యావు..
10617. బృందావనంలో నేనుండిపోతున్నా..
మధురానుభూతులను ఊహల్లోకి రమ్మని సైగచేస్తూ..
10618. శూన్యమెందుకు ఉలికిపడుతుందో..
నీ ఎదురుచూపుల్లో నేను మౌనవిస్తుంటే..
10619. చూపుల గిచ్చుళ్ళతోనే కాలం గడిచిపోతుంది..
మనసు కలపమంటే మాట దాటేస్తుంటావెందుకో..
10620. స్మృతుల బలమలాంటిదేమో..
బలహీనమైన మనసుకి ఓదార్పు మందవుతుంది..
10621. నేనో మధురసాన్నే..
తాగాలనే తగని ఆరాటం నీకుండాలంతే..
10622. కాలమలా కరుగుతుంది..
కొన్ని జ్ఞాపకాలను వద్దన్నా నాకంటగట్టి..
10623. మనసుకెన్ని భావాలుంటేనేమి..
పరిమళించని పువ్వుల్లా అక్షరాలు అలరించనంటుంటే..
10624. ఋతువులకు అతీతమైన వర్షం..
నా కన్నుల్లో కురుస్తోందెందుకో. 
10625. చీకటిని కలవరిస్తున్నా..
కన్నుల్లో నీ రూపం స్పష్టమవుతుందని..
10626. వాదించడమే అనవసరం.
కొందరు మూర్ఖులను గెలవాలనుకోవడం వ్యర్ధం..
10627. విషాదాన్ని వెంటేసుకు తిరక్కలా..
వసంతం వెనుకడుగేసి వలసపోగలదలా..
10628. అక్షరాలు బరువెక్కిన మాటలవి..
ఎప్పుడూ పాడని పాటలుగా..
10629. గంపెడు కలలను కుమ్మరించావు..
గుప్పెడు ప్రేమను కోరుకున్నందుకేమో..
10630. అభిరుచుల్ని ప్రేమిస్తున్నానందుకే..
మనుషుల ప్రేమలో స్వార్ధాల్ని జయించలేకనే..
10631. సంతోషాల్ని ఆహ్వానించడం నేర్వాలి..
ఎదుటివారి విజయాన్ని ప్రేమిస్తూ..
10632. నిన్నెప్పుడో సంకల్పించుకున్నా..
నా కలలకు దూరమవాలనుకోవడం భ్రమ..
10633. దాచాలనుకున్నా గాయాల్ని..
పదేపదే జ్ఞాపకాలుగా సలుపుతాయని తెలీక..
10634. అక్కడో శిశిరం చిగురించింది..
వరమిచ్చింది వసంతమే కాబోలు..
10635. అద్దం అబద్దం చెప్తున్నట్లుంది..
నాదికాని ప్రతిబింబాన్ని చూపిస్తూ..
10636. కొన్ని నవ్వులందుకే మిగుల్చుకున్నా..
పరిమళాలద్ది నీతో పంచుకోవాలని..
10637. నిష్క్రమించిన నిశ్శబ్దం..
లోపలి స్వరంలోని ఏ మాధుర్యానికో..
10638. అద్భుతాన్నే నేనెప్పుడూ..
రోజుకో కవనమల్లి నన్ను ఆరాధిస్తున్నావంటే..
10639. క్షణాల వెంట పరుగాపవు..
నా అడుగులెక్కడ కనుమరుగవుతాయోనని..
10640. అర్ధమైతే నేనెందుకు అతివనవుతానో..
అద్వైతానికి సమానమవుతాను కానీ
10642. నవ్వుల అమ్ములపొదిలో ఎన్నస్త్రాలో..
నీ మనసుని సంధించాలనుకున్నప్పుడల్లా..
10643. ప్రాణానికి విలువేముందసలు..
ప్రేమరాహిత్యంలో మునిగిపోయాక..
10644. నీకు దూరమైనప్పుడనుకున్నా..
నేను సజీవమన్నది ఒక కల్పనేనని..
10645. ఆనందాన్నలా పోగొట్టుకున్నా..
చిరునవ్వుతోనైనా కొన్ని సమస్యలు జయించలేక..
10646. చదరంగమే జీవితం..
ఎత్తుకు పైఎత్తులతో దాన్ని గెలవాలంతే..
 
10647. పదనిసల్లో పలికిస్తున్నా..
ప్రేమగా ఎదిగిన మన పరిచయాన్ని..
10648. మందారాన్ని పదేపదే వేధించకలా..
పెదవులతో పోల్చిమరీ సిగ్గుపడేలా..
10649. వెన్నెల చిక్కనైంది నీవల్లే..
అమాసని మరువడంలో వింతేముందైతే..
10650. విశేషమే అప్పుడప్పుడూ..
పలకరింపు వంకపెట్టి పదేపదే పొగుడుతుంటే..
10651. కాలమెందుకింత బరువో..
నిన్ను దూరం చేసిన విధినడగాలి.. 
10652. ఎప్పుడు మొదలైందో నాలో వాన..
కవిత్వమని దానికి ముద్దుపేరు పెట్టేసుకున్నా 
10653. నిద్దురనే కలగంటున్నా..
జ్ఞాపకాల వీధుల్లో మది విహరిస్తుంటే..! 
10654. ఆత్మానందమంటే నాదే..
ఉషోదయానికి నీ తలపులు సిద్ధమైతే..
10655. అక్షరాన్నెన్నడూ విడువకు..
ప్రవహిస్తున్న కన్నీరు ఆరిపోగలదు ఓనాటికి..
10656. జ్ఞాపకాలెన్ని మరలొస్తేనేమి..
చిరునవ్వు చిగురించలేనంటుంటే..
10657. ఆపేయాలనుంది కాలాన్ని..
నీ సమక్షాన్ని తనివితీరా ఆస్వాదించాలని..
10658. మౌనమిన్నాళ్ళకి కరిగింది..
నీ మాటలు మనసుని కదిలించగానే..
10659. నిశ్శబ్దాన్ని ఆలకిస్తున్నా..
ప్రవహిస్తున్న నీలివెన్నెల సన్నగా సాగుతుంటే..
10660. నీ చూపు నేనవుతున్నా..
అందాలలోకాన్ని కలిసి ఆరాధిద్దామని..
10661. నెలవంకలైతేనేమి కన్నులు..
కావల్సినంత ప్రేమను వెన్నెలగా మార్చేసాయిగా..
10662. కలదిరిగేవెందుకో మనసంతా..
ఒక్కసారి జ్ఞాపకాన్నిలా నే తడుముకోగానే..
10663. మైమరచిపోతున్నా ప్రతిసారీ..
పదేపదే ఊహల్లో నువ్వలా కవ్విస్తుంటే..
10664. వినిపిస్తోందింకా..
సగంలో నువ్వాపిన పాటనుకుంటా..
10665. పిలవకలా పదిమార్లు..
నలుగురిలో కలవరం దాచలేక ఛస్తున్నా..
10666. పూబంతులమే మనమెప్పుడూ..
నిత్యం పెదవులపై నవ్వులు విరబూసుకుంటూ..
10667. ఊహల్లోకి జారిపోయానలా..
నీ కవిత్వం చేసిన మాయనుకుంటానది..
10668. శూన్యమెటో వలసపోయింది..
నీ తలపులు ప్రవహించడం మొదలవ్వగానే.. 
10669. మట్టివాసనై పరిమళిస్తున్నా..
ప్రకృతిలో లీనమైనందుకేమో..
10670. అదే పాట..
గతజన్మల మన అనుబంధాన్ని గుర్తుచేస్తూ..
10671. చూపులెప్పుడూ చుక్కల్లోనే..
కొన్ని ఏకాంతాల ఆస్వాదనలో మైమురిసేలా..
10672. ఒద్దికలేని కాలం..
మనసుని తడుపుతూ ప్రవహిస్తోంది ఎన్నాళ్ళైనా..
10673. మౌనాన్ని పాడుకుంటోంది మనసు..
వలపులన్నీ తన సొంతమైనందుకు..
10674. వ్యసనమైతేనేం జ్ఞాపకం..
నవవసంతంలా నాలో నవ్వులు పూయించేదదేగా.. 
10675. కాలమంతే..
మనోభావాల్ని పట్టించుకోక పరుగుతీస్తుందేం గెలవాలనో..
10676. శివంగా ఎప్పుడు మారతావో..
పీడకలలను తప్పించుకుంటూ నువ్వు..
10677. ఎప్పుడు మారతావో నువ్వు..
మనోభావాల్లోనూ నవ్వులు నింపుకొనేలా..
10678. కల్లోకొద్దామని చూస్తున్నా..
నిదురంటూ నిన్ను చేరుకోగలిగితే ఈరాతిరి..
10679. ఉషస్సులన్నీ నా కన్నుల్లోనేగా..
చూపుని కలిపేందుకు సంకోచిస్తావెందుకో..
10680. మనసందుకే స్పందిస్తోంది..
తీయదనం నిన్ను తాకిందో లేదోనని..
10681. మాటలతో పనేముందిలే..
మౌనంతో మనసు మంతనాలు జరుపుతున్నప్పుడు..
10682. మనసంతే..
మౌనాన్ని మరచి మాటలు కలిపేస్తుంది అలుకలు మోయలేక..
10683. ఆనందాన్ని దాచుకోవాలనుకుంటా..
కొన్ని అనుభూతులు సొంతం అనుకుంటే..
10684. తప్పిపోయిన నా కల..
నిద్దరోయి చానాళ్ళయ్యంది మరి..
10685. అమాసను తలుచుకుంటూ జీవితాన్ని వ్యర్ధమనుకోకు..
దీపావళి పండుగ చేసుకోవచ్చని సంబరపడు..
10686. జీవితమెప్పుడూ పోరాటమే..
మాట నెగ్గించుకోవాలనే నిరంతర ఆరాటంలో..
10687. మృత్యువంటే భయంలేదు నాకెప్పుడూ..
మరపురాని స్మృతులేగా మనవన్నీ..
10688. ఎదురుచూపుని గెలిపించాలనొచ్చా..
నిరీక్షణ నాకోసమేనని మనసు చెప్పింది..
10689. ఆరాధనంతా నీకొరకేలే..
మనసుపడ్డది నీమీదేనని..
10690. ప్రతిరోజూ ఛస్తున్నా..
నాకిష్టమైన మాట నువ్వంటావో లేదోనని..
10691. దీపావళి లేనట్టుంది నాకు..
స్వేచ్ఛనింకా కలగంటూనే ఉన్నాగా..
10692. ఉక్కిరిబిక్కిరవుతున్నా ఆనందంలో..
నీ అనుభూతిలో నేను భాగమయ్యానని..
10693. అనుబంధం అర్ధమయ్యింది..
నీ అక్షరాలన్నిటా నన్ను చదువుకున్నాక..
10694. తలపుల్లోనే తారాడుతుంటావెందుకో..
తలుపు తీసి రాయబారాలెన్ని పంపుతున్నా..
10695. ఆనందభాష్పానికి పరిమళముంటుందని తెలిసింది..
నా అక్షరాన్ని శ్వాసిస్తున్నావంటే..
10696. ఉప్పెనంటే ఏమోననుకున్నా..
నన్ను చూసిన ఆనందం నీ కన్నుల్లో చూడనప్పుడు..
10697. ఊహలన్నీ దాచేసా..
మన యుగళంలో పల్లవిగా చేర్చేసుకుందామని..
10698. పదాలు వెల్లువవుతున్నాయలా..
హృదయాన్ని ఒలికిద్దామనుకున్నందుకే..
10699. అక్షరబంధమొక్కటే మిగిలింది..
మనసుపెట్టి నిశ్శబ్దాన్ని వినాలనుకున్నందుకు నేను..
10700. నా ఎదుట నువ్వేగా..
వేరే అలజడేముందిక ఎదలో..