Thursday, 10 March 2016

3251 to 3300

3251. మానవత్వం మరుగున పడింది..
ఆకృతి పచ్చచీరను కట్టిందనే..
3252. వేటూరిని అనుసరించమన్నానందుకే..
సిరివెన్నెలైతే పట్టుబడిపోతావనే..
3253. చిలికిన మనసు మధువయ్యిందేమో..
వెన్ననవ్వులను పైకి తేలించి..
3253. వర్షమంటే నీకూ ఇష్టమేగా..
నీ జ్ఞాపకాలతో నన్నేడిపిస్తూ..
3254. నా మోమంతా వెన్నెలే..
రాకాచంద్రుడివై నువ్వు నవ్వినప్పుడల్లా..
3255. దరహాసలిపిలో నీతో సంభాషిస్తున్నా..
మాట్లాడితే నానార్ధాలు వెతుకుతున్నావనే..
3256. మనసు నిండినందుకేమో..
స్వార్ధం పొంగుతోంది..
3257. నీ చనువును గమనిస్తూనే ఉన్నా..
నా మోముకి చూపులను గుచ్చినప్పుడల్లా..
3258. మనసులో నువ్వెప్పుడూ దొంగవే..
నా ఊహను కాజేసినందుకు..
3259. ఒంటరితనం మాలిమయ్యింది..
కన్నులు నిద్దురను దూరం పెట్టాయనే..
3260. మల్లెలు నోటకరవద్దన్నా..
ఆకలేస్తే అన్నంలో కూరేసి పెడదామనే..
3261. గుండెను వేదిక చేయొద్దన్నానందుకే..
అడుగుల సవ్వళ్ళకు అదిరిపోతావనే..
3262. తిరిగొచ్చిన తరంగం చెప్పిందిలే..
నువ్వింకా ఆనందంగానే ఉన్నావని..
3263. త్రివేణిసంగమమైందని భ్రమపడ్డా..
మదిమడుగులో నువ్వు కాలు మోపగానే..
3264. సంబరమైన సంతోషం..
నీ హృదిలో ప్రవహిస్తే చెమరిస్తావని..
3265. ఎదుగుతున్నాడని గమనించలేదేమో..
సద్విమర్శనూ చిన్నతనంగా భావిస్తూ పాపం..
3266. అంతరంగానికెప్పుడూ అసంతృప్తే..
గుర్తింపుకు నోచుకోని తన అస్తిత్వంతో..
3267. నిన్ను నాకు దూరం చేసింది..
మౌనం ముసుగు లోకానికి నచ్చినందుకే..
3268. మిణుకుమన్న ఆశ చిగురించింది..
నువ్వన్న మాటలకి మురిసినందుకే 
3269. మొత్తానికొప్పుకున్నావు..
నేనెడ్డెమంటే నువ్వు తెడ్డెమనే రకమని..
3270. మనసును విశాలం చేసాలే..
నువ్వు నిత్యకొలువుండే దేవాలమదేనని..
3271. ఒకటినై చేరి విలువ పెంచాలనుకున్నా..
నువ్వో శూన్యంగా అలా మిగిలిపోరాదనే..
3272. ఆనంద వీచికలు..
అలుపెరుగని కెరటాల అనురాగపు సవ్వళ్ళు..
3273. కనుగప్పి తిరగాలేమో..
లోకుల కన్నులు కాకులతో సమానమనుకుంటే..
3274. మూసిన రెప్పలపైనా వెలుగులు..
కిలకిలమను స్వప్నాలలో నువ్వున్నందుకు..
3275. నిజమో ఆవేదనే..
ఒప్పించి మెప్పించలేనప్పుడు..దాచి లాభంలేనప్పుడు..
3276. తనడిగినప్పుడే అనుకున్నా..
రహస్యానికి మసాలాపూసి చెప్పింది నువ్వేనని..
3277. ఊహలకందని రహస్యమే..
నీ భావంలో అక్షరం నేనేనంటే..
3278. సహజమే..
నన్నూహించని రోజు నీది కాదంటే..
3279. నా తలపు రహస్యం..
నీ వలపులోగిలిలో తచ్చాటలేగా..
3280. ప్రణయవేదాన్ని నిజమని నమ్మలేకపోయా..
నీ చూపుల్లో చదివేంతవరకూ..
3281. నక్షత్రాలు నవ్వుకుంటున్నాయి..
వెన్నెలొచ్చి జాబిల్లిని రహస్యాలు ఆరాతీస్తుంటే..
3282. ఓడిపోయిన చూపు..
నీ మదిలో రహస్యం పూలజల్లయ్యాక..
3283. పురివిప్పుకున్న రహస్యమొకటి..
నీ మాటల ముసుర్లకు ఆగలేక..
3284. స్వీయసందేహాలు..
రహస్యం రాహువుతో కూడి ముసుగేసుకుందని..
3285. 
అనంతమైన ఆకాశంలో రహస్యంలా నేను..
నీ మదిలో ఎక్కడున్నానో తెలియక..
3286. గుప్పిట మూసేసా రహస్యాన్ని..
నిజాన్ని సమాధి చేసేద్దామని..
3287. రహస్యం రంగులద్దుకొంది..
ఆవేదన అక్షరాలుగా మార్చే క్రమంలోనే..
3288. నల్లబడ్డ రహస్యం..
కృష్ణపక్షానికే నీ జ్ఞాపకాలు తడుముతున్నాయని..
3289. నీ చూపులకెప్పుడూ చమత్కారాలే..
మది దాచుకున్న రహస్యాలను శోధించే చిలిపి నవ్వుతో..
3290. చంద్రుడ్ని చూడటం మానేసావందుకేనా..
కన్నులు నీకు అరువివ్వలేదని..
3291. రహస్యాలంతే..
మనసుల్ని మలుపు తిప్పి దూరం చేసేస్తూ..
3292. రహస్యం రాయంచయ్యింది..
నువ్వు ముద్దుచేస్తే గారాలు పోవాలని..
3293. .ఆగిపోయిందక్కడే..
ఏడో అడుగు ఖరీదైనదనేమో.
3294. 
. కవిత్వం అంటే ఒళ్ళుమంటాయనకి..
తనని కాదని హత్తుకున్నందుకేమో
3295. కోతలను నమ్మనంటున్న మనసు..
నీకు తప్ప మరెవరికీ తెలియని రహస్యాలు వెల్లడవుతుంటే..
3296. గగనమెగిసిన కల..
నిన్నంతా నిద్దురలోనే గడిచిందని గుర్తొచ్చి..
3297. 
నవ్వుతూనే ఉన్నానందుకే..
కార్తీక వెన్నెల్లు మదిలో కురిపించాలని
3298. 
గుసగుసలాడుతుంటే తూనీగనుకుంది చెలి..
నువ్వెప్పుడో ఏడింటికే నిద్దురపోయావని.
3299. నీరుగారిపోతున్నా నేనే..
నీ నీరవంలో రవళించేది నువ్వేనంటుంటే..
3300. నిన్నూ నన్ను కలిపిన ఏకాంతం..
అపర్ధాల మబ్బులను ముచ్చటగా కరిగించమంటూ..

No comments:

Post a Comment