Tuesday, 7 March 2017

6001 to 6100

6001. నా ప్రణయాన్ని గెలిపించుకున్నా..
జీవితాన్ని కానుక చేసి..
6002. వెతుక్కోవడం మానేసా నన్ను..
కవిత్వానికి పట్టుబడ్డానని తెలిసాక..
6003. సంతోషాన్ని మోసుకొచ్చేసా..
నాకై స్వప్నాల్లోనూ ఎదురు చూస్తున్నావనే..
6004. ఊహలకు ఊపిరందినట్లుంది..
ప్రతిసారీ కొత్తగా జీవితాన్ని చవిచూస్తుంటే..
6005. మెరుపులో కలిసిపోయిన మేఘగర్జన..
చిరునవ్వులో దాచేసిన కన్నీరులా..
6006. నడిచే అందంలా ఆమె..
వినిపించని రాగాలను పాడుకుంటూ.
6007. నన్ను నేను మరచానా చిరునవ్వుల్లో..
కొత్తగా తిరిగి సజీవమైన భావనలో..
6008. లుప్తమైన ఆత్మీయత..
అభద్రతా భావంలో హృదయం చంచలిస్తుంటే..
6009. మది రాగరంజితమవుతుంటే ఏమోననుకున్నా..
మువ్వై గిలిగింతలిచ్చావని గమనించక..
6010. ఫలించినప్పుడే అనుకున్నా..
అక్షరమై విరబూసింది మదిలో ప్రేమేనని..
6011. గులాబీ పరిమళమై నవ్వుతున్న నయనం..
అమలిన వాసంతికవుతుంటే నా హృదయం..
6012. వాడిన మల్లెకే గుభాళింపెక్కువ..
దూరమై అధికమయ్యే జ్ఞాపకంలా..
6013. నిశ్శబ్దం రవళించినట్లుంది..
కాగితంపైన అక్షర విన్యాసాలను కవిత్వరీకరించగానే..
6014. అప్పుడప్పుడే నటిస్తున్నా..
జీవిస్తున్న ప్రతిసారీ ఆత్మీయత కరువవుతుంటే..
6015. విషాదం వెనుదిరిగింది..
వసంతమని పేరుపెట్టి నన్ను పిలిచినందుకే..
6016. కలలో తప్పిపోవడమే బాగుంది నాకు..
మెలకువొచ్చి నిన్ను దూరం చేసేకంటే..
6017. స్వచ్ఛమైంది మది..
అలౌకిక భావాల మౌనంలో మునిగినందుకే..
6018. ఎప్పుడూ కులుకే..
కదంతొక్కి కవ్విస్తూ..
6019. ప్రేమయుద్ధాలింకెందుకులే..
విజేతలమని విధి ప్రకటించేసాక..
6020. వేకువపువ్వునై నిరీక్షిస్తున్నా..
రాతిరిని దాటుకు నువ్వొస్తావనే నమ్మకంలోనే..
6021. పవనమై పలకరించక తప్పలేదు నాకు..
ఉదయాస్తమానాలు స్వేదంలో నువ్వు ముద్దవుతుంటే..
6022. తడిమినందుకేమో బుసబుసలు..
తలపుకు రాలేదంటే అలుకతో గిచ్చేస్తావు..
6023. స్వర్గం దిగివచ్చింది..
నీ ఎదలో కాస్త చోటిచ్చినందుకే
6024. నిర్దేశనమయ్యింది గమ్యం..
హృద్గుహలో ఏకాంతాన్ని అధ్యయనం చేయమంటూ..
6025. మంచిముత్యాలై నీ తలపులు..
పెదవులను మంత్రాక్షరి జపించమంటూ..
6026. నువ్వన్నదే నిజం..
తతిమ్మా ప్రపంచమంతా నాకో అబద్ధం..
6027. పగలే రేయవుతున్నట్లుంది..
నీ ఎదురుచూపులకు బదులివ్వాలనే ఆరాటమొకటి..
6028. నేనప్పుడు బొమ్మనేగా..
ప్రాణం పోసి నీవు జీవమందించేవరకూ..
6029. ఎంత చదివినా మిగిలే ఉన్నట్లుంటుందిలే..
నీ కౌగిలిలో నా మౌనం..
6030. ఊపిరిపోసుకున్న భావాలన్నీ కవితలేగా..
హృదయస్పందన ఆలకించే అనురాగానికి..
6031. గలగలలాడుతున్న చైతన్యం..
నిన్నో అనంతవాహినిగా మార్చేయమని కవ్విస్తూ..
6032. నిశ్వాసలు గమనిస్తున్నా..
నీ ఊపిరిలోంచీ జార్చేస్తావేమోనని భయపడి..
6033. పుప్పొడై రాలినా ఫరవాలేదనుకుంటా..
ప్రేమ పుష్పించి ఫలించాక..
6034. చెలిగానే నేనుండిపోతా..
నీ ప్రేమ చెలియలకట్టై దాచుకుంటానంటే
6035. బాహువుల మాటే దాగుండిపోతా..
సరిగమలన్నీ నాతోనేనని నీవంటే..
6036. దొంగను చేసి మాట్లాడుతావెందుకో..
దోచుకున్నది నీ మనసునైనా..
6037. గమకాలు సాగదీస్తావెందుకో..
తమకాలు బయటపెట్టేస్తూ..
6038. దాచుకోలేక చస్తున్నా..
మదిలో దాగిన నిన్నెవరైనా కనిపెడతారేమోనని..
6039. స్మృతులను బయటకంపేసా..
ఎదురేగిన ప్రతిసారీ నువ్వు అవమానిస్తుంటే
6040. కన్నుల్లో దాగిపోదామనుకున్నా..
కనుపాపలు చేరదీసి నన్నూ ఆడిస్తే..
6041. కెరటాలవుతున్న స్మృతులు..
అమృతమై నన్నాస్వాదించమంటూ..
6042. కలలెన్నడో మౌనవించాయ్..
పలకరింపులు కరువైన రాతిరి చెమ్మదనంలో..
6043. అమ్ముకోవాల్సొచ్చింది నమ్మకాన్ని..
నమ్మినవారందరూ నట్టేట ఒంటరిగా విడిచేసాక..
6044.స్వరాలవెల్లువలోనే మునిగిపోయా..
నీ పదాలన్నీ గమకాలై నన్నల్లినందుకే..
6045. ఏ రూపులో నీవున్నా నేనొచ్చేస్తా..
నీ ఆరాధన నిజమని నాకనిపిస్తే..
6046. అనగనగా కధలు విడిచేసా..
ప్రతిరోజూ నువ్వు కావాలనుకున్నాక
6047. ఊహలు అనేకం..
మన ఊపిరిలో సర్వం మమేకమేగా..
6048.చిరునవ్వునై వచ్చేస్తా..
నీ ఒంటరితనాన్ని పూడ్చి ఏకాంత ఉల్లాసంగా మార్చేందుకైనా..
6049. చలేస్తుందనేం చెప్పను..
నీ కౌగిలిలో వెచ్చదనం కప్పుకున్నాక..
6050. హేమంతం తరిమినట్లనిపిస్తోంది..
నీ దర్శనమహిమకేమో..
6051. మల్లెలగంధమంతా నాదయ్యిందిలే..
నిన్ను మత్తెక్కించే అవకాశం ఇన్నాళ్ళకొచ్చాక..
6052. మూతవడని రెప్పలు..
కనుపాపలు నిన్ను చూడాలని అదేపనిగా మారాం చేస్తుంటే..
6053. గుండెలపైనే నర్తిస్తావెందుకో..
హృదయ కవాటాలు తెరుచుకోవని తెలిసినా..
6054. రోజులను మర్చిపోతున్నాను..
యుగాలన్నీ నీతో క్షణాలుగా జరిగిపోతుంటే..
6055. కొన్ని నిజాలంతేనేమో..
ఎప్పుడూ మత్తుగానే మనసుని మెలిపెడుతూంటాయి..
6056. కన్నుల్లో శ్రావణమొస్తుందనుకోలేదు..
అకారణంగా నువ్వు నాకు దూరమయ్యాక..
6057. బహుమతైపోయా నేనే..
శ్రీమతిగా రమ్మని సైగ చేసావనే..
6058. పగలంతా వలపుల గొడవే..
రాతిరికి కౌగిళ్ళు కొదవైనట్లు..
6059. అభిసారికగానే జీవనం చాలించాలేమో..
శూన్యాన్ని కావలిస్తున్న ఎదురుచూపులతో..
6060. ఎంత చెప్పినా వినవంతే..
నా కలలన్నీ కధలేనంటూ..
6061. ఆగమ్యమేగా మన గమ్యం..
ఇద్దరం వికర్షణలోనే కొట్టుకుపోతుంటే..
6062. మనసు ముసురేసింది..
మబ్బులమాటుకు రమ్మంటూ..
6063. మల్లెలకీ మంటెక్కుతోంది..
ప్రతిరేయీ కురులతో గొడవేంటో అర్ధంకాక..
6064. హద్దులేని ముద్దుమాటలే నీవన్నీ..
గోడలకి చెవులుంటాయని తెలియనట్లు..
6065. ఆకర్షిస్తూనే ఉంటానలా..
అయస్కాంతమై నువ్వతుక్కునేదాకా..
6066. కనులు తెరిచి అందుకున్న అభినందన..
రెప్పలు మూసి నిక్షిప్తం చేసుకుందామె..
6067. మదిలో పీఠేసి పిలిచిందెవరో..
వలపుదెబ్బ తగిలిందనిప్పుడు ఆక్షేపిస్తూ..
6068. ఆశ్రువులన్నీ అక్షరాలుగా పేర్చేస్తున్నా..
కవిత్వం కావాలని నువ్వడిగావనే..
6069. కనులకు కలలు పరిచయించింది నువ్వేగా..
విరహాన్ని హృదయానికి అలవాటు చేసి..
6070. అక్షరాలతో అడుగులేస్తున్నా..
నీ హృదయాన్ని తిరిగి బ్రతికించడానికి..
6071. హేమంతమెప్పుడు కనుమరుగయ్యిందో గుర్తించలేదు..
హృదయం ఘనీభవించి కరగనందుకు..
6072. తలపును జార్చలేకున్నా..
హృదయాన్ని దాటి చూపుతో దర్శించాలనే..
6073. ఘొల్లుమంటున్న ఊసులు..
నీ ఊహలన్నీ ఒకేసారి బయటపడుతుంటే..
6074. నీ హృదిద్వారం మూసుకున్నప్పుడే అనుకున్నా..
మరో దారి వెతుక్కునే సమయమయ్యిందని..
6075. స్మృతులతోనే సహజీవనం చేస్తున్నా..
ప్రేమను కాదని నువ్వెళ్ళిపోయాక..
6076.
 ఎగ్గులేని మాటలే నీవన్నీ..
పగలే మదిని ఊపేస్తూ..
6077. ఊపిరందించాలని నేనొచ్చా..
చూసినంతనే జ్ఞాపకాల్లోకి జారిపోతావని తెలీక..
6078. జ్ఞాపకాలతోనే మది నింపుకుంటున్నా..
ఊహలోనే నువ్వు రాసిన ప్రేమలేఖలకు లిపిలేని జాబులిస్తూ..
6079. నీ ఊహలోకి రాలేదందుకే..
 మనసును కబ్జాచేసానని ఎక్కడంటావోనని..
6080. పదాలన్నీ పువ్వులైనాయి..
నీవు చదువుతావనే ఆశను పులుముకొని..
6081. చట్టం చుట్టమవుతుంది ప్రతిసారీ..
నేరాన్ని ఋజువు చేయాల్సొచ్చినప్పుడు..
6082. ప్రదోషానికెదురుచూస్తున్న మనసు..
గ్రీష్మ సల్లాపాన్ని మల్లెలతో మొదలెట్టాలని..
6083. అద్దంగా మారిపోవచ్చుగా..
నా ప్రతిబింబాన్ని నీలో చూసుకుంటా..
6084. నా మనసైతే కావ్య సరస్సే..
చాలినన్ని అక్షరాలను అట్టడుగున దాచుకుంటూ..
6085. నీ కన్నుల్లోనే కరగాలనుకున్నా నేను..
నీడలేని వెలుగును అనుభవించే ఆనందంలో..
6086. ప్రత్యుషంగానే మిగిలిపోతా..
నీరెండ మెరుపులను మాత్రమే కావాలంటే..
6087. లిపి లేని భాషలోనే అన్నీ..
నాకు మాత్రమే అర్ధమవ్వాలనే ఆరాటంలో..
6088. మిగిలిపోవాలనుందలాగే..
నీ జ్ఞాపకాల చంచలత్వంలో..
6089. ఆపేయవా రాత్రినింకోసారి..
మన ప్రేమకు దీర్ఘాన్ని జోడిస్తూ..
6090. బంధాలెప్పుడూ అంతే..
అభద్రతా భావాల లోలకమై చలిస్తుంటాయి..
6091. అన్నీ అస్థిరమే..
ప్రేమ కరువైన ఆకర్షిక జీవనంలో..
6092. పరిభ్రమించక తప్పలేదు..
ముద్దమందారమై ముద్దొస్తూ ఎదురుగా నీవుంటుంటే..
6093. గ్రీష్మాన్ని వాటేయక తప్పలేదు..
వియోగమై నీలా వేధిస్తుంటే..
6094. చెలి ఆచూకీ తెలియాలేమో..
మనసు కాజేసిందని నీకనుమానముంటే..
6095. మెరుపంటే..అడగలేను నేను..
నన్ను చూడగానే నీ చూపులో మెరిసేదని తెలుసని..
6096. నీ తలపుల ఊటకేమో..
మనసంతా మధురసాలు పూసినట్లుంది..
6097. ఆశావాదంలోనే ప్రవహిస్తున్నా..
నీలో చైతన్యం నేనేనని భావిస్తూ..
6098.  ఊపిరుల పంచరత్నాలే..
నీ తలపును పాట కట్టేవేళల్లో..
6099. కలనుకొని పొరబడ్డావేమో ఊహని..
ఊయలూపడం మనసు నైజమేనని..
6100. విలువలకి వ్యాఖ్యానాలట..
ఇరుకు మదిలోని విశాలత్వాన్ని సమర్ధించుకుంటూ..
Virus-free. www.avast.com

No comments:

Post a Comment