Wednesday, 12 September 2018

10001 -10100

10001. నీ జ్ఞాపకాలే అయస్కాంతం..
ఏకాంతమొచ్చినప్పుడల్లా నన్ను కమ్ముకుంటూ..
10002. కనులు మూయకనే కలలెందుకో..
హృదయ స్పందనకో ఆకృతొచ్చినట్టు..
10003. పొద్దుపోని జీవితమే నాది..
దయలేక కాలాలు కరుగుతున్నా నీ జాడే లేదని..
10004. చందమామని చూసిచూసి విసుగొచ్చింది..
నన్ను వెక్కిరించినట్టు నవ్వుతుందని..
10005. మనసుకి చేరువైన పరిమళం నీదే..
అనుభవాల్లోకి తొంగి చూసిన ప్రతిసారీ..
10006. జవాబు కాలేక ఛస్తున్నా ప్రతిసారీ..
అర్ధంలేని నీ ప్రశ్నలకు మంటెత్తి..
10007. అపురూపమే భావం..
మనసైన క్షణాల  మమేకం మనదైనందుకు..
10008. వసంతం వలచిన రాగాన్ని..
ఆవేదన ఒలికించకు అనురాగాన్ని..
10009. చెరిగిపోనివ్వను ఎప్పటికీ..
నన్ను కవితగా రాసుకున్న అభిమానాన్ని..
10010. కన్నుల్లో దాచుకున్నా కలలన్నింటినీ..
మనసైతే నువ్వే గుర్తిస్తావని..
10011. నీ విరహంలో నేనింతే..
కాలాన్ని తిట్టుకుంటూ సాగుతాను..
10012. శిశిరం వసంతమైంది..
మనసులో నెలకున్న విషాదం రాలిపోగానే..
10013. అలుకలు ఒక్కక్షణమే..
నీ అనునయానికని నేనాడుతున్న నాటకమే..
10014. నీ కలనై నేను రానా..
ఒక్క రాత్రి నాకు రాసిస్తానంటే..
10015. చెమరింతనడుగు చెపుతుంది..
కన్నుల్లో  నలకగానైనా నువ్వు చేరలేదెందుకని..
10016. గమ్మత్తులే నీకెప్పుడూ..
నేనున్న లేకున్నా మత్తులో  మునిగిపోతూ..
10017. నీ కథలు వినలేక  ఛస్తున్నా..
రోజుకొకటి మార్చిమార్చి సరికొత్తగా వినిపిస్తుంటే..
10018. కన్నీటికెందుకు లోకువయ్యానో..
విషాదాన్ని గుండెలోతుల్లో దాచి కరిగించకున్నా..
10019. మూగబోయింది జ్ఞాపకం..
నా మౌనంలో ఇమడలేనని భావించినందుకే..
10020. కన్నుల్లో సంతోషాలు..
మనసంతా నువ్వుంటే మాటలతో పనేముందంటూ..
10021. నిరంతరం నా ఊహలో నువ్వు..
నీ మనసుకి రెక్కలున్నాయేమో  చూడు..
10022. కష్టాల కడలి దాటాలనుకున్నా..
విశ్వాసమనే నావెంత సహకరిస్తుందో..
10023. కనులందుకే మూసుకున్నా..
ఒక్క అనుభూతినైనా మనసుతో ఆస్వాదించాలని.. 
10024. వర్షంతో పనేముందిప్పుడు..
మబ్బేయగానే మనసు నాట్యం మొదలెట్టిందిగా..
10025. నవ్వులు మరచిన పెదవులు..
మనసుకి గ్రీష్మం పరిచయమైందనే..
10026. మనసారా కురవాలనుంది..
గుండెతడి పంచుకునేందుకు నాకు నువ్వున్నావని..
10027. నీ కలంలో నేను కవనం..
సశేషం నువ్వు నేనైన భావం..
10028. గిజిగాడుగా మారవద్దన్నా..
నా తలపు చుట్టూ అల్లుకొని నన్ను ఏమార్చుతున్నావనే..
10029. అందం అయస్కాంతమే..
నా ఆకర్షణకు నువ్వు సిద్ధపడాలంతే..
10030. కంచికి పోకుంటేనేమి  మన కథ..
ముఖపుస్తకంలో ముచ్చటంతా మనదే కదా..
10031. చూపులనెందుకు ఆడిపోసుకుంటావో..
పెదవులడిగితే  కన్నులతో వారించానని అలుగుతూ..
10032. నీ హృదయం అద్దమైనప్పుడనుకున్నా..
నా అందాన్నక్కడే చూసుకోవాలని..
10033. కవనంలో కొత్త పుంతలు తేవాలిక..
అక్షరాల్ని అక్షయంగా ప్రేమించే వారుంటారులే..
10034. కొందరి బుద్ధి ఎన్నటికీ మారదు..
మనమే  ముందు కాటికి  పోతామంతే..
10035. అపురూపనయ్యానందుకే..
నీ మనసుని గెలుచుకున్న అపరంజినై..
10036. ప్రకృతి సోయగమేంటో గ్రీష్మంలో..
మదిలో హేమంతాన్ని ఊహిస్తూ..
10037. ఒప్పుకున్నా నీకు మంత్రాలొచ్చని..
తెలియకుండానే నేను వశమయ్యానని..
10038. కనుమూయక మేల్కొన్నాను..
రెప్పలమాటైతే  తెల్లారికి నువ్వు కనుమరుగవుతావని..
10039. రాసెద్దాం త్వరలో..
ప్రణాయానికి కొత్త అర్ధం మనమయ్యేలా మరో మధుకావ్యం..
10040. ఏకాంతానికని ఎదురుచూస్తున్నా..
నీ అర్చనలోని ఆనందాన్ని చవిచూడాలని..
10041. జీవితమిప్పుడు వసంతమే..
నాలో నిరాశ ఎదలోంచీ కదిలిపోయాక..
10042. ఆనందంలోకి విషాదమొచ్చింది..
నా నవ్వులందుకే శిధిలమై మూగబోయాయి..
10043. పొద్దుగుంకిన పూవునయ్యా..
పరిమళాన్ని మాత్రం గాలికి కానుకిస్తూ..
10044. ఎన్ని కలలు నిద్దుర లేవాలో..
ఒక కవితగా కలాన్ని కదపాలంటే..
10045. ఎన్నిసార్లు చూపులతో తడిముంటావో..
నన్ను అక్షరముగా రాసావంటే..
10050. కవితలన్నీ వాస్తవాలే..
రాయాలన్న నీ సంకల్పం  నిజమైందంతే..
10051. రెండక్షరాల్లో కుదించేదేముంది అమ్మని..
తనాకాశమని ఏనాడో ఋజువయ్యాక..
10052. అమ్మనెందుకు బొమ్మను చేస్తారో..
ఒక్కరోజే దైవమైనట్టు స్తుతిస్తూ..
10053. అక్షరమవుతూనే ఉన్నా..
నువ్వో భావాన్ని పలకరించిన ప్రతిసారీ..
10054. నా మనసు ఇరుకయ్యింది..
పూర్తిగా నువ్వు ఆక్రమించినందుకే..
10055. మదనోత్సవం మాటెందుకులే..
మసకేస్తే మురిపాలకు తెరతీద్దామంటూ నువ్వు..
10056. నేనవుతా నువ్వు..
శ్వాసలోకొచ్చి చేరమని నువ్వు పిలవాలంతే..
10057. ఎవరనగలరు మనమిద్దరమని..
నా అద్దంలో నువ్వే అగుపిస్తుంటే..
10058. నిజమైతే బాగుండనిపిస్తుంది..
మనమొకటయ్యే అపురూపాలన్నీ..
10059. నేను నేనయ్యే క్షణాలు..
రాయాలి కొన్ని అద్భుతాలు..
10060. అనుభూతి వాక్యం నేనవనా..
పదముగానైనా పరిమళించమని నువ్వంటుంటే..
10061. ప్రేమంటే ఆకాశమే..
నా అంతరంగాన్ని సరిపోలింది  మరి..
10062. శుభసంకల్పం మనదేగా..
కాలమందుకే నిశ్చలమై నిలబడిపోయినట్టుందీ క్షణాల్లో..
10063. కలలెప్పుడూ నాకిష్టమే..
కనుమూస్తే నిన్ను నాముందు నిలబెడతాయిగా..
10064. వేకువ తొందరది..
అనురాగాలు పెనవేసే సమయం ముందుందని..
10065. కలలో కలుసుకోవడం బాగుంది..
వాస్తవానికెలానూ దర్శనమయ్యేది లేదని..
10066. ఆశలు గమనం తప్పాయి..
నీ చల్లని హృదయం చేరే దారిని మరచి..
10067. బాధల దావానలమది..
బంధాల్లోని అంతరార్ధం బయటపడే కొద్దీ..
10068. నే రాతిరిగా మారిపోతా..
కన్నులనీలిమలో నీ నివాసమంటే..
10069. దురాలోచనలే మనుషులకన్నీ..
మానవత్వాన్ని గతానికొదిలి అక్రమాలకు ఎదురెళ్తారు..
10070. రాగాలెటో తరలిపోయాయి..
నీ మదిలో చోటివ్వనని నువ్వనగానే..
10071. నా ఊపిరి పరిమళిస్తోంది..
నీ ఏకాంతాన్ని నాకిచ్చేసావని...
10072. మహరాణినే..
నీ గుండెతలుపులు మూయనంత కాలం..
10073. ఆనందమో సుగుణం..
నువ్వెంత బలంగా పెనవేసినా హర్షించడం..
10074. నీకొచ్చిన కలలో నేనేగా..
నువ్వో సంకలనం మొదలెట్టావంటే..
10075. స్వర్గమెక్కడుందో..
నాకు నిత్యం నరకామే కనబడుతుంటే..
10076. మనసు బరువెక్కినప్పుడనుకున్నా..
రెప్పల్లోకి తొంగిచూసే సాహసం చేయలేనని..
10077. మనసంతా గుసగుసలే..
నీ పేరుని ఎన్ని రకాలుగా తలచిందో మరి..
10078. నా జ్ఞాపకం నువ్వే..
నిదురపోయి చానాళ్ళయ్యింది అందుకే..
10079. అందం ఆనందమేగా..
నీకో బంధమేస్తుందని నమ్మకం మొదలయ్యాక..
10080. నన్ను నేను చేరదీసుకోక తప్పలేదు..
నీరుగార్చేస్తుంటే నిన్నటి అద్భుతమైన జ్ఞాపకాలు..
10081. మరచిపోయిన వాక్యమొకటి..
జ్ఞాపకమొచ్చి అక్షరమై పదిలమవుతానన్న రాతిరిది..
10082. ఏకాంతం సంక్షిప్తమయ్యింది..
నాలో భావాలు అక్షరాలుగా పరిమళిస్తుంటే..
10083. నా కలం..
నాలోని ఆరాటాన్ని ప్రపంచానికి పరిచయిస్తూ..
10084. ఆలోచనిప్పుడు కరువయ్యింది..
మది నుండీ నువ్వు తొలగినందుకు..
10085. కైదండగా నా ప్రేమ..
నీ మనసంతా పరిమళిస్తున్నప్పుడు..
10086. అక్షరలక్షలుగా కురవలేనా..
నన్నో భావంగా నువ్వు ఒంపుకుంటానంటే..
10087. హృదయానికి గాయమెందుకో..
నువ్వు చూపులతో సంధించింది నవ్వులనైతే..
10088. ముసురేసినప్పుడే అనుకున్నా..
నన్ను నువ్వొచ్చి తడపడం తథ్యమని..
10089. జ్ఞాపకాల జాణతనమది..
క్షణమైనా కాలాన్ని వృధా చేయనివ్వనంటూ నీలా అలరిస్తాయి..
10090. పున్నమంటే కొత్తేముంది..
ప్రతిరేయి నీకు వెన్నెలను కానుకిస్తున్నాగా..
10092. ఆత్మావలోకనమిదే..
నాలో చంచలత్వాన్ని నీతో ముడేసుకోవడం..
10093. గ్రీష్మమెంత  చల్లనో..
నీ తలపుగుండా వలపు వీచినప్పుడు..
10094. కొన్ని అనుబంధాల గమ్యమదే..
చివరికి చిందరవందరగా ముగిసిపోతాయి..
10095. వెక్కిరిస్తున్న జ్ఞాపకం..
నిశ్శబ్దాన్ని విమర్శిస్తూ..
10096. రాగబద్దం  చేసా..మదిలో భావాలను..
ఒక సాయింత్రానికి  అందమైన ముగింపునిచ్చేలా..
10097. మనసెప్పుడూ పవిత్రమే..
నువ్వూనేనూ ఒకటేనన్నది  నిజం కదా..
10098. ప్రేమలేఖందుకొని నే గెలిచా..
మేరుశిఖరమంటి  మనసు నాదయ్యిందని..
10099. గాలి గమనం మార్చుకుంది..
నీ మౌనాన్ని ఛేదించడమెందుకని..
10100. కలనై రావాలనుంది..
పారేసుకున్న నీ నవ్వుని చేరదీయాలని..

No comments:

Post a Comment