Wednesday, 12 September 2018

10501 - 10600


10501. మౌనం గలగలలాడిందంటే మాటలున్నాయనే అర్ధం..
తీరం అల్లాడుతోందంటే అలల గుసగుసలకనేగా..
10502. విషాదం గ్రహపాటయ్యింది..
సంతోషాన్ని దూరం చేసినందుకు కాలం..
10503. భవిష్యత్తు బెంగ తీరిందిప్పుడే..
వర్తమానంలో కలిసి అడుగేద్దామన్నావని..
10504. మేఘమాల కోలాహలం..
చినుకై కురిసి జీవధారగా ప్రవహించాలని..
10505. విరిగిన మది..
అతికించే బంధమేదీ ఇంకా ఏర్పడనట్టుంది..
10506. పారిజాతమై అలరిస్తా..
పండువెన్నెల్లో పూలదుప్పటి పరవమని నువ్వంటే..
10507.గుప్పెడు వెన్నెల పులిమినట్టుంది..
నా స్వప్నాలన్నిటా నువ్వుదయిస్తుంటే..
10508. నీ స్మృతుల్లో నేనో ఖైదీనే..
నిన్ను తలవని క్షణాలు రోదిస్తుంటే..
10509. వసంతం ముందడుగేసింది నిజమేనేమో..
మనసంతా మల్లెపూలు గుప్పుమంటున్నందుకు..
10510. చీకటి రాత్రి ఏకాంత క్షణాలివి..
నాలో పరిమళాలు నీ జ్ఞాపకాలిప్పుడు..
10511. ఈ వేకువనాశించిందే..
కలవైన నువ్వు వాస్తవమై ముందుకొస్తావని..
10512. క్షణాలనెందుకు తలుచుకుంటావో..
నేనిక్కడ యుగాల లెక్కల్లో నిరీక్షిస్తుంటే..
10513. వర్తమానం విశేషమే..
భవిష్యాత్తు భవ్యమనిపిస్తూ..
10514. మనసందుకే కరుగుతున్నట్టుంది..
వెన్నగా నన్ను అభివర్ణించగానే..
10515. కన్నుల సరిహద్దుల్లో కన్నీళ్ళు..
నిన్నటి ఆనందాలు ఒలికిపోయినందుకేమో..
10516. వలపంటేనే మధురం..
ఇన్నాళ్ళకి మనసు నవ్వింది నిజం..
10517.  మధూదయమంటే ఇదే..
నీ మాటలతో నాకు మేలుకొల్పులవడం..
10518. శూన్యమే కొసమెరుపైంది..
నీ జ్ఞాపకాలొక్కటీ నాకు మిగిలి..
10519. నా సంతోషమొక్కటే..
ఊపిరున్నంతసేపూ నువ్వే..
10520. కాలం అలసిపోతుందిప్పుడు..
తలపుల్లో నిన్ను దూరం చేయలేక..
10521. అనురాగానికున్న ఆరాటం తెలిసింది..
నువ్వెన్ని సంకీర్తనలు పాడుతున్నా..
10522. విషాదం కనుమరుగయ్యింది..
కలలో నువ్వొచ్చి ఇద్దరం చెరిసగమన్నాక..
10523. నిన్నేసిన నాలుగడుగులే..
రేపటికి ఏడడుగులుగా పాదాలు కదుపుతుంటే..
10524. వర్తమానం పరిమళిస్తుంది..
గతంలోకి మనసు జారినప్పుడల్లా నీవల్లే..
10525. నా మనసెప్పుడో నీదయ్యింది..
ఏకాంతం మనల్ని కలపాలిప్పుడంతే..
10526. నల్లనివే నే రాస్తున్న అక్షరాలు..
తెల్లటి నీ మనసుని ప్రతిబింబిస్తున్నా..
10527. దాచుకున్న తలపులు కనిపెడతావెలానో..
నువ్వో ఇంద్రజాలకుడివి కాదంటూనే..
10528. అతిశయమంటే అలుగుతుంటావు..
అందానికున్న ఉపమానాలన్నీ నాకే అంటగడుతూ..
10529. అదేం మౌనమో..
మాటల్లోకి అనువదిస్తుంటే మనసు మండిపోతూ..
10530. అక్షరాల పరవశాన్ని తొలిసారిగా చూస్తున్నా..
నిన్ను రాసిన ఆనందాలు పదివేలుగా..
10531. నా మనసంతా ఆవేదన నిజమే..
మరుపు మందుంటే పూయాలిక సత్వరమే..
10532. జీవితమంతా శూన్యమేనిక..
నిశ్శబ్దం నేస్తమయ్యాక..
10533. మనసంతా ఈ వెలుగులెందుకో..
నీ నవ్వులు నక్షత్రాలైనందుకేమో..
10534. కథలుగా రాసుకోవాలిక..
కలలు నిజమయ్యేదెప్పటికీ జీవితంలో ఉండదుగా..
10535. తీయదనాన్ని ఆస్వాదించలేము..
జీవితంలో అప్పుడప్పుడైనా వేదనలు తడమకపోతే..
10536. అలికినట్టున్నప్పుడే అనుకున్నా..
నీ పదాల్లో నా ప్రస్తావన ఎక్కడా లేదేమోనని..
10537. నిన్ను ఆకర్షించడమే నాలో ప్రత్యేకత..
మనసు తలుపు తెరుచుకుందంటే ఏమనేదిప్పుడు..
10538. కదిలిపోయిన మేఘంలా నువ్వు..
సందేశమేదీ నాకు వినిపించకుండానే..
10539. కాటుకల మాయనుకుంటా..
నా కన్నులతో నీ సంభాషణలు..
10540.
అపురూపమైన జ్ఞాపకమనుకున్నా..
కన్నీరు ఎరుపురంగులోకి మారక మునుపు..
10541. గతమంటే ప్రేమందుకే..
నువ్వంతా నిండున్నావని..
10542. లక్షలతో అర్చించినట్టుంది..
నీ పలుకులతో పరవశాలు పురివిప్పుకున్నందుకు..
10543. నిత్యవసంతమే నాకిక..
నీ కన్నుల్లో ఆశ్రయం దొరికినందుకు..
10544. నీ రాకనెప్పుడో పసిగట్టా..
నిద్ర చెడగొట్టేందుకే మదినంటావని..
10545. వర్తమానాన్ని ఆస్వాదిస్తున్నా..
ఊహించకుండానే నీ సాన్నిహిత్యం దొరికిందని..
10546. జ్ఞాపకాలు ఊపిరైనందుకేమో..
నాలో రాగాలకో పల్లవి దొరికిందిప్పుడు..
10547. నింగీనేలా ఒకటేననిపిస్తుంది..
దూరానున్నా నువ్వూ నేనూ ప్రేమైనందుకు..
10548. కలలేవీ రావిప్పుడిక..
నా నిద్దురంతా నువ్వు దోచుకెళ్ళావుగా..
10549. నేనో ద్వీపకల్పం..
సేద తీర్చే భాగ్యం నాదవ్వాలిప్పుడు..
10550. జ్ఞాపకాలని ఏమార్చాలిక..
జీవితం చిగురించాలనుకుంటే..
10551. పరిమళమిలా సొంతమైంది..
ప్రణయం పూదోటై నాలో వెల్లివిరిసాక..
10552. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు..
కొన్నిక్షణాల మెరుపులుగా నాలో..
10553. జ్ఞాపకాలే ఓదార్పులు..
నాలో నిరాశని పారద్రోలే పలకరింపులు..
10554. అనుభూతుల పెన్నిధి నేనేగా..
నా జ్ఞాపకాలతోనే నువ్వుంటే..
10555. అక్షరాలతో సహజీవనమందుకే..
అనుభూతులనే అభిరుచిగా నీకు పంచాలని..
10556. ముగిసిన దాగుడుమూతలు..
కలలో మెలకువవగానే..
10557. అక్షరాలపై అలుగుతుంటారెందుకో ఆ నలుగురూ...
భావుకత వాసన మనసుకి నచ్చలేదంటూ..
10558. నవ్వుతూనే నేనున్నా..
సగంలో ఆపిన ప్రేమలేఖను ముగిస్తావని..
10559. రాయాల్సిందే కలలన్నింటినీ..
ఒక్క వాక్యంలోనైనా నిన్ను తడుముకుంటావని..
10560. నేనో వలపు పిపాసినే..
నీ హృదయసౌధానికి పునాదినవ్వాలని..
10561. ఏకాకిలా నేను మిగిలిపోయా..
నువ్వూ ప్రేమా దూరమైనందుకేమో..
10562. ఎప్పుడు సరితూగుతాయో భావాలు..
ఎన్ని పేర్చినా నీకర్ధమవలేదంటే..
10563. భావాలు శృతి మించాయనుకోకు..
అభిమానాం హద్దుమీరి నిన్నలరించినప్పుడు..
10564. కొన్ని బంధాలంతేలే..
గుండె బరువుని తెలీకుండానే పెంచేస్తుంటాయి..
10565. ప్రేమకందుకే దూరమైనట్టున్నా..
నీలో నన్ను వెతుక్కోడంలో విఫలమయ్యి..
10566. మౌనం నచ్చట్లేదిప్పుడు..
మనసుకి నీ ముచ్చట్లు మక్కువయ్యాయనే..
10567. మనిద్దరిదీ ఒక లోకమైనందుకే..
వేరెవ్వరినీ చేరనివ్వలేదు మనసులోనికి..
10568. వాన వెలియడం గమనించనే లేదు..
వానవిల్లుని చూడాలనే నా ఆనందంలో..
10569. సముద్రంతో సంధిచేసుకోకు..
ఆకాశమై నీకు నేను చేయూతనిస్తుంటే..
10570. నా పలుకులు గవ్వలైనందుకేమో..
నీ గుండెల్లో పదిలమైనవిలా..
10571. జీవితాన్ని జయించలేకున్నా..
నిట్టూర్చినప్పుడల్లా నలిగిపోతూ..
10572. గతాన్ని బూడిద చేయాలందుకే..
భవిష్యత్తు అందంగా పేర్చుకోవాలంటే..
10573. గాయమైనా ఫరవాలేదనుకున్నా..
గేయమై నన్ను అలరించేందుకు నువ్వున్నావని..
10574. ప్రణయానికి పరిధిలేదందుకే..
అనంతమై విస్తరించినందుకే..
10575. మనోరథం ముచ్చటపడుతోంది..
మన మనోవేగాలింత త్వరగా చేరువయ్యాయని..
10576. కన్నీరు కెరటమైనప్పుడే అనుకున్నా..
నీ హృదయతీరాన్నొచ్చి తాకుతుందని.. 
10577.  ఈ నిరీక్షణెప్పటికీ ముగియదేమో..
ఋతువులన్నీ కనికరంలేక కదిలిపోతున్నా..
10578. జ్ఞాపకాల గలగలలు కాబోలు..
నువ్వెక్కడున్నా తలపులకి లోటుండదంటూ..
10579. నా ఊహల్లోకి నిన్ను ఆహ్వానిస్తున్నా..
కలిసుంటే మన ప్రపంచం సుందరమవుతుందని..
10580. నేనొంటరినని తెలుసుకున్నా..
నా విషాదంలో ఎవ్వరూ తోడవ్వలేదనే..
10581. ఆసరా కోసం ఎదురుచూడకలా..
నీలో ఆత్మస్థైర్యం నిండుకొనేలా..
10582. వెలుగులీనుతోంది మనసు..
ఎదురుచూసిన నీ కావ్యంలో నెలవంకనయ్యానని..
10583. ఉరకలేసే నదికి సమానమే నేనెప్పుడూ..
ఉప్పొంగే సముద్రమై నువ్వు రమ్మన్నప్పుడల్లా..
10584. సరిహద్దు దాటి ఎగరాలనుకున్నా..
మబ్బేసిన ఆకాశమిలా భయపెడుతుందనుకోలా..
10585. నిన్నట్లో నిలబడిపోయా..
భవిష్యత్తు ఆగమ్యమైనందుకే..
10586. ఇంగితమివ్వని చదువు..
ప్రేమపాఠాలను మాత్రమే నేర్చుకొమ్మని ప్రేరేపిస్తూ..
10587. మనసు మిఠాయయ్యింది..
చెరుకు తీపిలాంటి నిన్ను దాచుకోగానే..
10588. నిన్న నీతో నేనున్న నిముషాలే..
నేడు ఒంటరిగా మిగిల్చిన విరహాలు..
10589. తీరని మోహానివే..
తపనలు వేధిస్తున్నా..
10590. మునుపులేని మోహ సూచన..
నువ్వెదురైన హాయి వాన..
10591. ఉషస్సు దూరమయ్యిందెప్పుడో..
మనసులో చీకటవ్వగానే..
10592. హరివిల్లునై నే రాలేనా..
వానాకాలమని నువ్వు భయపడుతున్నా..
10593. కొన్ని క్షణాలనలా దాచేసుకున్నా..
మాట్లాడిన మౌనాలు అపురూపాలనే..
10594. కొన్ని క్షణాలను దిద్దుకోవలసిందే..
అదేపనిగా విషాదాన్ని స్రవిస్తున్నాయంటే..
10595. వాన కురవడం గమనించనే లేదు..
అప్పటికే తడిచి ఉన్నందుకేమో నేను..
10596. వానంటే విసుగొచ్చిందందుకే..
కన్నీరాపని కళ్ళతో తను సమానమయ్యిందని..
10597. కల్లాపి చల్లుకోవాలేమో మనసంతా..
నీ తలపులొచ్చి పరిమళించాలనుకుంటే..
10598. నాలోని విషాదం నిజమే..
చిరునవ్వుతో కప్పేస్తున్నా నీకగుపడొద్దని..
10599. బడిగంటలు వినబడాలిప్పుడు..
ఉన్నట్టుండి బాల్యంలోని మనసు పరుగెత్తాలంటే..
10600. ఆకాశమే విస్తుపోవాలిప్పుడు..
విదిలించకుండానే మబ్బుల్లో నీరెందుకు జారిందోనని..

No comments:

Post a Comment