Wednesday, 12 September 2018

10301 - 10400

10301. సడిచేయనంటున్న భావాలు..
నీ జ్ఞాపకాలను మౌనంగా స్మరించుకుంటూ..
10302. నీలో నాలో జీవితావేశమిప్పుడు..
కలలో మనం విడిపోయినందుకేమో..
10303. ఆప్తమై కలిసిపోలేనా..
నీ పెదవంచు ప్రేమగా పాడుతానంటే..
10304. మనసు మరుగుజ్జయిందట..
మమత పంచేందుకు ముమ్మార్లు ఆలోచిస్తూ..
10305. చూపు మరల్చలేకున్నా..
నువ్వలా హరివిల్లుని నడుములో దాచేస్తుంటే..
10306. కలవని చేతులు..
చప్పట్లు ముగిసినందుకేమో..
10307. ప్రేమ ప్రభావమటువంటిది..
 అర్హత లేనివాళ్ళనూ తడిమి ఆదరిస్తుంటుంది..
10308. నవ్వి చానాళ్ళయింది..
జ్ఞాపకాల వ్యసనంలో నేను తప్పిపోయినందుకేమో..
10309. మాటలందుకే తగ్గించేసా..
నా మౌనాన్నయినా సరిగా అర్ధంచేసుకుంటావని..
10310. కొన్ని నవ్వులిక్కడ నిషేదాలు..
విషాదాన్నే పాడగలిగే పెదవుల్లో..
10311. ఆగేలా లేదస్సలీ వాన..
నా కన్నీటిని దాచేస్తానంటూ..
10312. ఆఖరి చరణంగానైనా నేనుంటా..
నీ పాటలో నన్నుంచుతానంటే..
10313. ఏకాంతం కావాలట ఆకాశానికి..
శూన్యంలోకి జారినట్టుందందుకే మరి..
10314. అబ్బురాలజోలికేమీ వెళ్ళబోకు..
ప్రేమంటే నీదేనని ఒప్పుకున్నా నేనెప్పుడో..
10315. గమకాలతో కవ్వించకలా..
తమకాలు రేపినట్టు ఈ వేళలోనా..
10316. క్షణాలు లెక్కిస్తావెందుకో..
కలలో ప్రతినిత్యం నిన్నే పలకరిస్తుంటే..
10317. మనసప్పగించి చూస్తున్నా..
నాకై తపించిపోతున్న నీ గుండెను..
10318. మెలకువొచ్చిందిన్నాళ్ళకి..
నీ ప్రేమకవితలో కలగన్నది నన్నేనని..
10319. రవళించాలనే ఉంది ప్రతిసారీ..
వసంతమై రమ్మని పిలిచినప్పుడల్లా..
10320. రాతిరి వలసపోయిన కలలే..
పగలు ఊహలై నన్నల్లుకుంటూ..
10321. ఒకప్పుడు పుస్తకమో అలంకారం..
నేడు అంతర్జాలమో వ్యసనం..
10322. గంథమద్దుకొని నీవైపొస్తున్నా..
నీలో కిలికించితాలు చెవులారా విందామనే..
10323. ప్రేమెప్పుడూ అపురూపమే..
ప్రాణమిచ్చి ఛస్తేనే అనుభవమవుతుంది కొందరికి..
10324. మనసున మనసవ్వాలనుంది..
మన పరిచయాన్ని కొత్తగా మొదలెట్టవూ..
10325. ఊపిరిలో ఒక నిశ్శబ్దం..
నా ఒంటరితనానికి సంకేతం..
10326. తన స్మృతులు లోలకాలు..
ఊగినప్పుడల్లా నన్నూపుతూ కలవరపెడతాయి..
10327. కమనీయరాగాలను ఆలకిస్తున్నా..
నువ్వే సముద్రమై నాకు స్పూర్తినిస్తుంటే..
10328. వెచ్చగా పొదుపుకుంటున్నాను..
నీకు నేను అపురూపమైన తొలిచూపులను..
10329. కాసేపన్నా ఉండవెందుకో..
మాటివ్వాల్సొస్తుందేమో మరి.
10330. మౌనం చాలుగా మన మధ్య..
ఏకాంతంలో అంతరంగపు మాటలు మొదలయ్యాక..
10331. వదిలేసుకోలేనా నన్ను నీకు..
నాలోని పరిమళాన్ని నువ్వాస్వాదిస్తానంటే..
10332. ఏ విషాదం వెంటబడుతుందో..
కలల్లో సంచరిస్తూ నువ్విప్పుడు..
10333. అప్పుడప్పుడూ పొడుస్తుంటాయి..
కొన్ని స్మృతుల గులాబీలకు ముళ్ళుంటాయి..
10334. మనసు నిండింది..
నా నిరీక్షణలో నీవనుభవించిన తపనకి..
10335. కనుమబ్బుల్లో పూసిన ఇంద్రధనసులు..
మనసెప్పుడు స్పందించిందో గమనించనేలేదు..
10336. మనసు కంపిస్తోంది..
తను అదృశ్యమవుతాడన్న ఒక్క భావనకే..
10337. పరిచయాలన్నీ సందేహాలు..
విశేషమో..సశేషమో తేలని గందరగోళంలో..
10338. కరుగుతూనే కాలం..
నువ్వు దూరమైన క్షణాలు ఘనీభవించాయంతే..
10339. మధనపడుతూనే ఉన్నా లోలోన..
ఊపిరాగిపోతుంటే నువు కనుమరుగైనప్పుడు..
10340. ప్రేమందుకే గెలిచింది..
నీ తలపుల్లోని వెన్నెల కావ్యాలకి..
10341. మరుగునపడ్డ జ్ఞాపకాలు..
వాస్తవంలో జీవించడం మొదలెట్టినప్పటి నుంచి...
10342. నాలో పరిమళాలిప్పుడు..
మధురభావనగా నీ గుండెకు కట్టేసుకున్నావంటే..
10343. గుండెపై దండలా నేనవనా..
ఒక్కసారి మనసయ్యిందంటే చాలుగా..
10344. ఆదమరుపు కావాలంది మనసిప్పుడు..
నీ తలపును ఆహ్వానించానందుకే..
10345. విరహమెక్కువే నా మనసుకి..
నీ జ్ఞాపకాలనందుకే వదలనంటోంది....
10346. కొన్ని తలపులంతే..
ధూపమేసి మనసుకి ఆహ్లాదాన్ని పంచుతాయి..
10347. సాయింత్రం గుభాళిస్తుంది..
నీ చిరునవ్వులో గులాబీగా నన్నద్దుకుంటే..
10348. ఆకాశం నేనే..
పందిరిగా నన్ను కప్పుకుంటున్నావుగా జీవితమంతా..
10349. కధలెప్పటికీ పాతబడవు..
మన అనురాగాన్ని రోజుకో శృతిలో కలిపి రాస్తున్నందుకు..
10350. వ్యక్తిత్వాన్ని అనుమానించాల్సొస్తుంది..
కొన్ని నిజాలు నెమ్మదిగా తెలుస్తుంటే..
10351. నన్నారాతీయడంలోనే ఉంటావెప్పుడూ..
పగటికలలన్నిట్లో నాతో యుగళాలు పంచుకుంటూనే..
10352. నిశ్వాసగా కదిలిందిలి నిట్టూర్పేలే..
శ్వాసగా చేర్చేసుకుంటాగా నిన్నింకోసారి..
10353. మనసెందుకు ముక్కలవుతుందో..
మనుషుల స్వభావాన్ని అతిగా ఊహించినందుకేమో..
10354. వలపును పంచుతూ నీ తలపులు..
నాలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ..
10355. జీవితంపై ప్రేమయ్యిందిప్పుడే..
జన్మలెన్నో దాటి నిన్ను నాతో జత కలిపిందని..
10356. నీ తలపుల్లోనే ఆదమరచిపోతున్నా..
మెలకువొస్తే వాస్తవం భయపెడుతుందని..
10357. నన్ను నేను మరచిపోగలుగుతా..
చిన్నారుల చిరునవ్వుల్లో తప్పిపోయినప్పుడే..
10358. అద్దానికి అవకాశమిచ్చినందుకేమో..
అందాన్ని అదేపనిగా కెలికి చూపిస్తుంది..
10359. ఉండీ లేనట్టు నువ్వు..
మనసులో అడుగెందుకేసావో తెలీక..
10360. వెన్నెలను ముసుగేసుకున్నా..
సహజమైన పున్నమిని ప్రేమిస్తున్నావని తెలిసి..
10361.కలల్ని పూరించుకుంటున్నా..
నీ వలపు రేయంతా తలపవుతుంటే..
10361. అలుసయ్యింది మనసెప్పుడో..
బ్రతికుండగానే నన్ను జ్ఞాపకంలో కలిపేసావందుకే..
10362. నిన్నారాధిస్తున్న కన్ను నాది..
ప్రేమందుకే కలంలో ప్రవహిస్తుంది..
10363. జ్ఞాపకమొకటే మిగిలుంది..
వసంతాన్ని అన్వేషిస్తూ నువ్వు ఎగిరిపోగానే..
10364. వయసవుతూనే ఉంటుంది..
జీవితమనే ఆటని గెలవమని సందేశమందిస్తూ..
10365. నిరాశను శ్వాసించినందుకేమో..
ఆశ నిశ్వాసగా జారుకుంది చెప్పకుండగా..
10366. మనసు దాకా చేరావనుకోలా..
ఎదలోని తీయదనం తడుముకోనంతవరకూ..
10367. ఏకాకినని అనుకుంటారందరు..
నీ తలపుల సహజీవనమో రహస్యం..
10368. దోబూచులాడక తప్పట్లేదు..
నా కన్నులు చదివేస్తావని భయమవుతుంటే..
10369. ఏదో తపన..
నా కోసం నువ్వెదురు చూస్తుండాలని..
10370. మనసంతా మబ్బులు..
నువ్వు నింపిన శూన్యమేగా అది..
10371. సుతారాలు మీటిపోకలా..
హృదయమిక్కడ సొమ్మసిల్లేలా..
10372. క్షణాలకదెంత కంగారో..
కాలాన్ని లెక్కించేలోపు పాదరసంలా కదిలిపోతుంది..
10373. నన్ను కాదని నిన్ను చేరింది మనసు..
ఏ మత్తు చల్లావో ఇప్పటికీ తెలియకుంది..
10374. అపార్ధం ఎదిగిపోతుంది..
ఆత్మీయత మరచి అసూయలు చేరువవుతుంటే.. 
10375. మాటలతో వేస్తావెందుకో వల..
మనసిప్పి తెంచుకోక సంకెల..
10376. చిరునవ్వొక్కటి చాలు..
ఇంద్రధనస్సు జీవితంలో ప్రతిరోజూ పూస్తుందంతే. 
10377. ఎన్ని కలతలనోర్చుకోవాలో..
కంటికి నీరు అలుసవుతోందని అణుచుకున్నా..
10378. కధలెన్నో వింటున్నా..
నీ కన్నుల్లోకి తొంగిచూసిన ప్రతిసారీ..
10379. మనసుపడ్డప్పుడే తెలిసింది..
మన పరిచయం ఈనాటిది కాదని..
10380. బంధమేసావుగా ఎన్నడో..
గుండెల్లోంచీ తోసేస్తావెందుకో ఇప్పుడిలా దయలేనట్టు..
10381. గుట్టుగుందామన్నది నువ్వేగా..
రట్టవలేదంటూ రాలుగాయి రాగాలు మొదలెట్టావెందుకో..
10382. నిన్న నువ్వు మెచ్చినవే..
అనుభూతులు రాగాలైన తమకాలు..
10383. చీకటితో గొడవపడుతున్నా..
కలలు రాకుండా మనసులో చేరిందని..
10384. నిశ్శబ్దమలా కరిగింది..
కాస్త కన్నీటితో మనసు కడిగేసినందుకు..
10385. స్నేహసౌరభానికెంత మత్తుందో..
ఎన్ని దశాబ్దాలైనా వీడని గమ్మత్తవుతుంది..
10386. శూన్యంలో నేను..
నిండుకున్న మనసులో జ్ఞాపకాలు వెతకలేక..
10387. తెరలు తెరలుగా ఆవేదన..
హృదయాన్ని కదిలించిన జ్ఞాపకమేనది..
10388. కల్పించుకున్న వ్యాపకమొకటి..
నీ తలపుల్లో పులకరిస్తున్న మనసుదది..
10389. జ్ఞాపకాలన్నీ జాజులైనట్టేగా..
ఈనాటికీ చెలిమి పరిమళం వాడిపోలేదంటే..
10390. విషాదమందుకే పండుతోంది..
ప్రేమలో కన్నీరు కలిసి మనసుకంటినందుకు..
10391. క్షణాలకు తప్పలేదు..
వియోగాన్ని వెచ్చని స్పర్శగా నిమురుకోవడం..
10392. ఎంత వెతికానో స్వప్నాల్లో..
తీపిచెమ్మయిన నీ జ్ఞాపకాలను..
10393. ఎన్ని జన్మల తాపత్రయముంటేనేమి..
ఈనాటికీ నిన్ను అందుకోలేకపోయాక..
10394. నాకిది వసంతకాలమే..
నీ కౌగిలిలో కొత్తగా పుట్టానంటే..
10395. వ్యధలన్నీ మనసువే..
నవ్వులెందుకు మాయమవుతాయో పెదవులపై విచిత్రంగా..
 
10396. నిద్దురతో పనేముందంటోంది రాతిరి..
నిన్నూహిస్తూ మైమురుస్తున్న కారణానికి..
10397. శాశ్వతమే మది పరిమళాలు..
నీ తలపునంటిన ఉదయాస్తమానాలు..
10398. మెలకువొచ్చింది మనసుకి..
నీ మౌనంలో ఏ రాగమిన్నదో..
10399. పిలుపు నీదయినందుకేమో..
మనసు గతాన్ని మలుపులో విడిచేసింది..
10400. జీవితమప్పుడే పూర్తవనట్టే కదా..
ఒక్క మలుపైనా తిరగలేదంటే..

No comments:

Post a Comment