Wednesday, 12 September 2018

9901 - 10000

9901. ఇష్టమంటే ఇదేనేమో..
నీ మనసుపాట నవ్వుగా నాకందడం..
9902. ఇష్టమంటే ఇదేనేమో..
కవ్వింతగా మొదలై అనుబంధంగా అల్లుకున్నాముగా..
9903. మనసందుకే ఓర్చుకుంది..
ముల్లుగుచ్చుకున్నా ప్రేమ గులాబీలా వికసించిందని..
9904. వివశమవనట్టు నటిస్తావు..
విచిత్రంగా మాట్లాడుతూ నా కన్నులతోటి..
9905. మన్మధుడివిగా  నా గుండెగూటిలో..
జ్ఞాపకాలీ జన్మకి వాడిపోవులే..
9906. విరహమెందుకంటావ్ వింతగా..
నా దగ్గరకి రాలేకపోతున్నా ప్రేమగా..
9907. పెదవిచ్చినందుకే పరవశం..
పెనవేసిన క్షణాలజరామరమేగా..
9908. నీ మాటలు జ్ఞపకాలుగా దాచుకున్నా..
మదిలోని బరువును తేలిక చేసాయనే..
9909. కాలానికో కుదురొచ్చింది..
మన మాటలను ఆలకించాలనే కుతూహలంలో..
9910. ఆధారమవ్వాలనుకున్నా  నీకు..
నీ జీవితానికి దీపమై ఉండమన్నావనే..
9911. పట్టుకుచ్చులా మెరుస్తుంటావు..
కలనేతగా ఉన్నా చాలని నేనన్నందుకు..
9912. అందుకోలేని దౌర్భాగ్యం..
చేజార్చుకున్న అదృష్టం నా నువ్వు..
9913. అల్లుకుంటున్నా కొత్త కవితలెన్నో..
నీ గుసగుసలు దాచుకోవాలని..
9914. నాకొచ్చిందొకటే మధురగానం..
మన మనసులు కలిపిన వసంతరాగం..
9915. నా ఏకాంతం  నీకెందుకో..
పిలవకుండానే పరుగెత్తుకొస్తావు చనువుగా..
9916. నీ చూపులతో  బంధాలు..
పెదవిప్పితే అవుతాయేమో అనుబంధాలు..
9917. నవ్వులందుకే దాచేస్తున్నాను..
నీ ఆత్రానికి అధరం తొణికిపోతుందని..
9918. ఆనందాన్ని అనుసరిస్తున్నా..
నీవల్ల నాలో నవ్వులు రెట్టింపులవుతుంటే..
9919. మనమంటూ మొదలవ్వొచ్చుగా..
మాటలతో గుచ్చే అలవాటు మానుకుంటూ..
9920. గారాలనిప్పుడే కలవరించకు..
నయగారాలంటూ నా సొగసుని శోధించకు..
9921. కన్నుల్లోకి చూస్తూనే తడబడ్డాను..
ఇష్టమడిగితే మనసద్దంలో నేనున్నందుకు..
9922. ఊరింతలతోనే ఊగుతుంటావు..
రాత్రైతే చాలు నిద్రొస్తుందని జోగుతూ..
9923. గమకమే కలస్వనం..
చెక్కిళ్ళ తీపి పెదవికి తెలిసేవరకూ..
9924. చెరిసగమైపోయాం..
నేనే నువ్వంటూ  మనం పాడుకున్నపుడేగా..
9925. అంకమ్మ శివాలు మొదలైనట్టుంది..
అర్ధరాత్రైనా మాటలకలుపు రాలేదంటే..
9926. ఉంటానిలా నిఖిలమై..
నాలో నీలాలు నువ్వు చిందించనంతవరకూ..
9927. గెలిచేదెప్పుడూ మనసేగా..
మాటల్లో ఎవ్వరోడినా..
9928. పున్నమినింక పదేపదే పిలవకు..
జాబిలిగా నేనెప్పుడో  మారిపోయా..
9929. మౌనమిప్పుడు ముద్దు కాదు..
మాటల్లో మురిపెం చవిచూసాక..
9930. హేమంతాన్నెప్పుడో పిలిచేసాను..
వేసవని భరించలేనని నువ్వు విసిగినప్పుడే..
9931. నిదురపోతేనేమిలే నువ్వు..
నీ కలలెప్పుడూ కోరుకునేది నన్నేగా..
9932. విరామం నాకొద్దిక..
నీ రాకతో విరహమిన్నాళ్ళకు తీరుతున్నాక..
9933. వేకువన్నది గమనించలేదు..
నీ గుండె చప్పుడు ఆలకిస్తున్నందుకు..
9934. సౌందర్యమే నిలువెల్లా..
నీ సమక్షంలో తనువెల్లా పులకించిపోయాక..
9935. కురిసింది నేనే..
కాసిని జ్ఞాపకాలు నువ్వు  నెమరేసుకున్నావని..
9936. నటినయ్యా నీ సాహచర్యం..
ఆరుమాసాల్లో నీకు దగ్గరైనందుకు..
9937. పగటికలలే నీకు నిత్యం..
రాత్రిని రానివ్వక నువ్వెలివేస్తుంటే..
9938. అలుపెరుగని ప్రవాహం..
మందాకినిగా నీలో నా పయనం..
9939. కథగా నన్ను మాయ  చేసావు..
కలం  పట్టమని ఇప్పటికిప్పుడు శాసించావు..
9940. అందుకున్నా ఆహ్వానమిప్పుడే..
రెట్టింపైన నవ్వుల పరిమళాన్ని ఆస్వాదించేందుకని..
9941. మాటలందుకే తగ్గించేసా..
కళ్ళకెలాగూ మనసు భాష అబ్బిందని..
9942. ఈ మైమరపులు ఈనాటివి కావు..
నీ నవ్వుల్లో నన్ను పోగొట్టుకున్నప్పటివి..
9943. నీ అక్షరముగా నన్ను మారనివ్వు..
చెరపలేని భావమై ఉండిపోతా సత్యము..
9944. మనసు ముక్కలైనప్పుడనుకోలేదు..
తిరిగి పేర్చినా నీ  రూపాన్నివ్వలేదని..
9945. నీ వెనుకే నా పయనం..
నిన్నో అక్షరం చేయాలనే ఆరాటం..
9946. అనుసరిస్తూనే నేనున్నా..
నన్ను తప్పటడుగులు వేయించవనే నమ్మకమది..
9947. విషాదాన్ని  వెనకేసుకురాను..
జ్ఞాపకములో నిన్ను జార్చి నన్నోదార్చుకోను..
9948. చిక్కులు పెట్టి చంపుతుంటావు నన్ను..
విడదీయలేక విసుగుతుంటే నవ్వుకుంటూ నువ్వు..
9949. కలనే అతిక్రమించలేకున్నా..
జీవితాన్నేం ప్రశ్నించగలను..
9950. మనసు నిండిందనే ఒంపేస్తున్నా..
ప్రేమించొద్దని నువ్వు తప్పుకుంటున్నా..
9951. వరదగుడిగా నా  మది..
ఎండల్లో వానలా నీ తలపులు నాలో  కురిసిపోతే..
9952. నీ అంతరంగమై నేనుండిపోతా..
నన్నే ఆవిష్కరిస్తూ నువ్వుంటే..
9953. మనసో మందారమైంది..
 ఎదలో నీ పూజకి సిద్ధమవుతూ..
9954. వలపంటే నెమరింతలే..
నువ్వు జ్ఞాపకమై నేనొంటరైనప్పటి సంధి..
9955. మనోభావానికి మూలమయ్యావు..
అల్లిబిల్లి నా కవితల్లో అల్లుకుంటూ..
9956. భావానికందం వచ్చింది..
పదాలన్నీ రాగయుక్తంగా కలిసి కుదిరినందుకే..
9957. మాలికందుకే  పరిమళించింది..
కొన్ని అక్షరాలు మల్లెలను తలపించాయని..
9958. పిలుపొక్కటీ మిగిలింది..
బంగారంపై ఆసక్తి నా  ముద్దుపేరయ్యాక..
9959. ఋజువొక్కటీ మిగల్లేదు..
గతజన్మలో మనం అమర ప్రేమికులమని..
9960. కలం పట్టినదందుకే..
కొందరి హృదయాలైనా మారితే చూడాలని..
9961. గుర్తించలేదు నీ మనసుని..
గుండెసవ్వళ్ళు మువ్వలుగా నాకనిపించినందుకే..
9962. రామాయణం తిరగబడేది..
రావణుడు కథానాయకుడయ్యుంటే..
9963. సరసమాడేందుకే నేనొచ్చా..
నవ్వులు కోసుకున్నాయంటే నేనేం చేయను..
9964. ప్రవహిస్తూనే ఉండాలనుందిలా..
నీ అక్షరాలు రాస్తుంటే నన్నిలా..
9965. ఆత్మోదయమంటే ఇదేగా..
నా ఏకాంతంలో నువ్వు జన్మించడం..
9966. నువ్వు కురవడం బాగుంది..
నేనలా  వెన్నెల్ని తలచుకోగానే..
9967. మనసుకందని రహస్యమేగా నువ్వు..
మెలకువలో కలగా వస్తున్నావంటే..
9968. పున్నమినై నవ్వుతాను నేనొక్కసారి..
నీక్కావాల్సింది వెన్నెల కురవడమేగా..
9969. వగలెన్ని పోతుందో మల్లెచెండు..
నిశ్శబ్దానికి పరిమళాలు పంచడమొచ్చన్నట్టు..
9970. నా మనసులో ఊరింది మకరందం..
జన్మలో వీడిపోను నీతో బంధం..
9971. చూపుతో హృదయాలు చుట్టుకుందామా..
అసూయతో కాలం రగిలిపోయేట్టు..
9972. సమయాన్ని బుజ్జగిస్తున్నా..
ఎదురుచూపులు త్వరగా ముగిసేలా చూడమని..
9973. నిన్నటిని గమనించుకున్నా..
రేపటిరోజున ఎలా ప్రయాణించాలా అని..
9974. మల్లెనై మురుస్తాను..
వెన్నెల్లో నా పరిమళాన్ని ఆస్వాదిస్తానంటే..
9975. వైశాఖపున్నమి వన్నెలూరింది..
మౌనం చాటు మాట ఆలకించిందేమో..
9976. వెన్నెలకు హాయిగా సోలిపోయా..
పున్నమి పులకరించేందుకు రమ్మనగానే..
9977. ఎప్పటికీ నీ కలనే..
ఆహ్వానించేందుకు సిద్ధంగా నువ్వుంటే..
9978. భూతద్దంలో చూడాలనుకున్నా భవిష్యత్తు..
గతాన్నందుకే నెమరేస్తూ నేనున్నా..
9979. వెన్నెల జాగారం మొదలయ్యింది..
మల్లెలు పరిమళించాలిక రేయిలో..
9980. మల్లెలే నావెంట పడుతున్నాయేంటో వింతగా..
పులకరించే భావమేదీ నాలో  లేకున్నా..
9981. మాటలు గాలికొదిలేసాను..
నీ మనసులో మురిపెమైన భాగ్యానికి..
9982. మల్లెలతో రాయబారాలెందుకో..
రాత్రైతే అలుకను తీర్చుకోవచ్చనే ఎత్తుగడలో..
9983. జ్ఞాపకాలచేదు తీపయ్యిందిప్పుడే..
వాస్తవానికి రప్పించకు నసపెట్టి  మరీ..
9984. నలగక తప్పలేదు మనసు..
పెదవులు నవ్వనని మొరాయిస్తుంటే..
9985. కొన్ని తపనలంతే..
వెన్నెల కోసమని పదేపదే కొట్టుమిట్టాడుతుంటాయి..
9986. అవధులు దాటుతోంది ప్రేమ..
నీతోడు లేని బ్రతుకెందుకంటూ..
9987. చూపులతో తినడం నేర్చానప్పుడే..
మనసు ఆకలి మొదలయ్యిందనే..
9988. లాలిస్తున్నా  కాలాన్ని..
నాలోని అనుభూతుల్ని తనలోనూ  పుట్టించమని..
9989. లాలిస్తున్నా  కాలాన్ని..
మదిలో విరహాన్ని త్వరగా ముగించమని..
9990. కురవక కురవక కురిసింది వాన..
అకాలమై ఆశలు తనతో కొట్టుకుపోయేలా...
9991. పక్షానికోమారు పక్వమవుతూ అక్షరాలు..
ఆస్వాదించేవారు లేరని విస్తుపోతూ..
9992. నీ మనసు బాకీ తీర్చేసా..
కొన్ని నవ్వులు రాసిస్తే సరిపోతుందన్నావనే..
9993. ఎన్ని రంగులు పులమాలో జీవితానికి..
చివరికి చీకటిలోనే అర్ధాంతరంగా ముగిసిపోతుంది..
9994. కొందరి జీవితాలంతే..
ఏ ఆత్మీయతను చూడకనే కడతేరిపోతుంటాయి..
9995. అక్షరాలే నా బలం..
అందుకే వెంటుంచుకుంటా అనుక్షణం..
9996. కలల్లోంచీ జారిపడినట్టు జీవితం..
మన కలయికతో  నందనవనం..
9997. మంచుబిందువులా మనసు..
ప్రేమకు మారుపేరుగా నాలో  విస్తరిస్తుంటే..
9998. అర్ధం మారిన స్వేచ్ఛ..
హృదయాల్ని మించి పరుగుపెడుతూ..
9999. అనుభూతించడమో సాహసం..
నాకు లేని భావాల్ని ఆస్వాదించడం..
10000. కవితగా  మెదులుతున్నా..
ఏ అనుభూతిగానైనా నన్ను రాస్తావనే..

No comments:

Post a Comment