Wednesday, 12 September 2018

10401 - 10500

10401. ఊహించని మలుపేగా..
గ్రీష్మంలో వసంతజలం నాపై చల్లావంటే..
10402. మనసు పులకరిస్తోంది..
ఒక చిరుస్పర్శ అనుభవానికిలా చేరువయ్యిందని..
10403. ఎదురుచూపులు ముగిసేట్టున్నాయి..
మనసులో పండగ సందడి మొదలైనందుకు..
10404. ఆనందంతోనే కొలుచుకుంటున్నా..
మదిలో నిన్ను దాచుకున్న అనుభూతిని..
10405. కన్నీరెప్పుడూ ఓడిపోతుంది..
గుండెలోంచీ జారొద్దని ప్రయత్నించిన ప్రతిసారీ..
10406. ఓదార్చలేకున్నా హృదయాన్ని..
ఓ బంధం దూరమైన ఆవేదనలో..
10407. ఎన్ని చినుకులని ముడేసుకోవాలో..
కొంత పరవశాన్ని కాజేద్దామంటే..
10408. ఉండీ లేనట్టుంటావు..
నా ఊపిరికడ్డం పడుతూ నువ్వు..
10409.సంధ్యారాగం మర్చిపోలేనుగా..
నీ జ్ఞాపకం కన్నుల్లో ఎర్రనవుతుంటే..
10410. మౌనాన్ని ఆలకిస్తున్న క్షణమిది..
నిశ్శబ్దం మాట్లాడుతున్న సవ్వడిలో..
10411. ప్రతిమలుపులోనూ నువ్వేగా..
కాలాన్ని ఆపేస్తూ కలసిరాలేదని నిందలెందుకో..
10412. తీరేదేలే తనివి..
తీరికయ్యే రోజుకని మనసు ఎదురుచూస్తుంటే..
10413. మూగబోయిన మాటలనడుగు..
మనసు మైదానంలో ఆ నిశ్శబ్దమేమిటని..
10414. పుంతలు తొక్కుతున్న నాలో పులకరింతలు..
నీ ధ్యాసలో వివశమై నేనుంటుంటే..
10415. వసంతం కోల్పోయినట్టుంది..
నా చూపుకొనల్లో నువ్వు కన్నీరయ్యావంటే..
10416. చినుకై కురవలేనా..
నాకై దోసిళ్ళు నువ్వు తెరిచుంచావంటే..
10417. కల పూర్తయ్యింది..
ప్రాణమస్తమించినా ఫరవాలనిపించేలా..
10418. ప్రేమను కొలుస్తున్నాను..
మనసు బయటపెట్టాలో లేదో నిర్ణయించాలని..
10419. నా ఒంటరితనపు హద్దు చెరిగిందిలా..
నీ నీడతో జత కలిసినందుకు..
10420. అనుభూతి ప్రవహించినప్పుడే అనుకున్నా..
వానల్లే కురిసింది నువ్వేనని..
10421. కాలమలా ఒదిగినట్టుంది..
నీ జ్ఞాపకాల శిలలు చెక్కుతున్నందుకే..
10422. కవితయ్యింది నువ్వేగా..
కలలోకి పిలవలేదని పదేపదే అలుగుతావెందుకో..
10423. అనుబంధపు వల్లరికి తొందరెంతుందో..
అనురాగపు సరిహద్దు ఆకాశమవుతుంది..
10424. నీ తలపులే అమృతంగమయం..
జీవించి ఉన్నానందుకే స్వర్గమయం..
10425. నీ జ్ఞాపకాల పందిరిలో నేనున్నా..
వానొచ్చిందని మన ప్రేమపాటని వల్లిస్తున్నా..
10426. మిణుగురుల్లోనేం వెతుకుతున్నావో..
నీలిమేఘపు నక్షత్రాల నడుమ నేనుంటే.. 
10427. అక్షరాలకు స్వరమొచ్చినట్టుంది..
నీ కవితల్లో సంగీతం వినబడుతుంటే..
10428. నన్ను తాకిన రంగుల సీతాకోకేనది..
గుండె గుచ్చుకున్న నీ జ్ఞాపకం..
10429. అరణ్యమంతా చీకటయ్యింది..
వెన్నెల పలకరించనని వలసటు పోయినందుకే..
10430. నవ్వుని పారేసుకున్నా..
నువ్వు పలకరిస్తావని ఎదురుచూసి అలసినందుకే..
10431. కువకువలు కప్పుకోవాలనుంది..
కమ్మని మాటలాడవూ..
10432. అవ్యక్తమొకటి వినబడుతుంది..
అంతులేని నీ తలపు మేల్కొన్నట్టుంది..
10433. ఏకాంతాన్ని సవరిస్తున్నా..
మౌనాన్ని పాడుకుందామని..
10434. అంబరమాపలేని హర్షమనుకుంటా..
వర్షమై కురిసి మనల్నిలా తడిపేస్తుంది..
10435. నేనే ఆమనైపోతున్నా..
నువ్వంత నాజూకుగా నన్ను వర్ణిస్తుంటే..
10436. చివరికి మిగిలిందిదే..
మనసు విరిగిన మెత్తని సవ్వడి..
10437. అలలవుతున్న కురులు..
దోబూచులాడేందుకు నీ మోము దాచుకున్నావని..
10438. తపిస్తూనే తనుంది..
నీ హృదయమనుకుంటా..
10439. అనుభవానికొస్తుందిప్పుడే..
నీ ఊపిరి నాలో చప్పుడైన సంగతి..
10440. నిన్నటికి అనామికనే..
నీ ప్రేమే నా పేరయ్యిందిప్పుడు..
10441. అద్భుతానికే అపురూపమవుతున్నా..
నీ పరవశాలు అణువణువులో సోకి..
10442. మనసిస్తే చాలు..
మాలికైపోనా నేను..
10443. నీకోసమే వికసిస్తున్నా..
కలువకు దూరమున్న చంద్రునిలా ఆరాధిస్తావని..
10444. కలతై కమ్ముకోకు..
కథగా మలుచుకోలేను..
10445. నిజాలన్నీ నిష్ఠూరాలే..
ఆత్మీయత ముసుగుమాటు తొంగి చూడరాదంతే..
10446. రేపటి వాస్తవమే..
ఈరోజు కలగా నన్ను మురిపించింది..
10447. కలయిక కోసమని ఎదురుచూపులెందుకో..
మధురోహలన్నిటా నన్ను పొదుపుకుంటున్నా..
10448. మాటతో ముడిపడే బంధాలే అన్నీ..
పెదవికి చేటయ్యే పదాలు వాడొద్దందుకే..
10449. పొగడపూల పరిమళమబ్బినట్టుంది..
నీ పొగడ్తలోని నిజాయితీ గమనించగానే..
10450. అధైర్యం ముందుకొస్తుంది..
ధైర్యాన్నెంత వీరభినయించాలనుకున్నా..
10451. నెలవంకకి దూరం జరిగిపోయా..
చుక్కలతో వైరం పెంచుకోడమెందుకనే..
10452. జ్ఞాపకాన్ని జావళి చేసి పాడుకోవాలిక..
ఆకాశం నా అస్తిత్వానికి తోడైనందుకైనా..
10453. నిశ్వాసగా వదిలేస్తావని భయపడుతున్నా..
నీ ఊపిరి కాలేకపోయినప్పుడల్లా..
10454. నేనో విషాదాన్ని..
చెదిరిపోయిన కలలన్నిటా నీకు కనిపిస్తున్నానందుకే..
10455. విశ్వాసమొచ్చిందిప్పుడే..
నీ ఆకాంక్షలోని ఆనందం నేనవగానే..
10456. కన్నీరే మిగిలిందిప్పుడు కన్నుల్లో..
అనవసరపు బంధాల్లో ఇరుక్కున్నందుకు..
10457. హృదయంలోకే చేరాలనుకున్నా..
నీ జీవితంలో వసంతాన్ని నింపాలని..
10458. నిన్నటిదాకా నిద్రించిన శిల్పాన్ని..
నీ స్పర్శతో వేకువయ్యిందిప్పుడే..
10459. నిశ్శబ్దపు మధురథ్వనే అది..
నాలో సంగీతమై ప్రవహిస్తుంది..
10460. అపురూపమే ఈ శ్రావణం..
స్వరాలవెల్లువలా నీ స్నేహం..
10461. మనసులో దాచుకున్నా..
వేకువపిట్టల చిలిపిసవ్వడి నాలో నిండిపోతుంటే..
10462. మధూదయం నిజమే..
నీ తలపులతో వేకువ మొదలైనప్పుడు..
10463. ఆనందం మనదే..
ఎదురుచూపులు ఫలించి కన్నీటిభాష్పాలు విడుదలైనప్పుడు..
10464. మనోహరమనిపించింది ఉదయం..
గులాబీరేకంటి నీ తలపు మెత్తదనముతో..
10465. పువ్వై నవ్విన వసంతం..
ఎంత బరువెక్కిందో విరహం..
10466. స్వప్నాలెరుగని కన్నులవి..
ప్రతినిత్యం కన్నీటితో అనిద్రే అవుతుంటే..
10467. కాలం కాగితమయ్యింది..
మరపురాని గతమంతా తనలో దాచుకున్నందుకు..
10468. నా మనసులో మొదలైన వసంతం..
కోకిల తెలిపింది నీ ఆగమనం..
10467.  నమ్మకాన్ని వెతుక్కోవాల్సిందే..
ఆశనిటు పూయించి నడకటు మార్చుకుంటే..
10468. వసంతానికి సమానమైన శిశిరం..
హృదయస్పందనులు ఒకటైన మనమిద్దరం..
10469. వేదనదులంతే..
నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటాయి జీవనదులైనట్టు..
10470. కొన్ని మురిపాలంతే..
రవ్వంత పరిచయంలోనే ఆనందాలు పెనవేసుకుంటాయి..
10471. అల్లాడినప్పుడే అనుకున్నా..
నీలో మోహం తరంగమై ఎగిసుంటుందని..
10472. వలపించావనుకున్నా..
నీ ఎదలో చాపేసుకునందుకే కూర్చున్నా..
10473. బంధీనే మనసు..
తాపత్రయాల నుండీ తప్పించుకోలేక సతమతమవుతూ..
10474. ప్రేమని గుర్తించిందప్పుడే..
నీకు దూరమై విరహం అనుభవానికొచ్చినప్పుడే..
10475. మట్టివాసన పలకరింపు..
వర్షాన్ని మోహించినందుకేమో..
10476. ఆ నవ్వులో నలుపురంగు..
ఏ జ్ఞాపకాలు స్రవిస్తున్నందుకో..
10477. మతి చెదిరినట్టుంది..
నిన్ను తలచినప్పుడల్లా ఆవేదన అధికమవుతుంటే..
10478. మూగబోయిన అక్షరానికి భావాలెన్నో..
మనసైన రాగానికి అనుభూతులన్ని..
10479. సప్తస్వరాల సమ్మేళనమేగా..
మన పరిచయానికి అక్షర రూపమిస్తే..
10480. కోరికలుంటే అంతేగా..
మనసుని భావాలకందనివ్వక అదోలా ఏడిపిస్తుంది..
10481. మాటల్ని సమాధి చేసిన విషాదం..
నీకు దూరమైన నా వర్తమానం..
10482. నిశ్శబ్ద క్షణాలే ముందున్నవన్నీ..
స్వరాలు మరచిన జీవితమయ్యిందిగా..
10483. కలిసుండటమో విశేషం..
కానీ అది జరిగేది కథల్లోనే..
10484. సంతోషం స్వర్గీయమైందెప్పుడో..
కుటుంబం కాస్తా విచ్ఛినమై ఛిన్నాభిన్నమైనప్పుడే..
10485. కలిసుండాలన్న కోరికే..
ఈనాటికిలా మనసుకు పండుగైనట్టు తీరింది..
10486. కలిసున్నదెప్పుడు స్థిమితంగా..
నీకు నేను కేవలం అవసరాన్నయ్యాక..
10487. నమ్మకమెందుకు విశ్రాంతి కోరిందో మరి..
మనసుని పదేపదే అనుమానంలోకి జార్చుతూ..
10488. మనసుని సవరించిన నీ కొంటెదనమిది..
నాలో అనురక్తి బుగ్గల్లో కెంపులుగా..
10489. నా నువ్వుగా మారినందుకేమో..
నీలో నవ్వులు మల్లెలవుతున్నాయి..
10490. మనసిప్పుడు సీతాకోకే..
నీ మౌనంలోని పలకరింపులు ఆలకించి..
10491. నిర్లక్ష్యమదే మరి..
నువ్వుండగా నీరవం నా నేస్తమయ్యిందంటే..
10492. ఈ రోజు అమాసని మర్చేపోయా..
దీపావళి వచ్చిందని నువ్వు గుర్తుచేసేవరకూ..
10493. మనసెప్పుడో శూన్యమైంది..
కాస్తంత వివేకమూ అప్పనంగా తనకివ్వగానే..
10494. వర్తమానం శయనించినట్టుంది..
గతమందుకే కలలా పదేపదే సవ్వడిస్తుంది..
10495. ఆనందం అధికమైందిప్పుడు..
నువ్వల్లిన పదాల్లో అనుభూతినై నేనున్నందుకు..
10496. హృదయన్నెందుకు మెలిపెడతావో..
అనుభూతి నీకే పూర్తి స్వంతమైనట్టు..
10497. హరివిల్లు గొడవకొస్తుంది..
నవ్వమన్నప్పుడల్లా తనకు నేను పోటీనిస్తున్నానని..
10498. నాలో చిరునవ్వు పరవళ్ళు తొక్కుతోంది..
నీలో నీరవాన్ని పూర్తిగా హరించాలనే..
10499. అటూ ఇటూ నీ తలపులు..
నా హృదయానికి పదివేల పలకరింపులవే..
10500. పయనాన్ని ఆస్వాదించవలసిందే..
జీవితంలో గమ్యమెంత సుదూరమని అనిపించినా..

No comments:

Post a Comment