Wednesday, 12 September 2018

10101 - 10200

10101. మనసుకెప్పుడూ మెలికలే..
నా ఆనందరాగంలో లయ నీదైనప్పుడు..
10102. నిద్దురలోనూ మెలిపెడతావు..
కలలోనే ఆగిపోయానందుకే కౌగిలిలోకి జారక..
10103. ఊపిరి నిన్నే కోరిందిలే..
పాటకి పల్లవిగా మారావందుకే..
10104. యుగాల వేదనెంత నిశ్శబ్దమో..
కన్నీటి  స్వరమేదీ వినబడనంతగా..
10105. నీకై ఊపిరినొదిలేస్తాను...
కాలాలకి అతీతంగా నన్ను ప్రేమించావంటే..
10106. అమృతమెప్పుడూ  ఆలశ్యంగానే అందుతుంది..
ఆరగించేందుకు మనం ఎదురుచూడాలంతే..
10107. ఏకాంతంలోకి నేను..
కొన్ని క్షణాలు నాలో మనమవ్వాలనే..
10108. ఆనందపు రుచి మారిందిప్పుడు..
అపార్ధమొచ్చి అనుకోకుండా కలిసాక..
10109. కన్నీటిలో రంగులేం  వెతుకుతున్నావో..
నీ చెక్కిళ్ళకు సరిపోలలేదంటూ..
10110. నా నవ్వుకింత సొగసెక్కడిదో..
నువ్వొక్కసారి చూపులు కలిపినందుకే..
10111. నీకూ నాకూ తేడాయేముంది..
ఒకరికి ఒకరై మనమున్నప్పుడు..
10112. కథనమొకటి మొదలవ్వాలిప్పుడు..
ప్రతిరేయీ నీ కల నేనవుతున్నందుకు..
10113. నీ పెదవులు వికసించినప్పుడనుకున్నా..
నవ్వితే నన్ను తలచుకునుంటావని..
10114. వరమై నాతో ఉంటావనుకున్నా..
ప్రాణంలేని రాతిగా మిగిలిపోతావనుకోలా..
10115. నీ రాకకి స్వాగతం పలకాల్సిందే..
పండగవై నా జీవితంలోకి నువ్వొస్తానంటే..
10116. నా పెదవులవంతే..
నువ్వుంటే నెలవంకలైనట్టు..లేకుంటే ముకుళించుకున్నట్టు..
10117. చూపులతో మొదలైన రణం..
నవ్వుల కలయికతో ముగిసిందలా..
10118. గీతను మార్చాలనుకున్నా..
అంతర్మథనమొక్కటీ మిగిలింది..
10119. ప్రియసఖినే నేను..
నాలో ఆనందానికి స్పందన  నువ్వైనందుకు..
10120.ప్రేమలేఖ రాసింది నేనే..
చదువుకొనే కోయిలవు నువ్వని..
10121. కాగితమవలేనా నేను..
కలమవుతానంటే నువ్వు..
10122. కల్లోలమెందుకులే ఇప్పుడు..
కలకీ ఊహకీ తేడాలు వివరిస్తూ..
10123. ఆపను తలపును..
కొన్ని క్షణాలు నాకెప్పుడూ ఇష్టమే..
10124. కల ఆగిపోయింది..
నిదురలో మెలకువొచ్చినందుకే..
10125. నీ పిలుపో పాటై వినిపించింది..
నాలో నవరాగానికి పల్లవిప్పుడు కుదిరింది..
10126. అనురాగం కుదరాలిద్దరి నడుమ..
పలకరింపులు పులకరింతలుగా మారాలంటే..
10127. ఆ నలుగురుంటే చాలు..
మంచుపల్లకిలో ఆనందంగా ఊరేగడానికి.. 
10128. నిక్షిప్తం చేస్తా నా నవ్వులన్నీ..
కలనైనా నీలో కలవరం కలగరాదనే..
10129. క్షణాలు కరుగుతూనే ఉన్నాయి..
కన్నీటిని దాచలేని నిస్సహాయతంటూ..
10130. కాలమలా కదులుతుంది..
జీవితమనే పుస్తకంలో పేజీలను నింపుకుంటూ..
10131. నవ్వినప్పుడల్లా నిన్నే తలచుకుంటున్నా..
ఊహలన్నిటా నిత్యం నువ్వుండాలని..
10132. నీ సొంతమన్న భావనొకటి చాలు..
నాలో నిశ్చింత నవ్వుగా నిలిచేందుకు..
10133. కలలోనే మురిసిపోతున్నాను..
నీకు చేరువైన ఆనందాన్ని అనుభవిస్తూ..
10134. నేనో మౌనాన్నే..
నిన్ను కలిస్తే మోహనరాగమై వినిపిస్తానంతే..
10135. అక్షరాలు అలలవుతుంటాయలా..
తీరమై నువ్వు ఆస్వాదిస్తావని తెలిసినప్పుడల్లా..
10136. నిరీక్షణెప్పటికీ వ్యథే..
దుర్భరమైన యాతనొకటి మనసు మెలిపెడుతుంటే..
10137. అక్షరాలకు పరిమళమద్దుతానలా..
చదవుతూనే నీ ఆవేదన మాయమైపోయేలా..
10138. మెరవాల్సి ఉంది అక్షరమిక్కడ..
భావంతో నిన్ను అభిషేకించాలంటే..
10139. మునుపున్న లావణ్యమే నాలో..
ఈరోజు నువ్వు గుర్తించావంతే..
10140. ఎక్కడని వెతుకుతావో లావణ్యాన్ని..
వెన్నెల మెత్తదనం చవిచూడనట్టు..
10141. తొలిచూపు నేసిన భావమది..
అపురూప లావణ్యమై మనసునంటింది..
10142. చులకనెప్పుడో అయ్యింది ప్రేమ..
అపనమ్మకం మదిలో మొదలవ్వగానే..
10143. వర్షమెన్ని వర్ణంలో కురిసిందో..
నా హృదయాకాశంలో వానవిల్లిప్పుడు..
10144. నావైపు ఓసారి చూడమంటున్నా..
నవ్వులతో నేస్తం కట్టాలనుందన్నావుగా..
10145. నా మనసిప్పుడు శాంతించింది..
నీ జ్ఞాపకాలు పావురాళ్ళనుకోగానే.. 
10146. మాటంటే నువ్విప్పుడు విన్నది కాదు..
నేనెప్పుడో నా మనసులో దాచుకున్నది..
10147. నీ జ్ఞాపకమే అది..
నాలో సంగీతమై శాశ్వతమయ్యింది..
10148. ఆనందమలా నశించింది..
కొన్ని నిరాశలు నిలువెల్లా కమ్ముతుంటే..
10149. మతి"మరుపు"లోనికి జారాక..
మనసేం మాట్లాడాలో మరచిపోయింది..
10150. మనసు మండిపోతుంది..
మేఘమై కూడా నువ్వు కురవలేదనే..
10151. చిరునవ్వుతూనే జీవితం..
ఒక్కోసారి విషాదాన్ని కసిరికొట్టాలి మరి..
10152. అందుకే నవ్వా..
నీకు పండగెలా ఉంటుందో చూపాలని..
10153. నా మువ్వల శబ్దం మనసు విన్నట్టుంది..
నీ అడుగు  పయనం నావైపు మొదలయ్యింది.. 
10154. నా కళ్ళ నిండా నవ్వులు..
నీ రూపం ఊహలో మెదిలినప్పుడల్లా..
10155. కాలాన్ని బందీ చేయాలనుంది..
కాసేపు జ్ఞాపకాలను ఏరుకుందామని..
10156. నిశ్శబ్దం కరుగుతోంది..
ఆకాశమంత తారల ఊసుల సందళ్ళతో..
10157. ఎన్ని కవితలల్లాలో..
నా ప్రేమ సమయాన్ని నీకిచ్చేందుకు..
10158. కథలెన్ని చెప్తావో..
వినడానికి సిద్ధమని నేననక మునుపే..
10159. నా సమస్తమంటే ఏముందీ..
నీ చిరునవ్వుల సమక్షమేగా..
10160. నీ పిలుపు..
కోయిల పాట జ్ఞాపకంలా నాకు..
10161. చీకటి సైతం పరిమళిస్తుంది..
మల్లెల మాటలేవో వినబడ్డట్టు..
10162. కొన్ని నవ్వులు నీకిచ్చేస్తా..
కన్నుల కలనేతలో దాచుకుంటావంటే..
10163. మొట్టడం మొదలెట్టకు..
కాస్త జీవితాన్ని చవిచూద్దాం రమ్మంటే..
10164. నవ్వుల నాపచేను పండింది..
పువ్వుల ప్రణయరాగం చూసినందుకే..
10165. నేనంతా సంతోషమే..
వాకిట్లో వసంతం నిలబడిందని తెలియగానే..
10166. నువ్వో అక్షరానివే..
మనసు బరువంతా కాగితం మీదకొంపేస్తూ..
10167. కన్నులు బరువెక్కిన నిరీక్షణ..
వెన్నెలకు వేసారిపోయిన హృదయమిక్కడ..
10168. కొన్ని స్మృతులంతే..
ఎంత నవ్వలనుకున్నా కన్నీటినే తెప్పిస్తాయి..
10169. మనోభావాల ప్రవాహం..
ఈ సాయంకాలం నాలోని కలకలం..
10170. అక్షరమైంది హృదయం..
నాలో కదిలే విషాదం కవిత్వమిప్పుడు..
10171. కలల కలనేతలు..
కొత్త బంగారులోకంలో నాతో నువ్వున్నట్టు..
10172. కుంచెగా మారుతూ నా కలం..
నీపై భావాన్ని ఆవిష్కరించాలని పట్టినప్పుడల్లా..
10173. ఎన్ని హొయలొలికించాలో అక్షరాలు..
చదువరుల మనసు గెలవాలనుకుంటే..
10174. వర్షం కురుస్తోంది..
చీకటికి పోటీగా ఈ మలిపొద్దు..
10175. గుండె చప్పుడు ఆగిపోతున్నట్టుంది..
కన్నీటివాన ముగియదెందుకో మరి..
10176. పూలవనమవుతూ మది..
నీ తలపులన నే పూసుంటానేమోనని..
10177. నువ్వో వ్యసనమవుతావనుకోలా..
నా సమయాన్నంతా అప్పనంగా ఆక్రమిస్తూ..
10178. తలపును మూయలేకున్నా..
కలనైనా నువ్వు కరుణిస్తావనే ఆశలోనే..
10179. హృదయమిప్పుడు తేలికైంది..
నా జ్ఞాపకాన్ని నువ్వు మోస్తున్నావనే..
10180. పలుకు పదనిసయ్యింది..
నీ మనసు నన్ను శృతిచేసినందుకు..
10181. భావమొలికినందుకేమో..
కాగితమలా నల్లని అక్షరాలుగా మెరిసింది..
10182. ఘల్లుమంటున్న భావాలు..
నా ప్రణయంగా నిన్ను లిఖించినందుకే..
10183. నీ గుండెతడి తీసుకోలేనా..
నా నిరీక్షణలోనే బ్రతికున్నావంటే..
10184. మొదలయ్యిందో గుసగుస..
ఆషాడం కురిసేందుకు సిద్ధమైందని తెలీగానే..
10185. వసంతాన్నే గుర్తుపట్టలేకున్నా..
మనసు విసిగినందుకేమో..
10186. తిరిగివచ్చేనా ఆపాతమధురాలు...!
అనుబంధాలు ఆవిరై నాణ్యత లోపిస్తుంటే..
10187. తిరిగివచ్చేనా ఆపాతమధురాలు...!
కనుమరుగవుతుంటే జ్ఞాపకాలు.
 
10188. విరబూస్తూ ఓ పరిమళం..
కొమ్మకొమ్మనా పువ్వుల సంతోషమది..! 
10189. తిరిగివచ్చేనా ఆపాతమధురాలు...!
ఆశలు విఫలమవుతుంటే..
10190. పరవశమే నీ పరిచయం..
మదిలో ఇంద్రజాలమొకటి మొదలైనందుకు..
10191. కవిత్వమదేగా..
మనం కలబోసుకున్న కబురులన్నీ కలిస్తే..
10192. కలలు స్పష్టమవుతూ నా కన్నులు..
దాచాలనుకున్న నీ రూపాన్ని వెలిగిస్తూ..
10193. మనోవేదనలా తీరింది..
నీ కావ్యంలో నన్ను చదువుకున్నాక..
10194. అనురాగం ఆలాపనై వినిపించినప్పుడనుకున్నా..
నువ్వే జీవనవేణువు ఆలపిస్తుంటావని..
10195. పరిమళిస్తున్న ప్రభాతం నేనే..
ఉదయానికై నువ్వు వేచున్నావంటే..
10196. గతమందుకే గుభాళిస్తుంది..
మన నవ్వులింకా సహజత్వాన్ని కోల్పోలేదని..
10197. మూర్ఛబోయింది మనసు..
ఊహించని మాటలు అక్షరాలుగా చలామణవుతుంటే..
10198. మానసిక విషాదమది..
ఇప్పట్లో తేరుకోలేని వేదనాతీత గాయం..
10199. వసంతం నిజమే..
నువ్వెదురైనా చూడకుండా జీవితం నవ్విందంటే..
10200. తానెప్పటికీ చందురుడే..
మబ్బులెన్ని కమ్మినా అమాసలు ముసురుకున్నా..

No comments:

Post a Comment