Thursday, 5 April 2018

9201 to 9300

9201. ఏం పూసుకొచ్చిందో గాలి..
నీ పరిమళాన్నిలా వెదజల్లుతోంది..
9202. నింగీనేలను కలపాలనుకున్న చినుకులు..
హరివిల్లును సాయమడిగాయి కాబోలు..
9203. జతచేరనంటున్నాయి జ్ఞాపకాలు..
నా మౌనాన్ని మనసు మోయలేనందని..
9204. నీకుగా కురిసిన వర్షానివేగా..
నాకొక్కసారి తడవాలనుందని అన్నందుకు..
9205. మనసాలకించినప్పుడే అనుకున్నా..
అనురాగంలో నా పేరే పల్లవైందని..
9206. శరత్కాలంలో వెన్నెల..
నీకై పగటిని రేయిగా మార్చేస్తూ..
9207. చిరునవ్వు వేసిందిగా వల..
చిరుగాలికి తప్పవింక ముచ్చెమటలు..
9208. ఆ పొన్నచెట్టుదెంత అదృష్టమో..
రాధాకృష్ణుల సరదాలకి సాక్ష్యమవుతూ..
9209. ఇన్నాళ్ళకు తీరిందిలా విరహం..
కల్లోకొచ్చి నువ్వొక్కసారి ఊయలూపగానే.
9210. కృష్ణుడికి అలుపే రాదసలు..
రాసక్రీడలు రాధతో అయినప్పుడు..
9211. అక్షరాలంటే..
మదిలోని భావాన్ని మాలికలోకి తర్జుమా చేయడమంతే..
9212. గమనం దశ మారింది..
రహదారిలో ముళ్ళకంపలు ఎక్కువైనందుకే..
9213. అనుబంధాల వలలో చిక్కక తప్పదు..
ద్వంద్వాలెన్నున్నా సర్దుకోగలిగే జీవన పయనంలో..
9214. సంధ్యారాగాన్ని కనుగొన్నా..
నీరాకతో ఆకాశం నారింజరంగులు దిద్దుకోగానే..
9215. వెన్నెలరాతిరిని కలగంటున్నా..
నా చందమామ ఇప్పట్లో రానన్నాడని..
9216. చిరునవ్వుతో వెలిగితే చాలనుకున్నానీ జన్మ..
నీ పెదవులపైనే జన్మిస్తానని తెలిసాక..
9217. రాతిరవుతుంటే బాగుంది..
నీ నవ్వుల జావళికి జతకావొచ్చనే..
9218. దీపావళికింకా వారముందనుకున్నా..
నీ కన్నుల్లో దీపాలు చూడకముందు..
9219. కలవరాన్ని కలలకిచ్చేసా..
కంటికెదురుగా కౌగిలి చూపి నువ్వెదురవగానే..
9220. తొలిచూపుకి కిరణం నువ్వు..
మలిసందెలో దీపం నేనవలేనా..
9221. సన్నజాజిలా వికసిస్తున్నా..
నా మనసు పరిమళాన్ని నువ్వాశిస్తున్నావని..
9222. ఇందరిలో మెచ్చినదానివే..
నా గుండెతడి నిన్ను తడిమినట్టుంది..
9223. శిశిరాన్ని తలవక తప్పలేదు..
ఆకుపాట మరచిన కొమ్మలు..
9224. రేయంతా దాగిన రాగాన్ని..
ఉదయమైతే మనోమహనమై వినబడాలని..
9225. చిరునవ్వుతో స్వీకరిస్తున్నా..
ఎర్రబడ్డ చెక్కిళ్ళ సాక్షిగా నువ్వు పంపుతున్న సందేశాలు..
9226. రాధనయ్యానందుకే..
జగన్మోహిని అంశగా నేనున్నందుకే..
9227. మళ్ళీ పల్లవి మొదలయ్యిందిక్కడ..
రాగరంజితమై నువ్వు రమ్మనగానే..
9228. సిద్ధించింది జన్మిప్పుడు..
నా వలపు పంట నీ జతలో ఫలించి..
9229. ప్రణయాంబుధిలో తేలుతున్నాట్లు నా మనసు..
మధురవాహినిలా నీ మాటలు ముంచుతున్నందుకేమో..
9230. మంచితనపు ముసుగు తొలగక తప్పదు..
బుద్ధి బయటపడే అవకాశం రావాలంతే..
9231. అపురూపమైన చెలిమేగా..
నిన్నూనన్నూ కలిపిన క్షణాలు మధురమైనప్పుడు..
9232. చీకటలా చెదిరిపోయింది..
హరివిల్లువై నువ్వొచ్చి రంగులిలా పంచగానే..
9233.మెరుపులీనే మనసిక్కడ..
అందాన్ని అద్దానికిచ్చి చానాళ్ళయ్యింది మరి..
9234. మానవత్వపు మెరుగులలా దిద్దాల్సిందే..
మంచితనపు పరిమళం ప్రసరించాలంటే..
9235. ఆశ గెలుపుని సుగమం చేసింది..
గమ్యమెంత దూరమున్నా పయనాన్ని ప్రేమించేట్టు..
9236. కదిలిపోయిందలా రాతిరి..
నీ ఎదురుచూపుల్లో తూరుపొచ్చి పలకరించేసరికి..
9237. అనుభూతుల సాగరంలో నేను..
కనుమూసేలోపు కాస్తయినా ఆస్వాదించాలని..
9238. దారమై ఆధారమయ్యావుగా..
కలవనంటూనే నలుగురినీ నీతో కలుపుకుపోతూ..
9239. 
ఊహల రసవాహినిగా నేను..
ప్రతిరేయి నువ్వు మునుగుతున్నందుకే..
9240. ఆపలేకున్నా కాలపు పరుగును..
వయసెంతయినా నన్ను ఓడిస్తున్నందుకు..
9241. తీపి పరమాన్నమెప్పుడో అయ్యావు..
చేదు జీవితానికి అమృతాన్నద్ది..
9242. గమనమెప్పుడూ మనసైనదే..
గమ్యమని నిన్నూహిస్తూ నే మొదలయ్యాక..
9243. ముగిసేది లేదనుబంధం..
ప్రేమకు సశేషమేతప్ప సమాప్తం లేదన్నావుగా..
9244. క్షణాలతోనూ సహవాసం తప్పలేదు..
కాలం తీరికలేక కదిలిపోతుంటే..
9245. అపార్ధాలతో జీవితమో నరకం..
అనురాగంతో స్వర్గం చేయవెందుకు..
9246. ఎందరి స్త్రీల అభిమానభంగమో..
అవమానపురుచి తెలియాలా ఆకలికి..
9247. నిమీలితమవుతూ అక్షరం..
నీ రోదనలో తాను సహకరించలేనంటూ..
9248. కన్నీరంటే అతివ కోపమే..
బిందువైతేనేమి.. నీకది మహాసంద్రమే..
9249. స్వేచ్ఛకి అర్ధం మారిందిప్పుడు..
కలియుగానికొచ్చామని పదేపదే గుర్తుచేస్తూ..
9250. నీ నవ్వునై రావాలనుకున్నా..
చూపులతోనే నిలువరిస్తావని తెలీక..
9251. వెలుగునీడలేగా జీవితం..
అందుకే పండుగలు అప్పుడప్పుడూ జరుపుకొనేది..
9252. ఋజువులేని వాస్తవాలే అన్నీ..
నమ్మే రోజంటూ రావాలిప్పుడు..
9253. మధురోహల కథలెన్ని రాయాలో..
నిదురని  గెలిచానని నమ్మించాలంటే..
9254. కన్నులతో వలేసినప్పుడే అనుకున్నా..
నా కాటులకలతో జతకట్టావని..
9255. అడ్డుకోనని మాటిచ్చేసా..
ఎవరు ఓడినా గెలుపు మనదేనని..
9256. నా మనసుతో ముచ్చటించడం తెలీదనుకున్నా..
నన్ను కాదని నీవైపుకది చేరేదాకా..
9257. క్షణాలకి లేని మోమాటం నీకెందుకో..
నన్ను కలిసేందుకు ఆరాటాన్ని ఆపుకుంటూ..
9258. ఆత్మఘోష వినబడదెన్నటికీ..
అతివను ఆటబొమ్మగా మలచుకొనే రాక్షసులకు..
9259. సముద్రమంటే నువ్వేగా..
నన్నో నదిలా తరలి రమ్మన్నావంటే..
9260. నా కవితలెప్పుడు చదివావో..
పులకింతలతో మనసునిలా మెచ్చుకుంటూ..
9261. అపరిచితనవుతుంటానెందుకో..
అప్పుడప్పుడూ అంతర్ముఖంలో నాకు నేనే కొత్తగా..
9262. ఎన్ని జవాబులో..
ప్రశ్నించేందుకు ఉవ్విళ్ళూరుతోంది నా మనసిప్పుడు..
9263. కార్తీకానికెంత కంగారో..
నా ఎదురుచూపులో వెలిగేందుకు త్వరపడుతూ..
9264. అక్షరం నవ్వుకుంది..
తనవల్ల భావానికొచ్చిన అతిశయాన్ని ఆలకించి..
9265. కన్నుల్లో కదులుతున్నా కంటిపాపనై..
చూపులతో చేరిన నీ ఆశను ఒక్కసారి తీర్చేద్దామని..
9266. నేనెక్కడ మిగిలున్నానని..
నీ పిలుపందుకొని తలపుల్లోకొచ్చి చేరిపోతుంటే..
9267. నిశ్శబ్దమిప్పుడు వినబడుతుంది..
నీ మౌనానికి చెక్కిళ్ళు ఎర్రబడుతుంటే..
9268. రాతిరందుకే నాకిష్టం..
మాటలు మాని మనసులు కుదురుకుంటాయని..
9269. నిశ్శబ్దం తాండవమాడుతోంది..
నీ మౌనం రాగాన్నెప్పుడు వినిపించిందో..
9270. కార్తీకమందుకే నచ్చింది..
ముసురుకున్న చీకట్లో వలపు చప్పుళ్ళకని..
9271. పగటికి మతిపోతుందట..
రాతిరి మొదలెట్టిన మౌనమింకా ముగియలేదని..
9272. రెప్పలార్చడం మరచిపోకు..
నువ్వో దేవుడివని పూజలిప్పుడు మొదలెట్టలేను..
9273. మత్తెక్కినప్పుడే అనుకున్నా..
నీ మౌనమొచ్చి మనసుని మీటిందేమోనని..
9274. నా మనసంతే..
అప్పుడప్పుడూ మౌనాన్ని తాగి నిన్నలరించాలనుకుంటుంది..
9275. పేరు పెట్టి పిలవలేక ఛస్తున్నా..
వరుసతో పిలిస్తే లోకులు ఆటపట్టిస్తారని..
9276. ఆగనంటూ ఆనందభాష్పాలు..
చూపు మసకేస్తున్నా సంతోషమలా కురవాలంటూ..
9277. ఉషోదయం మెరిసిపోతుంది..
నా హృదయాన్ని ఆవిష్కరిస్తున్న కార్తీకములో..
9278. నిను వీడని జాబిలి నేను..
ప్రతి రేయీ పున్నమే కావాలన్నావుగా..
9279. మెలకువొచ్చిందందుకే చీకట్లో..
నీ చాటు గుసగుసలు ఆలకించేందుకు..
9280. ముత్యాలుగా మారుతున్న మల్లెలు..
నీ నవ్వుల చల్లదనానికేమో..
9281. ఈ జన్మది కాదేమో మధురిమ..
అందుకే అయిపోయానిలా తన ప్రియతమ..
9282. నా మనసుకంటింది మధురిమ..
నీ చూపులద్దిన చక్కెరపాకానికే..
9283. కనురెప్పలిప్పుడు మూతపడ్డాయి..
కలలోకి తప్పక నువ్వొస్తానని మాటిచ్చినందుకే..
9284. ప్రకృతి పరిచయమయ్యేది కొందరికే..
అద్భుతాన్ని ఆస్వాదించే మనసుండాలంతే..
9285. జ్ఞాపకాల్లో తడిచిపోతూనే నేనున్నా..
అనుభూతులంటూ ప్రత్యేకంగా కురవకపోయినా..
9286. అతిశయం బాగుంది నీ మాటల్లో..
నే పరికిణీ కడితే పండుగొచ్చిందంటూ..
9287. మేరుపర్వతమని మెచ్చుతున్నావెందుకో..
హిమాలయమంత చల్లని మనసు నీకున్నా..
9288. కలలోనూ వదల్లేకున్నా..
కాలమెంత వేగమురుకుతున్నా నీతోనే నేనంటూ..
9289. అధరాలకు మధురిమంటింది..
నీ భావాలను పదేపదే పాడినందుకు..
9290. నీ భావాలకెన్నడో బంధీనయ్యా..
ఉక్కిరిబిక్కిరవుతున్నా హాయిగా ఉందనే..
9291. నీ రాత్రికి దీపమై రావాలనుకున్నా..
చీకటంటేనే నీకు మక్కువని తెలీక..
9292. హారతులు పడతావెందుకో కోపానికి..
ధూపాలతో సరిపెట్టుకోమని నేనంటుంటే..
9293. నీరవంలో నేనెందుకుంటా..
నా చూపుల కార్తీకం తనవుతుంటే..
9294. వసంతం వద్దకొచ్చినట్టుంది..
నిన్ను కలిసిన పరిమళమలా వీస్తుంటే..
9295. అబలనని ఎందుకు గుర్తుచేస్తావో..
ఆదిశక్తిలా అసురలను అంతమొందించాలనుకుంటే..
9296. ఎన్ని ఉదయాలని నీకై ఎదురుచూసానో..
ప్రతిరేయీ కలలోకొచ్చి నన్ను కవ్విస్తుంటే..
9297. నిన్నెలా నిద్దురపోనిస్తా..
రాకరాక ఇన్నాళ్ళకి నా ఇంటికొచ్చాక..
9298. నువ్వేగా నా సంతోషం..
నీలో ఆర్తిని అనువదించలేనంటావే..
9299. మువ్వలసడి మూగబోయింది..
నీ విరహంలో సంగీతాన్ని వెలివేస్తూ..
9300. నీలాకాశమెందుకు నవ్వుతుందో..
నన్ను కప్పుకొనేందుకు నువ్వు చేయందిస్తుంటే..

No comments:

Post a Comment