Thursday, 5 April 2018

9401 to 9500

9401. జ్ఞాపకం జ్వలిస్తుంది..
జీవితాన్ని త్యజించాలని చూసిన ప్రతిసారీ..
9402. మాటను మించింది మౌనం..
మదిలో సంఘర్షణ దాచుకొనేందుకు..
9403. మనసెప్పుడూ వ్యూహాత్మకమే..
మాటలని కవితలుగా అలంకరించు దారిలో..
9404. నిశ్శబ్దమొక్కటే తోడయ్యింది..
కరుగుతున్న క్షణాలను ఆపలేని నిస్సహాయతలో..
9405. ఎంత తీపున్నదో అనుబంధంలో..
మరి నేనెందుకో ఒంటరిని..
9406. నా కన్నుల్లో కాంతి..
నీకైన ఎదురుచూపుల్లో ఉన్నందుకే..
9407. మరణం..
మక్కువగా చేరగలిగే మజిలీ అదేనేమో..
9408. మనసునెప్పుడూ సంగీతమే..
మాటలన్నీ దాచుకొని పాటగా కూర్చునపుడు..
9409. మనసంతా వెలుగు నీడలే..
జీవితంలోకి తొంగిచూడాలని అనుకున్నప్పుడల్లా..
9410. చూపులతో దీపాలు వెలిగిద్దాం రా..
అక్కడ జీవితాలు చీకటిలో మగ్గుతున్నాయంట..
9411. అనంతాన్ని గానం చేయాలనుంది..
కాస్తంత ఆనందాన్ని శ్వాసిస్తూ..
9412. జ్ఞాపకాలను చీకటికొదిలేసా..
పున్నమిలో పులకరిద్దాం రమ్మని మనసంటుంటే..
9413. అమృతం తాగమని చెప్పాలనుకుంటా..
అద్భుతాన్ని ఆవిష్కరించాలని నీకుంటే..
9414. పూలతో వాదించాల్సొస్తుంది..
నీ తలపులో నేనున్నప్పుడు నాతో పోటీకి రావొద్దని..
9415. మానసం నర్తనమేగా..
మన సంతోషాలొకటై దూరం తరిగినవేళ..
9416. ప్రేమరంగుల సెలయేళ్ళు ఎటుచూసినా..
మనసుకి పండుగొచ్చింది కాబోలు..
9417. జ్ఞాపకాన్ని గారం చేయాలనుకున్నానంతే..
హేమంతమొచ్చి అలా హత్తుకుపోయింది..
9418. తలుపు చాటు చేసేసా చూపులన్నీ..
తటిల్లతలు కనిపెడితే హృదయం బయటపడుతుందని..
9419. నా మనసు మారం మొదలయ్యింది..
నీ చూపులకు చెక్కిళ్ళు చేమంతులవుతుంటే..
9420. బంధాలు బలపడుతున్నవి..
కూడికలతో రెట్టింపవుతున్న నాలో ఆనందానికేమో..
9421. మౌనం గెలిచిందక్కడ..
కొన్ని రోజులు మాటల్ని వెలేసినందుకు..
9422. ఆకాశమై ఒంగావనుకున్నా..
ఎగిసిపడుతున్న సముద్రమైన నన్ను ముద్దాడేందుకు..
9423. సరసానికని ఎదురుచూస్తున్న సాగరం..
మధువై మందాకిని మురిపిస్తుంటే..
9424.  నేనోడిపోతున్నా నిన్నోపలేక..
గెలిపించాలని ప్రయత్నించిన ప్రతిసారీ బావురుమంటుంటే..
9425. జాబిలి కాలేనందుకు నొచ్చుకుంటున్నా..
జామురాతిరి కలలోనైనా రాకపోయానని..
9426. మౌనాన్నిక దాటినట్టే ..!
నీ కవితల్లో నన్ను ఒంపేసావుగా..
9427. మౌనాన్నిక దాటినట్టే ..!
అవ్యక్తం అనుభూతిలోకొచ్చిందిప్పుడే..
9428. మౌనాన్నిక దాటినట్టే ..!
అంతరారాత్మలో ప్రవహిస్తున్న శాంతి నువ్వయ్యాక..
9429. ప్రేమంటే పడదా ప్రాణానికి..
ఊపిరెలా తీసుకుంటుందో కనిపెట్టాలి..
9430. వర్తమానం విసిగిపోతుంది..
నిన్నల్లో పడి రేపటికి నేనేమవుతానోనని..
9431. నిషాదమొక్కటే పాడగలుగుతున్నా..
నా గొంతులో పంచమం పలుకదెందుకో..
9432. స్వేచ్ఛను నటించడం అలవాటయ్యింది..
శాంతికపోతమని నలుగురూ ముద్రించినందుకే..
9433. జ్ఞాపకాలే మధురిమలు..
నాలో స్వరాన్ని నింపే సంగీతాలు..
9434. జవరాలినంటావని ఎదురుచూస్తున్నా..
పంచరత్నాలనీ పలుకురాళ్ళుగా విసిరేస్తావని తెలీక..
9435. కన్నీటిని దాచుకోమని ఎవరంటారు..
నేత్రాంచలాల నిత్యప్రవాహాలు..అవంతే..
9436. జీవితాంతం కలిసుందామనుకున్నా..
మన ఋణం తీరిందని విడిచిపెడతావనుకోలా..
9437. జీవితమెప్పుడూ సంఘర్షణే..
చీకటి వెలుగులను సమన్వయం చేయాలనుకున్నాక..
9438. మనసు తెరుచుకున్న ఆనవాళ్ళు..
చూపులొకటై పాడుకున్న కవిత్వాలు..
9439. అలుసయ్యింది వద్దన్నా ఉరికిన కన్నీరు..
నలుగురూ నవ్వుతారనే విచక్షణే లేకుండా..
9440.ఎందుకు నమ్మరో మనసుకి కళ్ళున్నాయంటే..
నీరాకను ఇట్టే పసిగట్టి నాకందిస్తుంటే..
9441. జీవితమొలికిపోతున్నా తప్పులేదనిపిస్తుంది..
 జ్ఞాపకాల బరువుకి మనసు నిండుతుంటే..
9442. చీకటని వీడలేదు రాతిరిని..
నీ కలను కౌగిలించుకున్నానంతే..
9443. యుగయుగాల శూన్యం వల్లనేమో..
ఆమడదూరమైనట్టు ఆనందాలు నాలో..
9444. సంతోషానికి దారి మరచిపోయా..
ఆమడదూరం జరిగిన వసంతముతో..
9445. నీతోనున్న క్షణలొక్కటే నిజం..
జీవితమంతా కథగా మిగిలిపోయినా..
9446. వద్దనుకున్నా నిన్ను..
మౌనంలోనే నీకు ప్రశాంతంగా ఉందన్నావుగా..
9447.నా పెదవుల్లో తీపులిప్పుడు..
నీ పదముల్లో తేనెలున్నందుకు..
9448. మనసు బరువెక్కినప్పుడే తెలుసుకున్నా..
కన్నీరింకా చెక్కిలిపై జారుండదని..
9449. నయానలందుకే సజలాలు..
నా మౌనాన్ని నీ పెదవులు అలవోకగా పోగొడుతుంటే..
9450. కష్టాలకు అలవాటుపడ్డ ఇష్టమది..
ప్రేమని సరిపెట్టుకుంటున్నా ప్రతిసారీ..
9451. తనివితీరా నవ్వలేకున్నా..
గుండెలోతడి ఆరనందుకే..
9452. అనురాగమైనా అపశృతిగానే మిగులుతుంది..
ఎంతసేపూ ఒకరే పాడుతూంటే..
9453. మౌనం పర్వతమై పెరిగింది..
దాచుకున్న మాటలేవీ పెదవంటనందుకు..
9454. శిశిరమెప్పుడో వస్తుందనుకున్నా..
మాటలు రాలిపోయాక ఋతువులను తిట్టుకుంటున్నా..
9455. దేహాలయానికి కళొచ్చింది నిజమే..
దేవేరి అలుకను అనునయించిందని..
9456. వానొస్తేనే వరదొస్తుందనుకున్నా..
కరిగే మనసు కన్నీటి ముంపుకు గురవుతుందని తెలీనప్పుడు..
9457. విషాదంతోనే తృప్తి చెందాలిక..
ఆనందమెటూ ఉండనని వలసపోయిందిగా..
9458. మౌనం తృప్తి పడాలిప్పుడు..
జ్ఞాపకాల సవ్వడి ఆలకించినందుకైనా..
9459. తృప్తికి నిర్వచనం మారిందిప్పుడు..
సామాజిక కట్టుబాట్లకు సర్దుకోలేక..
9460. వదలనంటుంది ప్రేమ..
మదిలో జ్ఞాపకాలనెలా తరిమేస్తావని నిలదీస్తూ..
9461. అక్షరాలందుకే గేయాలు..
నీ కదలికలవుతూ నా కవనాలు..
9462. విరహమలా తరిగింది..
వేకువొచ్చి ఆశను మేల్కొలుపుగా పాడుతుంటే..
9463. ఆనందమలా రాలింది..
శిశిరమెందుకు శీతలపవనంతో జతకట్టిందో మరి..
9464. ఎగరడమెంతో బాగుందిప్పుడు..
నీ రెప్పల్లో నా కలలున్నందుకు..
9465. కళ్ళెం వేయాలనుకున్నా ఊహలకి..
అందుకే రంగులకి అలకొచ్చినట్టుంది..!
9465. పల్లవించడం విశేషమే..
నా కన్నీళ్ళూ నీ నవ్వులొకటై..
9466. ఆ హాయిలోనే కొన్ని యుగాలుండాలనుంది..
వెన్నెల నవ్వినట్టు నీ మాటలున్నందుకు..
9467. నిన్నటి దాకా మౌనాన్నే..
నీ పలకరింతలో పులకరింతనయ్యిప్పుడు..
9468. నిజాన్ని అధిగమించాలనుకున్నా..
జీవించడమెలానో మరచిపోయా..
9469. చూపులు చేసుకున్న సావాసాలు..
మౌనమొలికితే మనసు బయటపడుతుందనే..
9470. ప్రేమంటే..చెప్పలేనన్నా..
అపనమ్మకంగా ప్రశ్నిస్తుంటే..
9471. నిన్నటి నీ కలని..
నేటికి గతంలా మిగిలానందుకే..
9472. వెలుగులీనుతూ అంతరంగం..
తను మనోధరుడైతే నేను మనోహరినంటూ..
9473. నన్ను నీకు చూపుతున్న అద్దం..
నీలో ఇమిడిపోయిన వైనాన్ని తిలకిస్తావని..
9474. కన్నులు బయటేసిన నీ అంతరంగం..
నా మనసిప్పుడు అయిపోయిందో విహంగం..
9475. చురుక్కుమంటున్న చెంపలు..
చేమంతులు విసిరే చనువు చూపులకేంటని..
9476. నీ కలంలోకెన్నడో ప్రవహించా..
నన్ను రాథేయంగా రాస్తానన్నప్పుడే..
9477. గుబులు దాచుకోవాలనుకున్నా..
మనసూరుకోక జ్ఞాపకాలను కన్నీటితో వెలిగిస్తోంది..
9478. ఎన్ని కథలు రాసానో లెక్కలేదు..
నీ కన్నుల్లోకి తొంగిచూసిన ప్రతిసారీ..
9479. అక్షరముతో గుట్టు రట్టు..
పదాలు గొంతెత్తి పాడుతున్నందుకు..
9480. ఆగనంటూ కాలం..
మనలోని మార్పులతో తానూ ప్రవహిస్తూ..
9481. మౌనానికి స్వరమొచ్చింది..
నిన్ను గానం చేయాలని సంకల్పించగానే..
9482. నిశ్వాసగా జార్చితేనేమిలే..
మరోసారి నీ ఊపిరిలోకి చొరబడే చొరవుందిగా నాకైతే..
9483. నిన్ను పెనవేసిన ఊహలోనే నేనున్నా..
పరిమళిస్తున్న దేహమిదో స్మృతి కాదంటున్నా..
9484. ఎన్ని రకాలుగా పాడినా మెప్పించలేకపోయా..
స్నేహాలాపనలో అపశృతులనే నువ్వు గమనిస్తుంటే..
9485. మౌనంగా మురిసిపోతున్నా..
నీ భావాల అలికిడికి నేను..
9486. ఎక్కడివో మధుపాలనుకున్నా..
నీ భావాలను గ్రోలేందుకొచ్చాయని తెలీక..
9487. మనసు ముసిరినప్పుడే అనుకున్నా..
వానొస్తే కన్నీటినందులో కలిపేయొచ్చని..
9488. కన్నులకెప్పుడూ ఇష్టమే..
కలగానైనా నువ్వొచ్చి సాక్షాత్కరిస్తావనే ఎదురుచూపులు..
9489. ఆపాలని ప్రయత్నించా ఉప్పెనవుతుందని..
కన్నీటికి చెలియలకట్ట తెలీదన్నది..
9490. నేనా క్షణంలోనే ఆగిపోయా..
కదిలితే విరహమొచ్చి వేధిస్తుందేమోనని..
9491. పున్నమి పరిమళించబోతుందని ముందే కనిపెట్టేసావ్..
నా నవ్వును సంపెంగెలతో పోల్చుకొని..
9492. నక్షత్రాల్లో దాచిపెట్టా కలలన్నీ..
ఒకొక్కటిగా కురిసి నిన్నలరించగలవని..
9493. చెలి చంపుతుందిప్పుడు మెత్తగా..
చిరుచెమటలు పట్టిస్తూ గుట్టుగా..
9494. పదిలమై ఒదిగిపోయా గుండెల్లో..
నిజాన్ని సంతోషంగా మార్చాలని..
9495. బాధలెన్నని అణుచుకోవాలో..
భరిస్తున్నవాడ్ని మెచ్చాలనుకున్నప్పుడల్లా..
9496. ఏకాంతాన్ని ప్రేమిస్తున్నా..
నువ్వెటూ తలపుల్లో తప్ప వాస్తవానికందవని..
9497. చీకటిలో వెలుగులు..
ఆరుద్రలై నన్నారాధించే నీ కన్నులు..
9498. అరనవ్వుల వదనంతో నేను..
పరవశాన్ని కవనంలో రాస్తావనే..
9499. నేర్వక తప్పలేదు పాఠాన్ని..
బాల్యాన్ని మరచిపోవద్దని నువ్వంటుంటే..
9500. అక్షరమందించిన గెలుపు..
ఎన్ని ఆర్తిగీతాలను ఎలుగెత్తి పాడిందో..
Virus-free. www.avast.com

No comments:

Post a Comment