Thursday, 5 April 2018

9001 to 9100

9001. పరమాన్నాలే వద్దనుకున్నా..
నువు  ప్రేమిస్తే ఆకలి తీరుతుందని..
9002. నా మనసుకెప్పుడూ విరహమే..
నీ మాటలు బంగారమవుతుంటే..
9003. విహారినే నేనెప్పుడూ..
నీ తలపుల్లోకో..ఊహల్లోకో ప్రయాణిస్తూ..
9004. ఇంద్రధనస్సునై నే నవ్వుకున్నా..
రంగులఒంపులను నువ్వు  మోహించావని..
9005. మమకారానికి కడుపు నిండింది..
కారమిప్పుడు కంట్లో ఆనందమైంది..
9006. రహదారి పూలవనమైంది..
వెళ్ళేప్పుడు విత్తులు జల్లుతూ నువ్వెళ్ళినందుకే..
9007.కలవరింత కలస్వనమయ్యేలా ఉంది..
రేయంతా జాగారిద్దామని నువ్వంటుంటే..
9008. ఆనందం పాపయ్యింది..
మన చిరునవ్వులొక్కటిగా నేడు రవళించగానే
9009. శూన్యమొక్కటే శాశ్వతమేమో..
అనుభానికొచ్చిన ఆనందాలు ఒక్కొక్కటిగా పాతబడుతుంటే..
9010. కాలమందుకే విస్తుపోయింది..
మందేయాలని వచ్చి తను గాయపడుతూ..
9011. కలలోకి రప్పించాలనుకొని నేనోడిపోయా..
కన్నుల్లో దాచుకొని గెలుచుకున్నావ్..
9012. పెదవులు మాత్రమే కదిపింది చెలి..
నీలో భావాన్నెలా అన్వయిస్తావో చూడాలని..
9013. బంగారమని పిలిచినప్పుడే అనుకున్నా..
నాకిక ఆభరణాలేవీ ఉండబోవని..
9014. సహవాసానికి అందమొచ్చిందిప్పుడు..
మనసులేకమై మాట ఒక్కటిగా నిలబడుతుంటే..
9015. కలలోనే నేనెప్పుడూ..
నీ పిలుపులు కరువైన ఋతువులన్నిటా..
9016. అంకితమిచ్చేసా నా పాట పూర్తిగా..
మనసుతో నువ్వు నర్తించినా చాలుననే..
9017. సంగీతనవుతున్నా అప్పుడప్పుడూ..
నువ్వు పాడమనగానే గొంతు సవరించాలని..
9018. అమ్మకందుకే నీరాజనాలు..
అక్షరాల వెలుతురులో నవ్వులు చూడాలని..
9019.  సముద్రమంటే ప్రేమవుతోంది..
కలిసి ప్రవహించాలని జీవితం ఉవ్విళ్ళూరుతుంటే..
9020. పెదవి పాడిన తొలిపాట నువ్వే..
ఈరోజు మాటలతో తనకి పనిలేదంటూ..
9021. అపరంజినై నవ్వుతున్నా..
క్షణాల కదలికలో అనురాగాలు వినబడుతుంటే..
9022. మధువులు కూడేది పెదవుల్లోనేగా..
కురుస్తున్నది చూపుల జల్లయినా..
9023. చూపుతో అదుపు నేర్పాలని చూస్తావెందుకో..
కన్నుల కొనల్లో కొంటెగా మునకలేస్తూనే..
9024. గ్రీష్మంతో తలపడినట్లుంది..
కాస్తైనా నువ్వు పక్కకి జరగనంటుంటే..
9025. నీడనే నమ్ముకోవాలందుకే..
జాడలేకున్నా అనుసరిస్తుందన్నా భరోసా ఉంటుందనే..
9026. కలిసిన మనసుల కన్నీళ్ళు..
మరుజన్మకైనా ఒకటవ్వాలని ఉవ్విళ్ళు..
9027. నా నవ్వులు నిండుకున్నాయిక్కడ..
కాజేసి నువ్వటు మాయమవగానే..
9028. అక్షరమైతే చాలనుకున్నా..
నన్నో అమరమయ్యే కవితని చేస్తావనుకోలా..
9029. విముక్తిలేని వ్యయప్రయాసలే..
అంతమవని ఆవేదనల తీరని విషాదాలు..
9030. ఎటుచూసినా పచ్చదనమే..
మన చెలిమి వసంతానికి సమానమైనట్టుంది..
9031. నీ నమ్మకాన్ని నేను నిలబెట్టలేను..
నా గుండెతడి పూర్తిగా ఇంకిపోయాక..
9032. అతిథిగానే అడుగేసా నీ ఎదలోకి..
ఆలింగనంలో నన్ను బంధించి ఉంచుతావనుకోలేదు..
9033. నీ కథలో నన్నిలా చేర్చావుగా..
భావాలన్నిటా నన్నో పదముగా కూర్చి..
9034. నీ జ్ఞాపకాల పరిమళమేనేమో..
నిన్న రాత్రి నా కలలో గుప్పుమన్న సంతోషాలు..
9035. గుండె గుబులవుతోంది..
ఆ మేఘం కురవకుండా ఎటెళ్ళిందోనని..
9036. విచిత్రమైంది హృదయమే..
నవ్వుల మాటు విషాదాన్ని కప్పుకుంటూ..
9037. ఆనందాలిప్పుడు గగనాలు..
నా నవ్వులు బంగరంతో పోల్చావుగా..
9038. క్షణాలన్నిటా నీ ఆనవాళ్ళు..
నే నిలుపుకున్నది హృదయంలోననే..
9039. కలత కనుమరుగయ్యింది..
దగ్గరున్నావన్న నీ ఊహ ఉత్తేజమిచ్చినందుకు..
9040. ఎన్నడుగులు ముందుకేయాలో..
మన మధ్య దూరమన్నది చెరగాలంటే..
9041. చెక్కిలి మెరిసినప్పుడనుకున్నా..
చూపులతోనూ చుంబించడం నీకు చేతనవునని..
9042. మాసాలన్నీ శిశిరాలనుకున్నా..
నువ్వో వసంతమైయొచ్చి చిగురింతలు నేర్పనప్పుడు..
9043. మక్కువై మిగిలున్నా..
నీ నిరీక్షణలో నేనుంటాననే నమ్మకంలోనే..
9044. సంగీతమే సమాధానమైంది..
నీ రాగానికి అనురాగాన్ని జోడించినందుకు..
9045. దూరమున్నాడనుకున్నా చెలికాడు..
విలుకాడై విరిబాణాలు గుచ్చక మునుపు..
9046. సాగసంగమమే మిగిలిందిప్పుడు..
నదినై ప్రవహిస్తూ నీలో కలవాలంటే..
9047. దింపుకోలేని బంధాలే కొన్ని..
నలుగురిలో ఒంటరిగా వంచిస్తున్నా..
9048. అనురాగాలన్నీ పల్లవి పాడుతున్నాయి..
బరువెక్కిన మదిని తేలికచేసేస్తూ..
9049. ఎంతకని పొగుడుతావో నా నవ్వు..
నీ ఊసుల్లో ఊహల్లో నాయికనంటూ...
9050. నా ఊపిరిలో లయమవుతూ నువ్వు..
శ్వాసలకో గంధముందని పదేపదే గుర్తుచేస్తూ..
9051. శ్రావణమిలా కురవాల్సిందే నేడు..
పండుగకిదే ప్రారంభం అన్నట్టు..
9052. మౌనం మధురమే మనిద్దరికీ..
మాటలు అనువదించుకుంటూ వింటుంటే..
9053. హేమంతమెన్నిసార్లు కురవాలో..
నా ఆవేదనను చల్లార్చేందుకు ఉరకాలంటే..
9054. అనుసరిస్తూనే ఉంటావలా..
జ్ఞాపకాల సహవాసంలానో..ఊహాల్లో గిజిగాడుగానో..
9056. నువ్వెలాగున్నా నచ్చేస్తున్నావిప్పుడు..
నా చిరునామా నువ్వని చెప్పమన్నావుగా..
9057. ఎన్నిసార్లు అలుకలంటూ అలరించాలో..
నీ అనునయాలమోజును తీర్చేందుకు..
9058. అక్షరాలతో ఇల్లు కడతానంటే నేనొస్తా..
నీ కలంలో కవితనై మిగిలిపోతా..
9059. అనిర్వచనీయమంటే ఏదో అనుకున్నా..
నన్ను రాయడమేనని తెలుసుకోలేక..
9060. సానపెట్టడం బానే నేర్చావు..
నయగారాలతో నన్నిలా మెరిపించేందుకేనా..
9061. మునకేస్తూనే ఉండలా నువ్వైతే..
గ్రీష్మమెళ్ళాక ఏకంగా తెలుదువుగాని..
9062. కంటి దీపమైతే చాలనుకున్నా..
మనసంతా వెన్నెలవుతుందని తెలీనప్పుడు..
9063. ఆకాశమంటూ అద్భుతం చేసావెందుకో..
ఇప్పుడందలేదని ఆడిపోసుకుంటూ నన్ను..
9064. మబ్బుల మాటున్నా బైటకొస్తాడు..
నువ్వారాధిస్తున్న తను చందమామననుకుంటూ..
9065. పరిమళమొక్కటే తక్కువ నక్షత్రాలకి..
ఆకాశంలో మల్లెలై నవ్వుతున్నప్పుడు..
9066. నీ చూపుల్లో చిత్రాలు చూస్తున్నా..
నాలా కనిపిస్తుంటే విస్తుపోతూ నిలిచిపోతున్నా..
9067. చూపులతో తాగుతావందుకే..
క్షణాలు అమృతాన్ని తలపిస్తున్నాయంటూ నాతో..
9068. ఎన్నిరాగాలు దాచుకోవాలో మదిలో..
ఆలాపనగా నువ్వు మొదలవుతున్నాక..
9069. ఊపిరాగినా ఫరవాలేదనిపిస్తుంది..
మరుజన్మకు తప్పక శ్వాసలోకొచ్చి చేరతావని..
9070. కోయిలంటే నాకిష్టమే..
ఎదురుచూపుల్లో కూజితాలైతే కూయలేను మరి..
9071. కలతలన్నీ కనుమరుగే..
నీ తలపునక్షత్రాలు లెక్కిస్తూ నేనుంటే..
9072. జనన మరణాల ప్రసంగమెందుకులో..
ప్రేమతో మనసుల్ని గెలవాలనుకున్నాక..
9073. అక్షరాలతోనే నేనుంటా..
అక్కడే నా ప్రభాతం మొదలవుతుందని..
9074.అనుభూతి తంత్రులు మీటకలా..
మరోసారి అనురాగానికి ఆరాటపడేలా..
9075. మనసంతా సరిగమలిప్పుడు..
నీ పదనిసలతో కలిసి పాడమంటూ..
9076. ఎన్ని పూలు కుమిలిపోతున్నాయో..
ఆమె పూజకు నోచుకోలేదని..
9077. ఒడిదుడుకులు లేకుండా ప్రయాణించాలనుకున్నా..
గమ్యం ఆనందం కావాలనే..
9078. మనసెలా దాచాలో తెలియకుండి..
మోహమయ్యిందంటూ నిన్ను వెతుకుతుంటే..
9079. నీ భావాలే అమృతాన్ని పంచాయో..
తాగినప్పుడల్లా నా మనసు పరిమళిస్తుంది..
9080. రాశులుగా దాచుకుంటున్నా నీ ఊసులు..
ఏకాంతంలో ఇష్టమైన పాటకట్టి పాడుకుండామని..
9081. చలి తానై వస్తుందిగా చెలి..
ఉక్కగా ఉందని ఒక్కసారి నువ్వన్నా..
9082. జ్ఞాపకాలతోనే నిలిచింది ఊపిరి..
నిన్నల్లోని నిన్ను కౌగిలిస్తూ..
9083. కొన్ని ఊహలెప్పుడూ ప్రియమే..
వారధిలా మనల్నిలా కలుపుతూ..
9084. దేహం ఆకాశమైంది..
నీపై మోహానికి సరిహద్దులే లేవంటూ..
9085. స్మృతుల సంక్రాంతి మొదలయ్యింది..
పండుగొచ్చినట్టు మదిలో ముగ్గులేస్తున్నావని..
9086. మాసాలెన్ని గడవాలోననుకున్నా వసంతానికి..
స్వప్నంలో నువ్వొస్తావని తెలీనప్పుడు..
9087. కాలమాగి చూస్తుంది..
లక్ష్యాన్ని సిద్ధించేందుకే ప్రణాళికలో నేనున్నానోనని..
9088. పరిహసిస్తున్నావనుకున్నా..
పువ్వులు నా నవ్వుకి వడిలిపోతున్నాయంటే..
9089. ఈతముల్లులా దిగినప్పుడే అనుకున్నా..
నీ మాటలకు పదునెక్కువని..
9090. పుడమికిప్పుడు పులకింతలు..
కురుస్తున్న వానతో తాపాలు తీరొచ్చని..
9091. ఎక్కడాగిపోయిందో ఉషస్సు..
నా జీవితాన్నిలాగే చీకటిమయం చేసేస్తూ..
9092. నా భావాల రుచి పెరుగుతోందిలా..
నీ తలపును సేవిస్తూ రాస్తున్నందుకేమో..
9093. కొన్ని జ్ఞాపకాల పరిమళాలంతే..
మునుపెరుగని పారవశ్యానికి నెట్టెస్తాయిలా..
9094. కన్నీరందుకే చేరుతుందనుకుంటా..
చినుకులుగా జార్చేందుకు నీ జ్ఞాపకాలున్నాయని..
9095. నీ ఆధీనమే నా మనసెప్పుడూ..
నాతో నువ్వున్నావని పదేపదే గుర్తుచేస్తూ..
9096. వారథిగా కలిపే మాలికలెన్నో..
మనమంతా ఒక్కటని నిర్వచిస్తూ..
9097. చూపులతో తడమే కళలే నీవన్నీ..
నిద్దురను సైతం దరికి చేరనివ్వనంటూ..
9098. వర్షమెంత కురవాలో..
గ్రీష్మించిన మన వలపు నీళ్ళోసుకోడానికి.
9099. నిరీక్షిస్తున్న స్వరమొకటి..
నే పాడితే తానొచ్చి చేరాలని..
9100. 
నచ్చి తీరాల్సిందే తను ఎవ్వరికైనా..
జాబిలితో సమానమైన తేజస్సుతో వెలుగుతున్నాక..
 

No comments:

Post a Comment