11701. అక్షరమై మిగులుతున్నా..
కొన్ని భావాలు నీకు పంచిద్దామని..
11702. నివురు కప్పుకున్న నిజాలే అన్నీ..
ఋజువైనా న్యాయం జరిగేది లేదని..
11703. మనసు పొలిమేర దాటితేనేమి..
మనిషిగా నలుగురినీ కనిపెట్టుకున్నప్పుడు..
11704. ఏరుకుంటున్నా నీ పదాలు..
గుప్పెడైనా గుండెల్లో దాచుకోవాలని..
11705. నీ కనుపాపలు రాసే కావ్యాలవేగా..
రెప్పలు దాచుకున్న మన రహస్యాలు..
11706. ఎంతకని కవ్విస్తావో..
నా నవ్వులన్నీ నువ్వు కాజేస్తూ..
11707. ఎండిన వాగునైపోయా..
కన్నీరు గడ్డకట్టిందిక్కడ..
11708. పలుకులెన్ని పోగేసానో..
నువ్వొస్తే పంచదార చిలకనై వినిపించాలని..
11709. క్షణాల తొందర తెలుస్తోంది..
పదేపదే గతంలోకి లాక్కుపోతుంటే..
11710. కలలంటే మక్కువందుకే..
నా కన్నుల్లోకి నిన్ను నడిపిస్తుంటాయని..
11711. ఆదుకోవడమే ధర్మం..
అవసరాన్ని మించి దాచుకొనే ఆశలేనప్పుడు..
11712. జ్ఞాపకం కాలేనెప్పటికీ..
నా జీవితం నీతో ముడేసుకున్నందుకు..
11713. ఊయలయ్యింది మది..
నీ మాటలు ఓలలాడించినందుకే మరి..
11714. అలవాటైంది మనసుకి మౌనం..
విరహం మధురమనుకొని చానాళ్ళయిందని..
11715. చెదిరింది మనసు..
మౌనవించేంతగా మన మాటలెటు పోయాయోనని..
11716. పరిచయమే కదానుకున్నా..
మనసులు మాలికలై పెనవేసుకుంటాయని తెలీక..
11717. వసంతం కదలక తప్పదుగా..
గ్రీష్మమొస్తుందని ముందే తెలిసాక..
11718. మాటలు మృగ్యమే..
వినేవారు లేకుంటే..
11719. వెన్నెల్లో తిరిగినందుకేమో..
పున్నమి పువ్వునై వికసించా ఉదయానికల్లా..
11720. జ్ఞాపకాల కలకలం..
రాసేదాకా కలాన్ని అదేపనిగా రేప్పెడుతూ..
11721. నేలమ్మ పరవశమది..
చినుకుల చుంబనాలకి తనువెల్లా తడిసిందని..
11722. పదివేలే లెక్కేసా..
కొన్ని పులకింతలెటు మాయమయ్యాయో మరి..
11723. అర్ధరాత్రి ఆకుల చప్పుళ్ళు..
విషాదాన్ని పాడుతున్నవేమో మరి..
11724. గుండెతడి తాకినట్టయింది..
నువ్వొక్కసారి మౌనవించినందుకే..!
11725. కలవరం తెలుస్తోందిప్పుడే..
నీ గుండె కొట్టుకుంటుంది నాకోసమేనని..
11726. వసంతాన్ని పిలిచి అలసిపోయా..
అర్ధరాత్రి పలకరిస్తుందని తెలీక..
11727. అలసటెరుగని జ్ఞాపకాలు..
మనసుని నిద్రపోనివ్వనంటూ..
11728. తీయటివేనని సరిపుచ్చుకున్నా..
నిన్ను తలవగా కురిసిన కన్నీళ్ళని..
11729. కలలెందుకులే నీ కనులకు..
కన్నీటిలో కరిగించి సాగనంపేందుకు..
11730. ప్రణవమే నీ పలకరింపు..
నా కనులకు మేలుకొలుపు..
11731. ఆద్యంతం లేని అనుభవాలు..
అనుభూతులన్నీ దూరం చేస్తూ..
11732. మాట మధురమయ్యింది..
నీపై మనసుపడ్డాననే..
11733. అందం రెట్టింపయ్యింది..
అనుభూతిస్తున్నది నీ మనసు కనుకనే..
11734. అక్షరాలు కొన్నయితేనేమి..
పదాలుగా పరుచుకొని అనంతమైన భావాలయ్యాక..
11735. మనసులో అనుకున్న మాటలే..
మౌనవించాక పదాలుగా మారాయలా..
11736. సంతోషినై నిలబడిపోయా..
నువ్వు చూస్తుంది నా ఆనందభాష్పాలనే..
11737. సుగంధమంటినప్పుడే అనుకున్నా..
కొన్ని భావాలు నాపై కురిపించుంటావని..
11738. నిలువునా మునిగిపోతున్నా..
నువ్వు గుప్పిళ్ళతో ప్రేమను చిలకరించినందుకే..
11739. నడతనందుకే నేర్చుతున్నా..
అడుగులెన్నడూ తడబడరాదని..
11740. నా ధ్యానమొక్కటే మిగిలింది..
నీ మౌనమింకా ముగియనేలేదు..
11741. కాలాన్ని శాసించలేరెవ్వరూ..
ఒక్క కవనం రాసేలోపునే కదిలిపోతుంటుందది..
11742. అంతుచిక్కని రహస్యాలెన్నో..
పుట్టక ముందే సమాథయ్యే పదాలలో..
11743. స్మృతుల నుండీ తేరుకోలేదింకా..
ఎడబాటు అసత్యమైతే బాగుండేమోనని..
11744. కావ్యనాయికనెప్పుడో అయ్యా..
నువ్వు కలం పట్టి రాయలేదంతే..
11745. కాలమాగి చూస్తుంది నిజమే..
నీ ప్రతిస్పందనలోని ఆంతర్యానికని..
11746. నిరాశ మాయమయ్యిందలా..
నా నిరీక్షణ నీరాకతో సమాప్తమయ్యిందనే..
11747. నా నవ్వులెన్ని సేకరించావో..
నీ మాటలకు నేనుక్కిరిబిక్కిరవుతున్నా..
11748. తాళం తప్పినప్పుడే అనుకున్నా..
ప్రేమస్వరానికి లయ కుదరలేదని..
11749. పున్నమి పువ్వై నవ్వుతోంది..
జాజులు ఉడుక్కోవడం చూసినందుకే..
11750. పలుకందుకే బంగారమయ్యింది..
నా మౌనం ముత్యాలుగా జారిపోయి..
11751. మరుపు వరమయ్యింది..
కొన్ని గాయాలు నిలువెల్లా బాధించలేదందుకే..
11752. కవితగా కురవాలనుకున్నా..
కన్నీరై రెప్పలను వీడతానని తెలీక..
11753. కదిలే కాలాన్ని ఆపేదేముందిలే..
కొన్ని క్షణాలైతే ఒడిసిపట్టుకున్నాగా..
11754. అక్షరమేగా ఆలంబన..
అలసిన మనసుని సేద తీర్చాలనుకున్నప్పుడల్లా..
11755. మనసంతా ఊహలమయమే..
ఇన్ని రాగాలు రాసులుగా పేర్చుకున్నట్టు..
11756. మౌనవిస్తేనేమి..
ఓ ఏకాంతమిప్పుడు నా సొంతమయ్యింది..
11757. కథగా మిగిలిపోతాలే..
నీ జీవితంలో ఒక జ్ఞాపకమయ్యాక..
11758. తడిచిపోతూ ఉన్నానిక్కడ..
నా కనురెప్పల మీద నీ తీపిముద్రల సాక్షిగా..
11759. నన్ను పాడే కోయిలవు నీవు..
వసంతమెప్పుడూ నా సొంతమే అన్నట్టు..
11760. మనసో చెర..
నిన్నొదిలు ఉండాలనిపించదు ఏ క్షణాన..
11761. హరివిల్లయింది మేను..
నీ మనసు అందుకున్న ఆనందానికి..
11762. మనసు త్వరపడుతోంది..
కరుగుతున్న కాలాన్నొదిలి తను గెలవాలని..
11763. మనసు రాయి చేసుకున్నా..
నిన్ను పొందే అదృష్టం ఈ జన్మకి లేదని..
11764. నా సంతకమందుకే నేర్చింది జాబిలి..
పెదవి పగడపు రంగెంతో నచ్చిందని..
11765. కలలన్నీ నిజాలందుకే..
నా కాటుకల కోరికలు తీర్చాలని..
11766. చిలిపినవుతున్నా నీ చెలిమిలో..
అగాగి కురుస్తూ కన్నుల్లో..
11767. కలం కదులుతోంది..
భావాల్ని పట్టి కాగితంపై బంధించాలని..
11768. పదింతలైన పరవశం..
నా బిడియాన్ని నువ్వలా ఆరాతీస్తుంటే..
11769. కాసులపేరులా నువ్వు..
ఎదలోని భావాలకు కొసమెరుపు కానుకవుతూ..
11770. అక్షరానికై అన్వేషణ..
మచ్చికైన భావాలు మెచ్చేలా అందించాలని..
11771. మనసు నింపుకున్నానలా..
నీ ప్రేమ దోసిళ్ళుగా దాచుకుంటూనే..
11772. కలలందుకే కోసుకెళ్ళావుగా..
నన్ను ప్రతి రేయీ చూడాలనిపిస్తుందని..
11773. అనురాగమైతే మిగిలుందిలే..
అక్షరాలు అలుక్కుపోయినా కొన్ని అపార్ధాలలో..
11774. అపురూపమవుతూ అక్షరాలు..
జాగ్రత్తగా వెతికి కవనంలో కూర్చావనే..
11775. చిగురాకు చివరన అద్భుతమొకటి..
వానాకాలపు అందాన్ని వెదజల్లుతూ..
11776. దిగులుపడుతూ నక్షత్రాలు..
ముసురేసిన ఆకాశం రోదించేలా అనిపిస్తుందని..
11777. ఎక్కడిదో ఈ సువాసన..
నువ్విక్కడే ఉన్న మనసాలాపనలా..
11778. కళ్ళతోనే నవ్వుకుంటున్నా..
నా కలలెంత కలవరపెట్టాయోనని తెలిసి..
11779. నిన్నో రాగం చేసి పాడుతున్నా..
నాలో సంగీతమై నిత్యం నువ్వుంటావని..
11780. వలసపోయిన కలలు..
నాలో కలిగే కలవరాన్ని చూడలేమంటూ..
11781. చిరునవ్వులే చిరుదివ్వెలిప్పుడు..
ముసురుపట్టిన మనసు చీకటికి వెలుగిచ్చేందుకు..
11782. కలువల కోనేరుగా నా మది..
ఆహ్లాదానికి నువ్విటు తప్పక వస్తావని..
11783. మహారాజువయ్యావందుకే..
నా హృదయ సింహాసనాన్ని అధిరోహించావని..
11784. అనువదించా ఆశల్ని..
నీ రూపుగా అవి మిగిలాయిప్పుడు..
11785. శ్వాస మందగించినప్పుడే అనుకున్నా..
త్వరలోనే ఊపిరాగేలా ఉందని..
11786. నిజం కాలేని కలలే అన్నీ..
నిద్దురలో నన్ను వెంటాడుతూ నిత్యమొచ్చేవి..
11787. అపస్వరాలను వెతకలేను అనురాగంలో..
శృతికలిసి చానాళ్ళయిన విశేషానికి..
11788. భావం బంగారమయ్యింది..
నిన్ను మెప్పించే నిధిగా మారాలనే..
11789. కాలంతో చేస్తున్నా సహజీవనం..
కొత్త ఉత్సాహం తెచ్చుకోవాలని..
11790. మనసు ఖాళీ అయిందనుకున్నా..
శూన్యమొచ్చిందని ఆలశ్యంగా గుర్తించి..
11791. నా ఊహకందని నిశ్శబ్దమిది..
జన్మరాహిత్యాన్ని కోరుతున్నట్టుంది మది..
11792. ఆనందం ఆర్ణవమయ్యింది..
నదిలా నీ ప్రేమొచ్చి చేరిందని..
11793. పులకిస్తున్న పున్నమినయ్యా..
పక్షముగా నాకై ఎదురుచూపులతో నువ్వున్నావని..
11794. మనసులెప్పటికీ మమేకమేగా..
దూరమైనట్టు మనం లోకానికి కనిపిస్తున్నా..
11795. వేకువ సహజమేగా జీవితానికి..
చీకటిని విసుక్కోక చేరదీయాలందుకే..
11796. నవ్వులెన్నిమ్మంటావో చెప్పు..
పెదవుల తీపి సహా రాసిచ్చేస్తా..
11797. మదిలో ఉప్పెన..
కలల్ని ముంచేయడానికి వచ్చిందేమో మరి..
11798. కలలకు లొంగిపోయా..
నీతో కళ్ళు కలిపిన సంతోషమైందని..
11799. నిద్దురాపలేకున్నా రాత్రుళ్ళు..
కొన్ని కలలు భయపెడతాయని తెలిసినా..
11800. ప్రతిస్పందన నేనవుతున్నా..
నీ భావానికి చేయుతగా ఉండాలని..