Monday, 2 September 2019

11101 - 11200

11101. మనసు వన్నె తగ్గింది..
కొన్ని జ్ఞాపకాలు తరలిపోగానే..
11102. మనసు తడిచిపోతోంది..
నిశ్శబ్దం కురుస్తున్నందుకేమో..
11103. మల్లెలు నవ్వుతున్న సవ్వళ్ళు..
మధుమాసానికి రమ్మని పిలుస్తున్నట్టుంది..
11104. కొన్ని అనుభవాలంతే..
పరిచయం పెరిగేలోపు పాఠంగా మిగులుతూ..
11105. మనసంతా జ్ఞాపకాలు..
వాస్తవానికవి ఊపిరిలో దాగిన పరిమళాలు..
11106. అల్లుకుపోయేదెప్పుడూ లతలేగా..
అతివ రూపముగానైనా..మల్లెతీగ మాదిరిగానైనా..
11107. కవితలన్నీ చదివేస్తున్నా..
నే కల్లోకొచ్చిన విషయాలే రాస్తున్నావని..
11108. కలత నిద్దురలోనే రేయంతా..
కళ్ళెదురు నువ్వున్న ఊహలతో..
11109. దిగులుపూలూ పరిమళిస్తాయనుకుంటా..
నా కన్నులవంక అదేపనిగా చూస్తున్నావంటే..
11110. ఆహ్వానించా ఎదలోకి..
నువ్వు పదిలమయ్యేందుకు ఒక చోటుండాలని..
11111. అక్షరానికెన్ని కలస్వనాలో..
సరసంలో గమకాన్ని కూయాలన్న తపనల్లో.. 
11112. తలపులే ఆహారం..
జీవితమింత ఆనందంగా ముందుకు కదులుతుందంటే..
11113. నువ్వూహించింది నిజమే..
నీ తలపులతోనే వికసిస్తోందిక్కడ జీవితం..
11114.కాలమెంత కరుకో..
నిన్ను దూరం చేసి తను ఆగకుండా కదిలిపోతుంది..
11115. ఇష్టపదుల పదబంధమే..
అనుబంధమై నిన్నూ నన్నూ కలిపిందిలా..
11116. జ్ఞాపకమెప్పటికీ జరగదులే..
నిన్ను ప్రతిష్ఠించుకున్న మనసు కదా..
11117. అక్షరమందుకే ఆనందిస్తోంది..
మనసులు కలిపే అదృష్టం తనదయ్యిందని..
11118. బ్రతికున్నానన్నది నిజమే..
నా ప్రాణాన్ని నీ సమక్షానికిచ్చి..
11119. మానసం పులకించింది..
మౌనమంతా పాటకచేరీగా నిన్ను తడిమిందని..
11120. ఎన్ని మలుపులో జీవితానికి..
రోజుకో తీరుగా ప్రయాణిస్తున్నట్టు..
11121. కన్నీటి విచిత్రమే..
ఆనందంలోనూ..విషాదంలోనూ చెలమలై ప్రవచించడం..
11122. పులకరమూగడం నేర్చానెప్పుడో..
కలలో నీ గుసగుసలు మొదలైనప్పుడు..
11123. రాజీనామా లేని జీవితమది..
జీతం రాళ్ళకి సంబంధించని ఉద్యోగమామెది..
11124. అపరమితమీ తీయదనం..
నా పేరింత అందంగా పిలిచినదెవరో..
11125. పెనవేసుకుందో ఆశ..
నాలో జీవితంపై ఉత్సాహాన్ని నింపేందుకేమో..
11126. కలవరింతలన్నీ నిద్దట్లోనే..
కౌగిలికి రమ్మంటే కిలకిలా నవ్వుతుంటావు..
11127. ఆ జ్ఞాపకమే నా నేస్తమయ్యింది..
నిత్యం మనసంతా వెన్నెల నిండేలా..
11128. పెదవులకంటిన తీపిని తడుముకున్నా..
నిద్దరోతుంటే కానుకేదో అందినట్టుందని..
11129. కలిసేందుకు నిన్ను రావాలిప్పుడు..
కలవరింతను పులకితం చేసుకొనేందుకు..
11130. ప్రాయం విరిసింది..
నాపై నీకున్నది ప్రణయమని తెలియగానే..
11131. నువ్వెప్పుడూ విచిత్రమే..
ప్రతి చిత్రంలోనూ నేనే కథానాయికనంటావు..
11132. ఇరువురి మనసులకి వంతెనేసావనుకున్నా..
కన్నుల్లోంచీ జారిపోతావని తెలీక..
11133. మనసు లొంగింది నిజమే..
వెన్నెల్ని ఎరగా వేసి రాతిరి విందుకు పిలిచావని..
11134. కోయిలకెంత తొందరయ్యిందో..
శిశిరం కదలకుండానే రాగాలు మొదలెడుతూ..
11135. నేనో పుస్తకాన్నే..
నన్ను చదువుతూ కాలయాపనలో నువ్వున్నప్పుడు..
11136. ఎన్ని భావాలుగా రాసుకున్నానో నిన్ను..
కవిత్వం చేస్తే అమరత్వం సిద్దిస్తుందని...
11137. అనుబంధాలవంతే..
ఎక్కడున్నా పూలవనాలై ఎదలో పరిమళిస్తుంటాయి..
11138. జీవితం వెతుకులాటయింది..
నా ప్రశ్నలకు జవాబులు నీదగ్గరున్నందుకు..
11139. ఎప్పుడో జరిగిన కథ..
నెమలీకలా మెత్తగా తాకుతోందిన్నాళ్ళకి..
11140. అపరిచితమైందో ఊహ..
ఆదరించని నా నిర్లక్ష్యానికి బదులుగా..
11141. నేనంతా పచ్చనైపోయా..
ప్రకృతిలో లీనమై పరవశాలు తాకినప్పుడు..
11142. వసంతమని గుర్తొచిందిప్పుడే..
నా ఎరుపు నీలోనూ చిందించగానే..
11143. అద్భుతమందుకే భావాలు..
అక్షరాలు ఎగిసి హృదయాలను తాకినందుకు..
11144. నీ భావనలో ఒదిగిపోయానలా..
కల్పనగా మొదలై జీవితమవ్వాలని..
11145. నాలో మధురమైన ఆర్తి మొదలయ్యింది..
నీ మౌనానికి స్పందించింది మది..
11146. మౌనమలా సవ్వడించింది..
మనసు ఆలాపన పాటగా ప్రభవించగానే..
11147. చెరిసగమైన చూపులు..
దాచుకున్న మాటలు కన్నులు కలబోసుకున్నందుకే..
11148. ఎన్ని పాటలు రాసుకున్నానో..
నువ్వొచ్చిన ప్రతిసారీ పండుగనుకుంటూ..
11149. ఊపిరిలో ఊర్వశినేగా..
నీ శ్వాసలో పరిమళిస్తున్నది నేనైతే..
11150. చూపులతో నిన్ను గెలుచుకున్నాను..
మనసుపడేలా నన్ను మెప్పించావని..
11151. చూపులతో నిన్ను గెలుచుకున్నాను..
మనసుపడేలా నన్ను మెప్పించావని..
11152. ఏకాంతమందుకే ప్రియమైనది..
జ్ఞాపకాలు వరుసపెట్టి నావైపు వస్తుంటాయని..
11153. కదిలిపోలేనలా కలలా..
నన్నో కావ్యకన్యగా నువ్వు రాసుకున్నాక..
11154. నాలో సంతోషపు దొంతర..
మనసంతా నిండిన భావనదేమో..
11155. నిద్దురలోనూ నడుస్తున్నా..
వలసపోయిన కొన్ని స్వప్నాలను వెతుక్కుంటూ..
11156. పులకలొచ్చినప్పుడే అనుకున్నా..
ప్రేమజల్లు నాకోసం నువ్వే కురిపించావని..
11157. బంధాలెందుకో అలా..
జ్ఞాపకాల్లోకి జారి మనసుని వేధిస్తాయి..
11158. కలత నిద్దురవుతుంది రేయంతా..
కలల్ని ఆరాతీస్తూ లేస్తున్నందుకేమో..
11159. మనసూగుతున్నది నిజమేననుకుంటా..
మాటలు తొణుకుతున్నవిగా..
11160. అనునిత్యమదే సంతోషం..
నే కోరుకున్న తలపులు నీవైనట్టుగా..
11161. ఊసులెన్ని దాచేసావో..
నా మౌనం నీకు నచ్చలేదన్నట్టుగా..
11162. సమయాన్ని పారేసుకున్నా..
నీ ఎదురుచూపుల్లో నన్నే మరచి..
11163. నా మనోవనంలో నువ్వు..
పరిమళాలు కాజేసేందుకే ప్రయాసలేమో..
11164. నన్ను వెతుకుతున్నావనుకున్నా..
అన్వేషినని నువ్వంటుంటే..
11165. అజరామరమే జ్ఞాపకాలు..
నీ ఆనవాళ్ళుగా నే దాచుకున్నందుకు..
11166. మనసుకి వసంతమొచ్చింది..
నీ చిరునవ్వులు వెచ్చగా తడిమినందుకే..
11167. వసంతం నిత్యమేనిక..
నువ్వు కలల్లోకి రావడం మొదలయ్యిందిగా..
11168. కలకలమంతా నీదేగా..
కారణం లేని కాలయాపనలో నేనుంటుంటే..
11169. కురవని మేఘమై కదిలిపోకు..
ప్రేమలో తడిచేందుకు నేనున్నందుకు..
11170. ముసిరిన మేఘమై నీలమవ్వకు..
వానాకాలమొచ్చిందని మనసు గెంతులేసేలా..
11171. నే రంగులమయమైనప్పుడే అనుకున్నా..
వసంతం నన్నల్లుకొనేందుకే తొందరపడిందని..
11172. కన్నీటినందుకే రానివ్వను..
కన్నుల్లో కాటుక నువ్వైతే కరిగిపోతావని..
11173. కన్నీటినందుకే రానివ్వను..
కన్నుల్లో కాటుక నువ్వైతే కరిగిపోతావని..
11174. ఆలకిస్తున్నా వెన్నెలని..
ఈ నిశ్శబ్దంలో మధురముగా సవ్వడిస్తుందని..
11175. 
11178. మౌనాన్ని ముగ్ధంగా రాల్చేస్తాను..
వాటేసే వస్తంతమై నువ్వొస్తావంటే..
11179. పగటికలనందుకే ప్రేమిస్తుంటా..
కన్నీటికి దూరంగా రంగులు నింపుకుంటూ..
11180. ఒక్క కవితగా ఇమిడిపోనూ..
ఇన్నిపదాలతో నన్ను పూజిస్తావంటే.
11181.  నీ ఊసులంతే..
ఎప్పటికప్పుడు ఎదురుచూసేలా నన్ను నిలబెడతాయి..
11182. హృదయం తేలికయ్యింది..
నీ మదిలో మౌనాన్ని ఆలకించగానే..! 
11183. బందీనైపోయా అనుబంధానికి.. 
నా భావాలకు తగినట్టు కుదిరావని..
11184. భావముగానైనా మిగిలిపోతా..
మాలికలో ఒక్కసారి నన్ను గుప్పిస్తే..
11185. అపురూపంగా రాసుకుంటా నీ చూపులు..
నా తెలిసిన లిపిలో మాట్లాడుతున్నవని..
11186. మురిపాలన్నీ వడ్డీలే..
ప్రేమలో విరహం మధురమని చెప్పేందుకు..
11187. గెలిచి తీరాల్సిందే హృదయం..
ప్రతిస్పందనలో ఇద్దరం తీసిపోనందుకు..
11188. ఎన్ని మంత్రాలుగా చల్లావో మాటలను..
మనసుని క్షణాల్లో మాయ చేసేస్తూ..
11189. గుండె బరువు దిగిందలా..
నీ పలుకులిచ్చిన సాంత్వనలోనే..
11190. తడిచినప్పుడనుకున్నా..
వలపు కురిసిందని..
11191. పరుగాపడమెందుకో కాలం..
నిన్నట్నుంచీ రేపట్లోకి ప్రతిరోజూ ప్రయణించాల్సిందేగా..
11192. మల్లెకి సమానమైంది మనసు..
నాలోని పరిమళాన్ని నీకందించాలనే..
11193. జీవితమాధుర్యం..
నువ్వనే నాకిష్టమైన మాటలకే..
11194. ఆయాసమొస్తుంది మనసుకి..
నీ మాటలకు బదులివ్వాలని అనుకోగానే..
11195. మువ్వన్నెల జెండాకదే గర్వం..
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతోందని..
11196. కాలం కరిగితేనేముందిలే..
నీ జ్ఞాపకాల తోడైతే నాకుందిగా..
11197. ఎంతగా ఊరిస్తావో మాటలతో..
మనసంతా మురిపాలు చిమ్మేట్టు..
11198. జన్మ ధన్యమైందిగా..
ఒక్కసారి భారతమ్మకి ముద్దుబిడ్డగా జన్మించినందుకే..
11199. చెరుపుకోలేనివే కొన్ని జ్ఞాపకాలు..
మరపురానివిగా మదిలో ముద్రించుకున్నందుకు..
11200. ఉప్పెనవుతున్నాయి ఊసులన్నీ..
రేయి తెల్లవారనివ్వనంటూ మనం పంచుకుంటుంటే..

No comments:

Post a Comment