Monday, 2 September 2019

10901 - 11000

10901. అనుసరిస్తున్న అనుభూతులు..
నాలో మనిషితనాన్ని మిగిలుంచాలనే తపనలో..
10902. మాపుకోవలసిందే గాయం..
పదేపదే నొప్పిని నిమురుకొని ఏడ్చేకంటే..
10903. అబద్దాలని కంగారుపడకు..
నీతో ఎప్పుడూ పరాచకాలే తెలుసుగా..
10904. తడేకంగా చూడకలా..
మనసు మాయ నుండి బయటపడలేనిక..
10905. పరవశాల వెల్లువిక్కడ..
నాపై సంతోషాలజల్లు కురిపించింది నువ్వేగా..
10906. కాలానికి చక్రాలు అమర్చిందెవరో..
క్షణం తీరికలేక కదిలిపోతుందలా..
10907. నాలో నేనుండిపోయా..
విషాదం వెన్నంటిందనే..
10908. పల్లవిస్తున్న హేమంతం..
ఉషోదయానికి మంచుతెరలు కప్పి ఊహలూగుతూ..
10909. రెక్కలొచ్చిన జ్ఞాపకమొకటి..
విహంగమై నా ఎదలో ఎగిరిందది..
10910. పగటికలలు పరిపాటవుతాయిక..
నా కలలన్నిటా నిన్ను కావాలనుకున్నాగా..
10911. మనసులు కలిస్తే చాలనుకున్నా..
మాటలతో గొడవలు మొదలవుతుంటే..
10912. అతని కథేంటో తెలీదు..
మనసులో కలగాపులగంగా తిరుగుతుంటాడు..
10913. హేమంతగీతం మొదలైంది..
ఈరోజే మంచుతెరలను దాటింది మనసు..
10914. చలెటు జరిగిపోయిందో తెలీదు..
నీ తలపులకు చోటివ్వగానే..
10915. దోసిట్లో కొన్నక్షరాలు..
నువ్వు చల్లిన మధురభావాల గులాబీలు..
10916. తిరిగొచ్చిన జ్ఞాపకం..
ఇన్నాళ్ళూ నాలోనే తచ్చాడుతున్నానని ఒప్పుకుంటూ..
10917. చదవాలనుకున్నా నిన్నే..
లిపిలేని భాషలో మాట్లాడుతావని తెలీక..
10918. కాటుకను దిద్దుకుంటున్నా..
నల్లని నీ అక్షరాలు నన్ననుసరిస్తుంటే..
10919. ఇంద్రజాలం చేయక తప్పదుగా మనసుకి..
వస్తూనే పరిమళంలో నిన్ను ముంచాలంటే..
10920. చిరకాలముంటుందా బంధం..
మనసు విశాలమై సాహచర్యం మధురమవుతుంటే..
10921. స్వరాలు నేర్చుతున్నా..
మనిద్దరి నడుమ సంగీతాన్ని అనుసంధానిద్దామని..
10922. నా నీడెటో తప్పిపోయింది..
నువ్వు అనుసరించడం మానేసినప్పట్నుంచి..
10923. ఒంటరితనం ముగిసిందిప్పుడు..
కలలతో కాలయాపనవుతున్నందుకు..
10924. కళ్ళతో నవ్వుతున్నాలే..
నా మనసుని ఊయలూపనట్టు నటిస్తున్నావని..
10925. తనెప్పుడూ ఆకర్షణీయమే..
ఇందరుండగా నా మనసుని గెలిచుకున్నాడని..
10926. మారని ఋతువులా మన వలపు..
కోరికలన్నీ కోయిలలై వసంతాన్నే కోరినందుకు..
10927. నిట్టూర్పులే పాటలిప్పుడు..
నాకు నువ్వు దూరమై చానాళ్ళయినట్టుందిగా..
10928. కురవక తప్పలేదు వెన్నెలకి..
నాలో ఆహ్లాదాన్ని నింపాలనుకుందిగా..
10929. సమాధానమవ్వాలనుకున్నానప్పుడే..
నువ్వు ప్రశ్నలతో విసిగినప్పుడే..
10930. పరిమళిస్తున్న సొగసునేం అడిగావో..
మనసుపొరల్లోని మల్లెలు బైటకొచ్చాయి..
10931. సముద్రంతో పోల్చుకోకెప్పుడూ..
నిరాశ కెరటాలు నిలకడగా నిలవనివ్వవు..
10932. ఆకాశమై వంగాలనుంది..
నీ మనసులోని భావాన్ని తాకాలని..
10933. మనసులో నవ్వుకుంటా..
పెదవి తగిలితే ప్రబంధాలు మొదలెడతావని..
10934. కొన్ని నవ్వులు కావాలిప్పుడు..
మనసు దాహమని మొరపెడుతుంది..
10935. అదే అనుభూతి..
నీ ప్రతివాక్యంలోనూ నన్నే చదువుకున్నట్టు..
10936. రంగు మార్చుకుంది ఆకాశం..
అవ్యక్తమైన ఆర్తిని విస్తరించేందుకేమో..
10937. నమ్మలేకున్నా కలని..
మనసులిపిని తప్పుగా తర్జుమా చేస్తుందని..
10938. ఎందుకంత దిగులో సాయింత్రానికి..
మునిమాపు ముచ్చటేదో ముగిసినట్టు..
10939. ఆకాశమే నేనిప్పుడు..
పొగడపువ్వులన్నీ నా పెదవుల్లోనే పూయించావుగా..
10940. కన్నీటికి విలువెక్కడుంది..
అనుభవాలన్నీ ఒకొక్కటిగా కాలం చేస్తున్నాక..
10941. మనసులో మొలుస్తున్న అక్షరాలు..
గుప్పెడు మట్టిని శ్వాసించగానే..
10942. మిగిలే ఉంది కల..
కవితగా రాస్తే శాశ్వతమవ్వాలని..
10943. అతికించుకున్నా ఊహని..
మనసంచునే నిలబడి అనుభూతిచ్చేందుకు రానంటుంటే..
10944. ఆ జ్ఞాపకాలు గులకరాళ్ళే..
తలవగానే గుండె కలుక్కుమందంటే..
10945. స్వేచ్ఛకు రెక్కలొచ్చినందుకేమో..
ఆకాశం విశాలమై రమ్మని పిలుస్తోంది..
10946. మనసందుకే ఆకాశమయ్యింది..
హరివిల్లు రంగుల్లన్నింటినీ తనలో దాచుకొని..
10947. వైభోగమంటే నాదే..
అడగకుండానే నీ మనసంతా రాసిచ్చావంటే..
10948. కలవరించినందుకే కలనయ్యాను..
అలలతో పోల్చి వెనక్కు పంపుతావనుకోలేదు..
10949. వెలిసిందెప్పుడో వర్షం..
కన్నీరిప్పుడు లోకం గుర్తిస్తుందని భయమేస్తుంది..
10950. మనసందుకే కుదిరింది..
నీ అభిరుచి నాకు తీపయ్యిందనే..
10951. చిరుగాలితో స్నేహం చేసినట్లనిపిస్తుందిప్పుడు..
నీ జ్ఞాపకాల్నే సవ్వడిస్తుందని..
10952. రాణినైపోతా నేను..
చందమామ కథలో రాజువి నువ్వైతే..
10953. పున్నమెంతో దూరంలో లేనట్టనిపిస్తుంది..
మాటల్లోనే వెన్నెలలా కురిసిపోతుంటే..
10954. మనసు నలిగిపోతుందిక్కడ..
నీ భావాల బరువుని మోయలేక..
10955. జన్మకొక్కటే వసంతఋతువు..
అది నీతోనే సాగిపోవాలిక నిరంతరమూ..
10956. పన్నీటివాన కురిసిందనుకున్నా..
నా చిత్తమెవరు తడిపారో తెలీక..
10957. చెలివైపే ఉంటాయి నీ చూపులెప్పుడూ..
చిరుగాలిని అడ్డుపెట్టి చొరవ చూపేందుకు..
10958. చూపులకు చిక్కినప్పుడే అనుకున్నా..
పెదవులను పట్టుపట్టకుండా వదలవని..
10959. కవితనై మెరవాలనుకుంటా..
నీ మనశాకాశంలో చిన్న చోటిచ్చావంటే..
10960. రాయని కవితను నేనేగా..
నువ్వు కలం పట్టనంటే..
10961. చూపులు వాలితే సిగ్గే అనుకో..
నువ్విచ్చిన పరవశానికి చిహ్నాలుగా దాచుకో..
10962. మనసెప్పుడో రాసిచ్చా..
నువ్విప్పుడే చదివినట్టున్నావ్..
10963. కవితెలా రాయాలో మర్చిపోయా..
కనుల ముందుకు రానన్నావని.
 
10964. మనసు రాయయ్యిందేమో..
గుండె గుబులు ఛేదించుకు పోలేనంది..
10965. ఆప్తవాక్యమొక్కటే చాలు..
మనసు దోసిలి పూర్తిగా నిండుతుంది..
10966. నా చెక్కిళ్ళు నిమురుకున్నా..
నీ మాటలకు ఎర్రబడ్డాయేమోనని..
10967. నువ్వలా చూసినప్పుడే అనుకున్నా..
చెక్కిలిపై చుంబనాల పంటలేసావని..
10968. కోపమెప్పుడూ ప్రేమతోనే..
అయితే అలుకలో అనునయాలు కోరి..
10969. కెలుకుతావెందుకో ప్రతిసారీ..
అలుకను అవకాశంగా మార్చుకోవడం మాని..
10970. ప్రణయిస్తే కలహమంటావు..
నా స్వార్ధాన్ని గుర్తించేదెన్నడో నువ్వు..
10971. గాయాలన్నీ అశాశ్వతమేలే..
గేయమై నువ్వొస్తే పూరించుకుంటా నేనే..
10972. గతాన్నందుకే నెమరేసుకోలేను..
విషాదం తప్ప వినోదమసలే లేదని..
10973. అరనవ్వులో దాచుకుంటాలే..
నీ మనసెప్పుడో నాపరం చేసినందుకు..
10974. మనసే శిథిలమైందిక్కడ..
నీ జ్ఞాపకాలు దూరమైన వేదనలో..
10975. నవ్వులన్నీ రాసిచ్చెస్తా..
నీ చూపులు నన్నిలా కట్టిపడేసినందుకే..
10976. మనసంతా దోచేయకలా..
నీ కలలో కలవరపెట్టినంత తేలికగా..
10977. మత్తెందుకు చల్లుతావో మనసుపై..
నేనో బండరాయినని తెలిసినా..
10978. జల్లుగా కురిసిపోవా జాజిపూవులు..
నవ్వుతున్నది నా పెదవులైతే..
10979. వెన్నెలంతా నింగిలోనే ఆపేసా..
మనసు ఆనందాన్ని ఒంపుకోలేదని..
10980. ఇప్పుడే పుట్టినట్టనిపిస్తుంది..
నీ పరిచయం ఎందుకింత ఆలశ్యమైందో..
10981. సోయగమలా విప్పారింది..
మనసుతో చూసి నువ్వు స్పందిస్తావనే..
10982. కొలువుండిపోనా కన్నుల్లో..
నీ ఆనందమంతా నావల్లనేనని నువ్వంటే..
10983. చిరునవ్వులు నేర్పాలిక పెదవులకు..
ఎంతకని వేదనతో ముడుచుకుంటాయో..
10984. పెదవులనెప్పుడు కలిపావో..
నా గుండెచప్పుడు నీలో చేరిందంటావు..
10985. వేకువైనట్టు తెలుస్తోంది..
నీ కువకువలు గుండెల్లో మొదలైనందుకే..
10986. భావాలన్నీ పోగుచేసుంచా..
నిన్ను కలిసినప్పుడు స్వయంగా వెళ్ళడించాలని..
10987. రంగులు విరబూసే సమయమదే..
రాలుగాయి రాత్రికి  అందమద్దినట్టు..
10988. అక్షరానికంటిన ఉద్వేగం..
నాలోని అపరిమిత భావాల్ని రాస్తున్నందుకే..
10989. శూన్యమూ మధురమే..
నాకిష్టమైన వ్యాపకాన్ని నింపుకోమని పిలిచిందంటే..
10990. వెలుగుతూనే ఉంటాయి పెదవులింక..
బాధలన్నీ నువ్వు తాగేసావని..
10991. నా జ్ఞాపకాలు అనంతమే..
నువ్వెప్పుడూ నాలో సజీవమైనందుకు..
10992. ఆశలు రేకెత్తిస్తున్న రంగులు..
మనసందుకే హరివిల్లుగా మారినట్టుంది..
10993. జీవితాన్ని గెలవాలనుంది..
కొన్ని అవాస్తవాలను వర్తమానానికి వదిలి..
10994. ఆనందిస్తుంటానలా..
నీ భావాలు సున్నితంగా ఎద మీటినప్పుడల్లా..
10995. కాలయాపన ముగిసిపోతోందలా..
కలలోని నువ్వు కనుమరుగై నేనేకాకినైనప్పుడు..
10996. సగంసగం నాలో నవ్వులు..
అర్ధనిమీలితమైన కన్నుల కిలకిలలవి..
10997. కలలన్నీ రాసుకుందాం..
కవనమంటే మక్కువనుకుంటే..
10998. అన్నీ నీ మాటలే..
నా చెవిలో మంత్రాలిప్పుడు..
10999. నేనో ఉల్లాసమేగా..
నీ మనసుకి నచ్చిన పండగనైతే..
11000. నా దోసిలి నింపిన అక్షరాలు..
నీ కలం జాలువార్చిన ముత్యాలు..

No comments:

Post a Comment