Monday, 2 September 2019

11501 - 11600

11501. బింబమైనట్టున్నా నేను..
నీ కన్నుల్లో నన్నెతుక్కొని పదిమార్లు..
11502. నా నవ్వలా మూగబోయింది..
కల నిజమవదని తెలిసి..
11503. కాటుకలా కరిగింది..
కన్నులు చేసిన మోసం బయటపడి. 
11504. నీ ఊసులెవ్వరికీ పంచనలా..
మనలో మనకై ఉంచుతానలా..
11505. ఆ పాటలా ముగియాల్సిందే..
అపశృతులు గొంతుకు అడ్డయితే..
11506. మనతోనే ఉంటుంది విషాదం..
వెన్నెలంటే ఇష్టమని కలవరిస్తామని..
11507. కాటుక కలకంటింది..
రేయంతా చీకటిని తలపోస్తూ మనమున్నామని..
11508. సొగసు పరిమళిస్తున్న సంకేతాలు..
వయసులో మనసులున్నందుకే కాబోలు..
11509. మత్తలా వదిలిపోయింది..
కల నిజమైన భావనలో నవ్వుకోగానే..
11510. అక్కడో పండుగ మొదలయ్యింది..
శ్రీవారి బ్రహ్మోత్సవానికి వేళైనందుకే..
11511. చూపులకే పరిమళిస్తావెలా..
మల్లెమొగ్గలే ముడుచుకొనేలా..
11512. విరహం బాధిస్తోంది..
కన్నీరందుకే విషమించింది..
11513. చీకటి చిక్కబడింది..
నా కన్నుల కాటుకతో పోటీపడాలని..
11514. నువ్వూ.. నేనూ..
ప్రేమలో మనం..
11515. కలలు మోస్తున్న కన్నులు..
నీ మనసునల్లుకున్న రాత్రులలో..
11516. కలత కనుమరుగయ్యింది..
కలనైనా నీ దర్శనం అయినందుకే..
11517. మనసెందుకు బరువెక్కిందో..
గాలి నీ ఊసులు మోసుకురాగానే..
11518. సంతోషమెందుకో సగమయ్యింది..
నీతో పంచుకోలేదనేమో..
11519. పరిమళం మనిద్దరిదీ అయిందిగా..
పన్నీరు నీపై చిలకరించినా..
11520. హృదయానికెప్పుడో గాయమయ్యింది..
నీ చూపులు గుచ్చుకున్నాయి మరి..
11521. కలొస్తే నిజమనుకున్నా..
రాత్రి నిదురలో కలవరించానని మరచి..
11522. నీ అనునయం మొదలైందిగా..
అలవాటుగా అలుకెటో మాయమైంది..
11523. కథలా మొదలైంది..
కలను నిజం చేద్దామని నువ్వనగానే..
11524. ఆపలేకపోయా ఉదయాన్ని..
కలలోని నీతో గమ్యం చేరకున్నా..
11525. ప్రేమున్నది నిజం..
ప్రేమను పట్టించుకోకున్నా..
11526. నా మనోవీధులో సౌందర్యం..
తొలిసారి వానొచ్చి తడిపినందుకే..
11527. పులకింత వెనుదిరిగింది..
నీలో కలిగిన పరవశం నావల్ల కాదని తెలిసి..
11528. పక్షమెప్పుడు కరిగిందో..
నేనింకా తొలివలపు వెన్నెల్లోనే తడుస్తూన్నా..
11529. విశ్వాధారం..
ఓంకారమనబడు శబ్దంలో లయమైనందుకే..
11530. కనులు మసకైనప్పుడే అనుకున్నా..
మనసు ముసురు కురిసేట్టుందని..
11531. గుండెగాయం ఆరేది కాదిప్పుడే..
అనుకోని కన్నులు వరదయ్యినందుకే..
11532. పరిచయం పెరిగినప్పుడే అనుకున్నా..
ప్రేమ పరవశం మొదలయ్యేట్టుందని..
11533. ఊపిరెందుకు నెమ్మదించిందో..
నీలో నేనున్నానని నువ్విన్నిసార్లు చెప్తున్నా..
11534. ఈదరినున్న నన్నెందుకు ప్రేమించావో..
ఎప్పటికీ రాలేనని తెలిసీ..
11535. దొరికినవిగా నీ భావాలు..
దోసిట్లో నా నక్షత్రాలుగా..
11536. పరుగునొస్తున్నా..
మనసు పరిమళం నీకు పంచాలనే..
11537. కల్పనలో నేనుండిపోయా..
కలలో వేసవి దాటి వర్షమొచ్చిందనే..
11538. ప్రత్యక్షమయ్యా నీకు నేను..
ప్రార్ధించి మరీ పిలిచావనే..
11539.విశాలమవుతూ నా కన్నులు..
నిన్నంతా నాలో దాచుకోవాలని..
11540. నేను సైతం పరవశించిపోయా..
ప్రకృతిలో సగమయ్యా కాబట్టి..
11541. నిశ్శబ్దమలా ఘనీభవించింది..
కరిగిపోతే నా శోధనకు ఆటంకమని..
11542. తమకం శృతి మించింది..
ఇష్టంగా ఇద్దరం ఒకటయ్యామనే..
11543. నువ్వూ నేనూ ఆకాశం..
రేయైనా పగలైనా మనకెందుకు..
11544. భావాల మురిపమేనది..
నీ అక్షరాలలో ఒదిగేందుకు ఉవ్విళ్ళూరుతూ..
11545. ఎందుకాగిందో కాలం నీ చెంత..
నిన్నూ నన్నూ ఒకటి చేసేందుకంట..
11546. ఆశ్చర్యమిలా నాదంట..
నీ ఆశంతా నా ఆనందమేనంటే..
11547. కలవరిస్తున్నా నిదుర కోసం..
కలలోనైనా నిన్ను చూడాలని..
11548. మనసునందుకే కలిపేసా..
ఒక మాట మీద మనముందామని..
11549. నీలిమబ్బులను చేరింది వర్షం..
వసంతాన్ని ముగించి హర్షమిద్దామని..
11550. కథలో నాయికనే..
జీవితంలో ప్రతినాయికనైనా..
11551. నా మౌనం..
నీ మాటలో అపార్ధాన్ని తొలగిస్తావనే..
11552. మనసుని వానాకాలమొచ్చింది..
ఎడతెగని జ్ఞాపకాలు వెల్లువై కురుస్తున్నవందుకే..
11553. ఆడుగులో అడుగేస్తూ నేనొస్తున్నా..
కొన్ని జన్మలైనా కలిసుందామని..
11554. నా గొంతు మూగబోయింది..
నీ మూగనోమును అనుసరించి..
11555. ఈ పొద్దు ఆకలే లేదందుకే..
నీ ముద్దు మనసు నింపిందనే..
11556. ప్రేమెంత బరువెక్కిందో..
నీ మనసు ఇవ్వలేనన్న ప్రతిసారీ..
11557. అదో వ్యాపకమయ్యింది..
నీ జ్ఞాపకాలను పేర్చుకుంటూ వెళ్ళదీయడం..
11558. నిశ్శబ్దమలా కరిగిపోయింది..
నీ కౌగిలి నుండీ విడివడగానే..
11559. నువ్వక్కడ.. నేనిక్కడ..
మన కాపురమందుకే కలల పాలయ్యింది..
11560. కలగానే మిగలాలనుంది..
నీతో జీవితం ముళ్ళమయమని తెలిసాక..
11561. మనోహర దృశ్యాలవి..
నిద్రించిందనుకున్న మనసు చిత్రించిన అందాలు..
11562. ఆమని సౌందర్యం నాది..
అందానికి నిర్వచనమయ్యా నేనందుకే..
11563. ఎర్రమందారం నేను..
పొద్దున్నే నువ్వెతికే చూపులకు చిక్కినందుకు..
11564. వదలనంటూ జ్ఞాపకాలు..
నా మనసు చూరుకే వేళ్ళాడుతూ..
11565. ఆవిరయ్యేది కాదా ప్రేమ..
మనసంతా తడిగా పరిమళిస్తుందిగా..
11566. సోయగానికెంత ప్రయాసో..
నీ మాలికలో పరిమళమై ఒదిగిపోవాలని..
11567. కోరికలెప్పుడూ గుర్రాలే..
అదుపు చేయడం తెలీకనే మనుషులమయ్యామిలా..
11568. రసయోగం నీది..
మధువనం నేనైనందుకే..
11569. ఆనందసాగరం నువ్వే..
మునకేసేందుకందుకే వస్తున్నా..
11570. కథ మనదయ్యింది..
కల నీదైనందుకే..
11571. నిరీక్షణ ముగించేసా..
నీ రాకతో నా పెదవుల్లో శిశిరేఖలు ఉదయించాయని..
11572. గమ్యం నువ్వయినందుకే..
నా ప్రయాణం మొత్తం ఆహ్లాదకరమయ్యింది..
11573. ప్రేమ ఖాళీ అయింది..
మనసులో ఉక్కిరిబిక్కిరికి ఊపిరాడలేదనే..
11574. ఎద పొంగిన నర్మదేగా..
నీలో నవ్వులు నాగురించైనప్పుడు..
11575. వలపు రాజుకుంటూనే ఉందలా..
నీ తలపుల మహిమనుకుంటా..
11576. వింటున్నా నీ పాటనలా..
కోయిలను అనుకరిస్తూ పాడావని..
11577. మనసెప్పుడూ పిచ్చిదే..
వద్దన్నా నీ వెనుకెనుకే వస్తుంది..
11578. మనసప్పుడే నీకిచ్చా..
నా మాటలు మీటుకుంటానని నువ్వన్నందుకే..
11579. నీ ఆనందభాష్పాలే..
నా మనసిప్పుడు నవ్వుతూ బదులిస్తుందంటే..
11580. నిత్యమైన ఎదురుచూపులు..
నువ్వొస్తావో రావోనని నమ్మకం కుదరక..
11581. మాటలెన్ని గుదిగుచ్చానో..
నీ ముందు మౌనవిస్తానని తెలీక..
11582. కంచెలెన్ని కడితేనేమి..
నీకై మనసు సరిహద్దునెప్పుడో చెరిపేసాక..
11583. నువ్వూ నేనూ ఒకటేగా..
వేరుచేస్తూ మాట్లాడతావెందుకో అప్పుడప్పుడూ..
11584. కవనం విరబూసింది..
మనసు పూదోటగా నే భావించగానే..
11585. చేయి ఒణుకుతోంది..
నీ మాలికకు నే ప్రతిస్పందించాలనుకోగానే..
11586. నా మదిలోకేగా విహారం..
నువ్వు విహంగమైనట్టు భావించినప్పుడల్లా..
11587. విషాదమెప్పటికీ వీడిపోదు..
జ్ఞాపకం జీవితమైనందుకే..
11588. బలపడిపోయానందుకే..
నీతో ముడిపడ్డ ఆనందం పెరిగిపోయిందని..
11589. అదృష్టమంటే నాదేగా..
మన నడుమ అరమరికలు లేనందుకు..
11590. మునిగిపోయా నీ నవ్వుల్లో..
సీతాకోకలా రంగులెన్నో రంగరించావని..
11591. క్షణాలకు తీపంటింది..
నీ తలపు మకరందపు సమానమయ్యి..
11592. పదం పరిమళిస్తుంది..
నువ్వొంపిన ఆనందాన్ని కాస్త తాగినందుకే..
11593. చీకటి నుంచీ మొదలుపెట్టా..
వెలుతురు వైపు ప్రయాణించేలా
11594. క్షణక్షణమూ నవ్వుతుంటా..
నీ మనసు పరిమళం గుర్తొచ్చినప్పుడంతా..
11595. తడిచిపోతున్నా అనుక్షణం..
నీ పదాలు జల్లులై కురిసిపోతుంటే..
11596. ఊపిరందిస్తున్న చిరునవ్వులు..
నీ ఊహలకు బలమెక్కువే మరి..
11597. మౌనం రవళిస్తోందిక్కడ..
నీ అలికిడి వినబడి చానాళ్ళయిందని..
11598. వాలిపోతున్నా అక్షరమై..
నీ పదాల పిలుపులు వినబడగానే..
11599. అనుబంధం ముగిసిందలా..
చివర్న అనురాగంలో అపశృతి వినబడి..
11600. గతం గతించిపోయింది..
నీతో కలిసి భవిష్యత్తులోకి నడవగానే..

No comments:

Post a Comment