Wednesday, 6 July 2016

3801 to 3850

3801. మాలికలు గుచ్చుతూ కూర్చుంటున్నా రేయంతా..
ఉదయం అలంకరణకి చేతికొచ్చి సాయపడతాయనే..
3802. క్షణాలనెందుకు పలకరిస్తావు..
పులకరింతనై స్పందించేందుకు నిముషమైనా తీసుకోనివ్వక..
3803. ఒయారం నడక మొదలెట్టి మూణ్ణాళ్ళయ్యింది..
నీలో ఆశలెందుకో ఆలశ్యంగా మేల్కొన్నాయి..
3804. .దైవం కాలేని రాళ్ళు రోదించాయేమో..
ఆకృతి కాలేని తమ దౌర్భాగ్యానికి..
3805. హృద్గుహలో దాక్కోవడమెందుకో..
వెలుతురై ఉండమని చూపులో చోటిచ్చినా..
3806. తన ఆత్మతో సమ్మేళనం చేసి చూడమంటున్నా..
నీ రాజు కొలువైంది నీలోనేనని తెలుసుకుంటావని..
3807. అంకురమేసే రోజొస్తుందిలే..
నువ్వో శిల్పానివని తను గుర్తించేలా..
3808. సన్నాయినీ సారంగినీ విననంటోంది మది..
నీ పలుకురాగాల పరవశానికి కట్టుబడినందుకే...
3809. స్వేచ్ఛాలోకంలోకి ఎగిరిపోవాలనుకున్నా..
నీ కన్నీటిలో తడిచి కరిగిపోరాదనే..
3810. ప్రేమవనంలో చిగురించిన అంకురాలు కొన్ని..
సాహితీక్షేత్రమై నేడు పరిమళాలు పంచుతూ..
3811. గాలివాటానికి కొట్టుకుపోని నీ అక్షరాలు..
సుమ పరిమళాలై నన్ను శృతిచేస్తూ..
3812. రాగం చేసి దాచుకున్నా..
నీ అనురాగం వెలకట్టలేనిదని..
3813. పరవశమైతే చాలనుకున్నా..
సాహిత్యం నీ ఇంటిపేరని తెలుసనే..
3814. కన్నులు మాత్రమే కురవగలిగే జల్లది..
నీరవంలో నిశీధికి సైతం సానుభూతయ్యేట్టు..
3815. సగపాలూ సల్లాపాలు సరితూగాయిలే..
మురిపాలు తాపాలు లెక్కించకుండానే..
3816. పండుగనై విచ్చేసానందుకనే..
పదిరోజుల నిట్టూర్పుల జాప్యం నీకెందుకనే..
3817. ఎన్ని సెలయేళ్ళు వెతికానో నిన్నోమారు అభిషేకించేందుకు..
పెదవుల తేనెవాకలో మునగడం నీకిష్టమని గ్రహించలేక..
3818. కల్యాణీరాగాన్ని కలవరిస్తావెందుకు..
కీరవాణిలో అన్వేషిస్తే నే కాదంటాననా..
3819. కావ్యసరస్సొకటి వెలిసింది..
కవనాలన్నీ గర్భాన దాచుకొని నిన్నాహ్వానిస్తూ..
3820. కుసుమించిన అందాన్నే..
నీ పూజలో నిత్యమల్లిని కావాలని..
3821. నన్నెందుకు హేమంతాన్ని పూసుకోమన్నావో..
నువ్వేమో శిశిరాలను రాల్చుకుంటూ..
3822. ఛస్తూనే బ్రతుకుతున్నా రోజు..
జీవితమంటే ఏమిటో తెలుసుకోకుండానే..
3823. ఎర్రజండా పట్టుకు నిల్చుంటావనుకున్నా నాకోసం..
ఎర్రచీర కనపడగానే వెళ్ళిపోతావని గ్రహించక..
3824. తెలుసుకున్నది చాలనిపిస్తుంది..
అతిగా మారి ప్రమాదాన్ని కొనితెచ్చుకోలేక..
3825. గిజిగాడివని గుర్తుచేయడమెందుకో..
హేమంతచలిలో నేనే కంబళని తెలిసాక..
3826. అందుకే హేమంతాన్ని ఆర్తిగా హత్తుకున్నా..
శరత్తుకి సీమంతాన్ని ఖాయం చేసావనే..
3827. అరుపులెందుకు మనకి..
వలపులో వసంతగానాన్ని హాయిగా ఆలపించక..
3828. నీలో ఆశలకి శిశిరాలే చిన్నబోవా..
వసంతం నీతో నిత్య సావాసమవుతుంటే..
3829. గోరింటాకు నిన్నే పెట్టుకున్నా..
నీలో ప్రేముందని మరచినందుకే.. 
3830. నిషాలో ఉంటే ఏమోననుకున్నా..
హుషారుని తాగేస్తున్నావని తెలుసుకోలేక..
3831. నన్నెందుకో గ్రీష్మం సెగలా కమ్ముకుంది..
నీ అధరాలు తాకిన అనుభూతులేమో..
3832. రెప్పలను పెదాలు చేసినప్పుడే అనుకున్నా..
ఏదో మైకం నిన్ను కమ్ముకోబోతుందని..
3833. ఋతువులు మారితేనేముంది..
స్నేహమనే వనంలోనే మనం విహరిస్తుండగా..
3834. వేరే మాటలెందుకులు..
నువ్వూ నేను హృదాయలిచ్చి పుచ్చేసుకున్నాక..
3835. రెక్కలు తెరిచినప్పుడే అనుకున్నా..
నువ్వు గొడుగై కాపాడతావని..
3836. నిర్వేదమంటిస్తావెందుకు మనసుకి..
ప్రేమవేదం చదివేందుకు రాత్రి సిద్ధమవుతుండగా
3837. గుండెకవాటాలు మూసుకుపోయినట్లు తెలియలేదు..
నువ్వందులో చిక్కుకున్నావని తెలిసేదాకా..
3838. కలలెందుకో గోలపెడ్తున్నవి..
తమను పిలిచి నిన్నే తలచుకుంటున్నానని..
3839. నువ్వొచ్చి వెళ్ళడం తెలిసింది..
నన్ను దొంగిలించావని మైమురిసిపోయినందుకే..
3840. అచ్చుతప్పులను గమనించలేదెందుకో..
నీ డైరీలోనే తప్పుగా రాసుకొని..
3841. సీసం పోసేసావేమిటో చెవిలో..
నీ నవరాగాలూ నేనిందమనుకుంటే..
3842. మా ఊరెంత మంచిదో..
నా నోటికి తీపి మాత్రమే నేర్పింది ఎప్పుడూ..
3843. మంగళకరమైనవే మన క్షణాలు..
రాహువొచ్చి కాలు పెట్టనంతవరకూ..
3844. తీయగా ఉంటావని ఊహించలేదసలు..
ప్రేమకి తేనెరుచి ఉంటుందని..
3845. వేరే పండుగలెందుకులే..
నువ్వు గుండెలో అడుగెట్టింది చాలుగా..
3846. ఆనందమేగా జీవనం..
నచ్చినవి మాత్రమే నేర్చుకొని ఆనందిస్తే..
3847. ఊపిరి వేణువులూదుతున్నా..
నా తలపును రాగమయం చేసేద్దామని..
3848. మాఘమాసం చిన్నబోయిందెందుకో..
మధుమాసం మనమయ్యామనేమో..
3849. శిశిరం రాల్చేస్తేనేమి..
మట్టైతే పరిమళిస్తోందిగా పూలను కలుపుకొని...
3850. తేనెవాకలను గుర్తుచేస్తావెందుకు..
అందనంత దూరాన అధరాలు దాచుకుంటూ..

No comments:

Post a Comment