Wednesday, 6 July 2016

3901 to 3950

3901. నాలుగే నవ్వులపూలెందుకో నీకు..
మల్లెవంటి మనసే రాసిచ్చాక..
3902. వంత పాడలేని పరుగే నీది..
నిశీధి కలకలంలో వెన్నెలను వెతుకుతూ..
3903. మాటలకందనిదే నీ మనసువేగం..
రెక్కలంటించుకొని నన్ను మీటుతూ..
3904. మరణమానాడే వరించింది..
జీవితం కూలబడ్డచోట..
3905. మునిమాపులో చేరువైన మధుర జీవితం..
ఇరుసంధ్యల ఎరుపునూ  ఒకేసారి ఆస్వాదించమంటూ..
3906. ఆడంబర ప్రయాణమే మనిషిది..
ఇంద్రియానుభూతులను అలుపెరుగక అనుసరిస్తూ..
3907. జీవనవెల్లువ మందగించింది..
పరుగులెత్తే చైతన్యం నాలో కరువయ్యిందని..
3908. ఎన్ని నీరాజనాలో అక్షరాలకు
అలరించే వాక్యం నీవైనందుకు..
3909. నిశ్వాసనవుతున్నది నేనేగా..
నువ్వూపిరి తీసిన ప్రతిసారీ మరణిస్తూ.
3910. పెళ్ళితో మొదలయ్యే ప్రేమపాఠం కాదది..
బ్రహ్మచారులకూ వర్తించే బతుకు నాటకం..
3911. నీ చూపులో భద్రం చేసావనుకున్న..
నన్ను తప్పించుకు ఎగిరొచ్చిన నిన్నటికల..
3912. నిన్నటిదాకా ఉరుకుతుంటే గుర్రమనుకున్నా మనసు..
నేడు పాదరసమై జారిపోతుంటే ఆపలేకున్నా..
3913. గాయమైన మనసు అశాంతిని చేరదీసింది..
అనునయించే ఆత్మీయతనై నేనొస్తానన్నా నిరాకరిస్తూ..
3914. శాశ్వతమయ్యింది ప్రేమందుకే..
మనసులు కలిసిన బంధం మనమేనని..
3915. సుస్వరాలహేలయ్యింది..
ప్రేమరాగలతో నే పరవశమవుతుంటే..
3916. అమరత్వం సిద్ధించింది..
నీ వలపుతలపుల్లో నన్ను నింపుకున్న ఆనందం వెల్లువయ్యి..
3917. ఎల్లలు చెరిపింది మనప్రేమ..
ఆకాశానికే హద్దులు గీసేస్తూ..
3918. చురకత్తులవుతున్న నీ చిరునవ్వులు..
చూపును కలపనివ్వకుండా అడ్డుపడుతూ..
3919. మౌనానికి మనసిచ్చా..
మాటలతో విసుగెత్తి..
3920. కలనే నేనెప్పటికీ..
నీ హృదయపురంగులను కొత్తగా చూపిస్తూ..
3921. తమస్సు తరలిపోయింది..
వెలుతురైన నన్ను ఆహ్వానించావనే అలుకల్లో..
3922. నా పేరంటే నాకిష్టమందుకే..
నువ్వు పలకరించే తీపయ్యిందని..
3923. మనసుల రాపిడే మహోజ్వలమయ్యింది..
తనువులను ఒకటిచేసే అవకాశమివ్వక..
3924. ఉదయానికై వేచిచూస్తున్నా..
విరిసే వసంతాన్ని మొదట నీకందించాలనే..
3925. అనుభూతుల అంచులు చూడటం నేర్చుకున్నా..
విరహంలో నువ్వూ చందమామా తోడయ్యారనే..
3936. అనుభవంగా దాచుకున్నా..
భావంగా రాస్తే నిన్నందరూ చదివేస్తారనే..
3937. వేకువనే వెలివేస్తోంది మనసు..
నీ రాతలకే అంకితమైపోవాలంటూ..
3938. కలువలుగా మార్చేసాలే కన్నులను..
జాబిల్లివై నీవొచ్చి అలరిస్తానన్నావనే..
3940. బ్రహ్మని వరమడిగి మరీ తెచ్చుకున్నా..
నీ రాతరాసే అవకాశం నాకివ్వమని..
3941. ఆనందాల ఆటుపోట్లు..
నన్ను రాసేకొద్దీ నీపై మనసవుతుంటే..
3942. అందిపుచ్చుకున్నాలే ఆనందాన్ని..
ఆకాశాన్ని కాదని నన్ను వరించిందని..
3943. నీ హృదయమొక్కటీ సరిపోతుందనుకున్నా..
వేరే చీనాంబరాలు నాకెందుకని..
3944. క్షణానికో పరవశం..
మనసంతా మల్లెలవుతుంటే నీ మోహంలో.. 
3945. ఆర్ణవమైన ఆనందం..
నింగికెగిసి అమాసనాడు రాకచంద్రుడ్ని చుంబించినట్లు..
3946. కెరటమై ఎగిసిన కల..
తీరం చేరేలోపునే మేల్కొల్పుతూ..
3947. ఋతురాగాలను మరచిందేమో..
ఏకం చేసెను మది వసంతం..
3948. హద్దెరుగని మనసు..
ఆకాశం చుంబించే కెరటం తానవ్వాలంటూ..
3949. అక్షయమై ఒదిగిపోయా నీలో..
మనోపాత్రలోకి నన్ను ఆహ్వానించగానే..
3950. వైద్యానికందని ముక్కల మనసులు..
మూసుకుపోయిన గుండెకవాటాల సాక్షి..

No comments:

Post a Comment