Wednesday, 13 September 2017

7501 to 7600

7501. మనసుకప్పుడే గాయమయ్యింది..
నీ నిరీక్షణలో చీకట్లు ముసిరినప్పుడే..
7502. నిన్ను వెంటాడి గెలవాలనుకున్నా..
ఒంటరినై ఓడిపోతానని తెలీక..
7503. యుగళమైన ఒక గీతం..
మనిద్దరి భావాల నడుమ..
7504. చదివినప్పుడే తెలుసుకున్నా..
ఆవేదనలోంచి పుట్టిన వేదాలే అన్నీనని..
7505. జ్ఞాపకమే జీవితమయ్యింది నాకు..
విరిగిన మనసుముక్కలు అతికించుకుంటూ..
7506. ఆ కాగితమూ చెమరించిందిగా..
ఎర్రనికధల ఆవేదన లిఖితాలకి..
7507. శ్వాసలు పరిమళించినప్పుడనుకున్నా..
పరవశించు క్షణాలను అందించింది నువ్వని..
7508. మధ్యలో ఆగిందెందుకో అశ్రువు..
ఎదను చేరే దారిలో పెదవుల తీపిని అద్దుకుంటూ..
7509. సహవాసమదే మరి..
నా తలపులు వెంటుంటే నేనున్నట్లేగా
7510. నీ మనసు మీటిన హృదయాన్నడుగు..
అవ్యక్త రాగానికి పారవశ్యమెలా కమ్ముకుందో..
7511. అణువణువూ ఎంతలా శోధిస్తావో..
అత్తిపత్తిలా నే ముడుచుకుపోతున్నా..
7512. పరవశమే..అనుక్షణం..
నీ ఊపిరిలో మమేకమై నేనున్నక్షణం..
7513. నేనే నువ్వనుకున్నా ఇన్నాళ్ళూ..
కాస్త ఎక్కువనిప్పుడే తెలుసుకున్నా..
7514. మెరుపు చెక్కిళ్ళ నునుపు చెదిరిందప్పుడే..
విషాదం వేడి కన్నీరై జారినప్పుడే..
7515. ఏకాంతం నవ్వుకుంది..
సరసాల సందడితో రేయి బెదిరిందని..
7516. నటించడం అలవాటయిన మనసది..
సంతోషాన్ని అనుకరించక తప్పదన్నట్లు..
7517. అప్పుడప్పుడే కురుస్తుందనుకున్నా వెన్నెల..
తన కన్నుల్లోకి చూసేవరకూ..
7518. భద్రతొకటి బలమిచ్చింది..
నాకు నువ్వున్నావనే సరికొత్త ఊహతోనే..
7519. ఏకాంతం తలుపు తెరిచింది..
నీ తలపులొచ్చి తడమగానే..
7520. పరిచయమైనప్పుడనుకోలేదు..
నిన్ను ఇష్టపడి మనసుకి కానుకిస్తానని..
7521. వెలిసిపోవెప్పటికీ ఆ జ్ఞాపకాలు..
డైరీలో పేజీలెంత పాటబడినా..
7522. గ్రీష్మం తెలియని హృదయమది..
నిత్యరోదనతో వానాకాలంలో మునిగిపోతుంటే..
7523. తానే గానమై పలికాడట మోహనుడు..
రాధ సౌందర్యానికి తన్మయమై మోహించి..
7524. విషాదం నిషాదమై పొంగింది..
జ్ఞాపకాలు హృదయాన్ని మెలిపెడుతుంటే..
7525. హృదయాన్ని ఆక్రమించినప్పుడనుకోలేదు..
మున్ముందు నీ తపస్సే చేయబోతానని..
7526. పులకలెన్ని పుడితేనేమి..
అలుకలో నీవుండి విరహాన్ని తోడిచ్చాక..
7527. ఋతువులు మరచిన కోయిలనయ్యా నేను..
నిరంతరం మన ప్రేమనే పాడుకుంటూ..
7528. మనసిప్పుడే నిండింది..
అక్షరాలను పరిచయించిన అమ్మను రాయగానే..
7529. అనుభూతినై చేరిపోయానందుకే..
నన్ను స్వప్నముగా దాచుకున్న కన్నుల్లో..
7530. అరుణోదయలాను సృష్టించిన మనసే..
రేయికి మెరుపు కాంతులద్ది..చీకట్లను తరిమి పొమ్మంది..
7531. ఏకాకిని చేసింది వలపు..
తనతో కలభాషణలకు విశ్రాంతినిచ్చి..
7532. నా చెక్కిలిపై రాసావెందుకో కన్నీటి చారికని..
నీ హృదయంలో చెమరింపు నాలో చదవాలని..
7533. అక్షరం అల్లుక్కుపోతుంది..
భాష్పం రాస్తున్న భావాన్ని కనబడనీయక..
7534. జ్ఞాపకాలకెన్ని మెరుపులో..
ప్రతి మలుపులో నువ్వే వెలుగుతుంటే..
7536. క్షణానికో సంతకం..
నీ పెదవులే దరఖాస్తు పెట్టుకుంటే..
7537. వనమంతా విరుల సందడే..
అనురాగమెంత తీయగా వినిపించావో..
7538. దోచేసానెప్పుడో నీ మది..
ప్రేమని అన్వేషించేందుకు నువ్వెదురైనప్పుడే..
7539. క్షణాల ఉరుకులాటలో వింతలు..
సరసాన్ని శృతి చేసేందుకనుకుంటాను..
7540. పువ్వుగానే మళ్ళీ పుడతా..
భ్రమరమై నా వెంటపడతానంటే..
7541. చెమరిస్తున్నాయి చూపులన్నీ..
మనసు వెచ్చదనానికి కన్నులు మూసుకుపోతుంటే..
7542. నవ్వుల నెలవంకనేగా..
నా వాలుకన్నుల్లోకి నువ్వు తొంగిచూస్తుంటే..
7543. కోటిరాగాల కోయిల కూసింది..
కలసిన మనసుల అనురాగాన్ని పాడి లోకాన్ని మురిపించాలని..
7544. వెక్కిరించిందనుకున్నా విధి..
నుదిటిరాత కాస్తన్నా మారలేదని గమనించి..
7545. అదేపనిగా చదువుతున్నా..
కలలపుస్తకంలో నెమలీకగా నన్ను దాచావని..
7546. కలలు రుచెరగవనుకున్నా..
ప్రతిరేయి నిన్నే ఆస్వాదిస్తున్నాయని తెలీక
7547. నిన్నెతుక్కున్నావెందుకో కొత్తగా..
నేనే నువ్వయిపోయానంటూ చెప్తున్నా అంతగా..
7548.నేనూ అద్దమూ స్నేహితులమే..
నేను నవ్వినంత సేపూ తను ఏడవనంత కాలం..
7549. జ్ఞాపకపు మరక మంచిదే..
మనసుజాబిల్లికి దృష్టి తగలరాదంటే..
7550. వసంతమప్పుడే మొదలయ్యింది..
నా అడుగుతో కొత్త ఆశలు నీలో మొలకెత్తగానే..
7551. కలమాగినప్పుడే అనుకున్నా..
మనసెండిన కధలు రాయలేనని మొరాయిస్తోందని..
7552. కలస్వనం పెరిగిపోతుంది..
నిదురించిన ప్రతిసారీ కలలన్నీ నీవవుతుంటే..
7553. మౌనాన్ని ముడేసుకోమంది మది..
హాయి రాగానికి గుట్టురట్టవుతుందని..
7554. ఎన్నిసార్లని కసురుకుంటావో..
అలిగిన ప్రతిసారీ అనునయం దొరుకుతుందని..
7555. కలలో కొలువుండాలనే కోరికే  నీకెప్పుడూ
హృదయంలో చోటిచ్చానని ఆహ్వానించి పిలిచినా..
7556. చిరునవ్వును దొంగిలించేసానందుకే..
పులకింతను శాశ్వతం చేసుకోవాలనే స్వార్ధంతోనే..
7557. ఊసులను అనువదించుకుందేమో హృదయం..
నువ్వే కావాలంటూ కలకాలం..
7558. కలలోనూ నిన్నే కౌగిలిస్తున్నా..
నన్నెతుకుతూ ఉషోదయానికి ఉరకలేస్తావనే..
7559. మరువలేని జ్ఞాపకాలే నీవన్నీ..
కలలు విడిచిపోతున్నా నన్నొదిలి..
7560. నిశ్శబ్దం నవ్వింది..
తనకన్నా మెత్తగా నువ్వు మదిలోకొచ్చావని..
7561. మధుమాసమందుకే చలిపెంచింది..
వెచ్చదనాన్ని కలవరిస్తావనే..
7562. ప్రవహించనప్పుడే అనుకున్నాను..
ఒంపులు చూడ్డంతప్ప అనుసరించడం రాదని..
7563. తేనెవరదనై తాకాలని ఉంది..
కలనైనా ఒక్కసారి నువ్వనుమతిస్తే..
7564. ముచ్చటగా దాచుకుంటున్నా..
మురిపించే మందారమై మదిలో నువ్వూగుతుంటే..
7565. భావాలనందుకే ఊరేగించొద్దన్నా..
పూర్ణత్వం సిద్ధించేదాకా తపస్సు చేద్దామని
7566. ఎదకెప్పుడూ సందళ్ళే..
ఊహల పొరిమేరల్లో ఊరిస్తూ నువ్వుంటుంటే
7567. కలలన్నీ అక్షరంగా రాసుకుంటున్నా..
ఏనాటికైనా నువ్వు చదువుతావని..
7568. మనసుకెన్ని మధురిమలో..
స్వరాల ఆలింగనంలో పదేపదే నన్నుంచుతుంటే
7569. మధురగీతమే జీవితమిక..
అల్లుకున్న స్వప్నాలన్నీ పాటగా నిజమైతే..
7570. మనసంతా మడుగు చేసుంచా..
ఎప్పుడొచ్చి మునకేస్తావో నువ్వని..
7571. నన్నల్లుకున్నప్పుడే అనుకున్నా..
ఆకాశమంటే మక్కువనే రెక్కలు కట్టుకున్నావని..
7572. మౌనంతో ఎన్నిసార్లు గొడవపడ్డానో..
మందహాసానికి ముమ్మార్లు ఆలోచిస్తుందని..
7573. ఆలకించానెప్పుడో మౌనగీతం..
నువ్వెలానూ పెదవిప్పే ధైర్యం చేయలేవని..
7574. జీవితం పంజరమైనప్పుడే అనుకున్నా..
బంధాలు నాకింక సరిపడవని..
7575. విరహంతో వేధిస్తుంటాడెప్పుడూ..
రేయైనా పగలైనా కలలెందుకు నీకంటూ..
7576. గతాన్ని కదిలించి రోదిస్తున్నా..
చేసిన అపాత్రదానమొకటి గుర్తొచ్చి..
7577. వెన్నెల మరకలే మనసంతా..
నువ్వు గుర్తొచ్చిన ఆనవాళ్ళనుకుంటా..
7578. ప్రేమరంగులన్నీ హరివిల్లులే..
ప్రతిరేయి కలగా నువ్వే వస్తుంటే..
7579. కాలం బదులిచ్చింది..
ఈ జన్మలోనే మనిద్దర్నీ పుట్టించి..
7580. వెన్నెల్లో నువ్వుంటే వన్నెలతో నేను..
తడవాలనిపించినా తప్పులేదనిపించే ఏకాంతపు సౌందర్యం..
7581. కొన్ని సందేహాలంతే..
బదులు దొరకని శోధనలో నిజమైపోతుంటాయి..
7582. కాలానికీ లోకువైపోయా..
నీ జ్ఞాపకాల తీపిని కలవరించి..
7583. శరద్వలువలు జారడం గుర్తించనేలేదు..
వెన్నెల చిరుచలికి ఒణికిపోతున్నా..
7584. శరత్కాంతిలో చిక్కుకుపోయా..
నీ కాటుకకన్నులు ముడివేసి దాచేస్తుంటే..
7585. కలలకి రంగులద్దినప్పుడే అనుకున్నా..
కన్నీటికి నప్పే రంగులెతుకుతావని..
7586. మనసుగుట్టు రట్టుచేస్తావనుకోలా..
మౌనంలోని మర్మం నీ ధ్యాసదేనని..
7587. నే రాసుకున్న కవితలెన్నో..
నీ స్మృతుల సంవేదనలో..
7588. కలల పరిధిలోనేగా నువ్వెప్పుడూ..
కలుసుకోవాలనుందని మది కలవరిస్తున్నా..
7589. శరద్వెన్నెల విశేషమేనది..
నవ్వుల ఇంద్రధనస్సులో నిన్ను కవ్విస్తున్నది..
7590. తామరాకు మీద నీటిబొట్టునేగా నేను..
నీకెప్పటికీ అర్ధంకాని ఎనిమిదో వింతనై..
7591. ప్రకృతిలో మనముంటే చాలనుకున్నా..
హృదయాల్ని పెనవేసే చిత్రముగానైనా..మనసుల్ని కదిలించే కవనముగానైనా..
7592. ఎక్కడ నేర్చావో ఈ విద్య..
నన్ను చదువుతానని నిన్ను బయటేసుకుంటూ..
7593.  చప్పుడు చేయని జలపాతంలా వెన్నెల..
కార్తీక సొబగులన్నీ నాపైనే కుమ్మరిస్తూ..
7594. ఇంద్రధనస్సుతో గుసగుసలాడినట్లుంది..
నీ భావాల రంగులొచ్చి పలకరిస్తుంటే..
7595. కన్నీరుగానే కనిపిస్తూ తను..
చూపునెంత వెలిగించి చూడాలనుకున్నా..
7596. నిరాశను రగిలించే స్మృతులే అన్నీ..
పొరలు పొరలుగా శూన్యం కమ్మినట్లు..
7597. కార్తీకం కొరకే దాచుకున్నా నవ్వులన్నీ..
దీపాలతో పోటీపెట్టి నువ్వు పొగుడుతావనే..
7598. శిశిరాన్నీ గమనిస్తూ కూర్చున్నా..
వసంతం వెళ్ళిపోవడం గుర్తించలేదందుకే..
7599. పరితపిస్తున్నా ప్రతిక్షణమూ..
వెన్నెల్లో అనుభూతుల దండొకటి గుచ్చుకోవాలని..
7600. పరవశించక తప్పలేదు..
శరద్రాత్రుల మసకల్లో పూలకలలన్నీ నీవయ్యాక..
 

No comments:

Post a Comment