Wednesday, 13 September 2017

8301 to 8400

8301. ప్రతిరేయీ పున్నమే కావాలని కోరుకుంటా..
ఏకాంత మౌనంలో తోడుంటానని నీవంటే..
8302. ఎన్నిసార్లు ఎదురుపడ్డానో..
ఒక్కసారన్నా నీ నన్ను గుర్తుపడతావని..
8303. చూపు మసకేసినప్పుడనుకున్నా..
ఊరిన కన్నీటిలో కరిగింది నీవేనని..
8304. మౌనాన్ని ఆశ్రయించక తప్పలేదట..
మనసు తనని ఓదార్చుకొనేందుకు..
8305. ఉలిక్కిపడ్డం మానేసాను..
నీ పలకరింపులు మది మీటినట్లుంటే..
8306. వేడుకవ్వాలని..
పండుగలా నీకు..
8307. ఇన్నాళ్ళ చెలిమి వ్యర్ధమైంది..
మనసు ముసుగొక్కసారి తొలిగినంతనే..
8308. జీవించక తప్పదు..
కొన్ని జీవితాలు నిలకడగా సాగాలంటే..
8309. వసంతంలో వెతుకుతావెందుకో..
నీ మనసు పొదరింట్లో నేనుంటే..
8310. ఆ కలనలా కౌగిలించేసా..
రేయంతా నన్ను మురిపించిందనే..
8311. ఆత్మవిశ్వాసం తోడుంటుంది..
మన వ్యక్తిత్వం నమ్మకమై ముందుంటే..
8312. నిరాశగా వెనుదిరిగా..
నీ ఎదురుచూపుల వేడికి గాయమై..
8313. పరవశమలా దూరమయ్యింది..
ఏకాంతంలో నీ వియోగం ఏడిపిస్తుంటే..
8314. హృదయమలా కరిగింది..
ఆకాశమాపలేని చినుకులా కన్నీరు కదలగానే..
8315. చెలిమేగా చిరునామా..
వెతలను దాటి నావైపు నువ్వొస్తున్నాక..
8316. నీరాజనానికే ఎదురుచూస్తున్నా..
నీలో కొలువుండమని నాకు కబురంపగానే..
8317. అమృతమవుతూ నీ తలపులు..
అనుభూతులు నాకిలా అంటగడుతూ..
8318. క్షణాలు కదిలినప్పుడనుకోలా..
తనతో పాటుగా నిన్నూ తీసుకుపోతాయని..
8319. చీకటుందని ఎన్నడూ అనుకోలా..
చుక్కలా నాతో నువ్వున్నందుకు..
8320. నిరంతర వసంతమే..
నీ నవ్వులు కిరణాలై నన్నల్లుకుంటే..
8321. గుట్టుగా తడిచిన పెదవులు..
ప్రేమామృతం గుండెలో పొరలగానే..
8322. అంతర్ముఖమవలేడంట..
అంతరాత్మ నిలదీస్తే బదులివ్వలేడని..
8323. రెప్పలు మెరిసినప్పుడనుకోలేదు..
నీతో ఉషోదయమింత మత్తుగా వెలుగుతుందని..
8324. నేనో నిట్టూర్పునే..
మృత్యువుకైన ఎదురుచూపులో..
8325. పగైతేనేమి జీవితానికి..
నీ తలపును దూరం చేయలేకపోయిందిగా..
8326. అమృతమవుతూ నీ తలపులు..
అనుభూతులు నాకిలా అంటుకడుతూ...
8327. వెన్నెల బొమ్మనే..
కాసేపలా రాతి శిలనై అలిగానంతే..
8328. స్వరం మారింది..
వియోగంలో కలస్వనం కాంభోజిగా కరిగి..
8329. నీ తలపే నా తోడు..
వెన్నెల్లో ఏకాంతం నాకో వరం..
8330. ఆనందమలా నాట్యమాడింది..
చుక్కల్లో జాబిల్లిగా నీకు మనసవుతుంటే..
8331. తపనలు తోడుకొచ్చిన తలపులు నీవి..
తలుపేసినా తప్పుకోని తన్మయాలు నావి..
8332. కలలకు సమయముండదుగా నీకు..
రేయొక్కటే రమ్మంటే ఎలా..
8333. వశమయ్యిందైతే నిజమేగా..
కలలో కనికట్టుకి సన్నాహాలు తమకెందుకో..
8334. నిజానికి అమావసే..
నేనుంటే నిండు పున్నమి నీకంతే..
8335. నా ఎదురుచూపుల గతింతేనేమో..
ఋతువులన్నీ దాటి నువ్వెప్పుడొస్తావోనని..
8336. చిలుకనై నవ్వాలనుంది..
రసడోలికల్లో ఊగేందుకు వసంతం రమ్మనగానే..
8337. కాలమెంత గడుసరో..
తనతోనే నడవమని చెప్పకనే చెప్తూ..
8338. నా తలపులంతే..గమ్మత్తులు..
పూల పరిమళాలై నిన్నల్లినప్పుడు..
8339. నీ చూపుల్లో వెతకాలనుకున్నా సమాధానాలు..
నా మనసు అడిగే ప్రశ్నలన్నింటికీ..
8340. కన్నీటి విలువ కాలానికి తెలుసేమో..
త్వరగా కదిలి తనలో కలుపుకోవాలనుకుంటుంది..
8341. నమ్మి లోకువయ్యాననుకున్నా..
అనుభవాన్ని పాఠంగా నేర్చుకు చదువుతున్నందుకే..
8342. కన్నీరు చెలమలనుకున్నా కన్నుల్లో..
ఆగనప్పుడు తెలిసింది వేదనదేనని..
8343. నేనో వసంతరాగాన్ని..
నువ్వో విపంచిగా మీటాలనుకోవాలి కానీ..
8344. ఆకాశం వంక చూస్తోంది చిలుక..
తనకు పరిచయమైన పచ్చదనాన్ని వెతుక్కుంటూ..
8345. నిరాశను తరమాలనుకున్నా..
క్రమంగా ఆశలు జాబితా కుదించుకుందెందుకో..
8346. మామిడికిప్పుడు మంచిరోజులే..
వసంతాన్ని కాదని వత్సరమంతా ఊరిస్తుందందుకే..
8347. వెచ్చని చెమరింతలే మనసంతా..
పరవశాన్ని నాతో పోల్చాక..
8348. రాస్తున్న ఆత్మకథెన్నడు పూర్తవుతుందో..
కన్నీళ్ళలో మలుపులు చెరిగిపోతుంటే..
8349. 
గుండెలో చోటిచ్చావనుకున్నా..
పదేపదే విచ్చేయమని సైగలతో ఆహ్వానిస్తుంటే..
8350. 
కినుకే లోకంపై..
ఇన్నాళ్ళూ కనపడకుండా నిన్ను దాచుంచినందుకు..
8351. కలనెందుకు కలవరిస్తావో..
కోరుకుంటే నీ ఊహాల్లో ఊయాలూగుతానంటున్నా..
8352. నీ ఉత్తరం..
మనసు మీటే చిలిపి పావురం..
8353. జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నా..
ఊపిరిపోస్తున్న గతాన్ని వాస్తవంలోకి మోసి.. 
8354. మనసుకెప్పుడూ అస్థిరమే..
నీ ఆలోచన పొద్దుపొడుపు తానవ్వాలని..
8355. ప్రయత్నమే పునాది..
అక్షరం ఆశువుగా మాలికలో ఒదగాలంటే..
8356. నీ చెలిమి..
నాలో శాంతి నింపిన మాలిమి..
8357. నా చరణాలు..
నీ పల్లవికి సాయమవ్వాలనే భావనలు..
8358. అలలా వచ్చిన ఓ కల..
తీరమైన నా నిద్దురను చెరిపింది..
8359. చూపుల చెక్కిలిగిలితో సరిపుచ్చుకున్నా..
ఆలింగనానికందనంత దూరంలో ఉన్నాననే..
8360. తమస్సలా తొలగిపోయింది..
నీ చూపుల కిరణాల సాంత్వనకే..
8361. కలల విరులెన్ని కురవాలో..
రేయి పరిమళాన్ని వెదజల్లాలంటే..
8362. నీ రాయబారం..
నాలో ఆశలు నింపిన మధుకలశం..
8363. నీ మిసిమి..
నాలో నిశీధిని తరిమిన కిరణమే..
8364. నా అనుభూతి..
నీలో వెల్లువైన భావ సంపత్తి..
8365. ఏ నీరైతే ఏముందిలే..
కన్నీరైనా పన్నీరైయ్యే చొరవున్నప్పుడు..
8366. అమాసలో వెన్నెల్లు..
నీ మాటల్లో నన్నతిశయించే పదాలు..
8367. నా సంకీర్తనలు..
నిన్ను కలిపి పాడిన మనోభావాలు..
8368. నీ కైంకర్యాలు..
నా అక్షరాలతో చేసుకుంటున్న నివేదనలు..
8369. వసంతాన్ని రమ్మంటున్నా..
హేమంతమింకా మిగిలున్నా..
8370. అదే నిశీధి..
నిన్ను నాకు పరిచయించిన కలలవీధి..
8371. మనసెన్ని ముక్కలయ్యిందో..
ఇన్నాళ్ళ భావాల పరిమళమూ అబద్ధమైనంతగా..
8372. మిన్నూ మన్నూ ఏకమైనట్లే..
తారలొచ్చి భూమ్మీద తిరుగాడుతుంటే..
8373. ఆనందమే..
మొలకెత్తిన విత్తనమిప్పుడు చిరునవ్వులు పూయిస్తుంటే..
8374. నీ మనసు మతి తప్పినట్లుంది..
నా శంకరాభరణంలో ఆనందభైరవిని విన్నానంటూ..
8375. ప్రేమ ఘనీభవించడం మొదటిసారి..
బహుశా భావాలు మూగబోయినందుకేమో..
8376. వలపించనా జీవితాంతం..
ఒక్కసారన్నా నీ మాటలు నిజమనిపిస్తే..
8377. అనుభూతులమయమేగా మనం..
నవ్వులూ రాగాలూ రంజితమై కలబోసుకుంటుంటే..
8378. నా చెక్కిళ్ళొచ్చి తీర్చాలేమో..
నీ పెదవులకి దాహమేసినప్పుడల్లా..
8379. నా ఊహల గమనం..
నీ హృదయాలాపన సమ్మతముతోనే..
8380. మనిషితనం అంటారు దాన్ని..
నాగరికపు కల్మషాలు సోకనందుకే..
8381. చెక్కిళ్ళెప్పుడూ సిద్ధమే..
జ్ఞాపకాలు రాలిన ప్రతిసారీ హత్తుకోవడం..
8382. దాక్కుందామనుకున్నా..
నీ ఎదలో ముడుచుకునందుకే కూర్చున్నా..
8383. బ్రహ్మనెందుకు ఆడిపోసుకుంటావో..
వెన్నెలొచ్చినా చీకటే బాగుందని తలపోస్తూ..
8384. వేసవినై నవ్వుకున్నా..
మరువాలూ మల్లెలింకా నీకు గుర్తున్నందుకు..
8385. అక్షరాలే అన్నీ..
ఒక్కోసారి పెదవులపై చిరునవ్వులు పూయిస్తుంటాయ్..
8386. ఆకాశమై ఒంగినప్పుడే అనుకున్నా..
నాలో ఆకర్షణేదో లాగిందని..
8387. అవకాశాన్నొదిలేసా..
నీ అంతర్నేత్రంలో నన్ను చూసుకుంటూ..
8388. నా నెలరాజు..
వెండి నక్షత్రాలతో నన్నెలిగించే దీపకుడు..
8389. నేనో మంత్రలిపినాలకిస్తున్నా..
నీ మనసు చదువుతున్న ప్రతిసారీ..
8390. తప్పుకుంటాలే..
నీ ఒప్పులన్నీ నేను నమ్ముతున్నానని..
8391. నీలాకాశం ఖాళీ అయ్యింది..
చుక్కలన్నీ నిన్నాల్లుకునేందుకు దిగొచ్చాయని..
8392. ముహూర్తం చూసుకోలేదందుకే..
కన్నుల్లోకి రమ్మనగానే కోయిలనై ఎగిరొచ్చేసా..
8393. పూలను వినే తీరిక లేకుంది..
యాంత్రిక జీవనంలో మనసుని కోల్పోతూ..
8394. ఆనందమలా వచ్చి వాలింది..
నీ అనుభూతులు నన్నంటగానే..
8395. జావళీలతో జతకట్టనూ..
నీ రాకతో మనసంతా జాతరవుతుంటే..
8396. కలలో కనిపిస్తానయితే..
ఊహల బరువు మోయలేనని నువ్వంటే..
8397. మనసులోని మధురిమెప్పుడూ నీదేగా..
కేవలం జ్ఞాపకాలతోనే నేనున్నా..
8398. బిందువుగానే మొదలైంది కన్నీరు..
ఆనకట్టలేక సింధువై ప్రవహిస్తూ..
8399. గతంలో గాయపడ్డ మనసిది..
వేదనొదిలి వాస్తవానికి రాలేనంటూ..
8400. విషాదంలోనూ విస్మయం..
వియోగమే వరమైన వసంతపు వీక్షణం..

No comments:

Post a Comment