Wednesday, 13 September 2017

8101 to 8200

8101. నీ మనసు గొప్పదనమదే..
నా నవ్వులు దొంగిలించి తన పెదవులను అతికించుకుంటూ..
8102. ప్రేమించడం మొదలెట్టేసా..
వాత్సల్యం రుచి చూపించేందుకు నువ్వున్నావనే..
8103. అడుగులకెంత తొందరో..
నిన్నూ నన్నూ కలిపేందుకు ఎదురవుతుంటే..
8104. అంతరంగాల మెరుపులు మోములో..
జ్ఞాపకాలు వెండిజలతారులుగా ఊగినందుకే..
8105. కొన్ని ఊహలకు సవ్వడుండదు..
ఉచ్ఛ్వాసనిశ్వాసలను మౌనం కప్పేయగానే..
8106. స్వానుభవాలంతే..
ప్రేమను మరొకరితో పంచుకోవద్దంటుంది  మదిలోని అమాయకత్వం..
8107. కలలవనంలో వేచున్నా..
నీ పిలుపందిన క్షణాన్నే రావాలని.. 
8108. కన్నీటితో కడగలేకున్నా..
గాయమైన హృదయం విస్పోటించి స్రవిస్తుంటే..
8109.నన్ను నాకొదిలేసి మాయమయ్యావ్...
మనసుదాకా నిన్ను రానిచ్చినందుకేమో..
8110. మోహపు మంటల ఆవిర్లు గుండెలో..
నీ వలపు పిలుపు సెగలకేమో..  
8111. రంగులు మార్చుకున్న సంస్కారం..
స్వేచ్ఛగా పరవళ్ళు తొక్కుతూ..
8112. గడ్డుకాలమే ఆ మనసుకి..
మాటలతో హింసించేవారున్నంత కాలం..
8113. సంతోషాన్ని కప్పిపుచ్చుకున్నా..
మనమొకటైన నిజం లోకులు కనిపెడతారనే..
8114. చిరునవ్వులందుకే చేరదీసా..
మనసల్లుకున్న స్వప్నాలను అప్పుడప్పుడూ గుర్తుచేస్తుందని..
8115. ఏడడుగులు వేయిస్తామంటున్నారంతా..
ఏడుజన్మల మన బంధాన్ని గుర్తించినందుకే..
8116. గుండె జారినప్పుడే గమనించా..
నీ ఊపిరందడం ఆలశ్యమయ్యిందని..
8117. మనసుతో జతపడ్డప్పుడెందుకు గుర్తించవో..
ముళ్ళంటూనే మౌనాన్ని ముట్టుకుంటూ..
8118. చిరకాల ఆశొకటి ఇలా తీరినట్లుంది.. 
నా చిరునవ్వులు నువ్వు గమనించగానే..
8119. రాదారి అందాన్ని గమనించా..
నీ చిరునామాను నాకు చేరవేసే పువ్వుల సంగీతంలో..
8120. విరహమెప్పుడు సరసమయ్యేనో..
నా కంటితడి నీ గుండెలో ఎప్పుడని ఇంకేనో..
8121. గుండెతడి గుట్టును మరచినట్లుంది..
కళ్ళవెంబడి ప్రవహిస్తోంది ఉప్పగా..
8122. కధలో మలుపుకి కారణం నువ్వే..
ముందుమాటలో నీకంటూ నే చోటివ్వకపోయినా..
8123. అబద్దాలు ఆడదట కాలం..
మనిద్దరినీ సమంగా ప్రేమిస్తున్నందుకు..
8124. తొడుకుంటూనే ఉందామలా చిరునవ్వులు..
మరోరెండు చేతులైనా హర్షించేలా..
8125. అలనైనందుకు ఆనందిస్తున్నా..
తీరమైయున్న నిన్ను తడిమేందుకు అవకాశమొచ్చిందని..
8126. విజయమెప్పుడో నీకందించేసా..
నాపై ప్రేముందని చెప్పిన మరుక్షణానే..
8127. భావాలెన్నటికీ బరువు కావుగా..
అక్షరమై నలుగురికీ పంచబడుతుంటే..
8128. అక్షరమై చిగురించాలనుంది..
బాధల్ని శిశిరంలో రాల్చేసి సరికొత్తగా..
8129. సహనమలా చచ్చింది..
వెలుగునీడల క్రీనీడల్లో నిశీధి ఎక్కువవుతుంటే..
8130. విరహమైతేనేమి..
సదా నీ ప్రేమలోనేగా..
8131. శాంతి స్థాపించేందుకు నన్ను పిలిచావనుకున్నా..
సంధి చేసేందుకు పావురాన్ని పంపిస్తే..
8132. అనురాగానికి పేరెక్కడిదిలే..
స్వరాన్ని మించి హృదయాన్ని మీటాక..
8133. మనసుని కొలిచే సాధనమేముంది..
అనురాగాన్ని ఆలకించే చెవులుండగా..
8134. 
ఎంతకీ అందని జాబిల్లి..
ఆకాశమంటే భావనలే నాకున్నా..
8135. వసంతమై వీచింది నువ్వేననుకున్నా..
మనసులో హాయి రంజితమవగానే..
8136. మాఘమాసమని మరచినట్లున్నావు..
మల్లెల మాయేంటని నన్ను కవ్విస్తూ..
8137. అనేకమవుతూ భావాలు..
రాసేకొద్దీ మదిలో అనుభూతులు వెల్లువవుతుంటే..
8138. మాఘమాసంలో తొలకరులు..
నిన్ను రాయాలనుకున్న అక్షరాలతో పులకలు..
8139. నీ చరణాల తోడుగా నేను..
ఆ చందమామ సాక్షిగా సాగుతూ..
8140. చిరునవ్వులు వెన్నెలలేగా..
పున్నమివై నా ముందు నువ్వుంటే..
8141. అన్వేషణలోనే అలసిపోతున్నా..
నీవొచ్చేలోపు  నాలో చైతన్యం నిండుకుంటుందని..
8142. వెనుదిరిగిన వెన్నెల..
దారితప్పి అమాసలోకి నడిచిందని గుర్తొచ్చి..
8143. పచ్చదనం నిండినప్పుడనుకున్నా..
నా కలలో రాబోతున్నది నువ్వేనని..
8144. ఆనందమే..
నా నవ్వును అతిశయంగా నీ అక్షరంలో అలంకరించడం..
8145.వెన్నెల నల్లబడింది..
చీకటి సారించిన అసూయపు చూపులకే..
8146.  హృదిలో చోటిస్తే చాలనుకున్నా..
ఆకాశంలో సగం నాకెందుకంటూ..
8147. నీ తలపో సంబరమే..
మనో తటాకంలో ఈదులాడేందుకనొస్తే..
8148. కలమక్కడే ఆగింది..
కాలానికణుగుణంగా కథ తాను రాయలేనంటూ..
8149. సిగ్గులతో మంత్రమేసా..
మల్లెలు ముగ్ధంగా మాట్లాడనని మౌనవిస్తుంటే..
8150. నీ ఊసులతో నా మనసు..
స్మృతుల పరవళ్ళతో రేయింబవళ్ళు పరుగులిడుతూ..
8151. మనసే ఆకాశమయ్యిందిగా..
నువ్వో చందమామగా కొలువు తీర్చగానే..
8152. నిరీక్షణ ఫలించింది..
వెతకని నా ఎదలోనే నిన్ను నే కనుగొన్నాక..
8153. కొత్తరెక్కలతో ఆమె..
అతనిచ్చిన నమ్మకానికి ఆకాశమే హద్దుగా..
8154. కొత్తరెక్కలతో ఆమె..
గతాన్ని బుగ్గిచేసి ఆత్మవిశ్వాసపు బావుటాతో..
8155. కొత్తరెక్కలతో ఆమె..
ఆశల వీక్షణాలతో..
8156. మనసుంటే సింధువే..
బిందువులు ఏకమై మానవత్వం ప్రవహించునప్పుడు..
8157. తరలిపోయింది నాలో భావమలా..
నీ నిష్క్రమణతో నిలువలేనంటూ..  
8158. మనసులు కలిసింది నిజమేగా..
జీవితమంత వసంతం నువ్వయ్యాక..
8160. నీదే ఆలాపన..
నాలో పొలమారుతున్న స్మృతుల సాక్షిగా..
8161. మనసెందుకు రోదిస్తుందో..
చూపులను మసకచేసి ఈ సాయంత్రంలో..
8162. నువ్వేగా రాజువి..
కొత్తబంగారు లోకమంటూ నే కలగంటే..
8163. అతనో మెరుపు..
ఆశపెట్టి కదిలిపోయాడంతే..
8164. నీ చిరునవ్వుకు రాలిపడ్డ పలుకులు..
నా మనసుని నీకు చేర్చాలంటూ..
8165. నువ్విన్నది నిజమే..
నా స్వప్నంలోని జీవితమిక నీదే.. 
8166. మరుపొక చేదయ్యింది..
తీయని జ్ఞాపకాలన్నీ మనసుపొరల్లో అడుగునచేర్చేసి..
8167. ఆమె నవ్వింది..
కొత్తగా నిర్వేదానికి స్పందించడం నేర్చినట్లుంది..
8168. జీవితాన్ని రంగరించక తప్పలేదు..
అనుభవాన్ని అక్షరం చేద్దామనుకోగానే..
8169. కవితలతోనే పొద్దుపోతుంది..
కుసుమాన్ని పలకరించాలని పెదవి కదపగానే..
8170. మనసెందుకు వెచ్చబడుతుందో..
వెన్నెల్లో నీ చూపులు నన్నంటగానే..
8171. వలపు చేసిన ఇంద్రజాలమనుకుంటా..
ఒంటరితనపు అలసట తీరినట్లుంది..
8172. కోయిలగా ఎన్నడో మారిపోయా..
ఆమనివై రమ్మంటూ పిలుపందగానే..
8173. నా కవితలన్నీ పరామర్శలేగా..
నిన్ను పలకరించాలనుకున్న ఏవేళనైనా..
8174. మనోనేత్రం తెరుచుకుంది..
మదిలో ఆలోచన పక్కదారి మళ్ళగానే..
8175. ఇవాళ్టి నేను..
గతానికి కాసిన్ని రంగులు పులిమాక.
8176. ఎదలోనే చోటిచ్చేసా..
ప్రపంచానికి కనిపించని రహస్యంగా దాచుకొనేందుకే
8177. చిరునవ్వుల హారతినందుకున్నా..
నా పెదవొంపులు నెలవంకకు కన్నుకుట్టేలా..
8178. శిలాప్రతిమనే నిన్నటివరకూ..
రంగులద్ది నన్ను నువ్వు పూజించేవరకూ..
8179. విషాదం చేరికయ్యిందిక్కడ..
నా నవ్వులు నీతో కదిలిపోయాక..
8180. వలపు పువ్వుల ఘుమఘుమలకేమో..
నా భావాలకీ పరిమళమంటింది..
8181. అబద్దమొకటి నిజమయ్యింది..
నాలో వలపు కలాన్ని చేపట్టగానే..
8182. ప్రేమరుచి ఎన్నటికీ మారిపోదుగా..
నీవెంత ఆకాశమై దూరముంటున్నా..
8183. సమీరానికెంత సాహసమో..
నన్ను తాకుతూనే తనలో అతిశయం..
8184. నీ నయనాల సౌందర్యాన్ని కంటున్నా..
నా పెదవుల ఆలాపనకి తాళమేస్తుంటే..
8185. కాలం కరిగించిన జ్ఞాపకాలు కొన్ని..
శిధిలాలుగా ఎదలో మూలన నక్కాయి..
8186. జీవితం రెండుముక్కలయినట్లుంది..
నీవులేని క్షణాలు భారంగా కదులుతుంటే..
8187. నిషాదాలే నిలిచాయిక్కడ..
నాలో గమకాలు నిన్ను వెతుకుంటుండగా..
8188. నేనంటే ప్రేమని అప్పుడే కనిపెట్టేసా..
ఊహల్లోకి చొరవగా నువ్వొచ్చి చేరినప్పుడే..
8189. కొన్ని కలతలంతే..
ఒక్క కేరింతకే మనసంత తుళ్ళింతలవుతూ..
8190. ఒక్కో అడుగూ వెనకేస్తున్నా..
నువ్వు చేరువవుతావనే ఆశతోనే..
8191. ప్రేమ కనుమరుగయ్యిందక్కడ..
అతని నిజస్వరూపం అనుకోకుండా బయటపడ్డాక..
8192. వెళ్ళిపోమన్నా వెన్నెలను..
నీ వన్నెలు తోడున్నది చాలనుకొని..
8193. వచ్చే శిశిరం ఆగిపోదుగా..
హేమంతపు కలలింకా వీడలేదంటున్నా..
8194. నువ్వెప్పుడూ గమ్మత్తువే..
నీలోకెన్నిసార్లు నా మది తొంగిచూసినా..
8195. చూపులు కలవడం నచ్చింది..
మౌనం మాట్లాడేందుకు సిద్ధపడ్డందుకు..
8196. మిన్నూ మన్నుతో ఏకమయ్యింది..
నీ కన్నీటికి వ్యధ చెందిన తన అంతరంగముతో 
8197. అక్షరానికెప్పుడూ అడ్డంకులే..
అపార్ధాల అలసత్వానికి తట్టుకుని నిలబడాలంతే..
8198. గాలికెరటాలన్నిటా నువ్వేగా..
మదిలో మల్లెలు చల్లినంత మాయగా..
8199. గతితప్పిన నా గమనం..
కలల తాకిడికే తడబడుతూ..
8200. గమనం మార్చుకున్న కోయిలామె..
వాడితో అపస్వరాలను ఆలపించలేక..

No comments:

Post a Comment