Wednesday, 13 September 2017

8401 to 8500

8401. తీపంటేనే వెగటు పుడుతోందిప్పుడు..
కన్నీటిచుక్క విలువ తెలుసుకున్నాక..
8402. నాలో చిలిపినవ్వుల తన్మయత్వం..
పెదవికందిన తీపి కలవరాలతో..
8403. తీపికర్ధం నువ్వేగా..
వేరే నిర్వచనాలింకెందుకు..
8404. తీపంటే ఇష్టమన్నా..
ముద్దులిచ్చి మాయ చేస్తావని తెలీక..
8405. అనుభూతుల మధురాలే..
బంధాలెంత బలహీనమైనా తీపి జ్ఞాపకాలుండగా..
8406. ఎంతగా ఖండించాలో..
కొన్ని ఆకృత్యాల రుధిరపు కంపుని..
8407. చలాకీ నవ్వులే నావన్నీ..
నీ హృదయాన్ని చిలికించాలనుకున్నందుకు..
8408. నా పేరు పిలిచినప్పుడే అనుకున్నా..
ఒంపులు తిరిగేందుకే నీ పెదవులున్నవని..
8409. చిలిపి నవ్వులతో నేనొచ్చా..
మనసుపొరల్లో మల్లియగా దాచుకుంటావనే..
8410. నిన్నటి నేనే..
నీతో సవాలు చేయబడ్డ విశ్వాసంలా..
8411. మౌనం భరించలేనంది..
భావాన్ని వెల్లడించమంటూ నా మనసు..
8412. నీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నా..
అనుభూతులు సశేషం చేద్దామనే..
8413. ఎన్ని స్వప్నాల్లోకొస్తేనేమి..
నువ్వెదురై నిజమయ్యే రోజైతే రాలేదుగా..
8414. ఊహిస్తున్నాననుకున్నా..
స్వప్నంలో నువ్వొచ్చి రంగులు పులుముతున్నప్పుడంతా..
8415. కలలు చాలించాలందుకే..
వేకువైతే వెలుగు కిరణాలొచ్చి కరిగించేస్తాయనే..
8416. ఊహలకర్ధం వెతుకుతున్నా..
పగలల్లా కలలంటూ నువ్వు పడుకునుంటుంటే..
8417. ఋతువులన్నిటా నవ్వుతూనే నేనుంటా..
నువ్వలా మనసుపొరల్లో దాచుకుంటానంటే..
8418. జీవితచరిత్ర జోలికి పోలేదందుకే..
నీ రక్తాశ్రువులు తుడవలేననే..
8419. మనసులోనే తొంగి చూసుకున్నా..
నిలువెత్తు నువ్వెలా కనిపిస్తావోనని..
8420. మల్లెలు పరిమళించలేదట..
మనసు మౌనవించినచోట..
8421. కురవడమాగదుగా చినుకు..
చిగురుఒణికి చిరిగిపోతుందని..
8422. సరిగమలే నా శృతిలయలు..
కోయిలంటూ ముద్దుగా పిలుచుకున్నాక...
8423. ప్రేమంటే విత్తనం..
అర్ధమైనోళ్ళకి ప్రణామం..అర్ధం కానోళ్ళకి అదో అద్వైతం..
8424. ఒంటరితనమో సదావకాశం..
నీలో నువ్వు తొంగి చూసుకొని విశ్వాసాన్ని కూడదీసుకొనేందుకు..
8425. మెలిపడుతూనే ఉంది మనసలా..
చేదుకన్నీరు తాగిన మౌనములా..
8426. స్వరాలన్నీ నాలోనే..
రాగాలు కూర్చింది మాత్రం నీ అనురాగపు సాయంతోనే..
8427. అభిమానం నిజమనుకున్నా..
ఆక్రమించేందుకందుకే అవకాశమిచ్చా..
8428. మనసు..
పెత్తనమిచ్చినందుకు లోకువే..
8429. అర్ధమైంది నీ విలవిల..
ఎదలోకి వస్తుంటానిక మిలమిల..
8430. పరిమళాలు గమనించినప్పుడనుకున్నా..
మల్లెల్లోకి పరకాయప్రవేశం చేసింది నువ్వేనని..
8431. అనుభూతులిప్పుడు చేదు జ్ఞాపకాలు..
అనురాగం హద్దులు దాటినందుకే..
8432. నా లాలసనెప్పుడు కనిపెట్టావో..
అలుకను అక్షయం చేయాలనిపిస్తోందిప్పుడు..
8433. నా మనసెప్పుడో గ్రహించుకుంది..
నీ పిలుపుల్లో నా పేరు ఎన్నటికీ వినబడబోదని..
8434. వరాల వెల్లువిచ్చినా మునగలేనంటావు..
గుండెను గిచ్చానని నిందలేస్తూ..
8435. శబ్దమంటే మండుతుంది..
మౌనంపై మనసు పడ్డానని తెలుసుకున్నాక..
8436. ఒకప్పుడు భావుకనే..
ఇప్పుడో నిరంతర శ్రామికనై వంటింట్లో..
8437. వసంతగానమొకటి పెదవుల్లో..
మన తొలిచూపుల పరవశాన్ని పాడినప్పుడు..
8438. ఊహించలేదిలా నా ప్రేమను ఒప్పుకుంటావని..
నీ అంతరంగంలో ఈనాడు పూజలందుకుంటానని..
8439. నీ ఊహలో నేను..
ఓ ఆనందానికి పర్యాయపదాన్నేగా..
8440. అందిన చందమామ అద్భుతమనిపించలేదట..
ఆమెలో కృష్ణపక్షాన్నే చూసినందుకు..:(
8441. నెమరేసేందుకేం మిగిలిందిక్కడ..
మనసు మృత్యువునే ఊహించడం మొదలెట్టాక..
8442. దైవాన్ని చూసే ధైర్యం లేదట..
పాపాలు కన్నుల్లో కనిపిస్తే శపిస్తాడని..
8443. కొన్ని ఆక్రందనలకు సవ్వడుండదు..
అద్దంలో నిజమెటూ కనిపిస్తున్నా..
8444. ప్రేమబంధీ చేసాననుకుంటున్నాడు..
మూడుముళ్ళకు ఆమె విలువిచ్చిందని తెలీక..
8445. మౌనరాగం కొనసాగుతోందలా..
ఒక మనసు రోదన మూగదయినందుకే..
8446. ఎందుకన్ని దోబూచులో..
ఆడేందుకు సిద్ధంగా లేనని తెలిసాక..
8447. ప్రపంచానికెప్పుడో దూరమయ్యా..
ప్రేమలో మాలోకంగా నే మారిపోయాక..
8448. మధురిమల రుచిప్పుడు తెలుస్తోంది..
నీతోడైన పరవశాన్ని హత్తుకున్నప్పుడు..
8449. చూపులతో అల్లుకున్న మౌనాలు..
మనసు భాష్యాన్ని అనువదించుకుంటూ..
8450. అత్యంత సహజమే..
మధుపం కోసమే మధువు చిలికించడం..
8451. చినుకై కురిసినప్పుడనుకోలేదు..
కన్నీరై కన్నుల్లో కరుగుతున్నది నువ్వేనని..
8452. అద్భుతాలిప్పుడు అరచేతుల్లో..
వసంతం రంగులై అనుభూతులు పండిస్తుంటే..
8453. నా మదిలో ఎందుకో ఉలికిపాటిప్పుడు..
నీ సంకల్పాన్ని తానేదో చదివినట్టు..
8454. ఎదుటివారి తప్పుల్నే లెక్కేస్తుంటారంతా..
తమలోని లోపాలను కనిపెట్టకూడన్నట్లు..
8455. నాది కాని భావం..
కవనంలో ఇమడలేనని మొరాయిస్తూ..
8456. ఆ రాగనికో గమ్మత్తు కుదిరింది..
విభావరిలో వెన్నెల తాపమై కురవగానే..
8457. నువ్వూ నేనూ మౌనానికి నిర్వచనం..
మనలో రాగాలు మనకినిపిస్తే చాలుగా..
8458. అందని ఆనందముగా నువ్వు..
నాలో నిరాశలు కమ్ముకుంటుంటే.
8459. కొన్ని జ్ఞాపకాలంతే..
పచ్చిగా ఉంటూ గాయాన్ని మరువనివ్వవంతే..
8460. ఒక్కోసారి మనసంతే..
అంతర్ముఖమై అద్దమంటి ఆత్మతో సంభాషిస్తూ..
8461. అపురూప బంధంగా సీతారాములు..
అతిశయమైతేనేమి ఆనంద ప్రణయోత్సవాలు..
8462. మనసంటే మక్కువేముంది కొందరికి..
జీవితపుఅరల్లో కలతలు  నింపుకున్నాక..
8463. అందిపుచ్చుకోవాలనే అంత దూరం నడిచా..
ఆనందం ఎండమావని అలిసేంతవరకూ గుర్తించక..
8464. సడెక్కువయ్యింది గాలికి..
నీ పరిమళాన్ని నాకందించాలనే ఆరాటంలో..
8465. మనసాకాశం ఎప్పటికీ నిండదు..
అన్నివేల చుక్కల్లో నన్ను వెతకడంలోనే సమయం కరిగిపోతూ..
8466. ఇసుకపువ్వునవుతా నేను..
ఎడారిలోనూ చిరునవ్వుకై నువ్వు వెతుకుతున్నావంటే..
8467. ఒడినే ఊయలచేసానందుకే..
కలలో కమ్మదనం కొరవడొద్దని అన్నావనే..
8468. మనసంతా వసంతమేగా..
ఎన్నిరంగుల్లో కురిసినా తడవక తప్పదన్నప్పుడు..
8469. దేవతను చేసావు నన్నెప్పుడో..
నువ్వెంత చూసినా నాకలుపునివ్వక ..
8470. దీపావళివే నాకెప్పుడూ..
అమాసన్నది కలనైనా గుర్తు రాకుండా..
8471. మహారాణిగా ఆహ్వానిస్తున్నా..
ప్రేమసిం హాసం అధిష్ఠించేందుకు ఎందుకా ఆలశ్యం..
8472. ఆకాంక్షలేవీ లేవంటాను..
అడక్కుండానే వరాలన్నీ తీర్చినందుకు గాను..
8473. పరిమళాన్నలా పంచుతావెందుకో..
ఏకాంతంలో నా తలపును ఆస్వాదించకుండా..
8474. వలపుదేగా గెలుపు..
ఒకరి తలపుల్లో ఒకరం బంధీలమయ్యామంటే..
8475. నిశ్శబ్దపోరాటమే నాది..
నీరవాన్ని చేరదీయమని మనసు కోరినప్పటినుండి..
8476. నిశ్శబ్దపోరాటమే నాది..
వెతలను గేయాలుగా కలాన్ని నడిపిస్తున్నందుకు..
8477. నిశ్శబ్దపోరాటం నాది..
సంకల్పం ధృఢమైనందుకే..
8478. అభిమానపడ్డం తప్పయింది..
అనుమానించిన ప్రతిసారీ ప్రేమ లేదనుకుంటూ..
8479. మౌనం మంచిదే,..
మరచిపోయిన చిరునవ్వుని వెనక్కు రప్పిస్తుంది..
8480. నిదురలో కదిలినప్పుడనుకున్నా..
తీయని కల మేల్కొల్పేలా ఉందని..
8481. మనోల్లాసంలో మునిగిపోతున్నా..
నువ్వో వసంతమై విస్తారముగా నన్నల్లుకుంటుంటే.
8482. అహాన్నెప్పుడూ ఆమడదూరముంచుతా..
చెలిమిని చేరదీయాలనుకున్నాగా..
8483. ఆనందమూ నేనే..
నీ అతిశయానికి ఓ కారణమయ్యానుగా..
8484. నీ చూపులను తప్పించుకోవాలని నేను..
అడుగుల దూరాన్ని చెరపాలని నువ్వు..
8485. రాస్తే పుస్తకమయ్యింది..
మన అనుబంధాన్ని అక్షరం చేయగానే..
8486. కాలు కదిపితే అందె మోగింది..
నీలో వలపు రవళిస్తుందని తెలీక..
8487. రేయలా ముగిసింది..
రోదన రహస్యంగా కన్నుల్లో ఇంకింది..
8488. నా నవ్వులు మువ్వలే..
నీలో లయమవ్వాలని కదిలొచ్చేవేళ..
8489. కన్నీటికి వేళాపాళా లేకుంది..
ఏకాంతాన్ని దుర్వినియోగం చేస్తుంది..
8490. అవగతం కానట్లే చూస్తున్నా..
భవిష్యత్తులో నీవెలా ఉండబోతావోనని..
8491. నక్షత్రమని నన్నెందుకనుకున్నావో..
ఆకాశమంత ప్రేమతో నే వెలుగుతున్నా..
8492. మోహమలా మించినట్లుంది..
చెలిమిని కాదనుకోలేక అర్ధాన్ని మార్చుకుంటూ..
8493. కాలమలా కదిలిపోతుంది..
మరోసారి నువ్వు తిరిగొచ్చినా తిరస్కరించమంటూ..
8494. మనసునూపే ఊయల నువ్వేగా..
వియోగ భారాన్ని మోయలేనప్పుడల్లా..
8495. నీ ఊపిరిలో ముడిపడాలనుకున్నా..
నిశ్వాసల్లోంచీ జార్చేస్తావని తెలీక..
8496. నాకూ వేసవికీ సరిపోయింది..
నాలోని వియోగానికి కొన్ని అగ్నిగోళాల్ని జత చేరుస్తూ..
8497. కొన్ని మనసులంతే..
పోరాటాల ఆరాటాల్లోనే నిత్యం అలసిపోతుంటాయ్..
8498. ప్రతిసారీ బంధించేస్తావ్..
నీ తలపుల్లోంచీ తప్పుకోవాలని చూస్తుంటే..
8499. మారనంటూ మనసు..
కోరుకుంది నిన్నుగా..
8500. వెతుకులాటలా ముగిసింది..
వాస్తవంలో కలవరించిన దాహం రాత్రి కలలో తీరిందని..

No comments:

Post a Comment