Wednesday, 13 September 2017

8201 to 8300

8201. నా గమనమక్కడే నిలిపేసా..
మౌనాన్ని మీటుకుంటూ సాగలేక..
8202. అందలమెక్కి నేనుండిపోయా..
నన్ను గెలుచుకునేందుకు తప్పక నువ్వొస్తావనే..
8203. సందేహమెందుకిక..
నా పదాలన్నింటా నువ్వేనట..
8204. కొన్ని గుబుళ్ళంతే..
తరిమేసినా మదిని పట్టుకు వేళ్ళాడుతుంటాయి..
8205. కవిత్వాన్ని తాగుతున్నా..
మనసు దాహాన్ని తానైతేనే తీర్చగలదని..
8206. నీ తలపుల్లోనే కనుమూయాలనుంది..
నాలో ప్రేమ నీకవగతమవుతుందంటే..
8207. భావాలన్నీ నీ పరమేగా..
ప్రేమలో నే పరాజితనైనా..
8208. నాతో జరిగినవన్నీ మధురానుభూతులేగా..
కాకుంటే నిన్ను తాకలేదంతే..
8209. ముత్యమై జారితేనేమి..
నీ కన్నుల్లో కాసేపున్నదే చాలనుకున్నా..
8210. విరితేనెలెంతని తాగాలో..
తనివితీరని తాపం నీ విరహమైనప్పుడు..
8211. ఉండిపోదామనలా పున్నాగతోటలో..
మెలికపడ్డ మన ఊహలను కలబోసుకుంటూ..
8212. నీ ఒక్క నవ్వుతోనే కనిపెట్టేసా..
ఇన్నాళ్ళ మనసు దాహం తీరబోతుందని..
8213. అలసిపోతున్నాయి ఆనందాలన్నీ..
నీ సమక్షంలో యుగాలైనా సరిపోవంటూ.
8214. నీ ప్రేమను పంచినందుకేమో..
పరవశాల విపంచికనై నేనిప్పుడు..
8215. అభిమానాన్ని చంపుకోవలసొస్తుంది..
అప్యాయతను గుర్తించనప్పుడల్లా పెదవికి పనిచెప్పి..
8216. అనుభూతిలో కరుగుతున్నా..
నీ అనునయంలో ఎన్ని మధురిమలోనని..
8217. శిశిరముంటేనేమి..
నీ రాకతో నాకైతే వసంతమేగా.. 
8218. తొలకరి థిల్లానాలెన్నో ఎదలో..
తలపుల తపనలు పెరిగిపోతుంటే..
8219. కొత్త ఊపిరితో నేను..
చైతన్యం నీలా నన్నల్లుకోగానే..
8220. 
ఒకప్పుడు జీవనదినే..
నీ తలపుల్లేక ఎండిపోయింది నిజమే.
8221. కోట్లాదిలో నువ్వు..
నాకైతే సమస్తమేగా..
8222. కలలే సాక్ష్యాలనుకో..
నీ మదిలో నేను సజీవమైయున్నట్టు..
8223. కవితనుకుంటావే..
నీపై ప్రేమనలా కమ్మగా కుమ్మరిస్తుంటే..
8224. తలపు నేనై గిచ్చింది నిజమే..
నువ్వు పరధ్యానంలో ఎటు కొట్టుకుపోతావోనని..
8225. వేసవిలోనూ కురవక తప్పలేదు..
నన్నెక్కడ విరహానికందిస్తావోననే బెంగలో..
8226. పరిమళమై చుట్టుముడతావు..
రేయైతే కలగానైనా నన్ను రమ్మంటూ..
8227. ఆశల వీక్షణాలతో నేను..
వసంతం నన్నూ కరుణిస్తుందేమోనని..
8228. చిలిపిదనం కరువైన కోయిల..
వసంతాన్ని ఆలపించడం మరచినందుకే..
8229. సుదూరాన తారాకవే నాకెప్పుడు..
ఎదురుచూపులకు నే నేస్తమయ్యాక..
8230. అక్షరాల్లోనే అనుభూతులు..
వాస్తవంలో వసంతం వలసపోయి ఒంటరయ్యాక..
8231. ఎప్పుడూ ముసురేగా మనసుకి..
అనునయానికందని అలుకలతో సాధిస్తుంటే..
8232. ఊపిరందుకే బరువెక్కింది..
ప్రేమను కాదంటూ నువ్వు మరలిపోగానే..
8233. ప్రేమలో నిన్నెప్పుడో మించిపోయా..
జీవితాంతం ప్రయోగాలతో నువ్వుండగానే..
8234. ఆత్మీయత లోకువిక్కడ..
అతిగా చొరవు తీసుకు దగ్గరయ్యినందుకేమో..
8235. అనురాగాన్నెంత మరగబెట్టాలో..
నీ మదిలో సంగీతాన్ని వెలికితీసేందుకు..
8236. మనసు తడవడం తెలుస్తోంది..
వసంతంలో కురిసింది ప్రేమనుకుంటా..
8237. చిలిపికోయిల నాకు పోటీనేగా..
మత్తెక్కిన సుస్వరాలతో బదులిస్తుందంటే..
8238. అతివకందుకే అతిశయాలు..
సొగసందాలు తామరతంపరలు చేసి వెదజల్లొచ్చని..
8239. నా ప్రయాణం నీతోనే..
గమ్యం ప్రేమని తెలియగానే..
8240. మెత్తగా గుచ్చుకున్నప్పుడనుకోలా..
మనసంతా గాయం చేయగలదని ప్రేమ..
8241. ప్రేమకెంత మహత్తో..
వింతైన వెన్నెలగా మనసుని వెలిగిస్తూ..
8242. చిరునవ్వుతోనే నేను..
పులకరించే నీ ఊహలను తలచుకుంటూ..
8243. పంజరంలో ఉండేందుకు నే సిద్ధమే..
అప్పుడప్పుడైనా ప్రేమను కురిపించేందుకు నువ్వొస్తానంటే.. 
8244. పసిదనమిప్పుడు పగ్గాన్ని తెంచింది..
ఆటలంటేనే వేసవికి మక్కువంటూ..
8245. నా తలపుల తోడెందుకొద్దంటావో..
ఏకాంతంలోనూ నీతోనే సంభాషించుకుంటూ
8246. నీ పిలుపందగానే విచ్చేసా..
నా చెలిమి నిరూపించాలని..
8247. నా మనసెప్పుడాలకించిందో..
నీ పెదవులు పాడిన చిలిపిదనం..
8248. వెచ్చగా తడిమినప్పుడే అనుకున్నా..
ఆనందమొస్తే ఆరున్నొక్కరాగమే నువ్వని..
8249. కాలాన్ని తేలిగ్గా తీసుకుంటావెందుకో..
హృదయాన్ని ఆవిష్కరించడం నేర్పిస్తున్నా..
8250. రేయింబవళ్ళు నాతోనేగా..
మదిలో గుడిగంటై మారుమోగుతూ నువ్వు..
8251. కన్నీటికింత భావముందనుకోలా..
ముత్యాలై నీ రాతలో ఒదిగేవరకూ..
8252. వగలు పోతున్న జాబిలి..
తనను పోల్చుకుందేమో నీలా..
8253. గెలిచింది అనురాగమే..
నేనోడి నిన్ను గెలిపించినా..నువ్వోడి నన్ను గెలిపించినా..
8254. ప్రేమరాహిత్యాన్ని తీర్చలేరెవ్వరు..
కోరి నరకాన్ని ఉద్ధరించేందుకు ముందడుగేసేదెవ్వరు..
8255. చంచలిస్తూ తనువిప్పుడు..
నీ స్పర్శలో పులకింతలు పెరుగుతుంటే..
8256. అదో మేఘం..నేనో విరహం..
తన సందేశాన్నెప్పటికీ చేరవేయనట్టే ఉంది..
8257. నీ తలపులు నసపిట్టలే..
నా ఏకాంతాన్ని భగ్నంచేస్తూ..
8258. గేయాలకు బాగా అలవాటు పడిపోయా..
నీ గాయాల్ని రాస్తున్నావని తెలీక..
8259. ధన్యమయ్యింది నేనే..
నీ ఆలాపనలో తొలిగా నన్నందుకున్నందుకు..
8260. పెదవెప్పుడో మూగదయ్యింది..
నా మాటలు నువ్వాలకించట్లేదని తెలిసాక..
8261. అవును..నేను నేనే..
నీ అక్షరాల్లొ నన్ను కొత్త కుంచెతో ఆవిష్కరించుకుంటూ..
8262. సప్తస్వరాలన్నిటా నువ్వేగా..
సప్తవర్ణాలుగా నా మదిని చిలికేస్తూ..
8263. వేయికన్నులతో నా మేను..
నిద్దురపోనని మారాంచేస్తూ నీకై..
8264. శృతిలోకి రానంటూ నా గొంతు..
పల్లెల్లో వసంతం కనిపించక తడబడుతూ..
8265. మదిలో జ్ఞాపకాలన్నీ మనవే..
నిద్దురపోనంటే ఏమైందిలే కన్ను..
8266. సున్నితత్వం సచ్చిపోయింది..
అభావమైన మనసుని మోహించి భంగపడ్డందుకు..
8267. నిగ్రహమో శాపమయ్యింది..
అది పూజించే విగ్రహమని తెలీక..
8268. పులకలెలా దాచుకోవాలో..
మొలకలై మొత్తంగా నన్ను మురిపిస్తుంటే..
8269. మనసంటిన భావాలు నీవేగా..
నన్నో అంబరానికి దగ్గరచేస్తూ..
8270. దారమై నిన్నల్లుకున్నా..
ప్రేమ పరిమళం ఆధారమై వశమవుతావని..
8271. అందమే ప్రతిబంధకమయ్యింది..
మనసు కాదని తనువును ఆశిస్తుంటే..
8272. నేనే నీ ఊపిరని తెలిసిపోయింది..
నా శ్వాసల పరిమళాన్ని గమనించుకోగానే..
8273. నువ్వు పంచే అనుభూతులెప్పటికీ ప్రియమే..
ఆవేదనైనా ఆనందమైనా సమంగా స్వీకరిస్తూ..
8274. మౌనం దగ్గర చేస్తుందనుకోలా..
మనసుని చూపులతో చేరేస్తూ..
8275. కాలాన్ని లాలించక తప్పలేదు..
గతాని మరపులోకి జార్చనందుకు.. 
8276. పులకరిస్తూనే నేనెప్పుడూ..
నీ అక్షరాలతో నన్ను పలకరించినప్పుడల్లా..
8277. జంటజావళిగా రమ్మంటున్నా..
యుగళగీతం చేసి చిలిపిదనం నర్తిద్దామనే..
8278. నావి చిలకపలుకులన్నప్పుడే గుర్తించా..
పంజరమొకటి సిద్ధం చేసుంటావని..
8279. చుక్కలకు చిక్కింది నా మనసు..
నీ ఎదురుచూపుల వరుసకి బదులివ్వాలనుకుంటూ..
8280. అమృతం పంచుతున్నా భావాలకు..
అనుభూతిని అమరం చేసేందుకు..
8281. నువ్వో భావం..నేనో కవనం..
లోకానికీ సంగతి అర్ధమైనట్టే ఉంది..
8282. ఎటు చూసినా పరిమళమే..
వాసంతికవై నువ్వు గుభాళిస్తుంటే..
8283. చెట్లెక్కడం మానేసాను..
నువ్విలా మాటలతో ఎక్కిస్తుంటే కాదనలేను..
8284. మదనికనే నేను..
వరించి నువ్వు తపించిన ప్రతిసారీ..
8285. ఎన్నిసార్లు జన్మెత్తాలోననిపిస్తుంది..
ఆత్మహత్యించుకున్న ప్రతిసారీ..
8286. గుండెకోతే మిగిలిందిప్పుడు..
మాయదారి వలపును నమ్మినందుకు ప్రతిఫలముగా
8287. మైనపుబొమ్మలా నేను..
నీ చూపుల సెగలకే కరిగిపోతున్నా..
8288. కొన్ని మాటలంతే..
అపార్ధంతో మొదలై అవమానిస్తూ ముగుస్తాయి..
8289. వసంతమొచ్చినట్టుంది..
నీ పలుకు తీయని పాటైనందుకే..
8290. ఎన్ని చిన్నెలు రువ్వితేనేముంది..
నీ చూపునాకర్షించనే లేదుగా..
8291. నీ కదలికలో చైతన్యం నిజమేగా..
నా ఊపిరితో ప్రాణం నిలబడిందంటే..
8292. మనసిప్పుడు కుదుటపడింది..
నీ తలపుల్లో నేను మిగిలున్నాననే..
8293. జాబిలెందుకు చిన్నబోయిందో..
నే ముద్దాడుతున్నది నీ మోమునైతే..
8294. ఆ నదేం పాపం చేసిందో..
మనసుల్లోని మాలిన్యాలు తాను పూసుకుంటూ.
8295. నవ్వుతూనే ఉంటా నేనెప్పుడూ..
నీకై విచ్చిన కలువనని నువ్వు గుర్తించేంత వరకూ..
8296. ఇన్నాళ్ళ నవ్వులు విఫలమైనట్టేగా నావి..
నొసటి వంకే చూస్తూ నువ్వున్నావంటే..
8297. నా సరికొత్త చీరకెన్ని సంగీతాలో..
అడుగడుక్కీ ఆలాపనలు నువ్వు లెక్కిస్తుంటే..
8298. మదిలో మోహనరాగం మత్తుగా ఉందిప్పుడు..
నీ భావాలు విపంచిగా వినబడుతుంటే..
8299. నీ అనురాగామొక్కటీ చాలనుకున్నా..
మనసుకెన్ని రాగాలతో పరిచయమున్నా..
8300. మధురోహలంటే మక్కువే..
మది మోహం తీరేందుకు సరియైన సమయం రాలేదనే..

No comments:

Post a Comment