Wednesday, 13 September 2017

8001 to 8100

8001. నీ ప్రత్యేకతే నా బలహీనత..
నేనోడినా నిన్ను గెలిపించాలనే తాపత్రయంలో..
8002. రేయైతేనేముందిలే..
మనసుకి ఆవిష్కరణ జరిగిందా వెన్నెల్లోనేగా..
8003. కురవకుండా వెనుదిరిగిన మేఘమొకటి..
తన పరిధి గుర్తించలేకేనట..
8004. మనసు పరిధులెప్పుడో దాటేసా..
వెచ్చని నీ గుసగుసల్ని నెమరేసే వెన్నెల క్షణాల్లో..
8005. ఏకాంతం విస్తుపోయింది..
పరిధిలేని నా మౌనాన్ని భరించలేనంటూ..
8006. హద్దులు గీసుకున్న మనసది..
నరనరాల్లో పరిమితులు విధించుకుంది..
8007. కరిగిపోతావని భయమవుతోంది..
తమకంలో కన్నులు పన్నీటిని ఒలికిస్తుంటే..
8008. విప్లవజ్వాలలు మనకెందుకులే..
ప్రేమపరితాపమొక్కటీ చాలనుకున్నాక..
8009. అసహజమవుతూ ఆలోచనలు..
కొన్ని వియోగాలిచ్చిన మనసు యాతనలో..
8010. ప్రేమెప్పుడో పుట్టింది..
నాకోసం నువ్వు పునర్జన్మిస్తావని తెలిసే..
8011. నిషాదంలో చేరింది నా స్వరం..
నీ మది నీరవాన్ని మోహించిందని..
8012. హృదయమెందుకు స్రవిస్తుందో..
నన్నో రాతిని చేసి ప్రతిష్ఠించినందుకేమో..
8013. మనసుని మరలించా..
నిన్నాలోచించే లోపు అగమ్యాన్ని చుట్టిరావొచ్చని..
8014. అణువులోకొచ్చి చేరిపోయా..
ఏకప్రాణంగా ఉందామన్న బాసలు నచ్చి..
8015. గుండెజారి గల్లంతయ్యింది..
నీ కన్నుల్లో బంధించి రెప్పలేసేయ్యగానే..
8016. శిశిరాన్ని స్వాగతించేసా..
వెనుకనే వసంతం వరుసలో నిలబడుందని..
8017. అంతరంగాన్ని ప్రక్షాళన చేస్తూనే ఉన్నా..
వగపిచ్చే ఆలోచనలను ఎప్పటికప్పుడు కడిగెద్దామని..
8018.కాలం ఏకాంతంలోనే సాగింది..
మౌనాన్ని కౌగిలించిన క్షణాలనుండి..
8019. మానసికంగా విడిపోతామనుకోలేదు..
నీలో చోటిచ్చి నన్నుక్కిరిబిక్కిరి చేసినందుకు..
8020. నాలో కలస్వనం..
స్వరకల్పనకు ప్రాణం పోసింది నువ్వని..
8021. ఆశ తీరిపోయింది ఆయువు మీద..
మరణాన్ని తలపోస్తోంది తలపుల భారం.
8022. వసంతాన్ని కలవరించడమెందుకో..
వలపు సొంతమై మనమొకటేనని తెలిసినా..
8023. కలలోనూ కలవరింతలే..
మన కలయికనెప్పుడు కధగా రాస్తావాని..
8024. మనసుకి వరదొచ్చినప్పుడనుకున్నా..
నిన్ను కలిసేందుకే తపనిలా ప్రవహిస్తోందని..
8025. హృదయపు తలుపులప్పుడే వేసేసా..
రాలిన ఆశలనెక్కడ నువ్వేరుకుంటావోనని..
8026. స్మృతులను ఆరాతీస్తున్నా..
అరకొరగా కావ్యాన్ని రాసి నీకంకితమివ్వలేనని..
8027. ఇష్టమెప్పుడూ నాతోనే ఉంది..
తలపుల్లో చకోరిగా నువ్వెదురుచూస్తున్నట్లు..
8028. ఆ రాధ నేనని తెలుసులే..
నీ చిరునవ్వుల పలకరింపుల సాక్షిగా..
8029. మలుపు తిరిగిందో కవితక్కడ..
నిశ్శబ్దం సంగీతాన్ని మోహించగానే..
8030. తీయనయ్యింది కడలి..
కలిసేందుకొచ్చిన నదిని తనలో పొదుపుకొని..
8031. ఆశలు కూలినప్పుడనుకున్నా..
నిరాశలు జీవితాన్ని మొదలంటా అంటించగలవని..
8032. నా కవనం కన్నీరై కురిసింది..
నీ మౌనం మేఘరంజని కాగానే..
8033. ఉస్సూరుమంటూ మది..
ఒక్కో అడుక్కీ నువ్వలా దూరమవుతుంటే..
8034. ప్రేమంటే అదే..
మాటలకందని మధురమైన మనసు విషాదం..
8033. గతంలోకి అడుగేయనిక..
ప్రేమొద్దంటూ మదిలోంచీ నన్ను గెంటేసాక..
8034. ఒంటరితనమెందుకు నవ్వుతుందో..
నిరాశను నిఘంటువులోంచీ చెరిపేస్తానని నేనంటుంటే..
8035. దేహం దేవాలయమయ్యింది..
దైవానికి చోటిచ్చి పవిత్రతను ఆపాదించగానే..
8036. తలపుల మధ్య విరామమెందుకిచ్చావో..
ప్రేమ వసంతాన్ని ఆశించినవాడవైతే..
8037. నీ ప్రేమ..
నన్నో పున్నాగపూల పరిమళంగా అల్లేసింది..
8038. మనసిన్నాళ్ళకు మొలకెత్తింది..
ప్రేమవిత్తులు జల్లి నువ్వు నిరీక్షించినందుకే..
8039. ముకిళించిందో హృదయమిక్కడ..
అనురాగాన్నో అపస్వరముగా వెక్కిరించి చిదిమేయగానే..
8040. ఋతువునై నవ్వాలనుంది..
వసంతానికై నీ ఎదురుచూపుల ఆరాటానికి..
8041. వంత పాడిందో పరిమళం..
హృదయంలోకి జొరబడింది నువ్వేనంటూ..
8042. అదే కౌగిలి..
దిగులు మదికి నులివెచ్చని సాంత్వనవుతూ..
8043. శ్రామిక సౌందర్యం కనబడుతోంది..
మట్టివాసనతో వారలా కదిలొస్తుంటే..
8044. కన్నుల్లో నీటిముత్యాలు..
నాపై కురిసిన నీ ప్రేమాంజలికి..
8045. జ్ఞాపకాలను నెమరేస్తున్నా..
నిన్నో గమ్మత్తులో ముంచి అలరించాలని..
8046. ఋతువునై నవ్వాలనుంది..
అనురాగంలో అపశృతులు కాలంలో కొట్టుకుపోగానే..
8047. ఋతువునై నవ్వాలనుంది..
తొలిపొద్దు చుక్కల ఊసులకు మైమురుస్తూ..
8048. కలవనంటూ మనసులు..
బంధాన్ని నిలబెట్టేందుకు నటించడం అనవసరమంటూ..
8049. నేనంటే నువ్వేగా..
మనసద్దంలో ప్రేమే ప్రతిబింబముగా కనిపించాక..
8050. ఆకాశం శబ్దించినప్పుడనుకున్నా..
వానవిల్లు వంచేందుకు మేఘం గర్జిస్తుందని..
8051. నా కళ్ళు నక్షత్రాలే..
మదిలోకి నువ్వడుగేసిన ప్రతిసారీ..
8052. నీ రాగంలో చేరింది నా పల్లవొకటి..
నా పరవశంలో నువ్వు సరసంగా కదిలినప్పుడల్లా..
8053. జ్ఞాపకాల బరువు పెరుగుతోందలా..
మరణానికి చేరువయ్యేకొద్దీ నిక్షేపములా..
8054. మానసిక ప్రయాణం..
నన్ను దాటి నీ హృదయపులోతుల్లోకి..
8055. శుభశకునం నా చూపుకందింది..
లేఖలోని నీ స్వచ్ఛతకి..
8056. అక్షరాలను ఆవహిస్తున్నా..
నిన్నాకర్షించే కవితలు కొన్నైనా గుప్పించాలని..
8057. ప్రేమెక్కడుందని ప్రశ్నిస్తూ మనసు..
మనమెదురైన ప్రతిసారీ కొట్టుకుంటుంటే..
8058. స్వప్నంలోనూ విషాదమే..
నన్నల్లుకోవడం చేతగాని నీ ఊహలతో..
8059. ప్రేమదేశానికి రాజువని నమ్మేసా..
నీ మనసు దోచిన రాణిగా నన్ను ప్రకటించగానే..
8060. నీ ఊహలతో రాజుకున్న వేదనది..
నన్నో నిశ్శబ్దానికి ప్రతినిధిగా మిగిల్చింది..
8061. నీ ఊపిరిలోకి ఇంకినట్లుంది..
ప్రాణం నేనని నువ్వంటుంటే..
8062. భావగీతాన్ని రాసింది నిజమే..
నాలోని మౌనం అక్షరమైనప్పుడు..
8063. నిశ్శబ్దమప్పుడే పరిచయమైంది నా హృదయానికి..
నీ ఏకాంతంలోంచీ నన్ను తరిమేయగానే..
8064. మాటలకు లోకువిప్పుడు..
చిరునవ్వుల ముసుగేసిన వాదనలకి అంతమెప్పుడో..
8065. ప్రతి పున్నమికీ నువ్వొస్తుంటే కనిపెట్టేసా..
వెన్నెలంతా తాగేసి తప్పించుకు తిరుగుతున్నావని..
8066. వచ్చీపోయే అలలకెన్ని అలుపులో..
తీరాన్ని ముద్దాడబోతే తోసేస్తుందని..
8067. రాగాల విందుకి రానంటావే..
అనురాగాన్నే రసముగా వడ్డిస్తున్నా..
8068. ఎప్పుడు నవ్వుతావో తెలియట్లేదు నాకు..
అలుకల మడుగులో మునకలేస్తూ నువ్వుంటే..
8069. ప్రేమ తిరిగొచ్చినట్లుంది..
ప్రతిక్షణం తోడుంటానని నాకు మాటిచ్చినందుకేమో..
8070. వృత్తమేదైతేనేమిలే..
ప్రేమలో మనల్ని ఒకటి చేసినప్పుడు..
8071. దోబూచులందుకే మానుకున్నా..
కానుకలంటూ ఆశపెట్టి నన్ను కనిపెట్టేస్తున్నావనే..
8072. రాగాలపన నేర్పుతున్నా మౌనానికి..
నిశ్శబ్దంలోనూ రవళించి రెచ్చగొట్టాలని..
8073. ఊపిరి బరువెక్కినా బానే ఉంది..
నా ఆరోహణలో నీకు భాగమున్నందుకు..
8074. ఆకునైనా చాలనుకున్నా..
వసంతమొస్తే మరోకొత్త జన్మెత్తేందుకు వీలుందని..
8075. కాలమాగిందక్కడ..
నీ కలలు నా మనసునెలా కౌగిలిస్తాయో చూడాలనేమో..
8076. ఆకుపాటతోనూ మురిపించగలవు నీవు..
ఋతువులన్నింటినీ సమంగా ప్రేమిస్తూ..
8077. సరిగమలెన్నడో మరచిపోయా..
నీ కన్నుల తమకాల్లో తప్పిపోతూ..
8078. వేసవిలో వానొచ్చినప్పుడే అనుకున్నా..
భగ్నప్రేమికుల కోసమే కురిసుంటుందని..
8079. పరవశమింకా మిగిలే ఉంది..
నీ స్మృతుల నెత్తావులు నా భావాల్లో ప్రభవించేందుకని..
8080. ఆరారుకాలాలూ వసంతమే అనుకుంటా..
నీ ఊహల్లో కురిసిన వెన్నెల్లో వలపంతా నాదైతే..
8081. వలపిచ్చి వాటేసినప్పుడే అనుకున్నా..
నిదురంటూపోతే కలలన్నిటా నీవేనని..
8082. కన్నీటితో కరిగిపోయిన కలలు కొన్ని..
మనసు తడిలో రంగులు మార్చుకోలేనంటూ..
8083. కవితల్లో కలబోసుంచా విరహాన్ని..
మనమేకమయ్యే కొంటెదనంలో వినిపించాలని..
8084. శిశిరానికో కథుందని తెలీదు..
రాలేఆకుని ఆరా తీసేంతవరకూ.. 
8085. కన్నీరెప్పుడో చేదయ్యింది..
పగుళ్ళిచ్చిన నేలతల్లిని ఓదార్చలేని నిస్సహాయతలో..
8086. ఎన్ని ఆత్మలు వేదన పడుతున్నాయో..
విషాదానికి ఆనవాళ్ళుగా నెర్రలిచ్చిన నేలకింద..
8087. విచ్ఛిన్నమైంది కల..
వసంతాన్ని వెంటాడి శూన్యానికి చేరువైనట్లుగా..
8088. నీ చూపు లాగినప్పుడే అనుకున్నా..
కన్నుల్లో శాశ్వతం చేసేందుకే పిలిచావని..
8089. నిన్ను నీకు తిరిగిచ్చేస్తా..
నా మనసు నాకిచ్చేస్తే..
8090. వెలసిపోయిన నవ్వులు..
జ్ఞాపకాలను తోడుకొని గాయాన్ని రేపుకున్నందుకు..
8091. మధువొలకబోస్తూనే ఉన్నాగా..
నా ఊపిరి నెత్తావులో గమ్మత్తుందన్నావని..
8092. భ్రమనాలపిస్తోంది మది..
నువ్వు చేసిన గాయంలోనూ తీపినెతుక్కుని..
8093. ఊసులు పరిమళించాయి..
నీ మౌనాన్ని తాగిన మధుమాసంలో..
8094. మానవత్వాన్ని గుర్తించేదెవరు..
కాసుల గలగలలో మైమరపించే సవ్వడుండగా..
8095. కాలం నిడివి పెరిగినట్లుంది..
అంతులేని ముచ్చట్లలో మనముండగానే..
8096. ఎన్ని రాత్రులు నిద్దుర కరువయ్యిందో..
కాస్త అలికిడికే నువ్వొచ్చావన్న తొందరకి..
8097. కలలంటే నాకిష్టమే..
దూరాన్ని లెక్కచేయక మనల్ని కలుపుతుందని..
8098. కొమ్మను చూసి నవ్వుతున్న మధుపమట..
గుమ్మ తేనెకో..దరహాసపు మైమరపుకో..
8099. తప్పించుకోలేని జీవితం..
నవ్వులు రాలిపోతున్నా తిరిగి చిగురిస్తాయనుకుంటూ..
8100. విరహమెప్పుడూ విషాదమే..
అంతులేని జ్ఞాపకాలతో మది మెలిపెడుతున్నందుకు..

No comments:

Post a Comment