Wednesday, 13 September 2017

8601 to 8700

8601. మనసునెన్ని కెరటాలో..
నీ ఊహలు తీరమై కవ్విస్తుంటే..
8602. నీవో మధుమాసానివే..
నా మనసిప్పుడు తనలో నవ్వుకుందిగా.
8603. హరివిల్లే అద్భుతమైందనుకున్నా..
నీ మనస్సోయగానికి సాటిరాదని తెలీక..
8604. మునిమాపులో హరివిల్లు..
స్వరాన్ని సవరించమని ఆదేశిస్తూ నన్ను..
8605. ఓ ముల్లు..
పువ్వుకి అందమిస్తూ తను కొమ్మ చాటు దాగిపోయేది..
8606. ఎంతకాలమని చీకటిని ప్రేమించాలి..
వేకువొకటి ఆహ్లాదమిస్తుందని తెలిసీ..
8607. నవ్వులెక్కడో పారేసుకున్నాననుకున్నా.
కలలో నువ్వు కాజేసావని తెలీనప్పుడు..
8608. ఊపిరినలా ఉగ్గబడుతున్నా..
నన్ను సహనంతో శ్వాసిస్తున్నావని తెలిసే..
8609. నేనో విహంగమిప్పుడు..
ప్రేమించానని బంధించక ఎగరమని రెక్కలిచ్చినందుకు..
8610. మనసుకి వెన్న రాద్దామనే నేనొచ్చా..
నీలో విరహాన్ని వేడుక చేద్దామని..
8611. విరహమైతేనేమిలే..
విచ్చలవిడి వెన్నెల్లో కవనమై నువ్ గుర్తొస్తుంటే..
8612. విషాదమెప్పుడూ సశేషమవుతుంది..
ఆనందాలన్నీ ఒక్కొక్కటీ వలసపోతూ వెక్కిరిస్తుంటే..
8613. గుండె సవ్వడించినప్పుడనుకున్నా..
ఆత్మీయతను పంచేందుకు సిద్ధపడింది నువ్వేనని..
8614. స్వప్నాలెందుకలా కదిలిపోతున్నాయో..
కాసేపలా అధరాల ఆస్వాదనలు ఆలకించకుండానే..
8615. పాలపుంతలోనే మనసు..
నా చుట్టూ నువ్వు తిరుగుతున్నంతసేపు..
8616. దప్పికతీరని మోహమేనది..
దేహాన్ని కాదని ఆత్మను ఆకర్షించాలనుకుంటే..
8617. మెదిలే కవనాన్ని నేనేగా..
నీలో భావాలంటూ వెల్లువవుతుంటే..
8618. నేనో సంఘర్షనో కవితే..
దిగులు మేఘమై నన్నావరించినప్పుడల్లా..
8619. ఒక వసంతమలా తడిచిందేమో..
తొలకరి కొసరించిన చినుకులకే..
8620. మౌనానికి రవళించక తప్పలేదు..
నీ శ్వాసలంటిన గిలిగింతలకి..
8621. మనిద్దరమూ ఒకటే..
మరణం దూరం చేయాల్సిందే తప్ప..
8621. కలిసున్నామని అనుకోలేను..
నువ్వాదరినీ..నేనీదరినీ..మదిలో తప్ప..
8622. గుండె ఝల్లుమంది..
నాలో ప్రవహిస్తున్న నీ జ్ఞాపకాలవెల్లువకేమో..
8623. గుండె ఝల్లుమంది..
నీకై రాసుకున్న ప్రేమలో కవిత్వం కమ్మగా కురిసినందుకే..
8624. గుండె ఝల్లుమంది..
నీ చూపుల కావ్యాలు ఒక్కోటిగా మదికి చేరుతుంటే.
8625. నవ్వు ఎక్కుపెట్టినప్పుడే అనుకున్నా..
రహస్యమొకటి మదిలో సమాథయ్యుంటుందని..
8626. కవినౌతాననుకోలేదు..
ఒక్కమాట అర్ధం కాలేదని నువ్వెన్నిసార్లన్నా..
8627. తొలకరిగా కురవాలనుకున్నా..
తడవడం నీకు నచ్చదని తెలీక..
8628. మువ్వలానే మోగాలనుకుంది మనసు..
నీ నెమరింతల్లో చోటివ్వక బండరాయిగా మార్చక మునుపు..
8629. అప్పుడే అద్దంలో చూసుకున్నా..
ప్రేమమూర్తిని దర్శించుకోమని మనసనగానే..
8630. చావలేకే బ్రతికున్నా..
నిట్టూర్పుల నిశ్వాసల్లో నిముషాలను నెట్టుకుంటూ..
8631. అందరూ దొంగలే అనుకుంటా..
వెతకనివ్వక హృదయాన్ని దాచుకుంటూ..
8632. వెన్నెల ముచ్చట్లెన్నో..
నీతో పంచుకున్నప్పుడే పున్నమికి అర్ధమంటూ..
8633. సగంలోనే ఆగిన కల..
కురుస్తున్న కన్నీటిలో కదల్లేనంటూ..
8634. కొన్ని అనుమానాలలా మిగిలుంటాయి..
సమాధానాలు సరిపుచ్చలేని కాలంలో..
8635. కాలాన్ని వెంబడిస్తున్నా..
నీ నిరీక్షణకు సమాధానం నేనవ్వాలని..
8636. ఆ పిలుపులకే నా ఎదురుచూపులు..
మనసు పరవశాలు నీకు పంచాలని..
8637. ఆక్రమించినప్పుడనుకోలా..
నన్ను నాకు దూరం చేసి నువ్వుండిపోతావని..
8638. అనిమేషమైనప్పుడే అనుకున్నా..
అందానికి నీ మది దాసోహమయ్యిందని..
8639. ప్రేమవేడుక చేసుకుంటున్న జంటనుకుంటా..
అక్కడ విషాదం విస్తుపోతుంది..
8640. నిరీక్షణలో గెలవాలనుకున్నా..
నీ రాకతో సంఘర్షణ అంతమవుతుందని..
8641. కలలకందుకే దూరమయ్యా..
కథల్లోని వాస్తవానికి మది బలహీనమవుతుందనే..
8642. వలపందుకే తీయనయ్యింది..
నీ మాటల రుచిపై మక్కువయ్యానని..
8643. ముందుచూపు కావాలందుకే..
జారుడు మెట్లపై జాగ్రత్తగా నడవాలంటే..
8644. మనసు మూగదయ్యింది..
కన్నీరు వ్యధలన్నింటినీ కురుస్తూ మాట్లాడుతుంటే..
8645. కొన్ని జ్ఞాపకాలంతే..
రాగాన్ని మింగేసి ఆవేదన బయటేస్తాయి..
8646. మనసుందనుకున్నా ఒకప్పుడు..
తనలో మరోమనిషున్నాడని తెలియక మునుపు..
8647. స్వప్నాన్ని కాదంటావెందుకో..
అప్పుడప్పుడు ఊహగానైనా నే మెదలాలనుకుంటే..
8648. దూరమై దగ్గరవాలనుకున్నా...
నువు దగ్గరై దూరమైతే తనువూ మనసూ తట్టుకోలేవనే..
8649. అనుభూతుల ఆలవాలమే మది..
ప్రతి మలుపులో నువ్వెదురవుతుంటేను..
8650. కలిసిన దారులు కనుమరుగైతేనేమి..
అనుభూతులెప్పటికీ పదిలమేగా గుండెలో..
8651. పంటెప్పుడో ఎండిపోయింది..
రైతు కనీసం కన్నీటితోనైనా తడపలేకపోయాడని..
8652. భావాలలా కురుస్తాయి..
నాలుగు అక్షరాలలా చినుకులై జారగానే..
8653. మనువో మొక్కుబడయ్యిందిప్పుడు..
కట్నం చాల్లేదంటూ నన్ను కట్టుకున్నాక..
8654. ప్రతిఘటించక తప్పలేదు..
వద్దంటున్నా ఆశలు మూకుమ్మడిగా మొలుస్తుంటే..
8655. చదువుకున్నా నీ మనసు వాక్యం..
అడుగులు కదిలినప్పుడల్లా అక్షరాలు అగుపడుతుంటే..
8656. పరమాన్నాలిక అక్కర్లేదు..
నీ సాన్నిధ్యపు తీయదనమొక్కటి చాలు..
8657. సాంతం స్వీకరించాలనుంది..
వెన్నెల్లో తన పరిష్వంగంలోని పరవశాలన్నీ..
8658. అపురూపమే తన వలపు పిలుపు..
నన్ను పలికినప్పుడల్లా మైమరపులో నెట్టేస్తూ..
8659. కనువిందుతో ఆగవెందుకో..
అందాన్ని ఆరగించాలనే ఆరాటంలో నువ్వు..
8660. ఆ క్షణాలు విలువైనవే..
తలచినప్పుడల్లా బంగారమై మెరుస్తుంటే..
8661. ఓపలేనన్ని వ్యధలు..
కన్నీటితో కొట్టుకుపోతున్నా మళ్ళీ పుట్టుకొస్తూ..
8662. ఆవేదనలా దాచేసుకున్నా..
నా చిరునవ్వులకై నువ్వెదురు చూస్తుంటావనే..
8663. ఆశెందుకో ఉప్పనయ్యింది..
బహుశా నిరాశగా మారి చిందినందుకేమో..
8664. నిన్నట్లో ఉన్నానన్న బాధ లేదు..
నీ స్మృతుల సంగీతం వింటున్నందుకు..
8665. పరాజితగా మిగిలిపోయా..
పారిజాతమనిపించుకున్న నీకు పరాయిగా మారిపోయాక..
8666. వయసుడిగితే అంతేనేమో..
బిడ్డలకి బరువెక్కుతాయేమో తల్లిదండ్రుల బాధ్యతలు..
8667. నీ వెన్నెలకిరణాల నీడలో నేను..
ప్రతిక్షణాన్ని చల్లగా మనసుని మీటుకుంటూ..
8668. మౌనాక్షరాలే నావన్నీ..
మనసుపెట్టి ఒక్కరన్నా చదివితే చాలని..
8669. కదిలిపోతున్న రాత్రులెన్నో..
నిన్ను కలగానైనా పొందలేని నిట్టూర్పులతో..
8670. చదవని కథ..
చెదిరిన అక్షరాలతో..
8671. ఆ చూపంతే..
చుక్కలన్నీ ఒకేసారి చుట్టుముట్టేలా చిలిపిగా..
8672. నీ కవిత అలరించింది..
నా అందం ఆకాశమైనంత..
8673. ఇంకిపోయా నీలోకే..
కవిత్వం రాసేందుకని నువ్వు కలమంటగానే..
8674. ప్రతిజాములోనూ నువ్వే..
కలగానో..కవితగానో..
8675. నా రూపం వెలిగిపోతుంది..
హృదయంలో కొలువున్నది నువ్వయినందుకే..
8676. సిరిమువ్వలెందుకు సద్దుమణిగాయో..
సిగలో మల్లెల్లు నిన్ను రమ్మంటుంటే..
8677. జీవించక తప్పడం లేదు..
ఆటుపోట్లను తట్టుకుని జయించేందుకు..
8678. మనోక్లేశమందుకే ఆగలేదు..
కన్నీరు కడలిని మించి ప్రవహిస్తున్నందుకే..
8679. అనుబంధమందుకే పెంచుకుంది..
నే శ్వాసించే ఊపిరికో ఉనికినివ్వాలని..
8680. తలపుల్లో తలదూర్చలేదందుకే..
నీ ఊహల్లోకి శూన్యాన్ని ఆహ్వానించావనే..
8681. వసంతం వగలుపోయింది..
పచ్చదనమూ వెచ్చదనమూ కలిసి మురిపిస్తుంటే..
8682. కలగానే మిగిలిపోతున్నా..
ఆకశమంత ఎదగలేని నీ హృదయంలో..
8683. వెలుగుతున్న ఊపిరి..
పరవశించిన క్షణాలను నెమరేస్తున్న రాతిరిలో..
8684. వెలుగుతున్న ఊపిరి..
వెన్నెల్లో నీ తలపును రాజుకుంటూ..
8685. వెలుగుతున్న ఊపిరి..
పలకరిస్తున్న గాలిలో నీ శ్వాసల పరిమళాన్ని గుర్తుపట్టి..
8686. ఆషాడమైనా ఫరవాలేదనిపిస్తుంది..
శ్రావణమవగానే మన కలలు నిజమవుతాయని..
8687. ఇప్పుడు నిశ్శబ్దాన్ని వినగలుగుతున్నా..
సముద్రపు హోరుని మించిన నీ మౌనంలో నేను..
8688. ఎన్ని మునకలేయాలో నీలో..
ఉదయాస్తమానాలు నన్నే స్మరించాలంటే..
8689. ముగిసిందిలా ఓ రోజు..
ఏ ముచ్చటా తీరకుండానే..
8690. నువ్వెప్పుడూ మదిలోనే..
చూపంచున కన్నీటిబొట్టుగా కరిగేందుకు ఒప్పనుగా..
8691. ఎదురు చూస్తున్నా ఎప్పటినుండో..
మాట మాత్రమైనా కలపకపోతావానని..
8692. కరిమబ్బులో కలిసిపోయా..
కాటుక కోసమైనా నన్ను తలచుకుంటావనే..
8693. నీ ఎదురుచూపులకు ఆనవాళ్ళు..
నాపై ప్రేమకు గీటురాళ్ళు..
8694. అంతులేని భావాలే నావన్నీ..
సరిహద్దులేని ప్రేమ నీవిచ్చాక..
8695. యవ్వనమో సందిగ్ధం..
మనుషులంతా మంచివారనుకొని అలుసయ్యే నమ్మకం..
8696. కన్నుల్లో రక్తస్రావం..
గతంలోకి చూడొద్దని హెచ్చరించినా విననందుకు ఈ ఫలితం..
8697. తీపి సంతకాలే ప్రతిసారీ..
ఎరుపెక్కిన బుగ్గల సాక్షి నీ చూపుల చుంబనాలకి..
8698. నువ్వెప్పుడూ ఇంతే..
మనసు పారేసుకున్నప్పుడల్లా నన్ను అనుమానిస్తూ..
8699. నటనలో అందెవేసిన చెయ్యే..
జీవిత నాటకంలో ఓడిపోయాడంతే..
8700. 

వేకువనే మనసు పులకించింది..
హేమంతం తలపుల్లో తారాడినందుకే..

No comments:

Post a Comment