Tuesday, 7 March 2017

4101 to 4200

4101. చూపుని సవరించుకోవాలందుకే..
ఆ లోపం సృష్టిలోనిది కాదు దృష్టిలోదని తెలుసుకున్నాకైనా..
4102. చుక్క బొట్టు దిద్దుకున్నా..
అలదుకుంది నీ ప్రేమేనని..
4103. పదునెక్కువేగా నా చూపుకి..
దయగా నువ్వు చేరదీసావని..
4104. పదాలెన్ని దాచానో..
మాటగా నిన్నభిషేకించేందుకు..
4105. మైనమెందుకులే మన మధ్య..
వెన్నెలానూ ఉండనే ఉందిగా..
4106. మెరుపుదాడిలా మాటలేమిటో..
మదిలో తన్మయత్వాన్ని తనివితీరా ఆస్వాదిస్తూనే..
4107. సూరేకారమని విసుక్కుంటావే..
మమకారంతో కట్టుకోవాలని నే చూస్తుంటే..
4108. కన్నుల్లో చేరిపోయా..
కనుపాపలా దాచుకుంటావనే..
4109. పట్టపగలని మరచిపోతావేం..
దోమలకు చీకటని చెప్పి ఆహ్వానించినట్టు..
4110. కన్నులు అరవిచ్చినట్లు చేస్తావెందుకు..
కలువలను కుళ్ళుకొనేట్టు చేసేస్తూ..
4111. నేనెప్పుడయ్యానో నీలా..
నీలిస్వప్నాలు అబద్దాలాడుతున్నాయేమో నిన్ను మాయచేస్తూ..
4112. కన్నులు అరనవ్వుతాయంటే నమ్మలేదు..
నీ నిమీలితాలు చూసేవరకూ..
4113. అడుగులో అడుగు కదిపొస్తున్నా..
పల్లవిలో నన్ను పలికావనే..
4114. అంతులేని ఆనందకెరటాలు..
నీ మదిలో ప్రతిబింబాన్ని తిలకించి..
4115. ఆహ్వానం అందకపోతేనేమి..
సంతకానికి సిద్ధపడ్డాయిగా నీ పెదవులు..
4116. వేసవి సరదా తీరిపోయుంటుంది..
హేమంతపు సమీరాన్నలా చుట్టుకొనొస్తుంటే..
4117. ఆ జీవితం ధన్యం..
మరో కంటికి వెలుగైనందుకు..
4118. కన్నుల్లో ఈదులాడొదన్నానందుకే..
అతిగా ఆయాసపడి ఇలా చిక్కిపోతావనే..
4119. గుండెసవ్వడి గమనం మారిందనుకున్నా..
నీదని నిజంగా ఎరుకలేకనే..
4120. కన్నీరొలికిందంటే నమ్మలేకున్నా..
శిలలకు చూపుల తడి తెలుసని కొత్తగా నువ్వంటుంటే..
4121. రెప్పలు మూతబడనివ్వని రాతిరది..
విరహాన్ని తొలిసారిగా పరిచయిస్తూ..
4122. ఆనందవర్ణం పూసుకున్న కన్నీరు..
తీయనిగుబులు నీకై రాలుతుంటే..
4123. చెక్కిలివర్ణాలు పూసుకున్నదేమో కన్నీరు..
జలపాతమై స్మృతులను జారవిడుస్తూ..
4124. ప్రవహించడం మానలేదు జీవితం..
ఎవరెవరి దాహమో తీరలేదని..
4125. పరీక్షించడం మానలేదుగా నువ్వు..
సహజమైన నవ్వులను సందేహిస్తూ..
4126. అలుకలోని కులుకులను గమనించవనుకుంటా..
అనురాగాన్నాలపించే తీరికే లేనట్టు..
4127. నేను కూడా జయించాగా విశ్వాన్ని..
నీ చిన్నిగుండెలో స్థానం నాదయ్యాక..
4128. నువ్వేగా..వలపుని చదవలేని మౌనాక్షరం..
శిల్పాన్ని శిలాగా మార్చిన శూన్యాక్షరం..
4129. అడుగులేద్దామనే అనుకున్నా వాసంతానికి..
హేమంతం చలిపులి అడ్డగించకుంటే..
4130. ఎప్పుడూ కలవరమే నీ తలపులకి..
ఆహ్వానించినా తడబడుతూ నిలబడే చూపులకి..
4131. ఇంతింతై విచ్చుకున్న ఆనందాలు నాలో..
ముద్దబంతిలోని రేకులను లెక్కపెట్టలేనట్లుగా నీలో..
4132. నవరసాలను దాచుకున్నా నా పేరులో..
రేపల్లె దాటి నన్నెతుక్కుంటూ నువ్వొస్తావ
4133. ప్రేమను పెనవేసుకున్నా..
నీకై నిరీక్షణలో క్షణాలను శిక్షించేందుకే.. 
4134. స్థానాన్ని మార్చేసా స్వస్థలానికి ..
శీతాకాలాన్ని భరించలేకుండా ఉన్నానని..
4135. పరవశమవుతున్న పెదవులు..
నిన్ను పలకరించిన ప్రతిసారీ మనసు వశం తప్పుతుంటే..
4136. సేవకులే వారందరూ..
అజ్ఞానవర్తులై నిర్లక్షంగా  రాజకీయాన్ని అనుసరిస్తూ..
4137. చిగురిస్తున్న అక్షరాలు..
కవనమై వసంతాన్ని మరోసారి రాద్దామని..
4138. నీరవమై మిగిలిపోతున్నా..
నీ స్వరాలను ఆలపించలేని మౌనమైపోతూ..
4139. దారితప్పిపోయా నీలోనే..
నన్ను నేనెతుక్కుంటూ
4140. మృత్యుసవాలుని ఎదిరిస్తావనుకున్నా..
నాతో కలిసి జీవించాలనుందంటూ మొరపెట్టుకొని..
4141. అక్షరమై చేరిపోవాలనుంది నీలో..
ఎప్పటికి క్షరమవ్వకుండా మిగిలిపోవాలనే..
4142. విపంచినై ఎదురుచూస్తున్నానిక్కడే..
నువ్వో పాటవై వస్తే రాగమవుదామని..
4143. కలలనూ కప్పుకోవడం మానేసా..
శ్రీగంధాలను మనసుకు పూయట్లేదనే..
4144. చైత్రమై వచ్చేస్తాలే..
నీ రెప్పలవానతో తిరిగి మొలకెత్తుతూ..
4145. ఎక్కడ దొరికిందో నీకీ శూన్యం..
నీకోసమని నేనొస్తుంటే అదోలా వెక్కిరిస్తూ..
4146. కలరవమై వినబడుతున్నా..
కలస్వనమై కూసే అదృష్టం లేదనే..
4147. శిశిరాన్నెందుకు శత్రువు చేస్తావు..
రాలిన అకులసవ్వడి వినిపించి నన్ను రప్పించిందదే కదా..
4148. 
మౌనసముద్రంలో మునిగినట్లుంది..
నదిలా ఉరకలేసొచ్చే నీలో ఉలుకులేదంటే
4149. ..అందరినీ ఆదరిస్తున్నా..
అయినవారిని తప్ప..
4150. ప్రభాతంలో చేరానందుకే..
ప్రేమగీతమై వినబడి నిన్ను మేల్కొల్పాలనే..
4151. బాధ్యతలు తెలిసొచ్చిన సమయమది..
నీ అస్తిత్వాన్ని నిలబెడుతూ..
4152. కాలమెంత విషాదమో..
పాటకట్టిన ఆవేదనను నిర్జనంలో పాడుకుంటూ..
4153. నిరీక్షణా అమృతపానమేగా..
వేచేది నీకోసమైతే..
4154. రాతిరికలను పూర్తిచేస్తూ నీవు..
పగటికలకు సిద్ధమవుతూ నేను..
4155. ప్రసాంతంగా నిద్రపోతాడని కాబోలు..
ఒక్కనోటున్నా దానిపై గాంధీ నవ్వే బోసినవ్వును చూసి..
4156. నిన్న నేడవుతుంటే అలానే అనిపిస్తుందేమో..
దేశానికేదైనా చేసి విశ్రాంతి తీసుకోవాలని..
4157. ఏ యుద్ధమూ వ్యర్ధం కాదు..
నాగరికత పుట్టుకలో అపాయాలెన్ని ఎదుర్కున్నా..
4158. అభినేత్రిగా నేనోడిపోతున్నా..
జీవితంలో నటించి మెప్పించడం చేతకాక..
4159. ఒక భావమేగా మిగిలింది..
ఆత్మలు రెండు ముడిపడ్డాక..
4160. నన్ను మరచిపోతూ నేను..
నిన్ను దాచుకుంటూ నువ్వు..
4161. ఒదిగిపోయిన మనసొకటి..
హేమంతమై నువ్వు గిలి పెట్టిస్తుంటే..
4162. మమేకమైపోనా..
ఆనందం వ్యాకోచించి నిన్ను హత్తుకోమంటే..
4163. ఊపిరందని శ్వాసలు..
ప్రేమసంగమంలో దారి తెలియక కొట్టుకుపోతూ..
4164. కాలమాగితే బాగుండనిపిస్తోంది..
ప్రణయాన్ని పూర్తిగా తాగేసి దాహం లేకుండా చేసుకోవాలని..
4165. ప్రేమరాగాన్ని ఆవిష్కరిస్తున్న సమీరం..
నీ విరహాన్ని విన్నవించాలనేమో..
4166. సగపాలకు వేళెక్కడయ్యిందని..
సరాగాన్ని సరసకంపావు..
4167. అడక్కుండానే చేసావుగా చొరబాటు..
కాదని బుకాయిస్తావే పొరపాటు..
4168. ఊసులాడటం మానేయకు...
ఊయలూపుతుంది నేనేకదానని..
4169. చైతన్యం మందగించిందందుకే..
విద్యార్ధులు పావులుగా చదరంగంలో మునిగిపోతుంటే..
4170. ఊపిరందింది నీతోనేగా..
చిగురాకును కప్పుకున్న ప్రకృతిలా పులకించినట్లు..
4171. వెన్నెల ఊగుతున్నప్పుడే అనుకున్నా..
నీ మాటలతో మైకమిచ్చుంటావని..
4172. కాలానికి రేపంటే ఆశెక్కువే..
చీకటినిశ్శబ్దం వెలుతురై రవళిస్తుందని..
4173. 
అంతిమ సంస్కారాలే ఆఖరి మజిలీలు..
సంస్కారం తెలియని కొన్ని స్నేహాలకి
4174. మోహనమే నీ రాగం..
విరహంలోనూ నన్ను హత్తుకుంటుంటే..
4175. ఏవీ నిజం కాదు..
ఈ స్వప్నాలు..హృదయ దొంగతనాలూ..విరహ వేదనలూ..
4176.బాటసారిగానే వచ్చాడనుకున్నాను..
మనోవనంలో శాశ్వతంగా పొదరిల్లు కట్టుకొనేవరకూ..
4178. అనేకమై ఆనందిస్తున్నా..
నా ఊసులొక్కొక్కటిగా నువ్వు దాచుకుంటుంటే..
4179. మిక్కుటమయ్యిందిగా మోహం..
హృది ప్రవాహపు ఆర్తి తీరిపోయాక..
4180. కవిత్వమే తనివి తీరని దాహం..
అక్షారాలు మాత్రమే తీర్చగలిగే మోహం..
4181. నీ మనసెంత గడుసుదో..
నవ్వితేగానీ నాకు తాళమేయకుండా..
4182. అహరహం తలవమన్నా నన్నే..
అప్రమేయానందం నీకు పంచివ్వాలనే..
4183. వియ్యమొందలేను నేను..
నీ నొప్పులకు లేపనంగా మారిపోమంటే..
4184. భావాలవేదికలో కలిసినందుకేమో..
అనుభూతి ప్రవహించడం అవగతమవుతూ నీలో..
4185. గతాన్ని బ్రతికించాలనుంది..
భవిష్యత్తులోనూ నేనే నీ ఊసవ్వాలని..
4186. మనమైన హేమంతాలివే..
శీతలాన్ని తరిమేసిన వెచ్చని చెలిమిలో..
4187. ఎప్పుడూ ఓడిపోయాననుకుంటావే..
నా గెలుపును నీదిగా చేసుకోక..
4188. మనసిచ్చాక తప్పదనుకున్నా..
బాధ్యతలే కాక భావాలూ ఏకమవ్వాలని..
4189. చైత్రమై మిగలాలనుకున్నా..
ఎదురుచూసే కన్నులకు నిత్యవసంతమై ఉండిపోవాలనే
4190. నీ ప్రేమను తట్టుకోలేకనేగా..
మౌనవించింది నా హృదయం..
4191. ఎప్పటికీ పుట్టని క్షణాలు కొన్ని..
మనసులో ఆనాడే కృశించి సమాధయినందుకేమో..
4192. చూడలేకున్నా నీ కన్నుల్లోకి..
చిరునవ్వులకే చచ్చిపోతానని భయమేస్తుంటే..
4193. నృత్యం చేస్తున్న నిశ్శబ్దాలు నలువైపులా..
కోటిశబ్దాలు చేధించలేని మౌనం ఘనీభవిస్తుంటే..
4194. కన్నీటిని మింగడం నేర్చుకున్న మౌనం..
కన్నులు హృదయాన్ని రాల్చేస్తాయని తెలీక..
4195. ఆనందం హరివిల్లే..
సప్తరంగులూ సప్తస్వరాలై అనుబంధాన్ని వెలిగిస్తే..
4196. విషాదంలోనూ ఆనందమే..
నీ మౌనంలోని విరహం నేనైతే..
4197. గాలులు ఈలలు వేస్తున్న సవ్వళ్ళు..
నీ తలపులు గలగలమంటుంటే నాలో..
4198. మనసెప్పుడూ నిజమే చెప్తుంది..
నన్నువీడి మనలేవు నువ్వని..
4199. మదిలో రూపం గమనించానప్పుడే..
నువ్వెనక్కి తిరిగి నవ్వినప్పుడే..
4200. తిలోదకాలు మనకొద్దులే..
ఒకరి ప్రేమలో ఒకరం ఒదిగున్నప్పుడు..

This email has been sent from a virus-free computer protected by Avast. 
www.avast.com

No comments:

Post a Comment