Tuesday, 7 March 2017

4501 to 4600

4501. ఊహలవలేసింది నువ్వేగా..
హృదితంత్రులనూరించి ఉరకలేస్తావెందుకలా..
4502. తప్పని తాత్వికంలో మది..
నువ్విలా ఉద్వేగంతో చంపేస్తుంటే
4503. ఒంటరితనమయ్యింది మరి..
హేమంతమొచ్చి మనసులో మౌనాన్ని రెచ్చగొడుతుంటే..
4504. మనసులన్నీ కృత్రిమత్వమే..
నటించడమన్నది తప్పకపోతుంటే..
4505. పరిమళాల నవ్వులెన్నో విరబూసేసా..
మధుపమై నువ్వొస్తావని తెలియక..
4506. కష్టాల కడలిలో ఉన్నానని మరచిపోతున్నా..
ఈది గెలవాలనే సంకల్పమొకటి హెచ్చుతుంటే..
4507. ప్రతికన్నీటికో వ్యధ ఉందనిపించింది..
విషాదం జలపాతమై నేలరాలుతూంటే..
4508. 
మనసెండిన కధలే కొన్ని..
రాయలేనని కలమే కన్నీరవుతుంటే..
4509. గాలమేసింది ప్రేమ..
గాలిలో తేలుతూ నిన్ను తాకిపోవాలని..
4510. కీరవాణినాలపిస్తోంది గుండె..
నిన్ను పొగడాలంటే రాగమొకటి కావాలని..
4511. వెన్నెలచారలైతే నావే..
నీ మనసు వెలిగినంత మేరా..
4512. ముళ్ళై గుచ్చుతున్న రహదారులు..
 గులాబీలు ముందున్నాయని సంకేతమిస్తూ..
4513. అహంకారం వేసే అడుగులే అన్నీ..
అధఃపాతాళానికి దారి వేసి చెడగొడుతూ..
4514. గాడ్పుగా మార్చేసా నిట్టూర్పుని..
నీకు ఓదార్పు నేనవ్వాలనే..
4515.అవకాశావాదం రాజ్యమేలుతోంది..
వారసత్వాలు పీఠమెక్కుతుంటే
4516.  రేపటికి తీసుకుపోవాలనుంది..
నీ గతమేదైనా నాకనవసరమని భావిస్తూ..
4517. నా తలపులు శీతలాలే..
నీ హృదయానికి మధురభావనవుతూ..
4518. మరకత మొలకలే మదిలో..
ఆశలు కొంతపుంతలు తొక్కుతుంటే..
4519. అస్పష్టమవుతున్న పేజీలు..
చరిత్రను తిరగరాయలని దిద్దిన సాహసానికేమో..
4520. మనసెందుకు మొగ్గయ్యిందో..
నీ చూపులకి పెదవులు విరబూస్తుంటే..
4521. మనోకలల గిరికీలు..
పునరావృత్తమైన ప్రేమలో నిజాయితీని పరీక్షిస్తూ..
4522. పుట్టుకతో వచ్చిన పొగరేమోనది..
నీ స్నేహంతో వన్నెకెక్కిందని..
4523. ప్రేమెప్పుడూ నాలో సజీవమే..
పరీక్షిస్తున్నా నీలోని నిజాయితీని..
4524. శంకరుడ్ని చూసి నేర్వమన్నానందుకే..
తనువులో సగభాగమివ్వడం చేతకాలేదనే..
4525. తిమింగలమై ఆడుకుంటున్నావనుకున్నా..
సముద్రం దాటి చెరువుని చేరావని ఎరుకలేని పిచ్చితనంలో..
4526. నువ్వు లేనప్పుడు నేనంతేగా..
మంచుతో బరువెక్కిన పువ్వులా..
4527. జీవితంలో తప్పని ఎదురీతలు కొన్ని..
మధురీతలను మరగుపరచి హృదిని నలిపేస్తూ..
4528. నీతోనే నేను..
వెన్నెలైనా...చీకటైనా..
4529. అక్షరమే అనుభూతి..
అక్షయమయ్యే ఆనందపు అలల అయష్కాంతి..
4530. కాగితమూ చెమరిస్తోంది..
కలం కక్కే కన్నీటిని పీల్చుకోలేక..
4531. ఉండిపోవాలనుందక్కడే..
నిత్యధూపాలతో నైవేద్యాలను నివేదిస్తుంటే నీ మదికోవెలలో.. 
4532. ఆగిపోయిందక్కడే ప్రేమ..
హృదయాలు శిధిలల్లో ముక్కలై పడుంటే..
4533. జన్మనిచ్చావెందుకో మరి ఊహలకు..
ఒడి పంచలేనని నెట్టేస్తూ..
4534. ఆకాశమంత పందిరేసా...
మల్లెలెగిరి కవ్వించాయనే..
4535. నడక నేర్వాలందుకే..
నలుగురికైనా సరైన దారొకటి చూపాలంటే..
4536. తామరాకునే నేను..
బిందువై నిలబడ్డా నిన్ను అంటుకోలేనందుకు...
4537. తడియారని వలపులే..
నన్ను గెలిపించిన నీ తపనలు..
4538. నిప్పుతో పోల్చుతావెందుకో ప్రేమను..
మనసును చేరి కాల్చకుండానే..
4539. అందని ద్రాక్షే పరిపూర్ణత్వం..
మనసు నేలచూపులతోనే సరిపెట్టుకుంటే..
4540. కలంలో కన్నీరు నింపొద్దన్నాను..
కాగితం రాసేందుకు ఒప్పుకోదనే..
4541. 

రెక్కలు చిద్రుపలైనందుకేనేమో..
ఎగిరే పావురం అక్షరమై కూర్చుండిపోయింది..
4542. 
కాగితామెంత ఉపశమనమో..
వేదనాభరిత హృదయాలను ఆత్మీయమై హత్తుకుంటూ
4543. ఆకాశమంతా శూన్యమే..
నక్షత్రాలన్నీ కోరికలు తీర్చేందుకు రాలిపోతుంటే..
4544. నీ మురళి గీతిక నేనైనందుకేమో..
ఊరొక బృందావనమై పెనవేస్తూ నిన్నిలా..
4545. నీ మురళి గీతిక నేనైనందుకేమో..
ఊరొక బృందావనమై పెనవేస్తూ నిన్నిలా..
4546. వెతుకుతూనే ఉన్నా..
అందెలు రవళించని రాగమేదైనా ఉందేమోనని..
4547. కలల్ని నిషేధించా..
కనే ఓపికలేదని కన్నులు మొత్తుకుంటుంటే
4548. 
కలల్ని నిషేధించా..
ఊరింతలే తప్ప వాస్తవం కావట్లేదని
4549. మరొక్క పక్షమాగమంటున్నా..
మాఘమాస వెన్నెల వెచ్చదనాలు చూడొచ్చని..
4550. మారుతున్న ప్రేమలు..
నా హృదయం నుంచీ నీ హృదయాన్ని చేరిపోతూ..
4551. మనసుపెట్టి పలుకుతున్న పెదాలు..
నీ పేరుగా బయటకొచ్చిందేమో..
4552. చిక్కువీడిన మనసు..
నీ అలోచనలో నేనున్నాననే ఆనందంలో..
4553. పచ్చని మొలకలు కని ఆనందించా..
నీ కన్నీటితో చిగురించినవని తెలియక..
4554. నిజమో నిష్ఠూరమే..
అబద్దాలే నిజమనుకొనే అపభ్రంశ హృదయాలకి..
4555. వైద్యానికి పనికిరాని పెరటిమొక్కలు..
ఇతరులకు దివ్యంగా పనికొస్తూ..
4556. మిణుగురులై వెలుగుతున్న ఆశలు..
చిరుదీపమూ నట్టింట లేకుంటే..
4557. ఏడనుకున్న స్వరాలే..
నిన్ను చేరి కోటిరాగాలకు పడగలెత్తుతూ..
4558. ఆనందాలెప్పుడూ మనవే..
మనసుపై ఇతరులకు  పెత్తనం ఇవ్వకుంటే..
4559. కలల్ని నిషేధించా..
భావాలను వెలివేసి మౌనంలో విశ్రమించాలనే..
4560. ప్రేమవిల్లు విరబూసిన సాయంత్రమిది..
మదిలోని తేనెజల్లుకు అనుసంధానమవుతూ..
4561. నిరీక్షణ శమించే సమయమొచ్చింది..
శుభశకునమై నువ్వు విచ్చేయగానే
4562. చెమరింతలయ్యాయి చెక్కిలిగింతలన్నీ..
నీ వలపుసైగలు మనసు అనువదించుకుంటుంటే..
4563. కిరణమై ఉండిపోమన్నా..
ఉదయమైనా సాయంసంధ్యలకైనా వెలుగు నువ్వవ్వాలనే..
4564. నాకు తెలియని నోమునెప్పుడు నోచావో..
అనుకోని మలుపై మాలికల్లో ఎదురైనట్లు..
4565. చెమరింపంతా రాసిన నీ హృదయానిదేగా..
భావాలకు అమృతమద్ది మైమరపులో ముంచేస్తూ..
4566. హద్దులేని ఆప్యాయతలే..
అపాయమివ్వలేని దీవెనలు..
4567. జ్ఞాపకాలకెన్ని పరవళ్ళో..
నీ తలపులలోగిళ్ళలో కలదిరిగొద్దామని పిలిస్తే..
4568. పరిమళాల పూదోటలెన్నో ఎదలో..
ప్రేమరాగాన్ని నేర్వాలనుకొనే హృదయానికి..
4569. పెదవులకిచ్చేసా ప్రేమనంతా..
నవ్వినప్పుడల్లా నీకు అనుభూతిని పంచుతాయనే..
4570. చెక్కిలిగింతలిస్తావెందుకో చెక్కిళ్ళకు..
చేమంతపు చలిగింతలు చేజారి చైత్రమొస్తున్నా..
4571. మనసులోని మర్మమును తెలుసుకోవెందుకో..
మట్టిబుర్రవని ఎన్ని సూచనలిచ్చినా..
4572. హృదయానికి చెముడొచ్చినట్లుంది..
పిలిచేది మన్మధుడైతేనే తాను పలుకుతానంటూ..
4573. అడుగులు ఏడింకా మిగిలే ఉన్నవి..
ఈ జన్మకీ నేను నువ్వవ్వాలంటే..
4574. సన్నగా మొదలవుతున్న నీ జ్ఞాపకాలు..
అకాల సమయంలో ఆనందాలు కురిపిస్తూ..
4575. మరుమల్లెలకూ కాలం లేదంది..
మధురోహలు మనసైన మదిలోనికి..
4576. జీవనమంతా వెలుతురే..
మేలిమి మెరుపై ఇంటికి దీపమవుతుంటే..
4577. ఆస్వాదనలే ఎదలో..
పెదవుల్లో తీపులన్నీ నన్నే తడిపిపోతుంటే..
4578. నిన్నటిదాకా పచ్చని తోరణాలే..
శిశిరచూపులకి మండి రాలినవేమో..
4579. పరవశధూపం తాకినప్పుడే అనుకున్నా..
మేల్కొల్పేందుకు కన్నులకు ఎదురయ్యుంటావని..
4580. 
సుస్వరపుష్పమై విరబూసేసా..
నీ అర్చనకు వేరే పువ్వులెందుకని.
4581. పండిపోయిన పసిడి తలపులు..
నీ పలుకుల వెచ్చదనాలకే..
4582. అవగతం కాని గతమిప్పుడెందుకులే..
నిశీధిలో నిరాశ అంటుకోగలదు..
4583. అయినవారే బల్లాలు..
అనుభవాలన్నీ వారికి పంచుకుంటూ పోతే..
4584. ప్రేమెప్పుడూ అద్వైతమే..
ప్రేమించేవారికి ప్రేమ విలువ తెలియాలంతే..
4585. అష్టపది కోసం కాచుకున్నా..
నన్ను పాడితే ఆలకిద్దామని..
4586. నీ చూపు మైమరపు చాలు..
నా అందాలు గంధాలను వెదజల్లేందుకు..
4587. వలపుల పతాకమది..
నిన్ను గెలిపించి నేను ఎగరేస్తూ..
4588. వెన్నెల మాట్లాడినట్లుంది..
నా నవ్వులు నీ హృదయ వీధుల్లో వినబడ్డాయంటుంటే..
4589. వాలుపొద్దంతా పాలపుంతలే..
నీ బహురెక్కల్లో నన్ను పొదుపుకున్నాక..
4590. అబిమానమూ సంకెలే..
స్వాతంత్ర్యం లేని బానిస జీవితానికి..
4591. రాలుగాయి రాగమూ నచ్చేసింది..
నిన్ను తాకిన గాలి నన్ను మౌనగీతమై అలరించగానే..
4592. హద్దులెరుగని ఆనందతీరాలనడుగు..
రాజయోగం కలసిన మనసులదేనని చెప్తుంది..
4593. అనుభవాలన్నీ కొట్టుకుపోయాయి..
జ్ఞాపకాల అలజడి మనసుకి తీరకుండానే..
4594. పరాజితనైపోయా..
నీ చూపుల యుద్దంలో కన్నులు వాల్చేసి..
4595. కందువ కోరడమే..
మక్కువ మీరిపోతే..
4596. నిశ్శబ్దంలో నిలబడిపోయిన స్వరాలు కొన్ని..
ఆకులురాలే కాలానికి అతిధులు కాలేమంటూ..
4597. ఆనందాలే అనవరతం..
అనుభూతులు వెల్లువయ్యే మన ఆలింగనములో..
4598. మాపుల్లోకి జారిపోయిన సరదాలు కొన్ని..
ప్రత్యుషానికి తీరిక చేసుకోలేని యాంత్రికంలో..
4599. జీవితమే మిధ్యగా మిగిలింది..
వీడని చిక్కుముళ్ళ బంధాలతో..
4600. కాలానికి పరిచయవాక్యమేముంది..
అనుభవాల బరువుకి రోజులు కుంగిపోతుంటే..
This email has been sent from a virus-free computer protected by Avast. 
www.avast.com

No comments:

Post a Comment