Tuesday, 7 March 2017

5801 to 5900

5801. పెదాల తీపేననుకుంట..
పదాలను చేరి ముత్యాలు కూర్చింది
5802. పున్నాగువే నీవు..
ప్రేమానురాగాలతో పెనవేస్తూ..
5803. పెదాలదెంత వియోగమో..
యోగం లేని మధురక్షణాలకు తపించిపోతూ..
5804. గెలుపుల నాదమే..
గుడిగంటై నీ గుండెలో వినిపిస్తూ..
5805. శిలనే అనుకున్నా..
నీ ఎదలో కొలువుంచి పూజించేవరకూ
5806. హృదయం నవ్వుకుంది..
నీ పూజకు పువ్వై కూర్చినందుకే
5807. భావం కాని రాగమేది..
నీ కవనంలో నేననుభూతినయ్యాక..
5808. వెలిగింది నా మోము..
అనురాగాన్ని నువ్వు గెలిపించాకనే..
5809. ప్రేమగీతాలన్నీ నీవేగా..
తాళమై నేనొస్తానంటే
5810. పున్నమింక పోనేపోదు..
బృందావనంలోనే మనముంటామంటే..
5811. వనదేవతనేగా..
వసంతమై నువు రమ్మంటే
5812. హృదయాన్ని మెలిపెట్టకలా..
నడిరేయి సూర్యోదయమయ్యేలా..
5813. వెన్నెలకేం అక్కర్లేదేమో..
వయసుంటే వలపుని గెలిపించాలని చూస్తుందేమో..
5814. కన్నులకు వరదలే..
ఆనందభాష్పాలు నీటి పుష్పాలై రాలుతుంటే
5815. మనసంతా పూలవనం..
నిన్ను తలచిన క్షణాలన్నీ పూలవుతుంటే
5816. నేనేగా నిశ్శబ్దం..
నీ రాతిరికి అందమైన ముగింపునైతే
5817. మధువంతా మోహనరాగం..
మనసైతే కదనకుతూహలం..
5818. ఎందుకంత వియోగమో..
రెప్పల బరువులో రూపం నాదవుతున్నా..
5819. ఆకర్షణలోనే ఆగిపోయా..
అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ..
5820. రెప్పల విహంగాలు..
నిన్ను దాచుకున్న హృదయం ఆకాశమైనందుకే
5821. పెదవులప్పుడు విరజాజులే..
నీ పలుకులకే మధువులై విరిసినప్పుడు..
5822. పులకింతల పదఝరులే..
నీ రాకతో హృదయం కరిగిపోతుంటే..
5823. ఆవేదనెలా అంకురించిందో..
దిగులు విత్తనాలేవీ నాటిన గుర్తులేదు..
5824. అన్నీ తెలుసనుకుంటాడు మనిషి..
ఆత్మవంచనను మదిలో దాచేస్తూ..
5825. కలనైనా వద్దామనుకున్నా..
పగలైనా కళ్ళంటూ నువ్వు మూసుకుంటే..
5826. మౌనాన్ని గెలిచేసా..
మరపురాని మాటలన్నీ మదిలోనే మింగేసి..
5827. మౌనం తప్ప ఏం మిగిలిందని..
ఆనందమంతా కాలపు రెక్కలేసుకొని ఎగిరిపోయాక..
5828. వెన్నెల కరిగిపోయింది..
నీ స్మృతులోని నన్నోదార్చలేక ఓడిపోయి.
5829. మోయలేని హాయిలే రేయంతా..
వెన్నెల పరిమళానికే వివశమైనట్టు..
5830. ఇంకెక్కడి జ్ఞాపకం..
నశించిపోయిన దేహం సమాధిలో చేరిపోయాక
5831. కన్నుల్లోనే నిలిచిపోయా..
చూపుల మాయలో వేసవిని తరుముకుంటూ..
5832. అబద్దాలే నిజమనుకున్నా..
నీ అల్లరిలో అయిష్టం ఎక్కువైందనే..
5833. తరలిపోతున్న వసంతాలు..
మనసులో మరకలన్నీ పెదవులు  బయటేస్తుంటే..
5834. వెన్నెలవుతున్న భావాలు నాలో..
మౌనాన్ని వెతుకుతున్నావేమో నువ్వని..
5835. ప్రేమను గుర్తించలేకపోయా..
పదేపదే మనసు ఆకర్షణలోనే కొట్టుకుపోతుంటే..
5836. అక్షరమెప్పుడూ అంతే..
మల్లెతీవెలా అల్లుకుపోయి మనసును కట్టేస్తుంది..
5837. కలకాలం చైత్రమైపోవాలనుంది..
వసంతానికై నువ్వెదురు చూస్తున్నావని తెలిసాక..
5838. ఆనందం జాస్తయ్యింది..
నీ తలపుల ఆస్థి నేనయ్యాననే..
5839. వసంతహేలంటే ఇదేనేమో..
మనసు మయూరమై ప్రణయంలో నర్తిస్తూ..
5840. కొన్ని సంకలనాలను మార్చలేమెందుకో..
స్నేహం సరిహద్దులు దాటి సహనానికి పరీక్ష ఎదురవుతున్నా..
5841. నిరీక్షణనే నీరుని పోశాను..
నాపై విశ్వాసం మొలకెత్తాలనేగా..
5842. కలలోనే అనురాగం..
వాస్తవంలో జీవంలేని మోహంతో మెలుగుతూ..
5843. కళ్ళతోనే నవ్వుతున్నా..
నీ మదిని ప్రేమగా పలకరించాలని..
5844. ఒంటరితనమే చుట్టమయ్యింది..
నిన్ను వెతికే దారిలో తోడుందని..
5845. ఎక్కడున్నావోనని వెతుకుతున్నా..
కంపిస్తున్న నీ జ్ఞాపకాలను తడుముకోక..
5846. విరహం వదలనంటోంది..
నీ నిరీక్షణలో హృదయం బరువెక్కుతుంటే
5847. ఆకలి చేసిన ఆర్తనాదమేనది..
దేహపు ఒత్తిడిని తట్టుకోలేక..
5848. రోజులన్నీ యుగాలవుతున్నాయి..
ముడుచుకున్న మనసులోని పరిమళాన్ని వెతికేలోపునే..
5849. హరివిల్లులోని రంగులెంతగా తడబడ్డాయో..
జీవితంలో నటిస్తున్న వారి ఆహార్యంలోని వైవిధ్యాన్ని చూసి..
5850. ఒకే భావం మెదులుతోంది మదిలో..
మీ ప్రణయం పదికాలాలిలానే వర్ధిల్లాలని..
5851. ఒకటేగా ప్రదక్షిణ..
నీ గుండె నుంచీ నా హృదయం వరకూ..
5852. మౌనమెప్పుడూ మంచిదే..
జీవితంలో స్పందించే మనసొకటి కరువైతే
5853. ఇంగితం లేని మనసది..
గతపు అనురక్తిలోనే ఇరుకైపోతూ..
5854. మది సంతోషమవుతోంది..
కురిసే జల్లులోనూ నన్నే తిలకించావని..
5855. ఎగిరొచ్చిన జ్ఞాపకమేమో..
కరిగిపోయిన సంధ్యల్లో తళ్ళుక్కుమని మెరుస్తూ..
5856. నేనెప్పుడూ నీతోనే ఉన్నా..
నీలోని విశ్వాసాన్ని తడుముకోగలిగితే
5857. నెమలికన్నులు నావేలే..
మెత్తదనాలు నీకు పంచడం నిజమైతే
5858. ప్రవహించమని అడిగితే తప్పేముంది..
శూన్యాన్ని ముసుగేసుకు కూర్చున్నావనేగా..
5859. అంతులేని వేదనెందుకో..
ప్రణయాన్ని మకుటం చేసి అలంకరిస్తున్నా..
5860. మౌనం పిల్లిమొగ్గలేస్తోంది..
మనసు మాట వినకుండా ఉందనే..
5861. చిరునవ్వుల గలగలలే మరి..
ముత్యాల వసంతాన్ని తలపిస్తూ నా మువ్వలు మోగుతుంటే..
5862. చిలిపి మువ్వలు మోగిస్తోంది హృదయం..
ఏ కమనీయ కదలికలు గుర్తొచ్చినందుకో..
5863. కంపిస్తున్న మువ్వలు..
అలుకను పోగొట్టే మంత్రాన్ని అన్వేషిస్తూ..
5864. వేసారుతున్న నవ్వులు..
కలలోనూ మౌనవించిన నిన్ను చూసి..
5865. రేపటికై నా పరుగులు..
మువ్వలు నిలవలేనని అంటుంటే..
5866.  మువ్వలకెన్ని పరవశాలో..
నీ మనసు మల్లై నా పాదాలని పెనవేసుకుంటుంటే..
5867. వెచ్చబడ్డ మువ్వలు..
నీ ఆలింగనపు సెగలేమాత్రం అంటినవో..
5868. మువ్వలకెప్పుడూ పరితాపమేగా..
దివారాత్రులు విషాదాన్ని మనసులో మోస్తుంటే..
5869. మురిపించే మువ్వలకి మైకమవుతోంది..
నీ మగసిరితో అడుగు కలిపి కదలమని నువ్వంటుంటే..
5870. మయూరాలూ..మువ్వలూ ఏకమైనందుకేమో..
తలపుల్లో తుంటరితనం తాండవిస్తోంది..
5871. వేదనాతీతమైన భావాలెన్నో..
అడుగడుగునా గాయపడుతున్న  మువ్వల సవ్వళ్ళలో..
5872. కన్నులకెందుకన్ని శోకాలో..
మురిపించవలసిన మువ్వలు మౌనంలో కూరుకుంటుంటే..
5873. ఒంటరినై నర్తించలేనిక..
ఏకాకితనపు ఆవేదనలో..
5874. మువ్వలు దొంగిలించినవేమో నా నవ్వులు..
నీ మనసుకు దగ్గర కావాలని..
5875. మువ్వగానైనా మిగిలిపోలేనా..
నీ నిశ్శబ్ద స్మృతులలో చేరదీస్తానంటే..
5876. మువ్వలవుతున్న అక్షరాలు..
కవితగా నిన్ను రాద్దామని పిలిచినప్పుడల్లా..
5877. అడుగడుక్కీ గమకాలే..
తమకం ఆపుకోలేని మువ్వల గుసగుసలతో..
5878. నీ గుండెసవ్వడెలా పసిగట్టిందో..
మౌనమొకటి మువ్వై మోగింది..
5879. మాటలా..ముత్యాల రాశులా..
వెన్నెలే మౌనంతో మత్తెక్కినట్టు..
5880. సమ్మోహనమే మది..
మురిపాల భావాలన్నింటిలో నిన్నే కూర్చుకుంటుంటే..
5881. నీ హృదయాలాపనలే..
నాకు చైతన్యమిచ్చే అపూర్వమైన క్షణాలు..
5882. బొమ్మగా మారిపోలేనా..
అందంలో నన్ను అలరించేలా చేస్తావంటే..
5883. మళ్ళీ ప్రేమ మొదలయ్యింది..
వికర్షించే కొద్దీ నువ్వాకర్షిస్తుంటే..
5884. సందేశాలు పెరగాలి..
గాలి సైతం మద్దతిచ్చి చేరువవుతుంటే
5885. ప్రేమకి చిరునామా నువ్వేనని తెలుసుకున్నా..
భరించలేని జ్ఞాపకమై నన్ను వెంటాడుతుంటే..
5886. నిద్దురపుచ్చేసా ప్రపంచాన్ని..
నీ వెంటే ఆవృత్తమై తిరగాలని..
5887. వెన్నెలవుతున్న రాత్రులు..
ఆమాసను కాదని ఆకాశాన్ని వెలిగిస్తూ..
5888. విస్తుపోతున్న ఆనందాలు..
అక్షరాలతోనే నవ్వుకుంటుంటే..
5889. కవిత రాస్తానన్నందుకేగా..
నవ్వు గువ్వై నిన్నే చేరింది..
5890. అర్ధాలెతకడం మానేసాను..
సంతోషాలనే సరిపుచ్చుకుంటూ..
5891. నా కంటిబొట్టు ముత్యమై మెరిసింది..
నీవున్న హృదయాన్ని ఆనందంగా తడుముకుంటూ..
5892. వానకారు కోయిలను వెతుకుతున్న..
మేఘసందేశమేదైనా త్వరలో మోసుకొస్తుందేమోనని..
5893. నమ్మకం కుదిరిందిలే..
నా ప్రేమ నీ దగ్గర భద్రమని నువ్వనగానే..
5894. వర్ణాలను గమనించాలనుకోలా ఇంద్రధనస్సులో..
నీ చూపులో నాపై ప్రేమను మాత్రమే చూడాలనుకున్నా..
5895. ఊపిరి పోసుకున్నట్లుంది..
కాసేపు నీ మౌనంలో సేదతీరుతుంటే..
5896. మనసంతా పచ్చనయ్యింది..
ప్రకృతిలా స్వచ్ఛమైన కనులను తిలకించి..
5897. కాలాన్ని సమాధానంగా మార్చుకోవాలి..
మందేసే మనసు దూరమైనందుకైనా..
5898. మరోసారి గెలవాలనుకున్నా..
నీ చూపుల కోలాటంలో ఓడిపోకుండా..
5899. వలపు హెచ్చించడం నిజమే..
నీ మనసంతా నాదయ్యాక.. 
5900. ప్రపంచమైతే నువ్వేగా..
ఒడిలో నువ్వొదిగే ఏ వేళనైనా..
Virus-free. www.avast.com

No comments:

Post a Comment