Tuesday, 7 March 2017

6901 to 7000

6901. నా మందహాసాలన్నీ మధుర సంగీతాలే..
నీ ఊహాగానాలకి నేనూపిరైన వేళ..
6902. వెన్నెలాక్షరాలేగా నీవి..
భావాలకు సైతం పులకింతల గంధాలద్దేస్తూ..
6903. ఆపేక్షెంత దాచుకున్నావో..
నన్ను పొగిడి నువ్వు పరిమళించేందుకు..
6904. మనసంత మధువనమే నువ్వు..
ఊహల వసంతం సాక్షిగా..
6905. మధుస్పర్శంతా నాదేగా..
చిరునవ్వుతో నిన్ను పరామర్శించు స్వప్నాలలో..
6906. బాధలతోనే కప్పబడ్డ హృదయాలెన్నో..
మేఘాలమాటు దాగిఉన్న నక్షత్రాల్లా..
6907. పరిమళమై వీస్తున్నా..
ప్రణయమై రమ్మనే నీ ఒక్క పిలుపు కోసమే..
6908. మొదలయ్యిందిప్పుడే..
జీవిత పోరాటంలో లక్ష్యాన్ని సాధించేందుకు..
6909. స్వప్నాలతోనే తెల్లారిపోతుందేమో జీవితం..
రేపు బాగుండొచ్చనే ఆత్మవంచనతో..
6910. మౌనవించడం నేర్చుకుంది మనసు..
అనుభూతులు జ్ఞాపకాలై మిగిలాక..
6911. కలలనెందుకు హత్య చేసావో..
ఒక్కటీ నిజం కాలేదని..
6912. నిన్ననే కలగన్నా..
మనసంతా మనమై ఒకరికొకరం అయినట్లు..
6913. ఆనందమయమే జీవితం..
నీ వలపును సంగీతముగా పంచినందుకు
6914. మనసిప్పుడే నిద్రలేస్తుంది..
నీ ప్రపంచంలోనికి నన్ను ఆహ్వానించినందుకే..
6915. గ్రీష్మంతో కలబడతావెందుకో..
ఉక్కబోతంటూనే కలలోనూ విరహన్నే ఊహిస్తూ..
6916. నక్షత్రాలే అక్షరాలిక్కడ..
శరత్కాలపు వెన్నెలను మాలికలే వెదజల్లుతూ..
6917. నీరుకారుతూనే నీ హృదయం..
ఆశల దాహమెన్నటికీ తీరలేదంటూ..
6918. ప్రేమమంత్రమెక్కడ నేర్చావో..
ఆమడదూరానుంటూనే నా హృదయాన్ని వశీకరిస్తూ..
6919. వానలు కురవాలంట వారికి..
ఉరుములు మెరుపులు లేకుండానే..
6920. మనసు చిత్తడవుతోంది..
చినుకు జోలకి వలపు కరుగుతుంటే..
6921. సమాధైన నవ్వులెన్నో..
చెక్కిలి గుంటల కదలికల సాక్షిగా
6922. చంచలిస్తున్న హృదయం..
ప్రేమించిన స్పందనొకటి  తీయని బాధావుతుంటే..
6923. మనసు నైజమేనది..
నిరంకుశాన్ని భరిస్తూనే బాధలంటూ విసిగిపోవడం..
6924. ఆవిరంతా నువ్వు పంచిందే..
నీ ఊపిరిని ఊహించుకోగానే..
6925. బృందావనం దూరమయ్యింది..
జీవన స్మృతిలోని మొక్కలు వాడిపోయాక..
6926. నిన్ను నన్నూ కలిపిన జ్ఞాపకమొకటి..
వికసించిన అనుభూతిలోని మంజుల సౌరభం..
6927. కురిపిస్తా నేనొచ్చి..
చివరి చుక్కని ఆనందభాష్పాన్ని చేసి..
6928. పెనవేసుకున్న శ్వాసలనడుగు..
నిట్టూర్పుగా జారిన నిశ్వాసల వివరాలిస్తాయేమో..
6929. అక్షరసుమాలెన్ని కోసుకొచ్చానో..
ఆగిపోయిన నీ ఆరాధన మొదలెడదామని..
6930. కన్నీటికి కబురెవరిచ్చారో..
నీ జ్ఞాపకాలను తవ్వుకుని రోదిస్తున్నానని..
6931. భగవద్గీతతో పోల్చినందుకేమో..
జీవితభాష్యం రోజుకొకలా పరామర్శించి సాధిస్తుంది..
6932. వేదనైనా ఆనందమై వినిపిస్తోంది..
తర్జుమా చేయలేని హృదయస్పందనొకటి..
6933. హృదయమందుకే విలపించింది..
అశాశ్వతమైన వలపును వసంతమనుకొని హత్తుకొని..
6934. కోరచూపుతో కోసినప్పుడే అనుకున్నా..
వాలుచూపుల వల సిద్ధమయ్యుంటుందని..
6935. నాన్ననే ప్రేమందుకే..
జీవితాంతం వెలుగిచ్చే వెన్నెలపాఠాలు నేర్పాడని..
6936. మరుజన్మకై ప్రార్ధిస్తున్నా..
ఈ జన్మలో మన పరిచయం ఖేదమే మిగిల్చిందని..
6937. చంద్రోదయమైనా చీకటేననిపిస్తోంది..
నీ వియోగంలో నేను ఒంటరినయ్యాక..
6938. ఊపిరి దాహమంతా నీకొరకే..
సౌరభాల తమకమంతా అందివ్వాలని..
6939. గుండెకవాటాలు మూసుకుపోతాయనుకోలా..
నేను కొలువు తీరగానే పరవశించిపోతూ..
6940. నీలిమను విడిచేసిన ఆకాశం..
కరిమబ్బును కానుక చేసి నా కంటికి సోయగమిచ్చావనే..
6941. వేకువ వెలుగు మక్కువే మనసుకి..
ప్రత్యుషపు సౌందర్యం కన్నులకు పండుగవుతుంటే..
6942. గాలి గుసగుస వినబడుతోంది..
నీ హృదయాన్ని తడిమి హేమంతపు ఒణుకుని నాకందిస్తుంటే..
6943. నాకు నేనే సుప్రభాతమవుతున్నా..
ప్రకృతి వెంట తరలొస్తుందనే..
6944. ప్రవాహమై కదులుతోంది మనసు..
నీ ఉచ్ఛ్వాసనిశ్వాసల్లోని పరిమళానికి..
6945. స్వరసంగమాలెన్నో హృదయంలో..
నీ ఊహలు మనసుపడి విచ్చేస్తుంటే..
6946. సిగ్గుపూలన్నీ నా బుగ్గల్లోనే..
నీ చూపుల తమకానికి కెంపు వర్ణములో కుసుమిస్తూ..
6947. ఎడంకన్ను అదిరినప్పుడే అనుకున్నా..
కుడివైపు చేరేందుకు సిద్ధమయ్యావని..
6948. పూర్ణమైతే చాలనుకుంటున్నా..
కలికితీపి కాపురం నువ్వు కాదనవనే..
6949. వగలు పోతున్న రాతిరొకటి..
వలపు సెగల సవ్వళ్ళకి..
6950. గమ్యమెంత చేరువో..
నీ చిలిపి నవ్వులనే అనుసరిస్తుంటే..
6951. పూల మనసులేగా మనవి..
పరిమళించక మానవు సురానుభూతిగా..
6952. స్వరాలాపనై వినబడుతున్న చినుకులు..
తన్మయత్వంతో అంకురిస్తున్న పులకలు..
6953. స్వప్నం నిజమయినట్లే..
వెన్నెల వెలుగులో నీ చెక్కిళ్ళు చిగురుకెంపులను తలపిస్తుంటే..
6954. తీగలా సాగినప్పుడే అనుకున్నా..
పాకమై ప్రాణం తీసేట్టున్నావని..
6955. కలలెందుకు మౌనవిస్తున్నాయో..
కన్నుల్లోకి రమ్మని నేనెంతగా ఆహ్వానిస్తున్నా..
6956. ఆవేదనే ఆప్తమవుతుంది..
ఆనందం వరించినా చెంత నువ్వుండనప్పుడు..
6957. నిరీక్షణకు ఉద్వాసనే..
స్మృతుల నెమరింతల్లో కాలమిలా కరిగిపోతుంటే..
6958. నువ్వు పిలిస్తే నిముషమాగలేను..
పిలవకుంటే ప్రతిక్షణమూ ఆగమవుతాను..
6959. నీ తలపుల తీయందనాలు..
నాలో తొలివలపు భావసంచలనాలు..
6960. గగనమెక్కిన ఆనందాలు..
బాధల మేఘాలను తరిమి నీతో జంటగా సంచరిద్దామని..
6961. ఒంటరితనాన్ని ఓడించాలనుకున్నా..
నీ మౌనరాగానికి స్వరకల్పన చేసి..
6962. రాజుకుంది అగ్గిలా నీలో వెన్నెల..
వెలుగు తాకినంతనే శ్వాసలోని సెగలా..
6963. మంచుకిరీటానికే మురిసిపోతున్న పచ్చిక..
వేకువకళ్ళకు వేడుక తానైనందుకు..
6964. వియోగానికింక విరామమే..
నీ రాకతో మది చంచలమవుతుంటే..
6965. అహరహం చైతన్యమే..
భావ'కులం' మనమై(దై)నందుకు..
6966. చూపులేకుంటే ఏమైందిలే..
నీ చెమరింతలో చోటు నాదయ్యాక..
6967. పాల మనసేగా నీది..
వెన్నెల తాగిన అనుభూతినిస్తూ..
6968. మలుపులెన్ని తిరిగానో..
మెలకువొచ్చిన ప్రతిసారీ నిన్నే దర్శించుకొనేలా..
6969. ఎన్ని యుగాల నిరీక్షణో..
మరలిపోయిన ప్రేమను రప్పించుకొనేందుకు..
6970. అధరమెందుకో పండనంటోంది..
ఆషాడపు గోరింట అసూయను తాళలేనని..
6971. ఓడినా గెలిచినట్లేగా..
చైతన్యపు ముందడుగేసే ధైర్యం మనదైతే..
6972. అనువదించ వీల్లేని అంతరంగం..
హరివిల్లులోని రంగులూ సరిపోక..
6973. వేరే అత్తరులెందుకులే..
మనసుకి నచ్చిన పరిమళం నువ్వయ్యాక..
6974. వేరే చైతన్యమేదీ వద్దనుకున్నా..
నాలో నువ్వొచ్చి లయమయ్యాక..
6975. అక్షరాలతోనే కలిసి అడుగులేస్తున్నా..
భావానికి పరవశించి చేరువవుతావనే..
6976. కాలమెంత గడుసుదో..
తానాగకుండా మనల్నీ కలుపుకు ప్రవహిస్తూ..
6977. విచ్చుకున్న నెలవంకగా నా నవ్వులు..
నిశీధిలో వెలుగును పెదవుల్లో చూపాలని..
6978. జ్ఞాపకాలంతే..
అలలై కన్నుల్లో పోటెత్తి మనసును ముంచెస్తాయి..
6979. మనసును లాగేస్తావెందుకో..
నాలో పురివిప్పిన సౌందర్యాన్ని వరించానంటూ..
6980. మిగిలిపోవాలనుకున్నా..
నేను సైతం నీ అక్షరయఙ్ఞానికి సమిధగా..
6981.ఆలోచన మెచ్చుకుంటున్నా..
ప్రేమతో ఆకలిని మరిపించమని నువ్వంటుంటే
6982. నాకు నువ్వు దూరం అవుతావనుకోలేదు..
నీ సందేహాలేవో అడిగి తీర్చుకోలేక..
6983. చెక్కిలికి సంక్రాంతులు..
నీవిచ్చిన కలలతో రంగవల్లులు దిద్దుకోగానే..
6984. అనురాగం నీదేనని ఒప్పుకుంటున్నా..
నాలో చరణాలు కుదురుకోగానే..
6985. స్మృతులలోనే మునకేయాలనుంది..
అంతరంగపు ఆనందం సాంత్వనై ప్రవహిస్తుంటే..
6986. ముత్యమై మెరిసింది నా జీవనం..
నీ కలానికి చిక్కి కావ్యమైనందుకే
6987. ఊపిరి బేరాలాడుతావెందుకో..
అడక్కుండా ఆనాడే నవ్వులన్నీ  కాజేసి..
6988. కళ్ళు కళ్ళు కలిసినప్పుడే అనుకున్నా..
చిలువల పలువలు చిలుకలుగా చుట్టేస్తావని..
6989. కన్నుల్లో కనిబెడతావనుకోలా..
పెదవులు దాయగలిగిన కొసనవ్వుల కిరణాలు..
6990. కావ్యమైనప్పుడే అనుకున్నా..
మన ప్రణయం పరిమళించి తీరుతుందని..
6991. సంధిగ్దమొకటి చేరువయ్యింది..
రాగమనుకున్నది కాస్తా అపశృతిగా మారినందుకే..
6992. అక్షరాలే అనునయాలెప్పుడూ..
ఒంటరైన మనసు ఓదార్పు కోరినప్పుడు..
6993. జ్ఞాపకమొక్కటే నాతో మిగిలింది..
కాలం కడగలేనంటూ కదిలిపోతుంటే..
6994. అక్షరాలతో నను దోచినప్పుడే అనుకున్నా..
నీ కలం మాయాజాలం మొదలెట్టిందని..
6995. నీ మనసే స్వరాన్ని కనుగొందో..
నేనైతే పంచమాన్నే పాడుతుంటా ప్రతిసారీ..
6996. పగలు సైతం రాత్రిలా అనిపిస్తోంది..
నీ తలపులు ఊయలలు ఊగినప్పుడల్లా..
6997. పువ్వంటి నిన్ను గుర్తించానప్పుడే..
తేనెలూరు సౌందర్యాన్ని వెదజల్లినప్పుడే..
6998. మెప్పించడం మానేసా ప్రపంచాన్ని..
ఆశనెప్పుడూ అనర్ధంగానే తీసుకుంటుందని..
6999. నీటిబొట్టూ నిగ్గుతేలింది..
నా కన్నుల అందాన్నింతలా పొగిడావనే..
7000. తలుపు తీసి ఉంచమన్నానందుకే..
తరంగిణైనా సరే నిన్నల్లుకోవాలని..

No comments:

Post a Comment