Tuesday, 7 March 2017

6701 to 6800

6701. స్వప్నమైతేనే బాగుండనిపిస్తుంది..
వాస్తవంలో నువ్వో తొడుగేసుకుంటావు గనుక..
6702. నల్లని అక్షరాలన్నీ నీవేగా..
ప్రేమను తెల్లకాగితంపై పరిచేస్తూంటే..
6703. ఏకాంతం ఏకాకితనమయ్యింది..
వేడుకొకటి వేదనవ్వగానే..
6704. స్వర్గారోహణ చేసినట్లుంది..
స్వప్నంలో నా రూపుకి కవితలల్లినందుకే..
6705. తలెత్తుకున్న విషాదం..
రంగుల స్వప్నమొకటి తెలుపులోకి మారిపోయాక..
6706. చెలిమి చెక్కలవుతుంది..
లోపాలనే ఎత్తిచూపి పదేపదే వెక్కిరిస్తుంటే..
6707. మధువనంలో నీవు..
కుదురులేక నిన్ను వెతుకుతూ నేను..
6708. కదిలిపోతున్న క్షణాలను వేడుకుంటున్నా..
నిన్నూనన్నూ కలిపి ముందుకెళ్ళమని..
6709. వంక లేని కలవంక..
నా గోరువంకైతే నువ్వేగా..
6710. వెన్నెలపువ్వునై నేనొచ్చేసా..
వేకువలో మెరిసే మోము నీకెదురవ్వాలని..
6711. తెమలనంటున్న తలపులు..
అంతకంతకీ నీ తాదాత్మ్యంలో విరహిస్తూ..
6712. కవిత్వానికొచ్చిన చిక్కనుకుంట..
అలికిన పదాలన్నింటినీ కవితగా కొనియాడుతుంటే..
6713. అనంతంలో వికసించిన స్వప్నాకృతిని..
హృదయానికి రాగమందించు ప్రణయాన్ని..
6714. నిన్నటి బెంగొకటి తీరిపోయింది..
నేడు నిశ్శబ్దం రవళించగానే..
6715. వానకోయిలకు వంతపాడుతూ మేఘాలు..
నింగీనేలను వానధారలతోనైనా కలపాలనుకుంటూ..
6716. పరిమళమెక్కువే జ్ఞాపకాలకి..
మగతను చీల్చుకొని మదిలో గుభాళించేందుకు..
6717. కొన్ని జ్ఞాపకాలంతే..
జీవనంలో ప్రవహిస్తూ చైతన్యాన్ని నిలుపుతాయి..
6718. కవితప్పుడే చేరువయ్యింది..
నీ తలపులన్నీ పదాలుగా పేర్చుకున్నాక..
6719. నువ్వున్నప్పుడు కళకళ..
నా ఊహలూ నీ నవ్వులూ ఒకటై మెరిసిపోతుంటే..
6720. ఆగనంటూ కదులుతున్న బ్రతుకుబండి..
జీవయాత్రను ఏదోలా ముగించాలనే..
6721. చెలియలకట్టలేని హృదయమొకటి..
పురివిప్పిన శూన్యంలో వేడికన్నీటిని ఒలికిస్తూ..
6722. ఆనందపు చిలకరింతలో అమృతాలు..
పెదవులకు ప్రాణమిచ్చిన రాగాకృతులు..
6723.  కోరిన కేరింతేగా మనదంతా..
క్షణాలకు శుభయోగాన్ని కలిగించాలని..
6724. ఉనికి కరువైన భావాలు కొన్ని..
తమను ఆదరించే కవితాత్మలు కరువైనందుకే..
6725. హృదయంతో వేరుపడక తప్పలేదు..
మనసయ్యిందంటున్నా ఉలుకుపలుకూ లేదనే..
6726. మలుపులు వెతకడం మానేసానందుకే..
నీ చూపుకి చిక్కితే పెదవుల రహస్యాన్ని కనిపెడతాయని..
6727. వెన్నెలతీగలే కన్నుల్లో..
శరన్నీరద మెరుపుల్లో కలగంటున్నది నిన్నయితే..
6728. ఆవిరవని వెల్లువలా నీవు..
నిరంతరం కెరటమై ఉప్పొంగుతూ..
6729. ఊపిరులేనవి..
నా శ్వాసను నియంత్రించే కొన్ని జ్ఞాపకాలు..
6730. వేదనకు వేదికలవి..
నిర్వేదాన్నీ అద్దమల్లే ప్రతిబింబించి చూపిస్తూ..
6731. కలలు నేసే కన్నులకే తెలుసు..
నీ తలపులోని మాధుర్యపు బరువెంతో..
6732. ఎట్నుంచీ తడిమితేనేం..
కల్మషమంటదుగా నేలజారే దివి కిరణానికి..
6733. అలవాటైన గాయాలెన్నో..
ఎదురేగి గుచ్చినా మనసు చలించనట్లు..
6734. కట్టిన పచ్చకోకతో సరిపెట్టుకోమంటున్నా..
నాగరికతలో వృక్షాలు కనుమరుగవుతుంటే..
6735. ఎదురుచూపులన్నీ రాతిరి కొరకే..
తన స్వప్నాలతోనే నిద్రించొచ్చని..
6736. వెన్నెల విలువెరుగముగా మనం..
పక్షానికి అమాసొచ్చి తడమందే..
6737. రమ్మని పిలిచావెందుకో అర్ధమవలేదు..
వాకిట్లో నిలబడ్డా ఆహ్వానించనందుకు..
6738. వెలుగురేఖల్లో మెరిసే సౌందర్యాలు..
విచలించు మదికవే పారవశ్యాలు..
6739. ఒక్క సిరాచుక్క సరిపోయిందిగా..
ఎదను తవ్వుకొనేందుకు..మధురిమలను వెలికి తీసి మురిసేందుకు..
6740. మనసు పెట్టి రాసావని తెలిసింది..
గాలి గంధమద్దుకొని కవితలా నన్నల్లుకున్నందుకే..
6741. నువ్వే పుస్తకమయ్యావుగా..
మనసు పెట్టి ఆపకుండా చదవాలనుకోగానే..
6742. నీవెంటే మేమంతా..
అక్షరాలతో కలిసి నడుద్దామని అడుగులేస్తే..
6743. గడ్డకట్టిన స్మృతులు కొన్ని..
కరిగించాలని చూసినప్పుడల్లా మదిని నీరు కార్చి ఏడిపిస్తూ..
6744. ఊహలందించింది నువ్వేగా..
సిగ్గిల్లిన ఊసులన్నీ కవితలుగా మలచుకుంటూ..
6745. విద్వత్తుకు భయపడుతున్నా..
అతనో మనిషి రూపంలోనున్న మహనీయుడేమోనని..
6746. అతిశయమొకటి మెలిదిరిగింది..
నీ ఊహల తెమ్మెర పొంగులెత్తగానే..
6747. చీకటంటే విసుగొస్తుంది..
మదిలోని వెన్నెలనూ తాగేయాలని చూస్తుందని..
6748. శిరం లేని శిలనవుతున్నా..
మొండి మనసుల ముక్తాయింపుల్లో..
6749. శ్వాస గడ్డకట్టింది..
నీ నవ్వుల శీతలానికి ఘనీభవించి..
6750. వానాకాలమొచ్చింది కన్నులకు..
కురుస్తున్న అశ్రువులతో మనసుని తడిపేస్తూ..
6751. ఆనందాలనే వరించమన్నా..
వియోగాలతో కలిసొచ్చేదేముందని..
6752. వేకువ విరిసిన కన్నుల్లోనే దాచుకున్నా..
రాతిరి పంచుకున్న ఎర్రని ఊసులన్నీ..
6753. కలలకు కొదవేముందిలే..
మరపురాని జ్ఞాపకాలన్నీ రేయొకటి తడుముకున్నాక..
6754. గిజిగాళ్ళమై అల్లుకుపోలేమా..
చేరికలోని ఆనందాన్ని చెరిసగం పంచుకొనేందుకైనా..
6755. అనుబంధమొకటి పెరికిపోయింది..
అప్యాయతల ముడి బిగుసుకోలేని సఖ్యతలో..
6756. అవే ఆనందాలు..
అక్షరాలుగా మారి కాగితంపై శాశ్వతమవుతూ..
6757. కలవరమిచ్చింది నువ్వేగా..
కమ్మగా నీ చూపుతోనే ఆకట్టేసి..
6758. కన్నులతో నవ్వినప్పుడే అనుకున్నా..
ఇంద్రజాలమంతా చూపుల్లోనే ఉందని..
6759. బరువెక్కుతూనే మనసు..
ఆశలు కరిగి నీరవుతున్న కొద్దీ..
6760. చీకటికి పెరిగిన ప్రవాహమొకటి..
స్మృతులను తాగి జీవిస్తున్నావని..
6761. రాతిరి కోసమే నా ఎదురుచూపులు..
కలలో కలిసుండొచ్చనే చిన్నారి కోరికలో..
6762. వియోగం వెనుదిరగనంది..
నిట్టూర్పుగానైనా నా ప్రేమకు తోడుంటానంటూ..
6763. ఆనందాలు విరుస్తూనే ఉంటాయక్కడ..
బంధాలే ఊపిరైన జీవితాలలో..
6764. క్షణాలెందుకు రోదిస్తున్నాయో..
నీ మౌనంలో ఇమడలేమని ఊహిస్తూ..
6765. చూపు తప్పుకుంది.. 
ఎదను గిల్లుతుంటే..
6766. నలువైపులా నవోదయమే..
అడుగులొకటై పయనిస్తే..
6768. నేనేగా..
నీ వెన్నెలంతా..
6769. పునర్ముద్రణకు అందని పుస్తకమది..
ఒకేసారి లిఖించబడ్డ జాతకముతో..
6770. ప్రతిక్షణమూ పరిమళిస్తున్నా..
నీ ఊపిరి నేనవ్వాలనే స్వార్ధంలో..
6771. చెలిమికి చేరువవుతున్నా..
అనుభూతుల సౌరభాలు మనసును తాకుతుంటే..
6772. పరవశాన్ని దాచుకుంటున్నా..
కొన్ని స్మృతులు జీవితాంతమూ కావాలనుకొనే..
6773. ఆవిరవక తప్పలేదు మనసు..
కన్నులకు గ్రీష్మమొచ్చి పొడిబారిపోతుంటే..
6774. అస్తిత్వాన్ని దిద్దుకుందామే..
తనకు తానే ఆవిష్కృత కవితాత్మయై..
6775. తెరమరుగై నేనున్నా..
నీ చూపులరాగాలకు కందిపోగలనని భావించే..
6776. ప్రేమ గొప్పదనమేనంతా..
మధురానుభూతులన్నీ మదిలో భావోద్వేగమై కదులుతుంటాయి..
6777. కాలమప్పుడప్పుడూ కర్కశమే..
వాస్తవానికి దగ్గరగా హృదయాలను మోసుకేళ్తూ..
6778. మౌనాన్ని వీడక తప్పలేదు..
సిగ్గును అనువదించమని మనసంటుంటే..
6779. అమృతమై కురిసిందేమో వెన్నెల..
రాతిరి అమాసను మరిచినట్లయినందుకు..
6780. విషాదం నుండీ అలవోకగా వేరుపడ్డా..
సంగీతమై నాలో నువ్వు చేరిపోగానే..
6781. పగటికలలూ కావాలనుకున్నా..
నీ ధ్యాసకు దూరమయ్యే క్షణాలుండరాదనే..
6782. కన్నుల కోలాటమాడలేకున్నా..
నీ చూపులకు వెన్నలా కరిగిపోతుంటే...
6783. రాతిరి వెచ్చబడినప్పుడే అనుకున్నా..
రేరాజు పరవశంలో మునిగున్నాడని..
6784. వేరే అదృష్టాలేవీ వద్దనుకున్నా..
నువ్వుంటే సరిపుచ్చుకోవచ్చనే జీవితానికి..
6785. ఋతురాణికి ఒయ్యరమెక్కువ..
రోజుకో రంగులో ప్రకృతిని తడమాలని..
6786. పురివిప్పిన సౌందర్యమై నిలబడిపోయా..
అనురాగాన్ని రాతిరికి అంకితమిద్దామనే..
6787. మధురిమలు చిలికే వసంతాలవే..
స్వరాలను తాగేసిన అధరాలవి..
6788. ఊయలూగాయెందుకో నింగిలోని మబ్బులు..
వెన్నెలపై మనయ్యింది నేనైతే..
6789. నువ్వో చంద్రికవే..
రాతిరేళ వెలుగురేఖల నునుపును ప్రసరిస్తూ..
6790. వసంతాన్ని గుర్తించా..
కోయిలవై నాలో రాగాన్ని మేల్కొల్పినప్పుడే
6791. చుక్కలు రాలిపడ్డప్పుడే అనుకున్నా..
మదిలోని కోరిక తీరే శుభసమయం నేటికి చేరువయ్యిందని..
6792. హేమంతానికే చలేస్తుందంటావు..
అతిశయానికే అలంకారాలద్దేస్తూ నీ ప్రేమతో..
6793. కాలానికే రంగులేసేస్తావు..
ప్రతిక్షణమూ నాలో ఉల్లాసం ఎగిసిపడేందుకు..
6794. వేయిగా కనిపించినప్పుడే అనుకున్నా..
పగలూరేయీ పట్టింపులు మరచిపోయానని..
6795. మౌనం మృదంగమైంది..
కన్నులతో ఊసులాడుతూ వలపును పండిస్తుంటే..
6796. వెన్నెల సంతకమది..
అధరాల కావ్యాలను కన్నులతో రాసేస్తూ..
6797. వెతకడం మానేసా..
పదేపదే నన్నెతుక్కొని నీతో భంగపడి..
6798. కలువపువ్వునే నేను..
రాతిరైతే మింటి చందమామకై ఎదురుచూస్తూ..
6799. అద్దమెంత సిగ్గుపడుతుందో..
ఇచ్చిన హృదయానికి పదేపదే ముద్దులిస్తుంటే..
6800. అలవాటైన చీకటేనది..
ఆర్తి కరువైన అమాస అనుభూతిలా..

No comments:

Post a Comment