Tuesday, 7 March 2017

6101 to 6200

6101. అప్పుడే రసోదయమయ్యింది..
నిశీధిని దాటి వెలుతురు పువ్వులు పుప్పొళ్ళు రువ్వగానే..
6102. మనసు మయూరమయ్యింది..
మసకేసిన నీ కన్నులతో నా చూపులు కలవగానే
6103. వేదనాతీతమైంది మది..
ఆనందానికీ ఆవేదనకీ సఖ్యత కుదర్చలేక..
6104. బుగ్గలపై చారలను ఆరా తీస్తావెందుకో..
నీ వియోగంలో శూన్యమైపోతానని తెలిసాక్కూడా
6105. నీలాంటి చీమెప్పుడూ కుట్టలేదు నన్ను..
పెదవులు తీయగా ఉన్నాయని అభినందిస్తూనే..
6106. మౌనంపై మనసయ్యింది..
ఊహించిన చెలిమి అంచనాలను అందుకోలేదనే..
6107. చిలికి గాలివాన అవుతుందని భయపడ్డా..
నీ అలుకతో నన్ను వేధిస్తుంటే..
6108. వరమివ్వాలనే నేనొచ్చా..
నువ్వు తలచింది నన్నేనని వినిపించి..
6109. మనసైనందుకేలే..
నిన్ను అక్షరంగా రాసుకుంది..
6110. అక్షయమయ్యింది మధువు..
అనువైన పాత్రలో దాచి అందించినందుకేమో..
6111. అభావమయ్యింది మది..
అనుభూతి ఎరుగని ఆనందాన్ని కోరినందుకే..
6112. మనసును వేడుకోవాలేమో..
భావుకత్వాన్ని అక్షరాల్లోకి అనువదించే సాహసమివ్వమని..
6113. భాషెప్పుడూ రసవంతమే..
పలికే హృదయానికి పదం అందాలంతే
6114. మాటలను మంత్రాలుగా మార్చేద్దాము..
మనవైన పదాలను పలికించి..
6115. వజ్రమై మెరిసిపోతున్నా..
రంగురాళ్ళతో కలిపి నన్ను దాచుకున్నా..
6116. అక్షరాల కనికట్ట్లే..
మనసు ఇక్కట్లను మర్చిపోయే మార్గమైనట్లు..
6117. వసంతానికి కొత్తరూపం వచ్చేట్టుంది..
మరులు గొలిపే వర్ణాలద్దుతుంటే
6118. మల్లెనవ్వుల అత్తరులే..
చోటివ్వక మనసంతా నువ్వే నిండుతుంటే..
6119. నీటిపువ్వుల సోయగాలు..
నేలను వింతైన కాంతులతో నింపేస్తూ..
6120. అనుభూతులకు కొదవేముంది..
అనుభవాన్ని దాచుకొనే అందమైన మనసుంటే..
6121. చిలకలా ఎన్నైనా చెప్తావు..
మాటలేవీ నీకు రావంటూనే..
6122. చిలిపిదనం వీడనంటూ మది..
పసిదనాన్ని దూరం చేసుకోలేనంటూ..
6123. యుద్ధమొకటి కావాలని అడిగింది నువ్వేగా..
పెదవులతో మొదలెట్టానని నస మొదలెట్టావెందుకో..
6124. నీ పన్నాగమిప్పుడు తెలిసింది..
అలుక తీర్చేందుకు మరిన్ని చిలిపి కాట్లు వేయించుకోవచ్చని..
6125. రజనీగంధమై వీరబూస్తున్నా..
నిన్నల్లుకోవాలనే తాపత్రయంలోనే..
6126. వలపు వశీకరణం చేసినందుకేమో..
నువ్వే కావాలంటూ మనసంటోంది..
6127. మనసులోకి అడుగేస్తానంటావెందుకో..
కలల పుస్తకంలో చోటిస్తానని నేనంటున్నా..
6128. పదేపదే నిన్నే పాడుతున్నా అనుమానిస్తావెందుకో..
తొలివలపు తీపైతే మధుమేహం రాలేదెందుకని..
6129. వీధులన్నీ చుట్టొచ్చేసా..
కలలో విరబూసిన నిన్ను కనిపెట్టలేకపోయా..
6130. ఎదలో సొదలే నీకన్నీ..
కాలపు రెక్కలేసుకు నేనెగురుతున్నా..
6131. చూపుకెప్పుడూ అలసటే..
నీ రాతిగుండెను కరిగించలేని కన్నులతో..
6132. నీ మనసెలానూ మాట వినదుగా..
చూపులతో మంత్రించక తప్పలేదు చూపుని..
6133. ఇంద్రధనస్సు చేతికందినట్లుంది..
తదేకంగా నువ్వలా నన్నే తిలకిస్తుంటే..
6134. ప్రేమయుద్ధాలెప్పుడో ఆపేసా..
గెలుపు కోసమని అడ్డదారులు వెతకలేక..
6135. గ్రీష్మ ఋతువు సోకినట్లుంది..
ఓరచూపుతో నువ్వొక్కసారి చూసినందుకే..
6136. ప్రేమజ్వరమొచ్చినట్లుంది..
నీ ఊపిరిలోని సంగీతాన్ని నేనాలకిస్తుంటే
6137. పచ్చగా మిగిలిపోలేనా..
వసంతానికి ప్రియమైన రంగు కావాలనుకుంటే..
6138. పులకింతలు పదివేలు చేయాలనే..
ప్రియురాలినై నీలో చేరుతున్నా..
6139. అడుగులకెందుకో తడబాటు..
చిటికెనవేలు పట్టకుండానే నువ్వు రమ్మంటుంటే..
6140. ప్రియమైన మాటలన్నీ నాకిష్టమే..
ప్రియంవదవై నువ్వు పలుకుతుంటే..
6141. అంచనాలు అందుకుంటూనే పోవాలి నేను..
ఈ జన్మకు ఆడపిల్లనై పుట్టినందుకు..
6142. భంగపడ్డ ఆనందాలు..
అనుభవంలోకొచ్చిన సుఖాలు పాతబడ్డం చూసాక..
6142. కళ్ళతోనే చదివేస్తున్నావు..
మౌనంతోనే మంత్రించినట్లు..
6143. నా మనసునే ఆకాశంగా పరిచేసా..
నీ భావాలు పదిలంగా పంచుకుంటావని..
6144. నీకు నేను వశమైన ఆనందమిది..
స్వప్నమో సత్యమో తెలియని ఉద్వేగమిది..
6145. వేకువ వేళకు ప్రణయ కాంతులు..
మేల్కొన్న హృదయానికి వైశాఖ పున్నములు..
6146. నేనొక అస్పష్టపు దృశ్యాన్ని..
స్మృతులలోనైనా జీవించాలనుకొనే కోరికని..
6147. నేనో అక్షర మకుటాన్ని..
నీ కవనానికి కౌముదినై వెలగాలనుకొనే నిరంతర భావుకని..
6148. కాటుక కళ్ళంటే మక్కువని ఒప్పుకోవేం..
నా చూపు కొసలకే వ్రేళ్ళాడిపోతూ..
6149. నా కనుల కవాటాల రెపరెపలు..
నీవుగా విహరిస్తున్న ఊహల కౌగిళ్ళలో..
6150. నీ మనసుకి రెక్కలు కావాలేమో..
నేనో విహంగమై నీలో విహరిస్తున్నందుకు..
6151. మకుటమవుతాలే నీ శతకానికి..
నాకే అంకితమిస్తానని నువ్వంటే..
6152. జీవనసంధ్యల్లో తళుక్కుమంటూనే ఉంటా..
నీ స్మృతులనైనా నెమరేసుకుంటానంటే 
6153. ఆరాటాన్ని అణచుకోలేని కొన్ని తారలు..
క్షీణించే చంద్రుడ్ని అదేపనిగా మోహిస్తూ..
6154. మువ్వలకీ నవ్వులకీ జతెప్పుడు కలిసిందో..
జంట జావాళీల్లో జానపదాలు జల్లుకుంటూ..
6155. తీరమంతా తీపయ్యింది..
మరోమారు కెరటమై విచ్చేసే నన్నాహ్వానించేందుకే..
6156. అమూల్యమైన చినుకులు..
మదిని చిత్తడి చేసే ఊహాశిల్పాలు..
6157. కలలోనూ మిడిసిపడతా..
నీ ప్రేమను గెలుచుకున్నది నిజమైతే..
6158. నీ కులుకు లాస్యాలకే..
నా పెదవికన్ని పదనిసలు..
6159. మనసు వేగాన్నడుగు..
నీకు దూరమై ఎప్పుడుందో చెప్పగలదేమోనని..
6160. ముందుచూపు ఎక్కువే తనకి..
మల్లెలతో మత్తెక్కించి మంత్రించాలని..
6161. మంత్రాలింకా నేర్వలేదు మది..
మధుమాసపు దాహానికే అల్లడిపోతుంటే..
6162. ప్రేమనే నమ్ముకున్నా..
ప్రేమను ప్రేమించు ప్రేమకై అనే ప్రేమికులు అన్నారని..
6163. అలవై తాకినప్పుడల్లా పరవశాలే..
పున్నమితేనేమి..నన్ను పట్టించుకున్నావని..
6164. చూపుతో వశం చేసుకుంటాలే..
కన్నుల్లో కాటుకై ఉండిపోతావుగా..
6165. పరిమళించు పున్నమిని త్వరగా రమ్మన్నా..
నీలో భావాలను నాకు పూసుకుందామని..
6166. చిన్నబోక తప్పలేదు మనసుకి..
కోరికలు గుర్రాలని కళ్ళెమేస్తుంటే..
6167. తారల మధ్య దూరమందుకే పెరిగిందట..
వలపు పంటకి కాస్త చోటిద్దామనుకుంటే..
6168. పదిమందికి చోటిచ్చే విమానమంటి మనసెందుకులే..
ప్రేమను ప్రేమించే ప్రేముంటే చాలులే..
6169. నేనో అమిత మాధుర్యాన్ని..
మధువంతా నీకే పంచాలనుకొని..
6170. ఎప్పటికీ వీడిపోని దండది..
నీ జ్ఞాపకాలతో చేసిందని..
6171. బరువెక్కుతున్న హృదయం..
నిన్ను రాసిన అక్షరాన్ని చదవలేకున్నావనే..
6172. పొరపాటు చేయని అక్షరాలు..
భావాలని యధాతధంగా నాకనువదిస్తూ..
6173. కొన్ని భావాలంతే..
అప్పుడప్పుడూ అల్లరిగా..ఒక్కోప్పుడు వెన్నెల్లా మనసును హత్తుకుపోతుంటాయి..
6174. స్వరాలుగా మారిన ఊహల వెల్లువలు..
శిశిరాన్ని దాటి వసంతాన్ని చేరి..
6175. ప్రేమగా ఒదిగిన నా చెక్కిళ్ళు..
నీ అరచేతులకు అపురూప అనుభూతులై..
6176. చినుకుల్లో చిందులేస్తూ ఆమె..
తన బిడియాన్ని దాచుకొనేందుకు నిన్నూ రమ్మని ఆహ్వానిస్తూ..
6177. మనసు ముత్యమవుతోంది వింతగా..
జ్ఞాపకాల ఆల్చిప్పల్లో జారిపోయి..
6178. స్వస్తి చెప్పేస్తున్నా నటనకి..
నీ వియోగంలో ఏకాంతాన్ని సైతం భరించలేనని ఒప్పుకుంటూ..
6179. కన్నులకు తెలిసిన భావమదేననుకుంటా..
కన్నీటిని వరప్రసాదంగా మనకిచ్చినట్లు..
6180. నా గుండెల్లోంచీ తన్నుకొస్తున్న కన్నీరు..
నీ గొంతు నన్ను పాడలేనంటుంటే..
6181. నువ్విచ్చిన చనువేగా..
నాదానివని ఒక్కసారంటే సరితూగిందనుకుంది మది..
6182. హేమంతమై అల్లుకోనా..
వైశాఖంలో వడదెబ్బను దూరం చేసేందుకైనా..
6183. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొన్ని నమ్మకాలు..
ఆత్మీయత దాటి అవకాశాన్ని అందుకుంటుంటే..
6184. గ్రీష్మాన్ని దాటి పరుగెడుతున్నా..
పడమట పవనమొచ్చి పిలిచిందని..
6185. ఒంటరితనమెక్కడుంది..
నేను నేనైన నేనుగా ఐక్యమయ్యాక..
6186. కన్నులకదెంత దాహమో..
ధ్యానంలోనూ చిగురించే కవిత్వాన్నే తాగాలని..
6187. రంపాల్లా కోసేస్తున్నాయి..
చంచలత్వంతో కొట్టుమిట్టాడుతున్న కొన్ని అనుబంధాలు..
6188. రంపాల్లా కోసేస్తున్నాయి..
వెల్లువవుతున్న ప్రవాహంలా నీ జ్ఞాపకాలు..
6189. రంపాల్లా కోసేస్తున్నాయి..
అనుభూతుల్ని శస్త్రచికిత్స చేయాలనుకొనే చూపులు..
6190. ఇప్పటిదాకా ప్రతీక్షణలోనే మగ్గిపోయా..
నీవొస్తే పట్టు చిక్కుదామని..
6191. కొన్ని ఎదురుచూపులంతే..
జీవితకాలాన్ని మందగించేలా చేసి నిలబెడతాయి..
6192. అనుభూతులను పంచుకుంటున్నా..
అంతరంగ సంపద నీకే చెందాలని..
6193. వేకువ నవ్విన సవ్వడేనది..
ప్రణయ వేణువు నువ్వూదావని
6194. తుళ్ళింతలే క్షణక్షణం..
నీ ఊపిరిలో పదనిసలు నావవుతుంటే
6195. ఋతురాగాలన్నీ అనురాగాలే..
ప్రకృతి ప్రేమను అమ్మానాన్నతో అనుసంధానిస్తూ..
6196. క్షణాలకెప్పుడూ పరవశాలే..
మనం కలిసున్న కాలాన్ని లెక్కించుకుంటుంటే..
6197.నీ చూపులకు చిక్కినప్పుడే అనుకున్నా..
పెదవులకు చిరునవ్వుల మంత్రమేదో వేస్తావని..
6198. అరచేతులకు అంటిన ఆనందం..
నీ స్పర్శలోని మాధుర్యం..
6199. గేయాల సంగతి మాటాడవెందుకో..
గాయాలన్నీ మాలికగా గుచ్చేసుకుంటూ..
6200. అవని ఆత్మకి గాయమయ్యిందట..
గమనం ఆపేద్దామని ఆలోచిస్తోంది..

Virus-free. www.avast.com

No comments:

Post a Comment