Tuesday, 7 March 2017

4801 to 4900

4801. తరువును తురిమేసే మనసులే కొన్ని..
కృత్రిమ శ్వాసలకే అలవాటు పడి..
4802. పదాలు కుదరని పాటొకటి..
స్వాధీనం కాని మనసుని శృతి చేయాలనే విశ్వప్రయత్నంలో..
4803. నీతో హృదయాన్ని పంచుకోవడం చాలించాలనిపిస్తోంది..
నమ్మలేని నిజాల్లో నువ్వు చేరిపోయాక..
4804. గుర్రాలు దౌడు తీస్తుంటే ఏమోననుకున్నా..
మనం కలియుగంలో ఉన్నామని మర్చిపోయి..
4805. అంతులేని అనుగ్రహానివై విచ్చేయవూ..
హృదయకవాటాలన్నీ నీకై తెరిచుంచినందుకైనా..
4806. స్వరమధురిమనై వచ్చేసా..
ముత్యాలసరాలుగా కూర్చి నన్ను పాడుకుంటావని..
4807. మధుమాసం నేనవుతున్నా..
వెన్నలతో పోల్చినప్పుడల్లా సౌందర్యం స్పృశిస్తున్నందుకేమో..
4808. గుండెలోనే దాచుకుంటున్నా..
నా జీవితంలోని ఖాళీను పూరిస్తావని..
4809. గుండెలోనే దాచుకుంటున్నా..
అనుభూతుల అప్రమేయానందాన్ని ఏకాంతంగా ఆస్వాదించాలని..
4810. అందుకే నువ్వంటే నాకిష్టం..
దేవుడిలా నన్నర్ధం చేసుకుంటావని..
4811. పదునైన సున్నితత్వమంట..
మాటలనే ఆయుధాలుగా హృదయాలను కోసేస్తూ..
4812. ఇన్నాళ్ళకి అద్దమో నిజం చెప్పింది..
సంతోషంలో నేను అందాన్ని మించిపోయానని..
4813. శిశిరపత్రాల లెక్కలు తేలకున్నవి..
వసంతమొస్తున్నా ఇంకా గలగలలాడుతూ..
4814. పలుకురాళ్ళనే మువ్వలుగా మార్చేసుకున్నా..
కదలికలతోనే కొండంత ఉత్తేజమిస్తాయని..
4815. అహంకారపు మగుటం తానంతటే దిగింది..
ప్రేమకి చెలి నేనని తెలిసాక..
4816. మిధ్యాబింబాలెన్నో..
ఇమడలేని జీవితనాటకంలోని పాత్రలుగా..
4817. పదిలమే నాలొ నీ జ్ఞాపకమెప్పటికీ..
చూపులు కలిసిన సాయంత్రం సాక్షిగా..
4818. హృదయం లయ తప్పించకలా..
మనసును గిచ్చి ఏడిపించేలా..
4819. నీ మౌనంలో దారి తప్పాలనుంది..
ఒక్కసారి స్పర్శను గాఢతరం చేయవూ..
4820. ఉనికి కోల్పోయారు..
భవిష్యత్తొద్దని చీకటి లోతుల్లో కూరుకున్నప్పుడే..
4821. శ్శబ్దపు ధూపమేనది..
నీ విరహంలో పరిమళాలను నిశ్వసిస్తుంటే
4822. విశ్వాసమే సున్నితం..
కోరిక బలాన్ని మొదలంటా తీయడం..
4823. వినూత్నమే నీ క్షణాలు..
నిశ్వాసలను సైతం వృధా కానీయక నీలో కలుపుకుంటూ..
4824. సహకరించకపోతేనేమి అంబరం..
ఎగిసేందుకు సముద్రుడు ప్రయత్నం మానలేదుగా.. 
4825. మంచానపడింది మంచి..
చెడొచ్చి చింతలిస్తుంటే..
4826. ఒడ్డుకు చేరుతున్న భావాలు..
అనుభూతుని నువ్వు ఆదరించినందుకే..
4827. కెరటానికే ఉబలాటమనుకుంటా..
తీరంలోని ఇసకంతా తీయగా మారింది.. తనలో కలుపుకోవాలని..
4828. నీ జ్ఞాపకాల హోరుకేనేమో..
ఊపిరాగి వేదన సుళ్ళుతిరుగుతోంది..
4829. అన్యాయమే..
అశాంతి ముగ్గులు నువ్వేస్తూ నన్నో గొబ్బిపువ్వుగా ఉండమంటుంటే..
4830. నిముషాలనెందుకు వేధిస్తావో..
క్షణాలు దొర్లిపోతుంటే ఊహలకందలేదని విస్తుపోతూ..
4831. ఒద్దంటే వెన్నపూసలే తింటావు..
బరువెక్కువయ్యావని నన్నడిపోసుకు చిందులేస్తావు..
4832. గజగామినితో పోల్చుకోవద్దన్నానందుకే..
తలపుల బరువుతోనూ నిన్ను వంచేస్తాయనే..
4833. నీ తలపులడ్డం పడ్డాయెందుకో..
నిన్నాలకించాలని ఆత్మీయంగా నేనొస్తుంటే..
4834. నువ్వు గుభాలించినప్పుడే అనుకున్నా..
నా మల్లెగంధాలు దోచేసింది చాలక శీతలకబుర్లు మొదలెట్టావని..
4835. అభావాలన్నీ అక్షరాలై కూర్చున్నాయి..
ముభావమై ముఖపుస్తకానికి రావద్దనుకుంటే..
4836. ఆనందాన్ని బానే హత్తుకుంటావు..
ఆవహించినది దుఃఖంలోనని గమనించకుండా
4837. శిశిరాన్ని ఆహ్వానించిన జంటలనుకుంటా..
అభిమానాన్ని రాల్చేస్తాయని తెలియక..
4838. పలుకు పెదవులకూ కంగారే..
చూపులొచ్చి చుంబించకుంటే చాలని..
4839. వెన్నెలచార పరిమితమయ్యింది..
అమాస నడిచినంతమేరా తాను కురవనంటూ..
4840. గ్రీష్మానికింకా సమయముందని మరచినందుకేమో..
హృదయాన్ని ఎండగట్టిన వియోగాలు..
4841. మధుమాలికని నామకరణమయ్యానందుకే..
నీ పెదవులకు తేనెలు పరిచయించేందుకే..
4842. దేవాలయమని గుర్తించావు సరే..
అనుగ్రహాల మాటెందుకంటే వినవే..
4843. దొరతనంగానే రావాలనుకున్నా..
నీ హృదయకవాటంలోకి నరాలు దారివ్వందే..
4844. తడుముకోవెందుకో హృదయాన్ని..
వినీలమై విపంచినయ్యింది నేనని గుర్తుపట్టక..
4845. నీ రహస్య భాష అర్ధమయ్యిందిలే..
మోహం ఆవిరిగా నాపై కురుస్తున్నప్పుడే..
4846. మది తలుపుల్ని మూసేయాలనుకున్నా..
వేళాపాళా లేకుండా చొరబడుతున్నావనే..
4847. చైత్రమై వచ్చేదాకా ఆగవు..
వదంతినంటూ అందరికీ అప్పచెప్పేస్తూ..
4848. ఖేదాలు మనకెందుకులే..
భేదాలు ఉన్నవాళ్ళు చూసుకొనేందుకు వదిలెద్దాం..
4849. శిశిరాన్ని చులకనగా చూడకు..
నీడల్లో చేరి ఆశలు రాల్చి గానీ కదలదు.
4850. పాకుడు చేసి పెట్టావుగా దారంతా..
లేని నడుమునొప్పిని మోకాళ్ళకు అంటించి..
4851. క్షణాలనే యుగాలుగా దాచుకున్నా..
మరణిస్తూనే సజీవితాన్ని భ్రాంతయ్యేలా..
4852. పున్నమినాడేం చేసావో మరి..
వెన్నెలను వడ్డీకివ్వమని వేధిస్తూ..
4853. ప్రేమయుద్ధాన్ని చేయాలనుకోకు..
ప్రేమ గెలిచినా ప్రేమికులుగా ఓడిపోగలం..
4854. పరిమళిస్తే చాలనుకున్నా పున్నమి ఘడియకి..
నీ పిలుపుతో నేనొచ్చి చేరొచ్చని..
4855. పాదరసాన్ని పట్టించావెందుకో..
మీనానికి మరింత జారత్వాన్నిస్తుందని తెలిసీ..
4856. గెలిచేవాడేగా విజేత..
యుద్ధం చరిత్రలో గాయమై మిగిలినా..
4857. జీవించున్నానని గుర్తించావుగా..
నన్నో జీవనదిగా మార్చి నువ్వీదుతూ..
4858. నీ భావాలన్నీ బంగారాలేగా..
ముఖపుస్తకానికి వన్నెతెచ్చి మెరిపిస్తూ..
4859. హేమంతంపై నడవొద్దన్నానందుకే..
నీ పాదాలు ఎర్రబడి కందిపోతాయనే..
4860. కన్నీరు రుచి మార్చుకోవాలని చూసింది..
ఒక్కసారన్న ప్రేమ చూపితే తీయనవుదామని..
4861. మట్టిబొమ్మను దేవతను చేసింది నువ్వేగా..
సముద్రపుతీరం నాకు సరైనచోటు కాదంటూ..
4862. గుర్తిస్తే చాలనుకున్నా..
గడ్డిపువ్వని తీసిపారెస్తావేమోనని మల్లెగా మారిపోయా..
4863. వేలపట్టునుండలేకపోతున్నా ముఖపుస్తకంలో..
నీ తలపులప్పుడప్పుడూ శూన్యాన్ని కానుకిస్తుంటే..
4864. రేపటికి ఆశ పువ్వే..
నేడు నిరాశ మొగ్గైనా..
4865. పనిలేని శూన్యమనుకుంటా..
మన మధ్య నిశ్శబ్దమై రాలిపోతూ..
4866. ప్రత్యుషమెంత సౌందర్యమో..
చూపుల మేలిముసుగులో తన్మయమై దర్శిస్తే..
4867. కలల సరోవరాలై నా కళ్ళు..
ఆనందం నీవుగా విహరించేందుకు విచ్చేసావని..
4868. నా గుండె మాత్రం ఆల్చిప్పనే..
ఒక్క చినుకుని మాత్రమే ఒడిసిపట్టగలదు..
4869. ప్రతి భావములోనూ నేనేగా..
నీ ఆంతర్యంలో రాధనయ్యాక..
4870. సుఖశాంతులు కరువేగా..
నిరంతర యుద్ధంతోనే జీవితం ముగిసిపోతుంటే..
4871. అక్కడే ఆగింది జీవితం..
నాలుగ్గోడల మధ్యనే కొట్టుమిట్టాడుతూ..
4872. ఎర్రగానే ఉంది రక్తం..
నీ మాటలతో ఉడికెత్తిపోతున్నా..
4873. ఆశయాలన్నీ జారిపోతున్నాయి..
నలుపు తెలుపులను దూరం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారీ..
4874. ప్రేమలేఖలమడతలే విప్పలేకున్నా..
నీ మోహపు ఆవిర్లు గుర్తొస్తుంటే..
4875. స్వరార్చనకి నేనొచ్చేసా..
నీ కచేరీలో పాడేందుకు పిలిచావని..
4876. వేయిజన్మల తపస్సు నాది..
నీ ఎదలో పరిమళించడమనేది..
4877. కన్నుల్లో ఎరుపందుకేగా..
నీకిష్టం లేకుండా ఏడుకొండలు నడిపించానని..
4878. శిశిరమెళ్ళేదాకా ఆగమంటున్నా..
నేనేసే రంగవల్లులు వేసవిగాలికి ఎగిరిపోరాదనే..
4879. విభేదిస్తున్న కల..
విరహంలో విహారాలు నీ కల్పితాలని..
4880. చూపుకదుపు నేర్పనట్లున్నావుగా..
ఏకాంతంలో చైత్రమై నన్ను చుట్టుకోమంటూ..
4881. చెక్కిళ్ళు కుంకుమలై నవ్వుకున్నాయి..
సంగీతాన్ని కనిపెట్టిన అందెలకేగా..
4882. శూన్యం వెలిగిందందుకేనేమో..
నీ చిటికెనవేలుతో నన్ను కలిపి..
4883. కనిపెట్టేసా ఆమనొచ్చిందని..
కోయిలవై విభావరికి రమ్మని కబురెట్టగానే..
4884. గోధూళివేళంటే నాకూ ఇష్టమే..
నిన్నుచేరే సమయం దగ్గరవుతోందని..
4885. కలకలమెందుకో కనులలో..
కలవరాలు పుట్టింది నీ మనసులోనైతే..
4886. ముకుళించుకుంటున్న అధరాలు..
స్వప్నమై చూపుల్లోకొచ్చి చొరవగా చేరిపోయావని..
4887. మౌనవిలాపమది..
మనసుని తడిమిన నీ స్మృతుల సందోహాలసడి..
4888. కేరింతలు కొడుతున్న అధరాలు..
అందమైన ఆకర్షణ నీకందించేందుకు..
4889. మకరందంగా మార్చేస్తావెందుకో..
నీ ఆంతర్యాన్ని అక్షరాలలో అనువదించి..
4890. మైకమొద్దన్నాందుకే..
హృదయస్పందన నిశ్శబ్దంగానే సాగనిద్దామని..
4891. వినోదంలో నిట్టూర్పులెందుకో..
నా సౌరభాలను మనసుతో ఆఘ్రాణిస్తూ..
4892. నువ్వే ఒక తమకం..
అనురక్తితోనే నన్ను దహించేస్తూ..
4893. మాలికలకెందుకిన్ని సెగలు పుట్టిస్తావో..
చూపులతోనే సన్నాయిలు పాడి..
4894. మెలకువగానే ఉన్నాగా రేయంతా..
మధురభావాలతోనే నన్ను ముడేసినందుకు..
4895. సుఖదుఃఖాలంటే ఏమోననుకున్నాను..
నీ ప్రేమలో పెనుతుఫానయ్యే వరకూ..
4896. పదనిసలన్నీ పరువానికెరుక..
నీ రాకతో నాహృది ఏరువాక.. 
4897. ప్రవహిస్తున్న మౌనం..
నిన్నూ నన్నూ కలిపే వారధిగా..
4898. గుండెకు చిల్లుపడింది..
నీ ఊసుల గలగలలకి బలహీనపడి..
4899. బ్రతికి బట్టకట్టా..
నీ మాటలు ప్రాణం పోసాయనే..
4900. వేదాంతభేరి వినబడుతోంది..
నిజాలు మాట్లాడాలని నోరు తెరిసినప్పుడల్లా..

This email has been sent from a virus-free computer protected by Avast. 
www.avast.com

No comments:

Post a Comment