Tuesday, 7 March 2017

4601 to 4700

4601. కాలానికి పరిచయవాక్యమేముంది..
అనుభవాల బరువుకి రోజులు కుంగిపోతుంటే..
4602. ఎవ్వరూ అనాధలు కాలేరేమో..
ఆకాశంలో ఆచంద్రార్కులు తోడున్నంతవరకూ..
4603. దాచుకోవాలన్న స్వార్ధం పెరిగిపోతుంది..
క్షణాలు తూనీగలై పరిగెడుతుంటే..
4604. భావానికందని శూన్యం..
మౌనంపు మరుగీతిలా..
4605. అనుభూతికందని పరిమళమది..
ఆనందం నీలా.. నాలో కరిగిపోతూ..
4606. పదములు అందెలై మోగాయి..
భావాలు సవ్వడి చేస్తుండగా..
4607. వియోగంలో లేఖలొద్దన్నానందుకే..
రెప్పలపై రాసిన లేఖలు చదువుకోవచ్చనే..
4608. అనుసరిస్తూనే ఉంది మనసు నిన్ను..
కన్నీటిని రాసే అవకాశం నీకివ్వరాదనే..
4609. నీ కలలవనంలో నా కవనమాల..
నీ ఎదురుచూపులకు నా పదములుగా..
4610. విమర్శిస్తుంటే తెలిసిపోయిందిలే..
నన్ను లోలోపలే మెచ్చుకునే మనసొకటుందని..
4611. ఒంటరితనం రోదిస్తోంది..
చేరువ కాలేని హృదయాన్ని తలచితలచి
4612. కలువనై విరబూస్తున్నా..
కనులకొలనులో నేనొదిగిపోవాలని..
4613. కొన్ని స్మృతులంతే..
మదిలో ముగిసినట్లే విషాదాన్ని పొడిగిస్తాయి..
4614. ఎప్పుడు పుట్టిందో తెలీదు..
తనుంటే మాత్రం స్వర్గమే..
4615. ప్రేమెప్పుడూ ప్రత్యేకమే..
అందుకే ప్రేమించబడాలనే తాపత్రయం హృదయానికి..
4616. అడుగులో అడుగులే నావెప్పుడూ..
ఏ గమ్యమైనా కలిసేనంటూ..
4617. ఒకరిని మించి మరొకరు..
ప్రేమయుద్ధంలో గెలిచి తీరాలనుకుంటూ..
4618. కలలన్నీ కల్లలే..
కన్నీటిసంద్రంలో మునిగి తేలడం తెలియక..
4619. తీరని మోమాటాలే..
శ్వాసలు కలసినా తీరని దాహాలతో..
4620. కువకువలాడుతున్న కోకిలనే..
పూలతెమ్మెరలో చేరి వసంతాన్ని రువ్వాలని..
4621. ప్రేమను ప్రేమించమని అడిగింది..
నువ్వే ప్రేమకు ప్రాణమన్నావని..
4622. ప్రేమకానుక నచ్చింది..
అక్షరాలు మెరుపులకి మనసు వెలిగిపోతుంటే..
4623. కన్నుల్లో వెన్నెలైన ప్రేమ..
హృదయంలోని అనుభూతి ప్రతిబింబమేగా
4624. సవ్వడిస్తున్న అక్షరాలు..
నీ అరచేతిలో ఆణిముత్యాలుగా మారి..
4625. పిల్లగాలేననుకున్నా..
నన్నెత్తి గుబులుతీరంలో పడేసేవరకూ..
4626. మల్లికగా మార్చేసుకోవా..
మరోసారి పరిమళాన్ని పంచేందుకు అవకాశమిస్తా..
4627. మౌనగమ్యం నిర్దేసించావెందుకో..
మాటలతో గలగలలాడుతూ నీకోసం నేనొస్తే..
4628. అనుభూతుల రవళింపేమోనది..
అరమోడ్పు రెప్పల్లో వినబడుతున్న మధురసడి..
4629. నిశ్శబ్దం చెదిరిన సవ్వడి..
మనసు పలికే మౌనగీతమనుకుంటా..
4630. ఏకాకితనమే మిగిలింది..
నీ అన్వేషణలో నేను విఫలమయ్యాక.
4631. మనోవనమంతా నీ పాదముద్రల చిహ్నాలు..
రేయంతా విహరించింది నువ్వేనని పట్టించేస్తూ
4632. పదునైనదే నీ శ్వాస..
నిశ్వసించేలోపునే నన్ను పట్టించేస్తూ..
4633. సమస్యే అతనికి ధైర్యమిచ్చిందట..
ఆత్మహత్య మహాపాపమని భయపడుతుంటే..
4634. నీ కలలకు ఏలుబడి నేనేగా..
నా చూపుల చేతబడి నీదైనందుకు..
4635. కొన్ని జీవితాలంతే..
మరణించి విముక్తి పొందాలనే ఆరాటంలో తనువు చాలించుకుంటూ.. 
4636. పవిత్రమైపోయానప్పుడే..
నిర్మాల్యమని నన్ను పక్కకి పెట్టగానే..
4637. వెలివేయాల్సిందే కొన్ని ఆలోచనలను...
నిప్పులేకుండానే పొగపెట్టాలని చూస్తుంటే..
4638. మానవత్వం మరుగునపడింది..
ఆప్యాయతలు కరువైన ఆ ఒంటరితనానికి..
4639. చీకటిపడితేనేగా నవ్వులు వికసించేది..
పగలంతా నీ వియోగంలో..
4640. చిగురింతలెందుకులే నెలవంక..
నా వంక క్రీగంట చూడకుండానే..
4641. గిలిగింతలన్నీ గాల్లోనే..
మాఘమాసం వెచ్చగా వెన్నెలను వేడుకుంటుంటే
4642. మరకతమైతే చాలనుకున్నా..
కాస్త విభిన్నంగా ఉండాలనే ఆకాంక్షలో..
4643. చెలిమొక చేబదులే..
మన సంతోషాలన్నీ స్నేహంతోనే ముడిపడుతూ..
4644. ప్రణయానికి గొడుగెందుకో..
ఎండల్లోనూ వెన్నెలై మనసు ఓలలాడుతుంటే..
4645. ఆ ఒక్కక్షణాన్ని గెలిస్తే చాలు..
జీవితముతో పోరాడే ధైర్యం తోడయ్యేందుకు..
4646. రాగబంధమయ్యానప్పుడే..
నీ కృతిలో నన్ను అనుపల్లవిగా పాడినప్పుడే..
4647. అల్లరికదుపేముందిలే..
పలకరిస్తే పదనిసలో కలిసిపోతానంటూ..
4648. చలేస్తుంటే ముసుగేసుకున్నావుగా..
హేమంతమై నేనొచ్చానని గుర్తైనా పట్టకుండా..
4649. ముందే కురిసింది వెన్నెల..
నేనింకో వారముందని విశ్రమిస్తుంటే..
4650. శిశిరమూ తిరిగి చిగురిస్తుంది..
ఋతురాగాలను శృతిచేసేందుకు రాలిపోయినా..
4651. మరుపును హత్తుకోవాలప్పుడప్పుడూ..
మమతలు కొన్ని మధురిమగా మిగిలిపోవాలనుకుంటే..
4652. ఎన్ని శిల్పాలకు ప్రాణం పోయాలో..
తిరిగవి నా వెంటేపడి వేధిస్తుంటే..
4653. ఆ చూపులు చంగావులే..
నన్ను వశీకరణం చేసేస్తూ..
4654. చల్లబడింది మనసు..
కురిసి విరిసిన హరివిల్లును చూడగానే..
4655. అభావాన్ని పూర్తిచేద్దామనుకున్నా..
సంపూర్ణంగా నీ అడుగులో అడుగులేసి..
4656. దూరం జరిగిపోయిన శాంతి..
జయించలేని బలహీనతలు తోడైనందుకు..
4657. పునరుత్తేజంతో వెలగాలి..
కొత్తఆశలకు పురుడుపోస్తూనే..
4658. సజీవినని మరచిపోతున్నా..
మరణించాలనే ఆశ వృద్ధి చెందుతుంటే..
4659. విలవిలలాడుతున్న తరువు..
నీడిచ్చి ఊపిరిపోసినా స్వచ్ఛం కాని హృదయాల్ని చూసి..
4660. స్వగతమే మిగిలింది..
తను విగతమయ్యాక..
4661. హృదయానికి చెలియలకట్ట లేదని తెలుస్తోందిప్పుడు..
నీ విరహంలో కన్నీరు వరదవుతుంటే..
4662. సమ్మేళనం బాగుంది..
మెరిసే చూపుల్లో అనురాగం తళుక్కుమంటుంటే..
4663. వరసెప్పుడు కలిపేసావో..
విషణ్ణవదనమై నేను రోదిస్తూ కూర్చుంటే..
4664. ఎన్నిచుక్కలు లెక్కించానో..
నీరూపుగా తలచిన నా ఒంటరితనములో..
4665. శిశిరంలో శీతలసమీరాలు..
నిశ్శబ్ద హృదయంలో భావుకతను వెతికేందుకేమో..
4666. ఝల్లుమంటున్న మానసం..
అనురాగమైన హృదయానికి శృతి తోడయ్యిందని..
4667. ఊహలకెన్ని కిలికించితాలో..
భావానికందని ఆకాంక్షలను పెనవేసి నవ్వుతున్నట్లు..
4668. 
నిన్నల్లో విడిచేసా నిట్టూర్పుని..
శిశిరంతో కలిసి శిధిలమవ్వాలనే
4669. అక్షరానికనేక రూపాలు..
ప్రతి సంధ్యనూ ప్రేమగా దిద్దేసుకుంటూ..
4670. అతిధిగా ఆహ్వానించినందుకేమో..
సమయం మించగానే తెరచాటుకి కనుమరుగయ్యిందామె..
4671. నక్షత్రాలు నవ్వుకున్నాయట...
స్ఫూర్తి కోసం రాత్రికై ఎదురుచూస్తున్నావని..
4672. నీరవం రవళించినప్పుడే అనుకున్నా..
ఏకాకితనం ఏకాంతమై ఎదురయ్యిందని..
4673. మూగబోయిన కోయిలలా నేను..
వర్షంనీరు తాగి గొంతుపోయినట్లుగా..
4674. కోరికల కెరటాలు..
అనురాగపు తీరాన్ని అల్లుకుపోయే ఆనందాలలో..
4675. అద్దంలోకెన్నడూ చూడమాకు..
లోకం కోసం ముసుగేసుకొనే ఉండమంటుంది..
4676. తేలికయ్యింది కాయమప్పుడే..
పరలోకపు పిలుపందిన ఆత్మ ఎగిరిపోగానే..
4677. అహరహాల కలమొకటి కావాలి..
కలల్ని గింజలపై రాయాలంటే..
4678. పరీవ్యాప్తమైన ఏమరుపాటు..
నన్ను నేనర్ధం చేసుకోలేని అంతర్నిహితాలలో..
4679. కలసిన హృదయాలకు కొదవలేదు..
జీవితనాటకాన్ని రక్తికట్టించే కొందరిజీవితాలలో..
4680. పులకించినప్పుడే అనుకున్నా..
మధుమాసమై నువ్వొచ్చేసావని..
4681. వెలుగునై చొరబడిపోయా..
నీ కవిహృదయంలో వేకువగా నన్నాహ్వానించావనే
4682. ఆజన్మ పిపాసిగానే మిగిలిపోతానేమో..
వెలుగుపూలకైన నా అన్వేషణలో
4683. నిశీధొక్కటే నిజం..
వెలుగొక ఆడంబరమైన ఆ జీవితానికి.
4684. ప్రతిపువ్వు నవ్వుతున్నందుకేమో..
నువ్వడుగేసే దారిలో వెన్నెల కిలకిలలు..
4685. ఓదార్చుకోవడం నేర్చేసుకున్నా..
బ్రతకాలని నిశ్చయించుకోగానే..
4686. శిశిరానికి వెలుగొచ్చింది..
మధుమాసపు మంచుతెరలు మదిలో తొలగించగానే..
4687. రేపటి వెన్నెలకై నిరీక్షిస్తున్నా..
నిన్నటి పున్నమిని తలచుకోవచ్చని..
4688. వేదనంతా వెన్నెలమయమయ్యింది..
ఒక్క వెలుగు తునక దరహాసించగానే
4689. చూస్తున్నా నిన్నే..
వెలుగుకిరణమై నా భావానికి ప్రేరణిచ్చావని..
4690. అమాస గుర్తులేదు..
పున్నమై నా ఎదురు నువ్వున్నందుకే
4691. అత్తరెందుకు అలిగిందో..
నా గంధాన్ని నువ్వు మెచ్చుకుంటుంటే..
4692. వెలుగులో విహరించాలనే ప్రయత్నమంతా..
చీకటిలోంచీ చూపును తప్పించైనా..
4693. వెన్నెలైన మనసు..
నీవొచ్చిన వైనానికి..
4694. మెరుస్తున్న వలపు..
భావ నీలాలకి చెక్కిళ్ళు చెమరించి..
4695. వెలుతురుకి పర్యాయమైపోయా..
నీ ప్రేమను అంటించుకున్న నేను..
4696. సంక్షిప్తమే కొన్ని కధలు..
కలలన్నీ కరిగిపోయిన నిదురలో..
4697. జలపాతమై ఎగిసిన ప్రణయం..
కలబోసుకున్న రుధిరాల సాక్షిగా..
4698. రసఝరీ యోగమున్నట్లనిపిస్తోంది..
జీవనవాహిని నీవైపు పరవళ్ళుగా ప్రవహిస్తుంటే
4699. అప్పుడప్పుడూ తలచుకోక తప్పలేదు..
జ్ఞాపకాలెప్పుడూ పచ్చగానే ఉన్నందుకే..
4700. నెలవంకనే మురిసిపోతున్నా..
ఆ పెదవులెన్ని వంకర్లు తిరిగినా



This email has been sent from a virus-free computer protected by Avast. 
www.avast.com

No comments:

Post a Comment