Tuesday, 7 March 2017

6301 to 6400

6301. కలసికట్టుగానే అక్షరాలన్నీ..
గొలుసుకట్టుగా భావాలను మది పేర్చుకుంటుంటే..
6302. అలవై అల్లినా చాలనుకున్నా..
తీరమై నిన్నక్కున చేర్చేందుకు..
6303. మాటలు కాలేని భావాలెన్నో..
మౌనంలోనే మనసును దాచేస్తూ..
6304. కొట్టుకుపోవాలనుందలా స్మృతులలోనే..
మనసు సాంత్వన కన్నీటితోనే వస్తుంటే..
6305. మానసంలో ఊరుతున్న అమృతం..
ఆనందం కానుక నీవయ్యావని..
6306. ఆశలు నింపుకున్న రాతిరిలో వేచున్నా..
మధురాలు చిలికే వేకువై నువ్వొస్తావనే..
6307. నీలోని భావాలెప్పుడూ అంతేగా..
పాటలో పల్లవిగా మారైనా నన్ను చేరాలని తపిస్తూ..
6308. ఆలకిస్తూనే ఉన్నా నీ ఊసులన్నీ..
పదముల్లో కలిసి నన్ను చేరాయని..
6309. నిశీధిలో దాచేసా కొన్ని ఆశలందుకే..
అనుభూతులుగా మారలేమని వెనుకడుగు వేస్తుంటే..
6310. నల్ల కలువలా నువ్వొచ్చినప్పుడే అనుకున్నా..
నా ఎర్రదనాన్ని ఆరా తీసేసెందుకొచ్చావని..
6311. ఆయాసపడలేక చస్తున్నా..
నీ తలపులను వెంటాడినా లాభంలేక..
6312. మోవి మౌనాన్ని ముసుగేసింది..
చూపులతో చుంబనాలు చేరినందుకేగా..
6314. మది నర్తనం ఆపలేదింకా..
నీ మౌనరాగానికెంతగా లయమయ్యిందో..
6315. తలపులెందుకో దూరమయ్యాయి..
మనసు నిన్ను విషాదానికి విడిచేసిందేమో..
6316. అక్కడెక్కడో ఉంటావెందుకో..
నేనెక్కడెక్కడో నీకై వెతకలేక వేసారుతుంటే..
6317. గుర్తించలేని ఆనందాలెన్నో..
విషాదానికే అంకితమైపోయిన కొన్ని మనసుల్లో..
6318. ఒరుసుకుపోతున్న జ్ఞాపకాలు..
చిటికెడు తీపికోసం మనసులో వెతుక్కుంటూ..
6319. విఫలమయ్యింది ప్రేమ..
మనసుని చూడక పెదవులను తాకిందనే..
6320. రాస్తున్నా మాలికలెన్నో..
నీ మౌనాన్ని తర్జుమా చేసుకుంటూ..
6321. అనునయాలతోనే పొద్దుపోతుంది..
అలుకలపందిళ్ళు వేసి అలసిపోతుంటే మది..
6322. ఆ మనసులెప్పుడూ మేలిమే..
కళ్ళను కరిగించి చూస్తే..
6323. నా మనసుకెందుకో ఇన్ని అలజడులు..
పుంతలు తొక్కుతున్నది నీ భావాలైతే..
6324. నీకున్న భావాలు నాకున్నాయనుకోలేదు..
అక్షరమాలతో నన్ను అలంకరించేవరకూ..
6325. వలపు నృత్యం చూడాలనిపించింది..
మరోమారు నీ నోట వింటే నా మనసూగుతుందని..
6326. ఊహనెప్పుడో దూరం చేసుకున్నా..
నువ్వు లేనప్పుడు విలువైన కాలాన్నీ నవ్వునీ పారేసుకొని..
6327. పాపభీతికి చెల్లిస్తున్న ఋణాలేనవి..
హృదయాల్లో మానవత్వం నిండుకున్నందుకు..
6328. జీవితాలన్నీ అంతే..
ఆశనిరాశల నడుమ అర్ధంకాని నాటకాలు..
6329. కనుమరుగవుతున్న నీ రూపం..
జ్ఞాపకాలు ఒకొక్కటిగా వెలిసిపోతుంటే..
6330. తానే ఆనందం..
ఆశను శ్వాసించే జీవితానికి సాంత్వనం..
6331. అనుభూతుల గవ్వలెప్పటికీ అపురూపమేగా..
జ్ఞాపకాలు దోసిట్లో ఒంపుకుంటుంటే..
6332. నీ మనసులోకెప్పుడు చేరిందో నా మౌనం..
భావ పవనాలుగా సాగి నీలో నిండిపోతూ..
6333. కలలోనూ ఇసుకమేడలే కడతావెందుకో..
కన్నీటివరదకి కొట్టుకుపోతాయని తెలిసీ..
6334. పగలైనా రెప్పలు మూసే ఉంచుతానిక..
నీ రాతలకు ఆకాశం నేనవుతూ..
6335. అమాసని సైతం మరచావెందుకో..
వెన్నెల నీ చెంతనే ఉందని లోకాన్ని దెప్పుతూ..
6336. జలపుష్పాలన్నప్పుడే అనుకున్నా..
నా కన్నులను కన్నీటికి అప్పచెప్తావని..
6337. దాచలేకపోతున్నా హృదయాన్ని..
అదేపనిగా నువ్విలా వెంటపడి ఊహల్లోకి పోదాం రమ్మంటుంటే..
6338. భావాలే కలిపాయనుకున్నా ఇద్దరినీ..
మనసులు తలో దూరమయ్యేవరకూ..
6339. సమన్వయం లోపించింది..
పగలూరాత్రీ తేడా కనిపెట్టలేని మౌనభాష్యాలకి..
6340. వధిస్తున్న శూన్యం..
నేనెక్కడున్ననో గుర్తుచేయలేనంటూ..
6341. కనుగవ్వలా చేరిపోయానందుకే..
నీ చూపులో గువ్వనై వెచ్చగుందామని..
6342. ఎప్పటికైనా చేరుకోవాలనుకున్నది నిన్నేగా..
కాలమెన్ని కష్టాలను కానుకిస్తున్నా..
6343. అంటరానిదానిగా మారిపోయాననుకోలా..
కలలోనూ నీవంత దూరం జరిగాక..
6344. నీ హృదయాకాశం నాదేగా అన్నదామె..
చుక్కలేవని మాత్రం అడగొద్దు అన్నాడతను..
6345. సౌందర్యంగా మారిన శిలనే..
నీ ఊహల కదలికతో నాకు ప్రాణం పోసినందుకు..
6346. సౌందర్యం విస్తుపోయింది..
తనను మించి ఆమెలో ఏముందోనని..
6347. సౌందర్యం ఉదయించినట్లుంది..
కన్నుల కవాటంలో సూర్యోదయం తిలకించగానే..
6348. మంచుపర్వతమై ఘనీభవించలేదని సంబరపడ్డా..
అమాసకు వెన్నెల రాలేదనే..
6349. ఊహలన్నింటినీ దాచుకుంటున్నా..
భావమాలికలు కూర్చి నీకు అలంకరిద్దామనే..
6350. ప్రాణమొక రాగం..
ఆత్మ పాడుకొనే ప్రార్ధనా గీతం..
6351. ప్రేమనక్షత్రమొకటి ఉదయించింది..
వేకువ వెచ్చదనాన్ని రాత్రికి పరిచయించేందుకే..
6352. కన్నులు మూసినా కనపడుతోంది..
తనలోని సౌందర్యం అంతటిదనేగా..
6353. నీ తలపుకే చిక్కుకుపోతున్నా..
ఏకాంతం కాస్త కరుణించగానే
6354. . ఈనాటి నా సౌందర్యం..
నిన్నటి మన ప్రేమాభిరామం
6355. ఏకాత్మగా మిగిలిపోదామనుకున్నా..
మనిద్దరం సమానమని ఒక్కసారైనా నువ్వంటే..
6356. నా హృదయం బరువెక్కుతోందెందుకో..
అంబారీ అంటూ భావాలన్నీ నన్ను సవారీ చేస్తుంటే..
6357. కాలమాగినట్లే ఉంది..
నీ ప్రేమకై వేచే నా ఒడినింకా నింపలేదని..
6358. జీవితమెప్పుడొ వ్యధే..
అనవసర వ్యాపకాలతో..
6359. అందం గంధమై గుభాళిస్తుంది..
నీ మాటల్లో పరిమళాలకేమో..
6360. అక్షరాలకెన్ని సొబగులద్దావో..
నా సౌందర్యాన్ని విభిన్నంగా ఆవిష్కరించాలని..
6361. వియోగ వనవాసం ముగించేద్దాంలే త్వరలో..
లోకుల కళ్ళల్లో గ్రీష్మాన్ని నింపేస్తూ..
6362. పారిజాతమని పోల్చినందుకేమో..
వేకువకే వెదజల్లే నవ్వుల పరిమళాలు..
6364. అకాలంలో వచ్చినట్లుంది వసంతం..
ఊసులతోనే కోలాటం కనువిందవుతుంటే..
6365. రాతిరెప్పుడూ చిలిపి అల్లరే..
వేకువప్పుడే అవకపోతే బాగుండని..
6366. నీ మనసు మోసిన కబురులన్నీ విన్నాలే..
వానకోయిలొచ్చి సన్నాయిగా పాడి వినిపించగానే..
6367. మరో సౌందర్యలహరవుతుందేమో..
ద్విపదాలన్నీ రాశిగా కలిసి కృతులవుతుంటే..
6368. కొన్ని నవ్వులు నిజాన్ని దాచేందుకు..
హృదయాన్ని దాచలేని కన్నుల కదలికలో..
6369.నా మువ్వలమోతలో ఎన్ని సందేశాలొ..
నీ గుండెచప్పుళ్ళను అనువదించే వేళలో..
6370. మల్లె రెక్కలన్నీ మందారాలయ్యాయి..
నిన్ను చూసిన సిగ్గులోనేగా..
6371. మనిద్దరం మమేకమైన రహస్యం..
మల్లే మరువం కలిసినట్టుగా..
6372. ప్రేమయుద్ధంలో గెలమంటున్నా..
నిన్ను నా రాజుగా ప్రకటించాలనే..
6373. సహనం చచ్చిన అనురాగం నాది..
అనుబంధంలో ఇమడలేవని ప్రతిసారీ నువ్వంటుంటే..
6374. కన్నుల యవనికను ఎప్పుడు దాటావో..
కవనాలుగా అనువదించుకొని పొగిడేస్తూ నన్ను..
6375. వలపుగీతాలేగా నావన్నీ..
నీ నవ్వులను అక్షరంగా రాస్తున్నానంటే..
6376. ఎంత ఊయలూగిందో నీ మది..
అక్షరంగా మారి ఒయ్యారం ఒలికించేందుకు..
6377. చీకటికే నన్నంకితం చేసావు..
వెన్నెలంతా మనదేనని మాటిచ్చి..
6378. ఉసురు తీసే ఊహలే కొన్ని..
ఆప్యాయతను చిదిమేసి పదేపదే గుర్తుకొస్తూ..
6379. అమ్మానాన్నలు రధసారధులే..
మన జీవితమే అందమైన పయనమనుకుంటే..
6380. తన తలపొక్కటైనా చాలు..
పొద్దుతిరుగుడుపువ్వై నే విరిసేందుకు..
6381. ఇప్పటిదాకా వీచిన గాలి నేనేగా..
తెరలుతెరలుగా నా పరిమళాన్ని నీకందిస్తూ..
6382. ఆనందమనే హత్తుకుపోయా..
సంతోషం నీ దగ్గరుందని కనిపెట్టాక..
6383. పట్టుకోలేకున్నా దోబూచులాడే మనసును..
ముసురేస్తూనే మబ్బులోకెగిరి విహరిస్తుంటే..
6384. కవనమైపోయా నేనెప్పుడో నీ కలంలో..
కలలోకి కనిపించింది నేనని కనిపెట్టగానే..
6385. మదిలో మొదలయ్యిందో ఆనందపు సొద..
నాదంగా ఎగిసి నీలో పలకాలని..
6386. నక్షత్రాలే కొన్ని అక్షరాలు..
కన్నుల్లో వెలుతురై కురిసిపోతూ..
6387. నీ పొగడ్తలకే నవ్వుతున్నా..
నన్నగడ్తలో ముంచి తీసావని..
6388. ప్రకృతి పరిచయమయ్యింది ఆ కిటికీతోనే..
మనసు దాటిన మనోరధం కదలగానే..
6389. గమనం ఆనందకరమయ్యింది..
గమ్యం దాకా అడుగులు కలిపిన నేస్తం దొరికిందని..
6390. మౌనస్వరాలెన్నో..
తమకు తామే చైతన్యాన్ని నింపుకొని ప్రవహించేవేళ..
6391. నిర్ఝర నిశ్శబ్దం..
నిద్రించిన జీవితమొకటి మరణించిన ఆనవాలు..
6392. మాటలతో మంత్రించేది నువ్వని తెలుసుకున్నా..
చూపులతో కట్టేయాలని నేను చూస్తుంటే..
6393. ఎక్కడో వెతికా వెన్నెల..
హృదయాంతరాళలో వెలుగుతుందని తెలియక..
6394. కొన్ని సంతోషాలంతే..
జీవ లహరిగా మనతోనే సాగుతూంటాయి..
6395. అమ్మా నాన్నా ఆధునిక యంత్రాలే..
పిల్లల జీవనాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు..
6396. నీ జ్ఞాపకాల జడివానతో మురిసిపోతున్నా..
వేరే వర్షాకాలంతో పనిలేదని మనసంటుంటే..
6397. సన్నాయిని సరిచేయొచ్చుగా..
అపశృతుల 
వీణను భరించే బదులుగా..
6398. ఎన్నవకాశాలించిందో విధి..
చూపులతోనే ఈ జన్మను సరిపుచ్చమంటూ..
6399. నా మనసుకెప్పుడూ సౌరభాలే..
స్పర్శను కానుకగా నువ్వడిగినందుకేమో..
6400. దూరాన్ని జయించినట్లనిపిస్తోంది..
మనసెప్పుడూ నీ చుట్టూనే పరిభ్రమిస్తుంటే..


Virus-free. www.avast.com

No comments:

Post a Comment