Tuesday, 7 March 2017

7201 to 7300

7201. అనుబంధపు చిరునామా ఎందుకనుకున్నా..
అనురాగ గమ్యమై నువ్వెదురవగానే..
7202.పల్లవిగా మారిపోతున్నా..
అనుపల్లవై నా వెనుకే నువ్వుంటావని..
7203. కాలమాగినట్లు అనిపిస్తుంది..
నీ విరహంలో కదలనని మొరాయిస్తుంటే..
7204. మమతలు కలిసిన మల్లెలకెన్ని ఘుమఘుమలో..
మన హృదయాలలో ప్రణయమై వికసిస్తుంటే..
7205. నువ్వు చల్లిన చూపుల సాక్షి..
నా చెక్కిళ్ళు కెంపులయ్యింది నిజమే..
7206. మిణుగురులేగా నా కళ్ళు..
చీకటి నిండిన నీ హృదయానికి దారిచూపు జలతారులు..
7207. మేఘం ముసిరితేనేముందిలే..
కురుస్తున్నది మన వలపు జల్లైనప్పుడు..
7208. పునరంకితమైపోనా..
ఊహలతెమ్మరలోని కదలికలోనూ నన్నే రమ్మంటే..
7209. గ్రీష్మంలోనూ చెమరిస్తున్నా..
తన నవ్వులజల్లుల్లో తడిచింది మది..
7210. అడుగు దూరంలోనే ఉంది విజయం..
అలసిపోక అడుగేస్తేనే వరిస్తుంది సత్యం..
7211. డబ్బంతే..
అనుబంధాలను ధిక్కరించి స్నేహాన్ని దూరం చేస్తుంది..
7212. నడిమంత్రపు సిరది..
ఇష్టానుసారంగా మనసులు విరిచి ధ్వనిస్తుంది..
7213. కలం పట్టినప్పుడే అనుకున్నా..
చీకట్లను చెండాడేందుకు నిర్ణయించుకున్నావని..
7214. జీవితం వికసించింది..
మన కలయికలో విరహం రాలిపోగానే..
7215. రాతిరికై  ఎదురుచూస్తుంటావనుకున్నా..
జలాతారులై కురిసే నా చూపుల వెన్నెల్లో తడిచేందుకు..
7216. మనసు కలిపానందుకే..
మౌనాన్ని జయించి మాటలు కదలాలనే..
7217. చిత్తరువునవుతున్నా..
నీ మదిలోనే సొగసు దిద్దుకుంటూ..
7218. కన్నులు నవ్వుకున్నాయట..
చీకటిని తన కాటుకతో పోల్చుతున్నందుకు..
7219. అప్పుడప్పుడూ మౌనమే మేలనిపిస్తుంది..
మాటలతో మనస్పర్ధలు పెంచుకొనేకన్నా..
7220. మాట్లాడకుండానే మాయ చేయడం తెలుసుగా..
చిలిపి చేతల చైతన్యమందించే నీకు..
7221. మనసుకెంత అసౌకర్యమవుతుందో..
వానాకాలాన్ని పట్టించుకోని ఋతువుల్ని తలచుకుంటుంటే..
7222. గెలవాలంటే కధానాయకుని ధీరత్వాన్ని ఆవహించాలిగా..
యుద్దం చేయక తప్పని జీవితంలో..
7223. కలల తాకిడికే విలవిలలాడుతున్నా..
నిజమయ్యేలా ఒక్కటీ అనిపించట్లేదనే..
7224.ఆదమరపో..మైమరపో..
నీ తలపుల్లో మరుపైతే తధ్యం..
7225. అలాగే మిగిలిపోయా..
మనసు నీతో కలిసి నేనొంటరయ్యాక
7226. సౌందర్యాన్ని పెనవేసుకున్నా..
చెవులు మూసుకున్నా రాగమొకటి వినబడుతుంటే
7227. పట్టించుకోడమెందుకు ప్రపంచాన్ని..
ప్రతిసారీ నీతో వితండానికి దిగుతుంటే
7228. ఊపిరి తేలికయ్యింది..
రేపటి విజయాన్ని ఈరోజు భావించగానే..
7229. మనసుకి మరింత పెరిగిన ఒత్తిడి..
ఊహించలేని అభిప్రాయాల వలలో చిత్తడయ్యి..
7230. అక్షరాలకెంత సొగసో..
ఒద్దికగా నువ్వమర్చిన పదాల సోయగంలో..
7231. హృదయాన్ని చిలుకుతున్న నీ చూపులు..
కన్నుల్లో నా రూపం పదిలమైనందుకు..
7232. వయసు కరగడం గమనించలేదు..
మనసు నిత్యాగ్నిహోత్రంలా మండుతుంటే..
7233. మబ్బుల్లో తేలుతున్నట్లుంది..
నీ మాటలు ఆకాశవాణిగా వినబడుతుంటే
7234. తెలుగెప్పుడూ తీయనే..
మకరందాన్ని తాగాలనే మనసుండాలే గానీ..
7235. నాకుగా నేనొచ్చా..
నీ ఒంటరితనానికి చేయిచ్చి ఆదుకోవాలనే
7236. అడుగులు కలపగలననుకోలేదు..
మంచితనం..అందం..నీలా ఎదురయ్యేవరకూ..
7237. పువ్వులకప్పుడేగా పండుగ..
దేవునిగుడిలోకో..ముదిత ముడిలోకో చేరినప్పుడు..
7238. మౌనం మాటలు వెతుక్కుంటోంది..
కొన్ని భావాలను వ్యక్తీకరించాలని..
7239. నీ పలకరింపు పుప్పొళ్ళే..
నాలో అనందపు రహస్యాలు..
7240. చెలిమెంత లోకువవుతుందో..
పట్టుకోవడం రాని చేతుల్లోంచి జారిపడి..
7241. మనసు గమ్యం నువ్వయ్యావు..
పిలవకుండానే ప్రతిరేయి కల్లోకొచ్చి..
7242. హృదయంలో ఇంకిపోయింది కన్నీరు..
రెప్పల పహారా దాటి బయటకు పోలేని కట్టడిలోనే..
7243. నీ మనసిప్పుడే తెలిసింది..
 చిరుగాలిగా అవతారమెత్తి ఆమె నవ్వును సొంతం చేసుకుంటున్నావని..
7244. విరిసీ విరియని నీ పెదవుల లాస్యం..
వింజామరలై వీచే చెలి కురుల కుహూరావం..
7245. గజ్జెకట్టింది మది..
నా అడుగులను అనుసరించింది నువ్వనే..
7246. ఆనందం అనుభవైకవేద్యం..
హృదయాల ఆలింగమైనప్పుడే..
7247. యుద్ధం చేయక తప్పదు..
జీవితాన్నో నిత్యపోరాటముగా స్వీకరించాక..
7247. మౌనంపైనే మనసవుతోంది..
ఒంటరితనాన్ని ఏమార్చి ఏకాంతంగా మార్చుకున్నవేళ..
7248. మౌనంపైనే మనసవుతోంది..
ఏకాంతంలో నీ ఊసులు వీనులవిందవుతుంటే..
7249. పైసా ఖర్చులేని ఈర్ష్యాసూయలు..
పదిమందిలో పలుచనయ్యే భోళామనుషులు.. 
7250. చూపులకెంత మెరుపొచ్చిందో..
అమాసనాడు పున్నమై నువ్వెదురైన రేయి
7251. కలిసుండాలనే కోరికే మనసుది..
ఎవరికి వారే యమునా తీరన్నట్లు మనుషులు లేకుంటే..
7252. కుసుమిస్తున్న కలలెన్నో..
కరుగుతున్న రాతిరిని ఆపలేని తొలివేకువలో..
7253. రాలుతున్న ఆశలకు ఆనాడే తెలుసేమో..
పెంచుకున్న మమకారాపు మిధ్యాబింబాల స్వరూపాలు..
7254. చెమ్మగిల్లిన హృదయమే చెప్పగలదేమో..
నీరింకిన నయనాల నిషాదం..
7255. ఊపిరెంత బరువెక్కుతోందో..
నీ తడిపొడి మాటలను తలిచేకొద్దీ..
7256. నీ మదిలో చేరినప్పుడే అనుకున్నా..
అణువణువు లయలో నన్నే నింపుకున్నావని..
7257. మనసునోసారి తట్టిచూడు..
అంతరంగంలోని ప్రకంపన రొప్పుతూ వినబడాలంటే..
7258. దగ్గరవుతూ అనుకున్నా..
ఇక దూరమవడం కలలోనైనా కుదరొద్దని..
7259. మనసు కోయిలయ్యింది..
వానాకాలమైనా వసంతం పోతపోసుకుని నువ్వొచ్చావని..
7260. గెలిచేం సాధించానో తెలియలేదు..
ఆలోచనల పొద్దుపొడుపు ఆశల్లో..
7261. మనసలా రోదిస్తూనే ఉందింకా..
కొన్నిమాటల శరాల గిచ్చుళ్ళకి
7262. పదమవ్వనా..
నీ హృదయాన్ని రాసేంత వరకూ..
7263. మనసును కొలవడం మానేసాను..
విషాదపు లోతును కనుగొనలేకనే..
7264. నీ మనసిప్పుడే తెలిసింది..
మన హృదయాల ఆలింగనమైనందుకే..:)
7265.నమ్మకమొకటి మరణించింది నిజమే..
అనుబంధాలు దూరమై ఒంటరయ్యాక..
7266. పూలను కాదని పరిమళమెటు పోయిందో..
నన్ను కాదని దూరమైన నీలా..
7267. మనసుకు మాత్రమే తెలిసిన నిజం..
నువ్వో నేనూ ఏకమైన తన్మయత్వం..
7268. పువ్వులెన్నని వెతుకుతున్నానో..
నిన్ను పోలిన నవ్వు దొరుకుతుందేమోనని..
7269. చూపులతో చుంబించాననుకోలా..
నీ కన్నులు నిమీలితమై నవ్వేంతవరకూ.
7270. అస్తిత్వాన్ని గెలిపించేదెవరని..
మొదలెట్టిన అడుగులన్నీ గమ్యాన్ని చేరనట్టుగా..
7271. అంతటా ఆనందమే..
వినిపించిన వేయిరాగాలు నన్నే పాడుతుంటే..
7272. నా తలపంతా నీదేగా..
నేను అక్షరాన్ని పరామర్శించినప్పుడల్లా..
7273. కదలని రాతిరి..
గడ్డకట్టిన స్మృతులలో ఆవేదన ప్రవహిస్తుంటే..
7274. నీ వలపంతా నామీదేగా..
నా ఆలోచనను చేరదీసాక..
7275. బాధపెట్టని జ్ఞాపకమొకటి..
తలచినప్పుడాల్లా కన్నుల్లో వెలుగై ప్రతిఫలిస్తుంది..
7276. అబద్దమెంత ఆనందించిందో..
నిజాన్ని కాదని తనని హత్తుకున్నాక..
7277. పువ్వులను పూసుకున్నా..
పరిమళిస్తే నా జాడ తేలికవుతుందని..
7278. అదురుతున్న అధరం..
నీ మాటలు నెమరేసుకున్న తీయదనం..
7279. వియోగమందుకే విస్తుపోయిందేమో..
కాలం విడదీసినా కలలు కలుపుతున్నాయని..
7280. డబ్బుకీ ప్రేమకీ లంకేముందిలే..
డబ్బున్నప్పుడు ప్రేమ పదింతలవుతుంటే..
7281. ఆరుకాలల గురించి ఆలోచించినప్పుడే అనుకున్నా..
ఏడుజన్మలూ కలిసున్నది మనం నిజమేనని..
7282. మధుపానమవుతూ నీ జ్ఞాపకాలు..
తలచినప్పుడల్లా మనసుకి మత్తునిస్తూ
7283. బలైపోతున్న ప్రేమలెన్నో..
ధన దాహానికి నీరివ్వలేని నిస్సహాయతలో..
7284. నిషాదాన్నే ఆలపిస్తోందిప్పుడు మది..
చెలికాడిచ్చిన నరకమదే మరి..
7285. ఒక స్వరమక్కడే మరణించింది..
గొంతు నులిమింది నువ్వయ్యాక.
7286. ఒక భావం రెక్కలిప్పింది..
పిలిచిన ప్రేయసి నీవయ్యాక..
7287. ఒక పాటకు పల్లవి కుదిరింది..
చరణంలో పదములై నువ్వు చేరువయ్యాక..
7288. నీకు నువ్వే సైన్యం..
ధైర్యలక్ష్మి నీకు తోడున్నంతవరకూ..
7289. బంధమని భ్రమపడ్డా..
నేనో పంజరానికి చిక్కానని గుర్తించక..
7290. ఆ కలానికెన్ని భావాలో..
ప్రేరణివ్వగలిగిన మనసు గొప్పదనమనుకుంట
7291. పువ్వుగానే పరిమళిస్తున్నా..
మన అనుబంధ గంధం ఇగిరిపోరాదని..
7292. ఉక్కిరిబిక్కిరవ్వాలనే కోరికేమిటో..
నీ ప్రేమ నిలువెల్లా అల్లుకుంటుంటే..
7293. బంధీకాక తప్పలేదు..
బంధనాలన్నీ నలువైపులా ముడేసి నిలబెట్టాక..
7294. ప్రేమరాహిత్యంలోంచీ రక్షించాలని నేనొచ్చా..
ప్రేమామృతంలో మునిగిపోతానని తెలియక..
7295. చెలివనే చేయూతనిచ్చా..
చేయి విడువని నమ్మకం నిలబెట్టుకుంటావనే..
7296. అర్ధాలెతకడం మానేసింది మనసు..
ఉదయాస్తమానాలూ నీతోనే సరిపోతుంటే..
7297. కొన్ని సమాధానాలంతే..
సందర్భాన్ని బట్టీ అనుకూలంగా మారిపోతుంటాయి..
7298. మళ్ళీ నువ్వే..
నన్ను పరామర్శించేందుకేమో చిరునవ్వై పూస్తావు..
7299. నిశ్శబ్దం మొగ్గతొడిగింది..
కలసిన మనసుల ఏకాంతాన్ని భగ్నపరచలేనని..
7300. గజ్జెకట్టిన నిశ్శబ్దమొకటి..
ప్రత్యూషపు సౌందర్యం పాటగా వినబడుతుంటే..

 

No comments:

Post a Comment