Tuesday, 7 March 2017

5201 to 5300

5201. నీ చిన్నారి ప్రపంచం నేనేగా..
ఒకరికి ఒకరైన గుండ్రటి పొదరింట్లో..
5202. మెచ్చిన గుండెకే తెలుసు..
నీ జ్ఞాపకాల పరిమళమెంతటిదో..
5203. జీవించడం మొదలయ్యింది..
నీ స్మృతుల సహవాసం నమ్మకమిచ్చాక..
5204. చిలుకగా మారిపోతానందుకే..
నా ముద్దుపలుకులు నువ్వాలకించే వేళ..
5205. సుకపికాలన్నీ నీకెరుకే..
నన్నాసాంతం కంఠతాపట్టిన చదువరి నీవని..
5206. నీవు నేర్పిన భాష్యాలేనన్నీ..
ప్రేమకు రంగులుగా అలదుకుంటూ..
5207. ఏమని ప్రతిస్పందించాలో నేను..
నీ స్పందనలా గుచ్చేస్తుంటే..
5208. ఒంటరితనమే బాగుంది..
నన్ను నాకు నిజాయితీగా చూపిస్తూ..
5209. ఆ కోయిల మూగబోయిందెప్పుడని..
వసంతమల్లే నువ్వు తోడయ్యాక..
5210. నేనే వృత్తమైపోయా..
చుట్టుకొలతై అల్లుకోవాలని..
5211. కన్నీరెంత వృధా చేసానో..
మరణంతో ముచ్చటించొచ్చని తెలియక..
5212. నీ అమృతత్వం అర్ధమైంది..
నా అసమ్మతిని స్వీకరించాక..
5213. నీ కోసమే ఋతురాగం మార్చేసా..
మొన్నెప్పుడో కోయిలగానంపై మనసు పడ్డావని..
5214. కన్నులే మాట్లాడుకుంటున్నాయిప్పుడు..
రుధిరస్రావాల విశేషాలను..
5215. మువ్వలందుకే మోగించా..
నీ హృదయానికి రాగరంజితం పరిచయించాలని..
5216. వేరే ఆలోచనలెందుకులే..
జీవనానికర్ధం నువ్వయ్యాక..
5217.  మౌనంపై ప్రేమయ్యింది..
ఎదలు ఏకమైనందుకే..
5218. ప్రగతిరథం ఆగిందక్కడే..
వితండవాదన మొదలైనప్పుడే.
5219. మున్ముందుకే సాగమంటున్నా..
నా తుదిభావం నువ్వని చెప్దామనే
5220. ప్రళయగర్జన ఆగిందిప్పుడే..
నీలోనూ ప్రణయముందని నే గుర్తించాక..
5221. మనసు నిర్మలమయ్యింది..
నీ కన్నుల్లో కలను నేనయ్యానంటే..
5222. ఎందుకంత నవ్వులపిచ్చో నీకు..
మాధుర్యమంతా మోవిలోనే ఉందంటూ..
5223. జలపాతంలో జార్చేస్తావనుకోలా..
నీ మనోవనంలో చిరుగజ్జెలు అల్లరిచేస్తున్నాయని..
5224. జీవించినందుకు సంతోషిస్తున్నా..
ఈ జన్మకి నీ ప్రేమ నాదేనని నమ్మకమొచ్చాక..
5225. పరుగాపని ఊహవేననుకున్నా..
నాకో క్షణకాలం విశ్రాంతి కరువవుతుంటే..
5226. సంతోషం గాలి తెమ్మెరై తాకుతోంది..
పారిజాతాలన్నీ నీ తలపునే వీస్తున్నందుకు.
5227. కలలోనెందుకో మనోవేదన..
ఆనందభాష్పాలిచ్చే నేను నీకెదురే ఉండగా..
5228. సంపెంగని మాత్రమే చేరదీస్తున్నా..
నా ముంగురులకవే మక్కువయ్యాయని..
5229. వసంతమొస్తుందని గుర్తుచేస్తున్న వలపు..
వైశాఖంలో వైభోగానికి త్వరపడమంటూ..
5230. కఠినాత్ముడే..
కలలోక్కాదు..కౌగిలిలోకి రమ్మంటూ..
5231. ప్రయాణమంతా పదనిసలేగా..
అడ్డదారిలో ఆలశ్యంగా గమ్యం చేరినా..
5232. భావాలెన్నుంటేనేమి..
నా అనుభూతొక్కటీ నిన్ను స్పృశించలేకపోతుంటే..
5233. వలపుసీమకు దారి సుగమం చేసా..
సౌందర్యాన్ని అన్వేషిస్తూ తప్పక నువ్వొస్తావనేగా..
5234. గంధర్వయఙ్ఞాలెన్ని చేసానో..
నీకోసమొక్క సుందర భవనాన్ని సృష్టించేందుకు
5235. కలగన్నానని భ్రమపడతావే..
నేనే కోయిలనై నిన్ను పాడుతుంటే
5236. యవ్వనమేమీ వృధా కాదులే..
రసప్లావితమైన వాసంతిక నీతోనుండగా..
5237. అలంకారాలతో అలరించింది చాలుగా..
నేనే పూబాలనై విరిసిపోగా..
5238. నా హృది మౌనవించింది..
ఒంటరితనాన్ని మరోమారు తడుముకొని..
5239. హృదయతంత్రుల మాటేమిటో..
ఏకరాగం ఆలపిస్తుంటే ఆపేందుకు నీవెవరివో..
5240. నీ దృష్టి మారినట్లుంది..
ఇన్నాళ్ళకు నా నవ్వును సరైన భావంతో అంగీకరించినందుకు..
5241. మనసుకి శీలమే లేదట..
మనిషి ద్వంద్వాల్లో కొట్టుకుంటుంటే..
5242. నిన్నిక్కడ చూసినప్పుడే కనిపెట్టేసా
మన్మధుడు మారువేషంలో తిరుగుతున్నాడని..
5243. వసంతమల్లే విచ్చేసింది నువ్వేగా..
మారుపేరుతో సత్కరిస్తుంటే తప్పేమిటో..
5244. కొసరి కొసరి ప్రేమిస్తున్నా..
లోకుల దృష్టి పడరాదనే..
5245. తరంగానికో తలపవుతోంది..
నీ భావసమీరాలు అలవోకగా నన్నల్లుకున్నందుకే..
5246. నువ్వో గాంధారం..
పాడితే సంగీతం..అలదుకుంటే సింధూరం..
5247. నా ఊపిరికి మాత్రమే తెలుసు..
నిన్ను ఉచ్ఛ్వాసనిశ్వాసల్లో దాచుకున్న రహస్యం..
5248. కాలం ఆగినట్లుంది..
రెప్పలు వాల్చని చూపుతో నన్నభిషేకిస్తుంటే
5249. నమ్మకం బలపడింది..
రాతిని ప్రార్ధించినా ఫలితం దొరికాక..
5250. మనసెన్నిసార్లు మరణించిందో..
అస్తిత్వం కోల్పోయిన ప్రతిసారీ జీవించున్నందుకు..
5251. గాంధీజీ మరణించిందందుకే..
కలిపురుషుడికి మంచి చెప్పినా ఉపయోగముండదని..
5252. నీలో భావోద్వేగమే..
నా మనోచింతనకు పరోక్ష అంకురార్పణమవుతూ..
5253.  ఉప్పొంగే కొన్ని ఉసురులంతే..
జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తూ..
5254. హృదయమెప్పుడో కాసారమయ్యింది..
నీవొచ్చి విహరిస్తావని వసంతం కబురెట్టగానే..
5255. నిలబడిపోమన్నా కాలాన్ని..
నీవున్న సమయాన్ని నిర్దయగా సాగిపోనివ్వొద్దని..
5256. శనిగాడ్ని అర్ధం చేసుకోలేకపోతున్నాం..
మంచి చేసినా నమ్మలేమనుకుంటూ..
5257. ఒత్తుల జోలికెళ్ళడం మానేసానందుకే..
నీ ఒత్తిడి భరించలేకనే..
5258. కాలుడ్ని మరిపించిందందుకేగా..
కలకాలం మనల్ని కలిసుండేలా చేస్తాడనేగా
5259. అధరాలతో పనేముందిలే..
చూపులతోనే ఆస్వాదనందించే రసికత్వం తోడయ్యాక..
5260. కంగారెక్కువైంది మరి..
హృదయాన్నలా చిదంబర నృత్యం చేయిస్తుంటే..
5261. మధురిమో మందారమే..
విరిసే నవ్వులన్నీ పువ్వులై వెలుగుతుంటే
5262. గుభాళిస్తున్న ప్రశంసలేనవి..
నీ వెనుక నలుగురూ తలచుకుంటున్నా..
5263. సూర్యకాంతిపువ్వుగానే ఉండిపోతున్నాగా..
నీవెటు తిరిగినా నిన్నే అనుసరిస్తూ..
5264. ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నా..
భాష్పాలై వర్షిస్తానంటుంటే కాదనలేని ఉత్సుకతలో..
5265. అలలు అలలుగా నవ్వులు..
భావుకత్వాన్ని కలగంటున్నందుకు కన్నులు..
5266. ఆ క్షణాలు మాత్రమే నాకపురూపం..
మా బుజ్జాయి నవ్వులే మందారం..
5267. చిక్కనంటూ నా మనసు..
నీ మాయలో చిక్కుకున్నాక..
5268. మరోసారి రాయిగా మారిపోయాను..
శిల్పానికి పూజలు కరువయ్యాక..
5269. స్వరాలన్నీ సుమాలైనవందుకే..
ఆ మోము ఊహలో సంధ్యారాగమైనందుకే..
5270. నా ఊహలెప్పుడో నీ పరం..
హృదిలో స్వాతివానలే అందుకు సాక్ష్యం..
5271. ప్రేమరాగమంటే చులకనెందుకో..
ఆశించగానే అమృతమై జీవితంలో జాలువారిందనేమో..
5272. కలలవాన కురిసినట్లుంది..
కదిలే మేఘమై ఎదలో చలిపుడుతుంటే..
5273. జ్ఞాపకాల్లో చేరింది విరహం..
ప్రేమ పాతబడి చేదయ్యాక..
5274. శోకమంతా దాచేసిందామె..
విజయాన్ని అధిరోహించాలనే ఏకైక ఆరాటంలో..
5275. ప్రతిపదమూ ఒయ్యారమే..
నీ అక్షరాలలో అడుగులన్నీ మడుగులెత్తుతుంటే..
5276. దిక్కులెప్పుడో దాటేసాను..
నీ చూపులు రమ్మన్న పిలుపందగానే..
5277. కొన్ని ఆనందాలకి చేరువైపోయా..
ఆశావాహం హృదిని చేరగానే..
5278. తూనీగనై ఎగిరొస్తున్నా..
నీ మదిలోని మకరందాన్ని గ్రోలేందుకే
5279. వింతలన్నీ నీకు నాలోనేగా..
నీ బంగారులోకాన్ని నేనయ్యాక..
5280. నిశీధినై నిలిచిపోతా నీకై..
నీకు చీకటంటేనే ఇష్టమంటే..
5281. కలని విచ్చేసానందుకే..
కౌగిలెలాగూ ఇవ్వలేవనే..
5282. అలవాటైన అల్లరేగా నాది..
చెక్కిలి బింబాల్లో నెలవంకల్లా నా గోటి తీపిమరకలు..
5283. వల్లరై అల్లుకునేది నీవు..
మల్లెనై మురిసిపోయేది నేను..
5284. చీకటికీ రంగులేసేస్తావు..
నాకు హరివుల్లు మక్కువని నేనంటే
5285. మౌనంగా నవ్వుకుంటున్నా..
అపురూపాల అనుభూతులను సఖులంతా ఆరాతీస్తుంటే..
5286. ఒకటే దేహమని భ్రమపడ్డా...
నువ్విప్పుడు వేరుచేసి మాట్లాడుతున్నావనే..
5287. రాధగానే మిగిలిపోమన్నా..
కన్నయ్యని మించిన ప్రేమ ఎందెందు లోకాలలోనూ దొరకదనే..
5288. ఆకాశమెందుకు పచ్చబడ్డదో..
వెన్నల సంతకం చేసింది నామీదనైతే..
5289. నీ శ్వాసలో కోరిక వినబడింది..
పెదవులో తేనెలెంత నువ్వు దాచేస్తున్నా..
5290. నీ ప్రాణమెన్నడో నాదయ్యిందిగా..
ఊహలో నవ్యానుభమే నువ్వయ్యాక..
5291. కొన్ని భావాలంతే..
రెప్పల్లో చేరి రాగాలై వినబడతాయి..
5292. కాలాన్ని సమాధి చేయాలనుకుంటా..
కాలావధుల్ని మనసు దాటేయాలనుకుంటే..
5293. ఆపేక్షను అర్ధం చేసుకోవేం..
అనుమానాలను అంటుకట్టుకొని రోదిస్తూ..
5294. కొన్ని కలలంతే..
కమ్మగా కౌగిలించి తడుముకొనేలోపే మాయమవుతూ
5295. గీతమో..గమ్యమో నేనొస్తాలే..
నువ్వొక్కసారి తలుచుకొని పిలిచావంటే..
5296. కాలాన్ని గెలవలేకున్నా..
విజేతనవ్వాలని గాయాల కనుగప్పిన ప్రతిసారీ..
5297. నువ్వు నాకు నచ్చావ్..
జీవన రహస్యం చెప్పావనే..
5298. ఆ చీకట్లెప్పుడు కరిగేనో..
కాటుకలు పూర్తిగా కొట్టుకుపోయినా
5299. నీ పెదాలు ఎర్రబడ్డప్పుడే అనుకున్నా..
నా పేరునెంత తీయగా పలికుంటావోనని..
5300. దాసోహమయ్యింది మది..
నీ ప్రతిపదానికి అర్ధం తానయ్యిందని..
This email has been sent from a virus-free computer protected by Avast. 
www.avast.com

No comments:

Post a Comment