Tuesday, 7 March 2017

4701 to 4800

4701. ఆశేదో మిణుక్కుమంటుంది..
నీ ఒంటరితనంలో నేను గుర్తొచ్చుంటాననే..
4702. కన్నీటిపాటలు వినొద్దన్నానందుకే..
హృదయాంతర్భాగంలో చేరి విషాదాన్ని పెంచుతాయనే..
4703. ఆరాటం మొదలయ్యింది..
అంతర్నేత్రం తెరుచుకోగానే..
4704. మధుమాస వెన్నెలేనది..
రెండు హృదయాలకు వెచ్చదనాలు పంచిందంటే..
4705. సూరీడొచ్చేదాకా నీ కలనే..
కన్నులువిచ్చి నన్ను కౌంగిలించేందుకు..
4706. మౌనపోరాటాలేనవి..
కలాన్నే ఆయుధం చేసుకొని ఉద్యమించేవి..
4707. చీకట్లోనే జాగారం చేస్తున్నా..
ఉదయాన్ని మదిలో ఊహిస్తూ..
4708. భాగాహరించుకుపోతున్న బంధాలు..
హెచ్చువేయలేని ఇరుకు మమతల గొలుసులను.. 
4709. తమస్సు కరిగిపోయింది..
సొగస్సు నీ మైత్రి కోరగానే..
4710. పగటి పన్నాగమే..
రేయిని కాదని ఉదయానికి నిన్నాహ్వానించాలని..
4711. మౌనం మరుగీతమే..
మాఘం మరందమవుతుంటే..
4712. నీడనై నీ వెనుకేనున్నా..
తడబడితే చేయందించి వాటేద్దామనే..
4713. మనసు కల్పించే అందాలకు అస్తిత్వమేది..
స్పందించలేని మనిషెదుట ఉనికి కోల్పోయాక..
4714. చిలిపినవ్వే..
హృదయంలో మొదలై కన్నుల్లో వెలుగుతూ..
4715. ఉత్సవం కరువయ్యింది మనసుకి..
ఊరేగింపులో నువ్వు కనుమరుగయ్యాక..
4716. నీ కలలు బంగారం కానూ..
వెన్నెల్లో కరిగించి నన్నెందుకు మండిస్తున్నావో..
4717. కనులు మూసినప్పుడు పిలిస్తే చాలు..
చిలిపికలనై కనుపాప తెరమీద నేనొచ్చేస్తా..
4718. ప్రవహించడం మానెయ్యలేదామె జీవితం..
అతను తడమ(వ)నంత మాత్రాన..
4719. కర్పూర పరిమళాలు వేసేస్తాలే..
జ్ఞాపకాల మైమరపు సేదతీర్చేందుకు..
4720. అతనో మనోహరుడు..
ఆమె మనోజ్ఞసీమలో..
4721. శిలలై మిగిలిన హృదయాలు..
మానవత్వం శిధిలాల్లో చేరిపోయాక..
4722. చూడచూడ మనసవుతోంది..
రెప్పవేయొద్దని కన్నులు మారం చేస్తుంటే..
4723. హృదయం భూపాలమే..
ఉదయం నువ్వైతే..
4724. యుగయుగాల అమృతవాహిని నా గీతం..
ఎన్నిజన్మలైనా నిన్ను వెంటాడుతూనే ఉండాలని..
4725. నింగికెగిసే ఆనందాలు..
నా మాటలు నిన్ను చేరి పల్లవిగా మారుతుంటే..
4726. గగనమయ్యిందిగా అనుభూతి..
మనసంతా మాధుర్యం నింపగల నేనుండగా..
4727. గుర్తించడం కష్టమవుతోంది..
వెలుగుచీకట్లలో ఒకటే ముసుగేసుకున్న మృగాలను..
4728. వెలుగిచ్చే కిరణానివే నువ్వు..
వికసించే మాలికల ప్రాంగణంలో..
4729. నిశ్శబ్దంలో సమాధిచేసా..
తీతువులై అరుస్తున్న ఉన్మాదపు కలలన్నీ
4730. అనంతంలోకి ఉరకలేసినట్లుంది..
నీ అభిమానాన్ని అనుభూతిలోకి అనువదించినందుకే..
4731. గుర్తుంచుకున్నానా తొలిక్షణం..
నీ సమక్షంలో పరవశాలు పదింతలైనందుకే..
4732. తెలుగుదేగా ఉత్సాహం..
అనుభూతులన్నీ తేనెలో మునిగి అభివ్యక్తమవుతుంటే..
4733. ఎంత చీకటైనా వెలుగే..
నా కంటిపాపలో నువ్వుంటే
4734. మౌనంలో తడిచిపోయా..
నీ భావాల కెరటాలతో ముంచెత్తుతుంటే..
4735. నేను సజీవమయ్యానప్పుడే..
ధైర్యంగా నీతో అడుగులు కలిపినప్పుడే
4736. నిక్షిప్తం చేసానో అనుభూతి..
రాగమబ్బుల్లోని మెరుపంతా కోసుకొచ్చి..
4737. అల్లేస్తావెందుకలా..
నరాలవీణలు తెగిపోయేలా..
4738. నా చూపు హరివిల్లయ్యింది..
నీ కలవరం మేఘమవుతుంటే..
4739. గంభీర జలపాతమే..
కాసేపు ఉధృతంగా..కాసేపు ప్రశాంతంగా..
4740. జీవితయ్యిందామే..
విలువ తెలిసినవారి జీవనానికి చేయూతయ్యి..
4741. ప్రతిస్పందనకై ఎదురుచూడదామె..
బుధ్బుదమైన భావాలను మనసులో మోయలేక..
4742. కనిపెట్టేసా ప్రేమని..
నా విషాదాన్ని ఓర్చుకొని భరిస్తుంటే..
4743. నిశ్శబ్దసుమం సైతం చలించిపోదా..
ప్రేమగా రవికిరణమొక్కటి స్పృసించగానే..
4744. శిశిరాన్నే కుంచెగా మార్చేసా..
వసంతానికి రంగులద్దాలనే ఆరాటంలో..
4745. అరనవ్వులు విచ్చుకున్నదందుకే..
నీ హృదయభరిణె నాకై తెరుచుకుందని..
4746. చదివేసానప్పుడే..
అక్షరమై వచ్చి అల్లుకున్నావని..
4747. ప్రతిపేజీ చదివినప్పుడే అనుకున్నా..
నన్నో పరీక్షగా భావించుంటావని..
4748. ఆహుతవుతున్న జీవితాలెన్నో..
అనుభవలేమి అసంతృప్తుల్లో..
4749. ఒక జీవితకాలం పడుతుందనుకోలా..
నిన్ను కోల్పోయిన క్షణాన్ని వెతుక్కొనే నా నీరవంలో..
4750. మనోకాశంలోనూ మెరుపులే..
నీ మాటలు చంకీలై విరిసినందుకేమో..
4751. అక్షరం అలదుకున్నప్పుడే అనుకున్నా..
ఏ పరవశం అడగబోతుందోనని..
4752. అణువణువునూ ఎందుకలా శోధించుకుంటావో..
పిలుపులకే రసానుభూతులు వెల్లువైనట్లు..
4753. మేఘాలెందుకు నల్లబడ్డవోననుకున్నా..
నువ్వు దూరమవుతావనే సంకేతం అందుకున్నందుకేమో..
4754. మనసైన సాయంత్రాలు..
మయూరమనుకొని నా కొరకే నువ్వొస్తుంటే..
4755. అప్పుడెప్పుడో తీపైన కన్నీరు..
ఒక్క కష్టం గట్టెక్కినందుకే
4756. అల్లిబిల్లిగా నా మనసు..
అలవికాని పరిమళమై నువ్వల్లుకుపోతుంటే
4757. ఒంటరితనంలో ఆపాదించుకున్న ఆనందమొకటి..
కోటినక్షత్రాలు కన్నుల్లో కొలువైనట్లు..
4758. మౌనాలెన్ని మోతలో..
నీ అలుకలను నే బుజ్జగించలేనప్పుడు..
4759. వెన్నెలెంత తెల్లబోయిందో..
నీ మల్లెల మనసు పరిమళానికి
4760. ఎప్పుడూ అనుమానమంటావే..
నాలుగ్గోడల మధ్య నీ ముందుంటుంటున్నా..
4761. నీ హృదయంలో దయ ఏమైపోయిందో..
నన్ను గిచ్చి సాంత్వనలో మునిగిపోతూ..
4762. ఎర్రబడ్డ మోము మంకెనయ్యిందనుకున్నావే..
కోపంతో జేవురించి కందిపోతుంటే..
4763. గొంతు సవరించుకుంది మౌనం..
నిన్నానంద పులకితం చేసేందుకే..
4764. వత్సరముంటేనేమి హేమంతానికి..
అనురాగం నిశ్శబ్దగతులలో నింపిపోయిందిగా నేటికీ..
4765. రవళించిన మువ్వలా మౌనమూ..
విరహాన్ని వీధవతల విడిచినట్టు..
4766. శృంఖలాలెన్ని తెగిపడ్డాయో..
ఆనందపరవశంతో నువ్వో భ్రమరమై చుట్టుముడుతుంటే..
4767. నిత్యం ఆలకిస్తూనే ఉన్నా నీ పాటలను..
రహస్యంగానైనా నన్ను చేరి సంతోషాలలోకి నెడుతుంటే..
4768. నీ హృదయపు పుప్పొడొక్కటి చాలేమో..
నాలో నిదురించిన స్వప్నాన్ని తట్టిలేపేందుకు..
4769. నా అధరమెందుకు మరందమైనదో..
జపిస్తున్నది నీ నామైతే..
4770. నా మూగసైగను కనిపెట్టేసావు..
ఆగని తనువు నర్తిస్తున్నందుకేమో 
4771. నన్ను ప్రేమిస్తుంటే పరవశిస్తున్నా..
నిన్నెలా మోహించాలోనని ఆలోచిస్తూనే..
4772. పల్లవించా రాగమై..
నీ హృదయపు చప్పుళ్ళకు స్పందించినందుకే..
4773. పూజ పూర్తయిపోయింది..
నువ్వు మంగళం పాడకపోయినా నీరాజనమిచ్చావని..
4774. సంప్రదాయమెంత గర్వించిందో..
ఆరుగజాలచీరలో అతివ అందం మెరిసిపోతుంటే..
4775. ఆవలించడం మానేసా..
పేగులు లెక్కపెట్టి మరీ సాధిస్తున్నావనే..
4776. ఆపాత మధురం నువ్వే..
నేనాలపించే ప్రతి వెన్నెలపాటలో..
4777. ముంగిట్లో నిలబెట్టావు మధువనాన్ని..
ఇన్నళ్ళూ నేను వాయిదా వేసిన ప్రియ వసంతాన్ని.
4778. నాలో మాయ మొదలయ్యిందెందుకో..
మౌనం నీలో కురుస్తుంటే..
4779. నీ ఎద నట్టింటికి తిరిగొచ్చేసా..
పంచమస్వరంగా మాత్రమే మనం మిగలాలని..
4780. శిశిరమూ నాకో ఉత్తేజమే..
కొత్తగా రేకులు తొడుక్కోవచ్చని..
4781. అధరాలు వదలనంటున్నాయి..
తేనె వరదలో హృదయాలు కొట్టుకుపోతుంటే..
4782. ఆలింగనమొద్దన్నానందుకే..
మనసెప్పుడూ హేమంతాన్నే కోరుకుంటుందని..
4783. ఎన్ని ఊహలు పదునెక్కుతేనేమి..
పాదరసమై నువ్వు జారిపోతుంటే..
4784. బంగారమంటూ మాటకలిపినప్పుడే అనుకున్నాను..
మభ్యపెట్టే కోతలు మొదలయ్యాయని..
4785. దూరమైనప్పుడే పెరిగింది అనురాగం..
మనసు రంజించిన తలపులతో..
4786. మెరుస్తూ మానసం..
నా ప్రతిపదంలో నిన్నల్లుకొని ఆఘ్రాణిస్తుంటే..
4787. ఊపిరాగిపోనందుకు సంతోషిస్తున్నా..
నిన్ను పీల్చుకొని నిశ్వాసలు బయటకుపోనన్నా..
4788. కలలకీ గర్వమవుతోంది..
నీ పెదవిలో చిరునవ్వులు తనవల్లనేనని.
4789. తన్మయించడం మానేయమంటావే..
రాగతాళాలు లేకున్నా భావాలను నేనాలకిస్తుంటే..
4790. ప్రేమిస్తున్నానని ఎప్పటికి అర్ధంచేసుకుంటావో..
హృదయాన్ని మాటల్లో ఆవిష్కరిస్తున్నా..
4791. హరివిల్లు ఆకాశంలో కన్నెపిల్లైంది..
నేలమీది నువ్వేమో మయూరమైనట్లు..
4792. అపురూపమైన భావమేనది..
ఏ రాగానికి అందని అనుభూతిలా నీకు నేనుంటే..
4793. ఎన్ని ప్రేమలు మార్చుంటావో..
వయసిప్పుడు నామీదకి తరిమింది..
4794. అలంకారాలు తెలియని సొగసేగా నాది..
చూస్తే అతిశయం అనుకుంటారు గాని..
4795. వెన్నముద్దనంటూనే కరిగించేసావుగా..
నీ మనసుకు అధరువు కరువయ్యిందని..
4796. గుండె కవాటాలు మూసినప్పుడే తెలిసింది..
నన్ను బంధించే ఆలోచనలో పడ్డావని..
4797. 
ఎంతకని సవరిస్తావో ముంగురులు..
నీ ముద్దులకు అడ్డమనుకుంటూ.
4798. కాలం నిలిచినట్లే అనిపిస్తోంది నాకైతే..
నువ్వు నన్ను సవరించడం మానేస్తే..
4799. ఎంత కడుక్కున్నా అనవసరమే..
మనసు ఒక్కసారి ముకుళించుకున్నాక..
4800.మైమరపదే నీ కన్నులకు..
నన్ను అదుముకొని పొదుపుకోవడం..


This email has been sent from a virus-free computer protected by Avast. 
www.avast.com

No comments:

Post a Comment