Tuesday, 7 March 2017

6801 to 6900

6801. వేరే భావాలకి చోటే లేదు..
పున్నములు మోసుకొచ్చే దరహాసాల మల్లెలవేళ..
6802. ఎగిసిన ఆనందమే నేను..
వసంతం ఫలించిన శుభసమయాన..
6803. ఎన్ని కధలు వినవలసొస్తుందో..
నీ కలలన్నీ నావేనంటుంటే..
6804. నువ్వూ నేనూ వేర్వేరని చెప్పాలా..
లోకమంతా ఒకటని కోడై కూసాక..
6805. ఇద్దరమని ఎవరనగలరు..
ఒకరికొకరం నీడల్లో జాడల్లా కలిసిపోయాక..
6806. వెన్నెలతరకనే నేను..
వెలుతురుగా నిన్ను కప్పుకోవాలనున్న రాతిరి..
6807. నిశ్శబ్దమూ రాగమాలపించింది..
గాలి పాడే చైతన్య గీతానికి..
6808. కొన్ని మౌనాలంతే..
నిశ్శబ్దం రవళించిన నిట్టూర్పులై వినబడతాయి..
6809. ప్రతిబింబిస్తూ అతను..
మనసద్దంలో ఆమె తనని చూసుకున్నప్పుడల్లా..
6810. తరంగమైన ఊహలు..
రాగాలుగా మారి హృదయాన్ని అనువదిస్తూ..
6811. ఆలోచనలన్నీ ఆనందం కొరకే..
ఆవేదనను ఆమడదూరం నెట్టేందుకు..
6812. వేకువకెంత వెలుగొచ్చిందో..
నీవొచ్చే కలలను స్వాగతించే వరమిచ్చినందుకు..
6813. మాలికగా చదువుకున్నా భావాలన్నీ..
అల్లరిగా నన్నల్లుకొని మురిపించాయని..
6814. ఊసులతో మభ్యపెడతావెందుకో..
నీ స్వరములో పంచమమై నేనుందామనుకుంటే..
6815. చినుకుల సవ్వడికే మైమురుస్తున్నా..
అక్షతలై వినబడి కవ్విస్తున్నందుకే...
6816. మందహాసాల మంత్రమెలా మరిచావో..
ప్రణయాన్ని స్వరబద్ధం చేసేందుకు..
6817. అల్లాడిపోతున్న మనసు..
నీ ఊహలకు ఉత్ప్రేరకం తానవ్వాలని..
6818. నీ నవ్వుల ఉషస్సులో కనుగొన్నా..
తప్పిపోయిందనుకున్న నా మనసు ఆచూకీని..
6819. నవ్వుకుంటున్న ఆకాశం..
మబ్బు పట్టిన మనసింకా కురవలేదేమని
6820. 
నవ్వుకుంటున్న ఆకాశం..
కదిలే మేఘాల్లోని పన్నీటిభావాలు తనవేనని
6821. అత్తరులై పరిమళిస్తాయనుకోలేదు..
నేను రాసిన పదాలు వెన్నెల సోయగాలను పూసుకుంటూ..
6822. రక్షించుకోవలసిందే చెట్టుని..
ఆశలకొమ్మల నీడల్లో ఒకనాటికి సేదతీరాలనుకుంటే..
6823. స్వేచ్ఛెప్పుడో కనుమరుగయ్యింది..
ఎగిసిపడ్డ సంతోషానికి హద్దులు పెరిగినప్పుడు..
6824. అక్షరమప్పుడే ప్రియమయ్యింది..
నీ ప్రేమనే పదాలుగా కూర్చుకుంటుంటే..
6825. చిరునవ్వులు దాచాలనుకోలేదు..
నీలో పడగలెత్తే ఆనందాన్ని చూడాలనుకున్నందుకు..
6826. మనసెంత ఉల్లాసించిందో..
పేరుకున్న తీపంతా ఒక్క నీ పిలుపుతో కదలగానే..
6827. ఆకాశం చిన్నదయ్యింది..
ఆనందానికి హద్దులు చేరిపేసి గువ్వనవుతుంటే..
6828. అనుభూతొకటి చేజారింది..
ఆవేశాన్ని చేరదీసి..అనురాగాన్ని ప్రశ్నించినందుకు..
6829. అణువుగా కుదించుకున్నా..
నీ గుండెగూటిలో ఒద్దికై సర్దుకోవాలని..
6830. అహరహమూ ఆశించాను..
కొసమెరుపుగానైనా కలిసుండాలనే..
6831. మదిలోనే ఆనందిస్తున్నా..
మైమరపుగా నేనయ్యాననే..
6832. కదులుతున్న ఆకుల్లా ఆలోచనలు..
నయనాలకందని హృదయపు విషాదాలు..
6833. కిరీటం పెడతానంటే సరేనన్నా..
ముళ్ళతో గుప్పించావని తెలుసుకోలేక..
6834. అక్షరాలతోనే అల్లుకున్న బంధాలు కొన్ని..
మనసుని మల్లెలమేనా ఎక్కిస్తూ ప్రతిసారీ..
6835. అక్షరాలూ గుచ్చుకుంటాయి..
ఆత్మీయతలో విషాన్ని రంగరించి గుప్పిస్తే..
6836. ప్రేమొక్కటీ చదివితే చాలనుకుంటా..
జీవితాన్ని గెలవాలని నీవనుకుంటే...
6837. స్వప్నవీధుల విహారమంటే నాకిష్టమే..
జంట చైతన్యమై నీవుంటానంటే..
6838. అనుభూతిని హత్తుకోక తప్పదుగా..
భావాలు చెరిసగమై పెనవేసుకుంటే..
6839. మరోసారి పసిపాదాలతో పరుగుతీద్దాం..
ఊహానుభావమొచ్చి నిద్దుర లేపిందిగా..
6840. కొన్ని ప్రవాహాలంతే..
కలుషితమని గుర్తించేలోపునే మంచితనాన్ని ముంచేస్తూ..
6841. పరుగుతీస్తున్న వయసుకెంత ఆనందమో..
బాల్యపు వలువలు కప్పుకోవాలంటే..
6842. అగాధం దాటి నేనొచ్చా..
విషాదాన్ని తరలించే గెలుపునవ్వాలనే..
6843. అర్ధంకాని అల్లికలే కొన్ని ఆలోచనలు..
పగలబడి నవ్వుతూనే పెనవేసే మనసుల్లా..
6844. ఒంటరితనం తప్పలేదు..
నలుగురూ నాతోనున్నా మనసే  దూరమయ్యాక..
6845. లక్ష్యమొకటుంటే చాలనుకుంటా..
నిర్లక్ష్యాన్ని తరిమి గమ్యాన్ని చేరేందుకు..
6846. విరహమెప్పుడో తీపయ్యిందిగా..
నీ తలపులో వలపంత పండగానే..
6847. నీ పిలుపెంత హృద్యంగమమో..
అణువణువూ అమృతమే ప్రవహించినట్లు..
6848. ఏకాంతమైతేనేమిలే..
కాంతి నశించని కలమైతే నీ తోడుందిగా..
6849. చేతిరేఖలనెందుకు నమ్ముతావో..
చేయి లేనోళ్ళకీ జీవితమొకటుందని మరచి..
6850. ముంగిట్లో నేను పూయక తప్పలేదు..
ముద్దబంతినై రావాలని ముచ్చట పడ్డావనే..
6851. ఎదురుచూపొకటి ఫలించింది..
రాగమాలికను ఆలపించి హృదయానికి విజయమిస్తూ..
6852. విముక్తమైన మానసం..
విసురుకున్న చూపులు చేరువై నవ్వుకోగానే..
6853. అర్ధరాత్రొకటి వికసించింది..
నీ కల్పన నా కన్నుల్లో మెరుపుగా ప్రతిఫలించి..
6854. గడుసుదనమెక్కువే నా వలపుకి..
ఏ క్షణమైనా నన్ను మాత్రమే తలవాలని కాంక్షిస్తూ..
6855. ఆనందంతో ప్రఫుల్లమయ్యే నా నవ్వులు..
పున్నమి వెన్నెలను పెదవులతోనే పరిహసిస్తూ..
6856. దూరాన్ని కరిగించేసా..
కలల కౌగిలిలో ప్రతినిత్యం నిన్నాదరించి..
6857. అనుభూతుల పరంపరలు..
నీ భావాలలో చేరాలనుకొనే నా రాగాల కవిత్వములా..
6858. వెతకడం మానేసా..
మనసుతో రాసే పదాలకు అర్ధాలేముంటాయని..
6859. హేమంతమై ఒణుకుతున్నా..
చినుకుపూల అభిషేకాలకు మదిలో మైమురుస్తూనే..
6860. అభావమై మిగిలిపోయిన ఆనందాలు..
నిశీధులే శాశ్వతమైన జీవనంలో..
6861. అల్లకల్లోలంలో మనసు..
కుదురులేని స్మృతుల వలలను విడిపించుకోలేక..
6862. ఆదరించే ఆర్తివి నువ్వే..
ప్రవహిస్తున్న దైన్యానికి అడ్డుకట్టగా..
6863. విజేతలమైనప్పుడే అనుకున్నా..
ప్రణయరాజ్యానికి తిరుగులేని గెలుపు అందించామని..
6864. ఆనందాలు కల్పితాలు..
నువ్వు నడయాడని నా హృదయాకాశంలో.. 
6865. 
వికసిస్తూనే ఉన్నా..
నీ మనసుకొమ్మలో ఘుమఘుమల మల్లెపువ్వునై..
6866.  అక్షర అనురాగమందుకున్నా..
నాకోసం పదాలన్నీ పాటగట్టి వినిపించావనే..
6867. అనివార్యమేగా మరణమెప్పుడూ..
ఆశీర్వాదాలెన్ని అందుకున్నా కాలాన్ని తొడుకున్నాక....
6868. షడ్జమమై వినిపిస్తా..
మోహనరాగంలో చోటిచ్చి మక్కువనంతా నాకందిస్తే..
6869. కలలు కనే సమయం లేదు..
గమ్యమై ఎదురుగా నువ్వు రమ్మన్నాక..
6870. గెలిచినట్లేగా మనసు..
అంతరంగాల వారధిపై అడుగులు ఆటలాడాక..
6871. ఈ ఏకాకితనంలో నిశ్శబ్దాన్ని అనువదించుకోవాలేమో..
మౌనరాగానికి మాటలొచ్చి నన్ను అలరించినట్లు..
6872. వెలుగునీడల వర్ణంలో ఆకాశం..
ముసురేసిన మనసుకి అద్దంపట్టినట్లుగా..
6873. వయసెందుకు వలపెందుకు వగపెందుకు..
నీకిచ్చి ఏకాకిగా మిగిలినందుకే..
6874. శిలయ్యింది కాలం..
నాలో ప్రవహించలేనన్న నిన్ను తలచినందుకే..
6875. స్వప్న చిత్రాలెన్నో..
నీ స్మృతుల వెలుగుతో గీసుకున్న నా తొలిసంజెలో..
6876. 
స్వప్నంలోనే ఆగిపోయిన స్వరమొకటి..
నీ మౌనంతో ఏకీభవించలేక.
6877. 
స్వప్నాలు కరువైన రాతురులెన్నో..
అనుభూతికై నిరీక్షించిన ప్రతిసారీ.
6878. స్వేచ్ఛ కోరడం వ్యర్ధమని తెలుసుకున్నా..
తన కనుసన్నలలోంచీ జారిపోయానని తెలిసాక..
6879. పరుగాపనిదే పయనం..
అంతులేని బాటైనా అడుగేసేందుకు నువ్వుంటే..
6880. వెన్నెల వానై కురవడం నిజమేననిపిస్తుంది..
ప్రేమలో తడవడం ఇష్టమని నువ్వంటుంటే..
6881. దాచుకోక తప్పలేదు..
నీవిచ్చిన వియోగం మన మనసులను ఒకటి చేస్తుందనే..
6882. ఆగిపోయిన సంతోషాలు..
నీ చిరునవ్వుల వానింకా కురవలేదని..
6883. సాంత్వన నువ్వేగా..
వియోగించినా విరహించినా నీ రాధనయ్యాక..
6884. మనసు ఆవిరైనప్పుడే అనుకున్నా..
అమృతవర్షాణికై నిరీక్షణ తప్పదని..
6885. ముత్యాలుగా మారిన కన్నీటిబొట్లు..
నీకై జార్చిన ఆనందాలకేమో..
6886. నా శ్వాసల గమనం మారింది..
ఊపిరి వెచ్చదనాల కారణమేదో చూద్దామని..
6887. పాపనై పరుగెడుతున్నా..
పాదాల మధుస్పర్శకు నువ్వు నవ్వుకోవాలనే..
6888. అమృతహృదయాలే అన్ని..
కంటి ముందున్న తెరలు తొలిగేదాక...
6889. నువ్వున్న ఊహలన్నీ నాకిష్టమే..
ఏనాటికైన నిజమవుతాయనే నమ్మకంలో..
6890. విరినవ్వులైతే నీవేగా..
సిరిమల్లెకూ లలిత పరిమళ మత్తునిస్తూ..
6891. నీ తలపుల చిత్తడేనది..
మనసుకి చిగురింతల పచ్చదనాలిస్తూ..
6892. మనసుకెందుకో హడావుడి..
అందనంత దూరంలో ఉన్నావని తెలిసినా అలజడై ఎగిసిపోతూ..
6893. స్వప్న సౌదామినై విచ్చేసావుగా..
వేరే ముహూర్తమెందుకులే స్వాగతాలకు..
6894. మనసుకెందుకో మిడిసిపాటు..
అధరాల పూతలు అరచేతుల్లో పండుతుంటే..
6895. గ్రీష్మానికి చేరువవుతున్నా..
ఆత్మీయుల వెన్నుపోటుకి మనసు మండినప్పుడల్లా..
6896. ఎన్ని కలలని దాచుకోవాలో..
విత్తులుగా కాజేసి ఫలాలనే ఊహించి నాకు కానుకిస్తుంటే
6897. నిలుపలేవుగా ఏ గొలుసుకట్లూ..
నన్నుదాటి ప్రవహించాలని నువ్వనుకుంటే..
6898. ఆత్మైతే నశించదుగా.. 
ప్రాణం వెలుగుతూ దేహం కనుమరుగైనా..
6899. ప్రేమశిఖరపు అంచున మనమేగా..
ఆకాశానికి చేరువైన చైతన్యంలా..
6900. నీవుగానే మిగిలిపోయాను..
నాకు నేనెవరనే ప్రశ్నల సందిగ్ధంలో..

No comments:

Post a Comment