Tuesday, 7 March 2017

4901 to 5000

4901. అదే నేను..
నృత్యం చేస్తున్న నిశ్శబ్దం సాక్షిగా..
4902. ఆఘమేఘమై వచ్చావనుకున్నా..
ఆకాశం అనుకోకుండా నల్లగా మారిందనే..
4903. శృతులన్నింటినే సరిచేసా..
అనుపల్లవై నువ్వొస్తావనే..
4904. చంచలత్వం సుగుణమేగా..
మళ్ళీమళ్ళీ నీతోనే ప్రేమలో పడుతుంటే..
4905. ఎన్ని యుగాల ప్రవాహమో కెరటం..
తీరాన్ని కాసేపైనా హత్తుకుని ఉండాలని..
4906. వృత్తాన్ని ఎంచుకున్నానందుకే..
ఎంత తిరిగినా మొదటికే చేరొచ్చని..
4907. విషాదాలు తాగించడం మాత్రమే తెలిసిన హృదయాలు..
నాతిని రాతితో పోల్చి పూజించమని ప్రోత్సహిస్తూ..
4908. ఆలాపన మొదలెట్టవెందుకు..
నీ నిట్టూర్పులతోనే శోకాలు వల్లించుకుంటూ..
4909. గాలివాటం తెలిసిన గాలిపటం నీవు ..
నీకాధారమవ్వాలనొచ్చి నేలజారిన దారం నేను..
4910. పగలంతా దూరముండక తప్పడం లేదు..
కొంగుకు తిప్పుకుంటున్నానని లోకులు ఆడిపోసుకుంటుంటే..
4911. నా కలానికి ఆధారమైనందుకేమో..
కన్నీటికీ కాస్తంత మెరుపొచ్చింది..
4912. అనాదిగీతంలో చేరాలనుకున్నా..
ఆదిలోనే నువ్వాదరిస్తానంటే..
4913. నీ కలల చప్పుళ్ళు వినబడుతున్నవిలే..
కళ్ళు తెరిచే నువ్వు నిద్రపోతుంటే..
4914. ఎప్పటికీ ప్రియమే..
నాన్నగారి ఒడిలో మహరాణినై నేను కూర్చున్న దృశ్యం..
4915. బాల్యంలోకి ఉరకలేసా..
చిన్ననాటి నేస్తం రమ్మని పిలవగానే..
4916. నీవు నేర్పిన విద్యనే అనుకుంటా..
ఏమరపాటు నటిస్తూనే తటస్థంగా ఉండటం..
4917. మదన కోమలుడివి నీవు..
నా రసగీతి చరణాలలో..
4918. మిన్నంటాలనుకొని విచ్చేసా..
కంటిలోంచీ నీవు నిర్దయగా జార్చకపోయుంటే..
4919.  వ్యామోహాన్ని కనిపెట్టానప్పుడే..
స్నేహమంటూ వాడు కాయాన్ని కెలికినప్పుడే..
4920. కల్యాణవీణా నాదమది..
కొంగుముడేసి ఇద్దరి ప్రేమను ఒకటిచేసింది..
4921. అక్షరాలు పరిమళిస్తుంటే అనుకున్నా..
మరంద పన్నీటినే రచించావని..
4922. ఆనందానికి హద్దులేదు..
ఆకాశమై నాకు నువ్వు గొడుగువైతే
4923. ఆకర్షణ పెరిగిందప్పుడ..
వద్దనేకొద్దీ తను ముద్దు చేస్తుంటే..
4924. తేనెలు పూసుకున్నదందుకే..
తీయని సాంగత్యాన్ని నీకు పరిచయించేందుకే..
4925. ఎన్ని వేల ముత్యాల రాసులో..
నన్ను మునిగిపోమని మత్తుగా ఆహ్వానిస్తూ..
4926. గ్రీష్మమైతే నేముందిలే..
మన మనసులప్పుడే వర్షాకాలానికి ఉరకలేస్తుండగా..
4927. సుధాలాప స్వర్గమనిపదేననిపిస్తోంది..
రసధునివై నీవాలపించే రాగాన్ని ఆస్వాదిస్తుంటే..
4928. మరకతంగా మారిపోమంటున్నా..
ఒక్కమారైన నిండు పచ్చగా మెరిసిపోవాలనే..
4929. కన్నీరూ ఆనందభాష్పాలే..
నీ చేయి చేదోడుగా ఉంటే..
4930. కంపిస్తూనే ఉన్నవి జ్ఞాపకాలు..
హృదయంలోని అనుభూతులు మరణించినా..
4931. విషాదపు పర్యవసానమది..
ఆనందం ఎక్కువై కాగితాలు నిడుతుంటే..
4932. నువ్వురిమినప్పుడే అనుకున్నా..
మెరుపై నేనెగిసే సమయం ఆసన్నమయ్యిందని..
4933.ఋతురాగం మారిందనుకున్నా..
కాలం కాని కాలంలో యేరై నువ్వు ప్రవహిస్తుంటే..
4934. గుండె బరువెక్కువయ్యింది..
నిన్ను ఆలోచించి కన్నీరు ఎక్కువవుతున్నందుకే..
4935. అలుపొచ్చి నిద్దురపోయింది నా మనసు..
కడవెత్తుకు నువ్వొస్తావని నాకేం తెలుసు...
4936. శిశిరంలో గ్రీష్మమొచ్చినందుకేమో..
నిరీక్షించిన ప్రేమ నీరెండకే మండిపోతూ..
4937. సఫలం చేసాలే నీ నిరీక్షణ..
నీరసంగానున్నా నాకై ఎదురుచూస్తావని తెలిసి..
4938. అక్షరాలుగానే మిగిలాయెందుకో..
నిన్నల్లుకోవాలని కలగన్న మదిలోని భావనలన్నీ..
4939. నా మనసైతే మధువయ్యింది..
నీ తీపికలల జలకాలాటలకే..
4940. అమరమేగా ఆనందాలు..
అనునిత్యం నీవుంటే..
4941. అందుకున్నా అభివందనం..
కవితను చేసి అక్షరాన్ని మెరిపించావని..
4942. అసమానంగా ఎదుగుతాననుకోలా..
నేనో తీగనై నీకు అంటుకట్టబడేవరకూ
4943. 
నాకు తెలియకుండానే ద్రవపదార్ధంగా మారిపోయా..

నీకు నచ్చినట్లు నన్ను మలచుకున్నావేమో
4944. మాధుర్యమంతా హరించినట్లుంది..
ఒక్కసారిగా నీకు దూరం జరిగినందుకే..
4945. సంక్షోభానికే..
ప్రేమ మరణించింది..
4946. గెలుపు వలపుదేలే..
అనురాగపూరిత ఆలింగనాల్లో..
4947. శ్రావణం పోయి శిశిరమొచ్చింది..
నిన్నన్వేషిస్తూ నే అలసిపోతుంటే..
4948. ఎర్రనిజ్వాల ఎగిసిపడుతుంది..
నీ జ్ఞాపకాలు ఎదురేగి మంటపెడుతుంటే
4949. ఎన్ని స్వప్నాలు కుమ్మరిస్తేనేమి..
నీ మదిలో జ్ఞాపకాలు నన్ను కాదని బోర్లాపడ్డాక..
4950. వసంతాగమనానికే ఆగమంటున్నా..
మంకెనపూలు నిన్ను వరిస్తే జతచేద్దామని..
4951. ఆనందంగానే ఉంది..
నా రసోదయాలు నీతోనే మొదలవుతుంటే..
4952. మైకం చల్లాను..
నన్ను మాత్రమే నువ్వు ఆఘ్రాణించేలా..
4953. నా మనసెందుకు విరిచేసావో..
నీ గుండెకొమ్మకు పూలు పూయాలని అంతగా కోరుకుంటే
4954. ఊపిరయ్యానందుకే..
శిశిరంలా ఎక్కడ పండి రాలిపోతావోనని..
4955. ఇప్పుడెందుకులే సరసాలు..
నా వరుస నీకు నచ్చట్లేదంటూనే..
4956. నన్నొచ్చి చేరింది సిగ్గు..
రాజకీయాల్లోకి మాత్రం పోవద్దంటూ..
4957. అదే ఇది..
అడగకుండ చెప్పరానిది..చెప్పకుండ ఉండలేనిది..
4958. అనుబంధాలకి ఎదురెళ్ళడం మానేసా..
పంజరాలు సిద్ధంచేసి రమ్మంటుంటే..
4959. నాన్న విడిచెళ్ళిపోయాడు..
గాంధీ ఉన్నాడనే ధైర్యంతోనే కాబోలు..
4960. జాజుల జావళీలు..
జల్లంత తుళ్ళింతలకు జూకామాల్లెలనూ జతకమ్మంటూ..
4961. వినోదం గేలిచేసింది..
వియోగానికి పరమైన మనల్ని ఏడిపిస్తూ..
4962. మధువనానికొచ్చేయ్ మళ్ళీ..
మరులతో విందిచ్చే పూచీ నాది..
4963. వెన్నెల్లో జారింది నవ్వు..
నిశ్శబ్దంగా నువ్వు రమ్మన్నావనే..
4964. సహజత్వాన్ని చేరదీసానందుకే..
మాసిపోని నవ్వుని అధరాలకు పంచిందని..
4965. ధన్యమైంది పుడమితల్లి..
చినుకు చలువకి చిన్నారిమొలకలకి జన్మనిచ్చి..
4966. ఆనందంలోనేగా అందముంది..
సౌందర్యాన్ని తిలకించే కన్నులే మనకుంటే..
4967. పరిమళిస్తున్నవేంటోననుకున్నా..
నీ గుప్పిట చేరిన నవ్వుల గాంధాలనుకోలా..
4968. ప్రాణం లేచొచ్చిందిలే..
నీ పిలుపు వీనులవిందుగా వినబడ్డందుకే..
4969. తలపు మధుగీతమైనందుకే..
నా వలపు బృందావనం కోరింది..
4970. ఎంత జీవితం ముందుందో..
ఆయాసపడుతూ కడలిని ఈదలేనంతగా..
4971. మనసిస్తే చాలనుకున్నా..
నీ తనువు ఎన్ని వీధిలు తిరిగిందో అడగలేకనే..
4972. జ్ఞాపకాల మల్లెలేనవి..
మనసును నిలువనీయక గుభాలింపజేస్తూ ఇందరిలో..
4973. దాగలేని అల్లరే..
దోచుకున్న ఆనందాన్ని నిలువెల్లా పూసేస్తూ..
4974. ఊహించని ప్రణయమే..
నా అణువణువూ ఆత్మీయతను పులిమేస్తూ..
4975. అనుబంధాల గంధం పరిమళిస్తోంది..
విషాదం తలొంచుకొని వెళ్ళిపోతుంటే..
4976. కుసుమించని రాగమే..
పెదవి చాటు పల్లవిలోనే దాగిపోతూ..
4977. ప్రేమ చూపిన రాదారది..
ఆనందానికి చివరి మజీలేనంటూ..
4978. ఉన్మాదపు ఎరుపుజీరలేనవి..
ఇటు నవ్వితే అటు అద్దంపడుతూ..
4979. అవమానాలనీ ఓర్చుకోవాలేమో..
మనసుని జయించాలంటే..
4980. ఇష్టం పెరిగినందుకేగా..
ఏకాంతాన్ని సైతం ఆక్రమించింది ప్రేమ..
4981. నిరాశే మిగిల్చింది..
నిన్ను చూడాలనుకొనే చిరకాల వాంఛ..
4982. జ్ఞాపకాలకెప్పుడూ చొరవే..
అడక్కుండానే మదిలో చేరి కలదిరిగేందుకు..
4983. జగమంత కుటుంబమే కావాలందరికీ..
ఆ నలుగురూ తోడుంటానంటే..
4984. నా మనసెప్పుడూ చిక్కనే..
నవనీతమై నీతో నెయ్యమొందేందుకు..
4985. ఎర్రని మరక చూసినప్పుడే అనుకున్నా..
సిగ్గుపడ్డ కలం సిరారంగు మార్చుకుందని..
4986. ఎన్ని కలలు పిండాలో..
సిరాలో ఆర్ద్రతను నింపలంటే..
4987. మూగప్రేమనెప్పుడు గమనించావో..
చిరుగాలి తరంగాలతో నేసైగలు చేసుకుంటుంటే..
4988. అమాసని మరచినట్లున్నావు..
నా నవ్వుల్లోని దీపాలను దర్శిస్తూ..
4989. ఇంద్రధనస్సెందుకు విరిసిందోననుకున్నా..
నీ మౌనం నా చిరునవ్వుతో కలిసిందని తెలియక
4990. పూలవానలే కురిపించాలనుకున్నా..
నీకు సువాసన పడదని ఊరుకున్నా..
4991. అనురాగాన్ని మరచావెందుకో..
గతజన్మ స్మృతులన్నీ మర్చిపోతూ నువ్వు..
4992. ప్రేమ వ్యూహత్మకమేమో..
శ్వాసకు పరిమళాలూ..వర్ణాలూ అద్దేస్తుంటే..
4993. మనిద్దరం..
ఒక లైలా..ఒక మజ్ఞూ..
4994. అలంకారమైంది ప్రేమేగా..
మనిద్దరం చెరోదిక్కైనా..
4995. గతమో విషాదం..
నన్నో విరహిణిగానే మిగిలిపొమ్మని శపించి..
4996. హృదయవేదన వెన్నెలై ప్రవహిస్తోంది..
నీ నిరీక్షణలో చల్లనిమంటవుతూ
4997. ప్రేక్షకురాలిగానే మిగిలిపోతున్నా..
రక్తికట్టించలేని జీవిత నాటకాన్ని ఆడలేక..
4998. పరాజితగానే మిగలాల్సొచ్చింది..
క్షణికమైన బంధాలు శాశ్వతమని భావించినందుకు..
4999. నన్ను నేను పోగొట్టుకున్నప్పుడే తెలుసుకున్నాను..
జీవితం జారిపోయే నక్షత్రంతోనే సమానమని..
5000. ఆత్మవిశ్వాసం కొరవడుతోంది..
బుద్భుదమైన జీవితాన్ని గతానికే ధారపోసాక..

This email has been sent from a virus-free computer protected by Avast. 
www.avast.com

No comments:

Post a Comment