Tuesday, 7 March 2017

7101 to 7200

7101. వెన్నెలను తలపిస్తున్న చెలిమి..
కురిసినప్పుడల్లా చల్లదనమే మనసుకందుతుంటే..
7102. చెలిమి చేరువైనప్పుడే అనుకున్నా..
అనుభవాల నెమరింతల్లో మునిగిపోతానని..
7103. రాతిరి వెలిగిందంటే ఏమోననుకున్నా..
చందమామను కానుకిచ్చావని గుర్తించక..
7104. అనురాగపు చిమ్మిలి..
నా మనసుకి నచ్చిన మన అనుబంధపు చెలిమి..
7105. నీ మనసుకెందుకో ఉలికిపాట్లు..
హృద్రోగమొచ్చింది నా తనువుకైతే..
7106. చూపులకావల నిలబడ్డావనుకున్నా..
అనుమతడక్కుండానే మదిలోకి చొరబడ్డావని గ్రహించక..
7107. కష్టానికీ లోకువైపోయాను..
రాబోతున్న కన్నీటిని ఆపుకున్న తెంపరితనానికి..
7108. ఆరోప్రాణమై తిరిగొచ్చేసా..
నిన్ను తిరిగి జీవితను చేయాలనే..
7109. పచ్చదనమెంత మురిసిందో..
కురిసిన మంచుబిందువులకి తనువు చల్లబడి..
7110. ముగింపు లేనిదే మన చెలిమి..
కొనసాగింపుల పర్వానికి మున్ముందు సిద్ధమవుతూ..
7111. నొసలు వెక్కిరించినప్పుడే అనుకున్నా..
నవ్వులో తేడా కొడుతుందని..
7112. చెలిమందుకే గెలిచింది..
విషాదానికి విలపించడం మది మానేసాక..
7113. దిక్కులేనిదయ్యింది ఆకాశం..
మేఘాల్లేని శూన్యంలో ఒంటరిగా ముసురేస్తూ..
7114. కరిగింది ప్రేమ మైనంలా..
నీ మౌనానికి వెచ్చబడ్డందుకేగా..
7115. కళ్ళతోనే తాగేస్తావెందుకో..
నా చూపుల్లో వెన్నెల మరుగుతుందంటూ..
7116. ఏకాంతాన్ని తపస్సుగా మలచుకుంటున్నా..
నా భావాక్షరాలకు సొబగులద్దుకోవాలనే..
7117. నన్ను వరిస్తావనుకోలేదు..
చూపుల స్వయంవరంలో విరహన్ని కనిపెట్టి..
7118. నే రాసిన ప్రేమలేఖ అందిందనుకున్నా..
నీ చేతుల్లో శుభలేఖ చూడగానే..
7119. జ్ఞాపకాల మల్లెలు జారినందుకేమో..
మనసుపొరలు దాటి ఘుమఘుమలు..
7120.నవ్వితేనేగా..
ఆ మోముకి కళ..
7121. వెన్నెల్లోనూ స్వేదమే..
నీ తలపులు నాతో సరాగమాడుతుంటే
7122. చిలిపికలల గిచ్చుల్లే రేయంతా..
నీ వలపునూహిస్తూ నిద్దరోతే..
7123. క్షణాలను బుజ్జగించా..
కాసేపలా మన మధ్య నిలిచిపొమ్మని..
7124. నువ్వెప్పుడూ పడమట్లోనేగా..
నేనేమో తూరుపున అరుణమై విరబూస్తుంటే..
7125. ఏమ్మాయ చేసిందో నీ మౌనం..
గలగలలాడే నా స్వరాలన్నీ కాజేసి..
7126. నేనిప్పుడో అపురూపాన్నే..
నీ హృదయం వలచిన జ్ఞాపకాన్నై..
7127. కలవరం తీరిందిగా..
మనసైన మరునాడే మరుని పిలుపినిపించగా..
7128. కలలెక్కడ దాచాలో..
కన్నీరలా రాతిరంతా విడువకుండా కురుస్తుంటే..
7129.  ఊరేగాలనిపిస్తోంది..
ఆనందాల పల్లకినెక్కి ఆత్మీయులను పలకరిస్తూ ఇలా..
7130. నువ్వో స్వరసంగమానివేగా..
నాలో రాగాలన్నీ నీలోకొచ్చి కలుస్తుంటే..
7131. పరిమళించేదప్పుడేగా..
మనసులో కుసుమమనేది వికసించాక..
7132. నిన్ను తలచినప్పుడల్లా హృదయం  విశాలమే.
గగనంతో పోల్చినందుకు ఆనందం గొడుగులెత్తినట్లు..
7133. చందనగంధిలా చెలి..
నీ మాటల్లోనే పరిమళాలు వెదజల్లుతూ..
7134. నీ తలపే సాహిత్యమయ్యింది నిజం..
నా చేయి కలాన్నిలా పట్టగానే..
7135. మౌనం నడిపిన రాయబారమది..
కన్నులు దాచలేని ఆరాధనలో..
7136. మధువంతా నువ్వే..
నా మనసో అక్షయపాత్రని నువ్వంటుంటే..
7137. నీ తలపు భాష్పమది..
ఆకాశమాపలేని నా ప్రేమధార..
7138. బృందావనం నువ్వే..
చెలి వదనశోభకు తుమ్మెదలా మారుతుంటే..
7139. వలపంటే మనదేగా..
పున్నమి రాకముందే వెన్నెల్లు జల్లుకుంటూ..
7140. తలపుల్లో తేలినా చాలంటోంది మది..
నీ ప్రేమ తరగలై అల్లుకున్నాక..
7141. అలుపన్నదే తెలియదుగా..
ఆనందాల వేటలో నువ్వెంత ఉరకలేస్తున్నా..
7142. వయసు వరదైతేనేమిలే..
గొడుగు పట్టేందుకు సాయం నువ్వండగా..
7143. మరుగీతిక పరవశం..
ప్రేమ రాగంలో పెదవికి చోటిచ్చినందుకు..
7144. మనసుకెందుకో సిగ్గు..
అక్షరాలతో తనువల్లుకుంటుంటే..
7145. కలలు నిజాలై కూర్చుంటాయేమో..
వలపుకి హద్దు విధించలేకుంటే..
7146. మనసంతా వెన్నెలే..
నీ కలలు కుమ్మరించిన మధురిమలతో..
7147. హృదయమంత వెన్నెల..
నీ  పలుకులన్నీ పాటలుగా కూర్చుకుంటుంటే..
7148. క్షణాలకెంత మెరుపొచ్చిందో..
బంగారమంటి నీ హృదయాం నాదవ్వగానే..
7149. ఎన్ని హేమంతాలు కలవరించాలో..
నీలో సంతోషం నేనవ్వాలంటే..
7150. కవితలకందని భావాలేనవి..
నీ చూపులజల్లై నన్ను తడిపినవి..
7151. దిగులు మేఘాలే హృదయంలో..
మనసుపొరలన్నీ మౌనంతో నింపేస్తూ..
7152.  నేనే స్పందనవుతున్నా..
పురివిప్పుకున్న భావుకత్వాన్ని అనువదించాలనే ఆరాటంలో..
7153. ఎదురుచూడటం మానేసా నీ స్పందనకి..
రాతిమనసులో రాగాలు రవళించడం అసాధ్యమనిపించి..
7154. అత్తిపత్తి పువ్వునై నేను..
నిన్ను తలచినంతనే ముడుచుకుపోతూ..
7155. నీరవాన్నీ ప్రేమిస్తున్నా..
నీ మౌనాన్ని మనసుతో ఆలకించినప్పుడల్లా..
7156. శిధిలమైంది ప్రేమ..
చిట్లిన రహస్యాలన్నీ మదిలోనే దాచుకుంటూ..
7157. ఆమెందుకు నవ్విందో..
అలిగిన నక్షత్రాన్ని బుజ్జగించేవారు లేరనేమో..
7158. క్షణాలకెంత తొందరో..
నీ సమక్షాన్ని స్వరాలతో ముడేసుకోవాలని..
7159. కొత్తగా రెక్కలొచ్చిన స్నేహమది..
మరోవైపు పచ్చదనానికి మోజుపడి..
7160. అధరసుధల గంధాలు..
ఊపిరందని హేమంతానికి ఆనందాల వెచ్చదనమిస్తూ..
7161. ఆనందం వర్షిస్తోంది..
అభిరుచిని ప్రేమించేకొద్దీ..
7162. అస్తిత్వాన్నే ఒదులుకుంటుంది మనసు..
ప్రేమనే వసంతరాగాన్ని ఆలపించేందుకు..
7163. అభినందిస్తున్నా..
అభివ్యక్తించిన నీ అంతరంగ చాటువుని..
7164. కొన్ని ఆశలంతేనేమో..
భావమంటని అనుభవాల వరదలోనే కొట్టుకుపోతుంటాయి..
7165. ఆనందం నవ్వింది..
నా పెదవంచులో
7166. నీ మదిలో తడవ్వాలనుకున్నా ఈవేళ..
జ్ఞాపకాల చినుకులు చిలకరించైనా నేను..
7167. అప్పుడెప్పుడో మది రాసుకున్న విషాదగీతమది..
నీ ఆగమనంతో ఆనందభైరవై పెదవందుకుంది
7168. ఆనందాన్ని పంచాలనుకున్నా..
అందుకే నీ ఇష్టంలోకొచ్చి చేరిపోయా..
7169. జ్ఞాపకాల గవ్వలు దాచుకొని నేను..
అలవై నీవొచ్చినా అనుభూతులు నీకివ్వాలని..
7170. అక్షరాల పెనవేతలు..
వద్దన్నా వచ్చే కన్నీటిని రాయమంటూ..
7171. నీ స్మృతులెప్పుడూ సరిగమలే..
నాలో గమకాలతోనో..తమకాలతోనో..
7172. మగువ నిట్టూర్పుకు విలువేముందిలే..
నశించిన ఆశలు నెమరేసుకోడానికితప్ప..
7173. కదిలిపోతూనే ఉంటుందలా కాలం..
క్షణమాగినా జీవితాలు స్థంభించిపోగలవని..
7174. సముద్రమంత ఉప్పు తేలింది కన్నీటిలో..
నువ్వో జ్ఞాపకమై మిగిలావని గుర్తించగానే.. 
7175. నీ తలపులకు పండుగలేగా..
కన్నుల్లో కొలువై నేనొచ్చినప్పుడల్లా..
7176. మగువ మనసో అక్షర ముత్యమయ్యింది..
రాయాలనుకున్న కలానికి ఉత్ప్రేరకమై కదిలి..
7177. నీ ఊహలకేమయ్యిందో..
భావనగానైనా నన్ను ఆహ్వానించలేదు మొన్నప్పుడు.
7178. నిజం..
కఠినమైనా సంతృప్తినిచ్చే వాస్తవం..
7179. మనసులో తడెటు పోతుందో..
వానాకాలంలో విరహమొచ్చి మండిస్తున్నందుకు..
7180. మనసుకు రెక్కలు మొలిచినప్పుడే అనుకున్నా..
నీ చిరునవ్వును అందుకొనేందుకు ఎగిరొస్తుందని..
7181. మౌనమైతేనేమిలే నువ్వు..
నాలో వెన్నెల్లయ్యే మందహాసమైతే నీదేగా..
7182. నిర్జనవారధిలో నిలబడతావెందుకో..
పాలవెన్నెల్లో పల్లవులన్నీ నీకోసమే పాడుతున్నా..
7183. చూపులకెంత చెలగాటమో..
తాకలేని చెక్కిళ్ళను కనురెప్పల్లో కౌగిలిస్తుంటే..
7184. పదాలకెంత కష్టమొచ్చిందో..
మదిలోని బాధను కాగితం స్వీకరించనంటుంటే..
7185. మనసెంత భంగపడిందో..
నీ ఆనందంలోకి ఆహ్వానమందని నిర్లక్ష్యంలో..
7186. నీ అక్షరాలలో నేను..
కొన్ని భావాల పరిమళింపులా..
7187. వెన్నెలంతా అడవి కాచింది..
మదిలోని మోహం మౌనవిస్తుంటే..
7188. అరచేతిలోకి చేరింది బలమంతా..
ప్రత్యర్ధిని నిలువరించమని మనసనగానే..
7189. అన్ని భావాలెందుకో హృదయానికి..
మదిలో ముల్లులెన్నో దిగిపోతున్నా..
7190. చీకటికి ఒళ్ళు మండిందట..
శూన్యమొచ్చి నల్లదనాన్ని వెక్కిరిస్తుంటే..
7191. మనిషికెప్పుడూ ఉబలాటమే..
అహంకారంతోనైనా ఎదురీది సముద్రపు అంతుచూడాలని..
7192. పెదవుల్లో మల్లెలు పండించడమేమిటో..
నేనేమో పగడాలు ఏరుకోవాలనొస్తుంటే..
7193. పగలంటే పరాకవుతోంది..
రాతిరి కలల చిరునామా నీదయ్యాక..
7194. పదేపదే పల్లవిస్తున్నా..
నీ పాటలో కుసుమించాలనే ఆకాంక్షలో..
7195. నీ తలపులు మల్లెలే..
పరిమళిస్తూ నన్ను పరామర్శించినప్పుడల్లా..
7196. బెల్లం చుట్టూ చీమలే..
డబ్బుల చుట్టరికంలో బంధుసముద్రులు..
7197. వెన్నెల ముచ్చట్లెన్నో ఎదలో..
చీకటికి మాటలు రావంటున్నా..
7198. నీ ఊహలలో మైమురుస్తూ కన్నులు..
వేరే కలలేవీ వద్దంటుంటే రాత్రులు..
7199. ఉదయాస్తమానాలెన్ని కరిగాయో..
నీ ముద్దుముచ్చట్లలో తేలిపోతుంటే నేను..
7200. వేణువై వినబడుతోంది..
గొంతు సవరించుకుందేమో చలికాలపు గాలి..

No comments:

Post a Comment