Tuesday, 7 March 2017

6601 to 6700

6601. పగటికలలను సైతం కానుకిచ్చేసా..
పాలవెన్నెల జోలలన్నీ నావైనావని..
6602. గెలుపు కేక వినబడుతోంది..
జలపాతమై ఉరుకుతున్న జీవచైతన్యంలో..
6603. మనసు పంట పండింది..
చెలిమిఫలాన్ని నీలా నాకిస్తూ..
6604. కన్నీరొక్కటే చేరువయ్యింది..
నీ రూపుకి నోచుకోలేదనే నయనానికి..
6605. రాగాల పాలయ్యింది రాతిరంతా..
అంతరంగాన నువ్వాడిన ఆనందతాండవానికి..
6606. గమ్యమొకటి నిర్ణయమయ్యిందిగా..
మలుపులెన్నొచ్చినా మరచిపోమని అన్యాపదేశ సందేశమిస్తూ..
6607. నీ జీవాత్మలో నేనేగా..
అణువణువులో నాదాన్నై వినబడుతూ..
6608. నీ జ్ఞాపకాలైతే గిజిగాళ్ళే..
నలువైపులా మెత్తగా బంధిస్తూ..
6609. నీ తొలివేకువ కవిత నేనేగా..
రేయెన్ని వెచ్చని మాలికలను రాసుకుంటున్నా..
6610. కలవరమెప్పుడూ లేదుగా అంతరంగానికి..
వర్ణచిత్రంగా మారిన నీ హృది స్వప్నాల వేదికలో..
6611. మనసు ఊయలూగుతోంది..
ఏకాంతరాత్రిలో నీ పాటలిచ్చిన పరవశానికి..
6612. అలౌకికమే హృదయానందం..
నీ ఆలాపనతో చిరునవ్వుతుంటే ప్రభాతం..
6613. అమ్మా నాన్నకి ఇరుకయ్యిందట హృదయం..
ఉన్నంతలో సర్దుకుపొమ్మనే కలికాలపు జీవనంలో..
6614. అందం నేనైపోయా..
నీ ప్రపంచం నేనని తెలుసుకున్నాక..
6615. అదేగా మురళి..
వేణుగానామృతమును రేపల్లెకు పరిచయించిన రవళి..
6616. గెలిచేదెప్పుడూ ప్రేమేగా..
మనసంతా మాటల్లో ఒదిగించి సంధించినా..
6617. ముంగిట నిలిచిన చైతన్యం..
చెలిమి నీలా రూపంతరమయ్యాక..
6618. కలలనే వరముగా ఇచ్చా కన్నులకి..
రేయంతా నీ వియోగాన్ని భరించలేనంటుంటే..
6619. గుచ్చుకుంటూనే ఉన్నాయింకా అపార్ధాలు..
స్వార్ధం కోసం నిజాలు దాచిపెట్టి అబద్దాలు విహరిస్తుంటే..
6620. కన్నీటిలో దాచిన కలలేగా నీవన్నీ..
చినుకుగా రాలి నన్ను చెమరింపజేస్తూ..
6621. పరిమళిస్తూనే నీ జ్ఞాపకాలు..
రేరాణిపువ్వుల కుసుమవృష్టిగా నన్నంటిపెట్టుకుంటూ..
6622. వారంవర్జ్యం లేని నీ తలపులు..
కన్నీటితో ఋతువులను తప్పుదారి పట్టిస్తూ..
6623. ఆస్వాదించడంలో ఆరితేరాను..
ప్రతి తలపులోనూ నిన్నే హత్తుకుంటూ..
6624. వసంతంలోనే ముగిసిపోవాలనుకున్నా..
నీ వియోగ శిశిరాన్ని భరించలేననే..
6625. తరువుగా ఎదగలేకపోయా..
ముక్కుపచ్చలారని మొలకగానే జీవనం ముగిసిపోతుంటే..
6626. అనురాగాన్నై నీలో వినబడేది నేనేగా..
కనువాకిట్లో జాలువారే తొలి ముగ్గులా..
6627. నీ చూపుకి తటిల్లతను నేనేగా..
పూర్ణ చంద్రికల పురులు చూడాలనిపించినప్పుడల్లా
6628. వసంతం నిద్రపోయింది..
చిగురించేందుకు తరువులేక..
6629. నా గుండెకెప్పుడూ తీయని బాధే..
తొలివలపు కన్నుల్లో అలా కదులుతుంటే.. 
6630. అనుభూతులెప్పుడూ అజరామరమే..
మనవైన మధురక్షణాలు జ్ఞాపకాల్లో కంపిస్తున్నా..
6631. ముక్కలు చేయక తప్పలేదు మనసుని..
నా రూపమెక్కడైనా కనిపిస్తుందేమోననే ఆశలో..
6632. జతగానే జీవించాలనుకున్నానందుకే నీతో..
మన ఆలోచనలేవీ సరిపడకపోయినా..
6633. వలపునందుకే దాచుకున్నా..
నా మౌనంలోనే మనసు పసిగడతావని..
6634. ఏకాత్మగా మిగిల్చిన అనుభవమొకటి..
ఏకాంతంలో పదేపదే గుర్తుకొస్తూ..
6635. చూపును మరల్చుకున్నా..
నీ కళ్ళెలానూ నన్ను కలవలేవనే..
6636. పరిమళాలద్దుతావు నా పలుకులకి..
కిన్నెరసాని ఒయ్యారాలను కోసుకొచ్చి..
6637. ఎంతకీ అలసిపోనీ నా కన్నులు..
నీ రూపాన్ని ధ్యానించే ఆనందాలలో..
6638. రంగు మారిన నా లేతపెదవులు..
ప్రేమతో తీయని తొలకరులు చిలికించగానే..
6639. రోదన తప్ప ఏం మిగిలిందా మనసుకి..
ఒక్క అబద్దాన్ని నిజమనుకొని నమ్మిన పాపానికి..
6640. ఏడడుగులు సరిపోతాయనిపిస్తుంది..
వెన్నెల్లో విహారమైనా నాతో నువ్వుంటే..
6641. ప్రశ్నలేమీ వేయదలచుకోలేదిక..
ప్రేమకి సమాధానం నేనేనని తెలిసాక
6642. నవ్వుకుంటున్న భావాలు..
నాలోని అలజడిని నువ్వు మీటుతుంటే..
6643. ముగించేసా మౌనం..
నీ పలుకు వినాలనే పరవశంలో..
6644. నువ్వెప్పుడూ అంతే..
దిగులైనవేళ ఏకాకితనంలోకి నన్ను విసిరేస్తూ..
6645. వీడని అలలై నీ జ్ఞాపకాలు..
నా మనసుతీరాన్ని కెరటాలై తాకుతూ..
6646. రాతిరవుతుందంటే పండుగే..
కలలో నువ్వే రూపంలో విందవుతావోనని..
6647. అక్షరాల్లో చేరినప్పుడే అనుకున్నా..
కవనానికి దారడిగి తీరతావని..
6648. రాగాలు రవళిస్తున్న సవ్వడొకటి..
మౌనవాటికలో మెరుపుతీగల గలగలలో..
6649. తొలకరిజల్లుగా కురిసిందొక మనసు..
ఎండిన గుండెకు చెమరింపయ్యేందుకే..
6650. పగలంతా కలవరమే..
కలలోకి నువ్వొస్తావనుకుంటే..
6651. మనసుకు మెరుగు పెట్టినట్లనిపించింది..
జ్ఞాపకాల జడివానతో గతం కొట్టుకుపోయి భవితను వీక్షించాక..
6652. ఉషస్సు వెలిగింది కన్నుల్లో..
వెన్నెలరేఖలను ఊహించుకుంది మనసైతే..
6653. అనుబంధమొకటి చెదిరిపోయింది..
విడిపోక తప్పదని విధి నిర్ణయమయ్యాక..
6654. ముగిసిన ప్రేమ..
అర్హతలేని మనసుల మధ్య ఇమడలేక..
6655. సంపెంగల సమాహారమొకటి కడుతున్నా..
నన్ను దాటి నీలో మృదువైన పరిమళమొకటి ప్రవహించాలని..
6656. రాతిరి పూసుకున్న రంగులన్నీ నీవేగా..
నన్నో సౌందర్యానికి ప్రతీకగా మలచుకుంటూ..
6657. నిశ్వాసించడమే మానేసా..
నీ ఊపిరిగంధాలకు వేడిమి సోకరాదనే..
6658. అక్షరీకరించిన కవనమది..
నీ హృదయంలో రాలిన భావమది..
6659. ముక్కలుకాక తప్పని మది..
నిస్సహాయతలో నిట్టూర్పును విడిచేసాక
6660. అంతర్యామిని మించిన సృష్టికర్తలు లేరు..
ప్రతి పాత్రనీ అనుగుణంగానే స్పృశిస్తూ..
6661. పరుగులు పెడుతూ నా ఊహలు..
నిన్ను చేరేవేళ కాలన్నే ఓడిస్తూ..
6662. కొత్తగా సర్దడమెందుకో నీ హృదయాన్ని..
ఉన్న రంగులకు నిశ్శబ్దాన్ని పూసేస్తూ..
6663. పూసంత ప్రేమకే..
మనసంత దాసోహం..
6664. అతిశయమెక్కువే నీ పెదవికి..
నా అందాన్ని వర్ణించేందుకు..
6665. విరహ విషాదంలో నేను..
పన్నీరైన ప్రేమలో నీవు..
6666. నా రాతిరికి వెన్నెల నీవేగా..
ఇంట్లో దీపానికి చమురనేదే లేకున్నా..
6667. నీ తలపులకెందుకో గగ్గోలు..
నా వలపును పండనివ్వకోకుండా..
6668. నిజమిప్పటికి బయటకొచ్చింది..
మనసొకటి సమాధి స్థితిలో జారేవేళ..
6669. శూన్యమంటేనే భయపడి ఛస్తున్నా..
సముద్రపు లోతులను అన్వేషించలేదందుకే..
6670. నిండుపున్నమే నీ తలపు..
మనశాకాశంలో వెన్నెలొకటి విరిసినట్టు..
6671. వేకువై తడమడం మానలేదు..
తనకు ఉషస్సును కాలేకపోయినా..
6672. స్వరాలు మరచిన జీవితమే నాది..
నీ అనురాగంలోనే పారవశ్యాన్ని చేరుతూ..
6673. ఏడేననుకున్నా స్వరాలు..
నీ మాలికలను రాగంలో కూర్చనప్పుడు..
6674. ప్రేమెక్కువే నాకు..
నువ్వెన్నోవాడివో లెక్కించుకుంటూ..
6675. మోహాన్ని కాలదన్నిందామె..
వ్యామోహాన్ని భ్రమపడినందుకే..
6676. నిజాలన్నీ మరుగునపడుతున్నాయి..
కలలోనే జీవితాలు సృష్టించుకొని ఆనందిస్తుంటే..
6677. నీ ఊహలో ఊయలూపినప్పుడే అనుకున్నా..
నన్నో అపురూపముగా దాచుకున్నది నిజమేనని..
6678. కృష్ణశాస్త్రి వారసురాల్ని నేనేగా
అలతిపదాలతో మాలికలు గుచ్చి నీ హృదయాన్ని మెప్పిస్తూ..
6679. చినుకంత ప్రేమకే..
మనసింత తుళ్ళింత..
6680. ఊపిరిలో చేరిందో వెచ్చని మైకం..
నీలో శ్వాసల పరవశం నాదవ్వాలనే..
6681. అశ్రుగీతాలకీ స్వరముంటుందని తెలిసింది..
విషాదమొకటి గొంతులో ప్రవహిస్తున్నప్పుడు..
6682. నీరవాన్ని హత్తుకున్నప్పుడు తెలియనే లేదు..
నా హృదయం గతాన్నే ఇష్టపడుతుందని..
6683. మనసు వాకిలి తెరిచే ఉందిగా..
నిదురలోనైన ఓసారి నే నడిచొస్తాలే..
6684. మనదేగా స్వర్గం..
లోకాలన్నింటినీ కాదని మనమో లోకమయ్యాక..
6685. ఉదయిస్తున్న ప్రశ్నలెన్నో మదిలో..
జవాబు కాలేనని నువ్వనకుండానే..
6686. మనసుకేమయ్యిందో..
అద్దం నన్ను నన్నుగానే చూపుతుందీరోజు..
6687. భావాలెందుకో బరువెక్కాయి..
సహకరించని మనసుని బుజ్జగించలేక ఓడిపోయి..
6688. నీకు నేను..నాకు నువ్వూ..
ఒకరికి ఒకరం మనసులిచ్చి పుచ్చుకున్నాక..
6689. గతమొక్కటే తోడుంది..
నన్ను నాకు అపరిచితం కాకుండా కాపాడేందుకు నేడు..
6690. చూడాలనుంది నిన్నే..
కన్నులకు ఆకలవుతోందట..
6691. గాలికి గంధమంటినట్లుంది..
వసంతగానంలో పరిమళాలు మనసును తాకుతుంటే..
6692. ఆరారుకాలాలూ కలిసుందామనుకున్నా.. 
డెబ్భైరెండు గంటలకే మరచిపోతావని తెలీక..  
6693. అనుభవసారాన్ని పంచేస్తున్నా..
ఆదమరపులో ఉండగానే జీవితం ముగిసిపోవొచ్చనే..
6694. మూడునవ్వుల నీరిస్తే చాలనుకున్నా..
ఆరుపువ్వులు వాటంతటవే పూస్తాయని.. 
6695. దేవుడందుకే కనుమరుగయ్యాడు..
తమకి తామే దేవుళ్ళుగా ప్రకటించుకుంటున్న విపరీతాన్ని చూసి..
6696. దగ్గరకు రాదందుకే ఏ చలీ..
హేమంతాన్ని తరిమేసే తలపులు నీకున్నాయని..
6697. జ్ఞాపకాల వారధిపై నడవాలనిపిస్తోంది..
స్వచ్ఛమైన నవ్వును తడుముకోవాలనే..
6698. అలుకల చిందులు ఆపక తప్పలేదు..
చిరునవ్వుల నీ పెనుకేకలకి ఉలిక్కిపడ్డాక..
6699. జీవితమంతే..
అంకురించాలంటే రాలిపోక తప్పదుగా..
6700.  చూపులకు పట్టుబడ్డప్పుడే అనుకున్నా..
ప్రేమ పంజరంలో పెట్టబోతున్నావని..

No comments:

Post a Comment