Tuesday, 7 March 2017

4001 to 4100

4001. నిరీక్షణా క్షణాలవసరమే..
చెలిమి చిరునవ్వు నిష్కారణపునవ్వుగా మారాలంటే..
4002. సన్నజాజులసెగ పెట్టావేంటో..
 భోగిమంట వేసుకుందామని ముచ్చటగా నేనడిగినందుకు..
4003. జీవితమో సాగరం..
ఆదీ అంతంలానే లోతునూ కనిపెట్టలేనిది..
4004. విహారిలా తిరుగుతావెందుకో..
తుమ్మెదవని నలుగురూ ఆడిపోసుకొనే అవకాశమిస్తూ..
4005. అక్షరమొక అద్భుతమే..
అందరి భావనల్లో అలవోకగా ఒదిగిపోతూ..
4006. భగ్నవీణతంత్రులేవో మోగాయి నా ఎదలో..
నీలోలేని నన్ను వెనుకకు రమ్మంటూ..
4007. అపశృతులు మొదలైన జీవనరాగం..
వెతలకు ఎదురీదే క్రమంలో.. 
4008. గుసగుసలను తలపోస్తున్న నా జూకా..
కసిన్ని కబుర్లను కలబోసుకుందాం రమ్మంటూ..
4009. చుక్కానివయ్యావందుకే నా జీవితనావకి..
నిశ్చింతల్లో నన్ను సేదతీరుస్తూ..
4010. ప్రవాహమై ఉరకలేస్తున్నా..
ఆపేక్షను అవ్యక్తం చేసి అందించావనే..
4011. బాహుబలివని గుర్తించలేకుంది..
బాహ్యంలో అల్పమైన ఆలోచనలను హత్తుకుంటూ..
4012. ఆవేదనై నిలబడిపోయా..
నువ్వింత ఆలశ్యంగా నా ప్రేమను గుర్తిస్తావని తెలియక..
4013. వెలసిన నా మెడలోని ముత్యానికెరుక..
 నీవున్నప్పటి మెరుపు తనకిక తిరిగిరాబోదని..
4014. చిలిపికలలను దాచుకున్నానందుకే..
వేసవి వర్షంలా అప్పుడప్పుడూ పులకింపజేస్తాయని..
4015. ఒక్కసారి విమానమెక్కుదామన్నానందుకే..
నీలో చైతన్యం చక్రాలను వీడుతుందనే..
4016. నీటిలో నీడ చూసుకోవడం తప్పయిపోయింది..
తారలకు తిధులూ వారాలూ గుర్తులేనప్పుడు..
4017. జాజిమల్లినెందుకు గుర్తుచేస్తావులే..
జావళీలు జూకాను కదిలించి పాడాయని..
4018. ప్రవాహమై ముంచుతావని గ్రహించానప్పుడే..
కడలితరంగమై నన్ను చుట్టుముట్టినప్పుడే..
4019. ఆనందపు గుసగుసలాడుతున్నావనుకోలా..
నువ్వలా చెవిలో రహస్యాలు గుప్పిస్తుంటే..
4020. అద్దుకున్నా నీ ఆనందభాష్పాలు..
నులివెచ్చనై కమ్మగా తడిమాయనే..
4021. జంపెతాళాలేస్తున్నా నీ మాటలకు..
సంకీర్తనలై నాకు వినబడ్డాయనే..
4022. చెలికత్తెలకు సెలవిచ్చేసా..
భోగిమంటేసుకుంటామని ముచ్చటపడ్డారని..
4023. అక్షరాలకెన్ని సొబగులద్దానో..
నా ఆకాంక్షలను నీకు అందిస్తున్నాయని..
4024. భోగిపళ్ళ దృష్టి తీయమంటే పట్టించుకోవెందుకో..
నీవు మాత్రం నిరంతరనిప్పు రాజేసుకుంటూ..
4025. లక్షింతలై కురిసినప్పుడే అనుకున్నా..
శుభమంగళం మనసుకింక వేరేవద్దని..
4026. నవ్వుకుంటున్న వేకువ..
సృష్టిలోని మార్పుల్ని అంగీకరించని అల్పత్వానికి..!
4027. 
నవ్వుకుంటున్న వేకువ..
అనంతమైన ఏకాంతాన్ని హత్తుకునేందుకు సందేహిస్తున్నానేమో.
4028. 
నవ్వుకుంటున్న వేకువ..
భోగినాటి మధూదయాన్ని చూసి ఆస్వాదించలేని నాగరికతను చూసి.
4029. 
నవ్వుకుంటోంది వేకువ..
నిర్మలాకాశంతో నేనాడే మౌనపు గుసగుసలకేమో
4030. నిశీధిలో నవ్వులేంటో..
ఎంత నిద్రపట్టకపోతే మాత్రం నన్నో చంద్రముఖిగా ఊహిస్తూ..
4031. పచ్చదనం వెనుక ఎర్రదనం బయటపడుతోంది..
వెల్లువై నీ కన్నీరు గుచ్చుతుంటే..
4032. ఇన్ని విన్యాసాలనుకోలేదు అక్షరానికి..
పండుగను మాలికాతోరణాలతోనే అలంకరిచ్చేస్తూ..
4033. రెక్కలొచ్చినట్లు తెలియనేలేదు..
పక్షిలా మారి నీపైన ఎగిరేవరకూ..
4034. ఓరచూపుతో బ్రతికిద్దామనుకున్నా నిన్ను..
క్రీగంటికే మూర్ఛపోతావని మరచి..
4035. భోగిమంటై వెలిగానందుకే..
పండుగకు నాకు హద్దులు చెరిపేసావనే..
4036. మధురీతలో తేలుతోంది మనసు..
నాకోసం నిన్నింతగా ఆవిష్కరించుకున్నావనే..
4037. స్పందనలెందుకు దాచుకుంటావో..
ప్రతిస్పందించలేదని నా భావాలను తిట్టిపోస్తూ..
4038. చందనాలు దిద్దుకోనన్నానందుకే..
ముద్దబంతివంటూ ముప్పొద్దులా ముద్దులాటల్లో మునిగిపోతావనే..
4039. బంధనాలేయడం నేర్పింది నువ్వేగా..
నాలుగుపెదవులనూ రెండుగా మార్చేస్తూ..
4040. ఇందువదననే మొన్నటిదాకా..
నువ్వు మోహించి మాయలమళయాళీగా మార్చేదాకా..
4041. నా ఆపదమస్తకం బిగిసినప్పుడే అనుకున్నా..
నీకు ప్రేమతో బంధించడం తెలుసని..
4042. తుమ్మెదవై తిరుగుతున్నావనుకోలా..
తోటలో ఇష్టారాజ్యమై నువ్వలా సంచరిస్తుంటే..
4043. నా గీతలు గంతులేసాయి..
నీ నుదురు వేదికయ్యిందనేమో..
4044. మధురమైనవి నీ జ్ఞాపకాలు..
తీయని వెన్నెలను కలగలిపినందుకే..
4045. వంతపాడేసా నీకు..
నీవెంటే నేనంటూ..
4046. అపశృతులెందుకులే..
సంసారసిద్ధాంతాలు సరిగా పాటిస్తే సరి..
4047. నీవైపోయా నేనెప్పుడో..
నువ్వూనేనూ మనమైనప్పుడే..
4048. ఆడిపోసుకుంటావెందుకు అపరచితుల్ని..
ఆనందానికి ఆమడదూరముంటానంటూ..
4049. మనమంటే గుర్తొస్తోంది..
మనమిద్దరం ఉన్నామంటావా..
4050. ఒక్కటిగా మిగిలింది మనసు..
మనిద్దరి పంపకాలలో ఇమడలేక..
4051. ఆవేదనంతా మాయమయ్యింది..
అద్వైతంగా మార్చి నన్ను చదువుతుంటే..
4052. మనసు కోరిక తీరింది..
అనంతమైన ఆవేదన తీసావనే..
4053. అపరంజిసిరులు కానుకిచ్చినందుకే..
తవ్వేకొద్దీ బయటపడుతున్న సంతోషపు నిధి..
4054. నిన్నటిద్దకా మూగనే..
నువ్వేసిన మంత్రంతో మాటలొచ్చిన చిలకలా..
4055. ఆనందం ఆటవెలదైంది..
జానపదంలా నువ్వు నన్ను పాడుతుంటే..
4056. కులుకు నేర్చానందుకే..
నా అలుకలతో నీకు విసుగెత్
తించకూడదనే..
4057. మత్తేభమై మత్తెక్కించాలనుకున్నా..
నా పలుకుల తీయదనాన్ని అర్ధంచేసుకుంటావని..
4058. పద్దురాస్తున్నా నీ ఖర్చులన్నీ..
నెమరేసుకునేందుకు జ్ఞాపకాలుగా గుర్తొస్తాయని..
4059. స్వప్నలోకాలు ఎదురుచూస్తున్నాయేమో..
సారంగీ నాదాలతో నిదురకు నిన్నాహ్వానిస్తూ..
4060. మాపటికి సుద్దులు నేర్పుతావెందుకో..
ముద్దులసద్దుకై నేను వేచుంటే..
4061. విడిదవ్వలేకున్నా విషాదాలకి..
వినోదాలకి ఆలవాలమైన మదిని ఏడిపిస్తూ..
4062. ఉత్పలమాలల ఊసులెన్నో..
గడుసుగానైనా  నిన్ను ఆకట్టుకోవాలనే ఆరాటంలో...
4063. మువ్వలూరుకోనన్నాయి..
ముద్దులకని పిలిచి నువ్వు మాట మారుస్తుంటే..
4064. ఆనందభాష్పాలు కరువయ్యాయి..
నువ్వలా ప్రతీదీ కన్నీటితో పోలుస్తుంటే..
4065. నీ మాటల్లోనే మదికి ఆరగింపు..
వేరే తాళింపు ఒద్దంటున్న వంటకాలు.. 
4066. కన్నీటిని తీయగా మార్చుకున్నా..
నీ తలపు పన్నీరవుతుంటే..
4067. అలుకలు పెంచకలా వాయినాలతో..
వలపులో వగరు పాయసంలా..
4068. నీ కొరకే తీయగా మారిపోయా..
సముద్రమనుకొని నువ్వు చెంత చేరలేదనే..
4069. షడ్రుచుల నా మనసు..
ఆరుకాలల ఆనందాలకీ లోకువైందేమో..
4070. మధించమాకలా మనసును అంతలా..
అమృతమే ముందుగా బయటపడాలనుకుంటూ
4071. ఎన్ని అరుణిమలో ఆనందాలకి..
సిగ్గులు మల్లెలను దోచేస్తుంటే..
4072. సంకురాతిరినే మరచినట్లున్నావు..
షడ్రుచులను మనసారా మదికి పట్టించుకుంటూ..
4073. బుగ్గలు కందుతున్నవి చూసుకోవా..
సిగ్గునలా రంగరించి పూస్తావెందుకలా..
4074. మంచు సైతం మల్లెలా మెప్పించింది..
తెల్లని వెన్నెలై మదిలోకి ఇంకిపోతూ..
4075. అర్ధాలను విచారించడం మానేసా..
మనసద్దంలో మెరుపును చూసుకుంటూ..
4076. ఎన్ని ఒయారాలొచ్చాయో పదాలకు..
పండుగ సొగసంటే ఇదేనేమో..
4077. రసవాటికగా మారుస్తావెందుకలా మనసును..
ఆనందడోలికల్లో ముంచి మురిపించేందుకేనా..
4078. సొబగులెన్నో అతివకుమల్లే..
అక్షరాల అందం ఇంతింతై వెలిగిపోతూ..
4079. అపరంజి తారకలు..
ఆనందయానంలో అమృతగుళికలు మన మణిమాలికలు..
4080. మణులు గుభాళిస్తాయంటే నమ్మలేదు..
మాలికలకు సౌరభాన్ని నువ్వద్దేదాకా..
4081. మనసు ముంగిలిప్పుడు మెరిసింది..
రంగవల్లుల్లో మేలిమి కలిసినందుకు..
4082. వేడుకయ్యిందిగా మానసం..
కన్నుల్లో సంక్రాంతి కార్తీకాన్ని తలపిస్తుంటే..
4083. బుగ్గలకెందుకో నిగ్గులు..
ముగ్గుల రంగును అలవోకలో పూసుకున్నందుకేమో..
4083. సరదాలూ..సగపాలూ మనవేలే..
సంగీతం సంతోషం మనదైనట్లు..
4084. అలుకలేమో నీ పెదవుల్లో..
అనునయాలేమో నా చేతుల్లో..
4085. కల నిజమయినట్లుంది..
నువ్వెదురై నన్ను చూపులతో గిల్లాకనే..
4086. మంగళం పాడమంటావనుకున్నా..
అదేదో నువ్వే గొంతు సవరిస్తుంటే..
4087. ముగ్గులేద్దామని రమ్మంటున్నా..
మొగ్గలేస్తావని గమనించకుండా..
4088. గమ్మత్తుగా మాట్లాడుతావే..
గారాబు చేసేవాడిలా నాతో బ్రతిమాలించుకుంటూ..
4089. గతి తప్పుతున్న మనసు..
నీ అలుకను తాగిందనే..
4090. ప్రేమెంత చిలిపిదో..
గుచ్చుతుందో గిల్లుతుందో తెలియకుండానే దగ్గరచేస్తూ..
4091. మరపురాని స్రవంతులు..
నిన్ను తోడుకొచ్చిన సంకురాత్రి సంతోషాలు
4092. పాదరసాన్నే అనుకున్నానిన్నాళ్ళూ..
నువ్వు జలపాతంతో నన్ను పోల్చేదాకా..
4093. నీలినయనాల తారను నేనే..

నీ చూపుల వెలిగించు వెన్నెల సితారనూ నేనే...
4094. సితారగా మారానప్పుడే..
సారంగిలా నేనున్నా నువ్వర్ధం చేసుకోలేదనే..
4095. భావతరంగాల్లో చిక్కినప్పుడే అనుకున్నా..
నువ్వేసిన వలపువలకి దొరికిపోయానని..
4096. 
ఊపిరిలో జీవం నింపింది నువ్వేననుకున్నా..
నా శ్వాసలో సుగంధాలను గమనించుకుంటూ..
4097. నులివెచ్చగా తాకినందుకేమో..
నవరాగాలు తీస్తోంది నీ తనువు..
4098. నన్ను అపరాజితగా చేసినప్పుడే అనుకున్నా..
విషాదానికి నువ్వు తెరతీసి కుమిలిపోతావని..
4099. లోకం ఏకాకయ్యిందట..
మనమిద్దరం ఒకటయ్యామనే..
4100. ఒక్కటైతే చాలనుకున్నానీ జన్మకి..
నువ్వూ..నేనూ..వెన్నెలా..
This email has been sent from a virus-free computer protected by Avast. 
www.avast.com

No comments:

Post a Comment