Tuesday, 7 March 2017

5900 to 6000

5901. కదలని మనసులెన్నో..
కలల కౌగిలిలోనే నిరంతరం నిదురిస్తూ
5902. కిరణమై నువ్వు ప్రసరిస్తే చాలు..
వరదలా వెల్లువవుతున్న భావాలు నాలో..
5903. ఊహాసుందరని చాటింపేసావుగా..
నిన్ను దాటి నా మనసులోకే పోలేకున్న నేను..
5904. దశమినాటి వెన్నెలేనది..
నాపై కురవాలనే ఆరాటాన్ని ఆపుకోలేక..
5905. నీ చూపు అర్ధమయ్యింది..
నన్ను నీలో గుర్తించలేకపోయాక..
5906. అక్షరాలతో అమ్మ మనసు..
ఆకాశంలా ఆనందాన్ని నింపేస్తూ..
5907. అక్షరానికి వెలుగెక్కువే..
మదిలో చీకట్లను చిటికెలో తరిమేస్తూ..
5908. వాల్లిద్దరూ ఎవరికివారే..
యమునా తీరంలో కలుస్తారేమో చూడాలి..
5909. నువ్వే రాసుకోవాలి నీ వేదన..
ఆవేదన అక్షరమై ఒలికి మనశ్శాంతిస్తుందంటే..
5910.  సుగంధమేదో నిండింది ఎదలో..
నీ తలపు సౌరభమేననుకుంటా..
5911. బాల్యమో అనుభవమే..
ఎదిగేందుకు జీవితాన్ని పరిచయం చేస్తూ..
5912. నిరాశను నిరీక్షణలో పెట్టెయ్..
ఆశకు మాత్రమే పిలుపిస్తూ..
5913. నా చూపులకెందుకో మత్తు..
గంధాలు పులిమింది చెక్కిళ్ళైతే..
5914. వెన్నెలై ఒదిగినప్పుడనుకోలేదు..
లోకానికి చీకటిచ్చి నిన్ను వరించానని..
5915. అడుగుల తడబాటందుకేనేమో..
నీ చూపుకి నెలవంకలు కుదించుకుంటుంటే..
5916. మనసు ఇరుకైపోతోంది..
నీపై వలపు అనంతమై విస్తరిస్తుంటే..
5917. ప్రేమావేశం..
ప్రేమేగా నీ ఆవేశం..
5918. మజిలీ నువ్వేగా..
నాలో వలపెన్ని జన్మలు కొనసాగినా..
5919. నవ్వును ధరించక తప్పలేదు..
నిరాశల నగ్నత్వాన్ని కప్పిపుచ్చాలంటే..
5920. తీరిక కోసమే అలమటిస్తున్నా..
ఒక్క కోరికైనా తీర్చుకుందామని..
5921. మట్టివాసనకే మత్తిల్లిన మది..
మరోమారు ఊరు పలకరించిందనే..
5922. మబ్బేసినప్పుడల్లా దిగులే..
నక్షత్రాల్లో దాగిన అమ్మ కనబడలేదని..
5923. ఆమెందుకు అపరాజితను చేస్తావో..
ఆటను సగంలోనే ఆపేస్తానంటూ..
5924. ఎన్ని విరుల ఆత్మార్పణోనది..
మరణిస్తూనే అనుభూతులకు పరిమళాన్నిస్తూ..
5925. మధుమాసం వలసపోయింది..
మూఢాలంటూ లెక్క కడుతుంటే లోకులు..
5926. నువ్వెప్పుడూ అంతే..
కన్నుల్లో కొలువుందామనొస్తే నలుసనుకొని నలిపేస్తూ...
5927. నటించడం మానేసా..
నీ పెదవులపై జీవమిచ్చి చేర్చినందుకే..
5928. మనసెందుకు నొక్కెశావో..
నీ దగ్గర కవిత్వం కరువయ్యిందని..
5929. గ్రీష్మమసలే గుర్తురాలేదు..
నీ అనురాగంలో తడిచి ముద్దైపోతుంటే
5930. మల్లెలకెంత అలకొచ్చిందో..
వసంతంలో విరజాజులను మాత్రమే చేరదీసావని..
5931. కన్నులు కలువలైనవి..
చెలికాని ఆలశ్యానికి ఎదురుచూసి అలసినందుకే
5932. నగిషీలు దిద్దుకున్న భావాలు..
మెరుపిచ్చిన నీ హృదయంతోనే..
5933. అనుభూతికి తక్కువలేదు..
నన్నాత్మీయంగా దాచుకున్న నీ ఆలింగనంలో..
5934. నువ్వక్కడా..నేనిక్కడా..
మనసైతే పడ్డది మనం సాహిత్యంపైనేగా..
5935. భావాల బరువు మోయలేకున్నా..
కవిత్వానికి కనుమరుగై దోబూచులాడుతుంటే..
5936. నీ మనసు బంగారం నాదయ్యిందిగా..
నాలో అందాన్ని రెట్టింపు చేసేస్తూ..
5937. ప్రతీ భావములోనూ నువ్వే..
అనురాగాన్ని కలగలిపి పాడినప్పుడల్లా..
5938. గమకాలన్నీ గతి తప్పాయి..
తమకం నిన్నే కోరుకుంటుంటే
5940. క్షణానికో పులకరింత..
నీ కౌగిలింత స్వర్గాన్ని తలపిస్తుంటే..
5941. నేనెప్పుడో నువ్వైపోయాను..
నేను విడిగా లేనని ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేదనే..
5942. పగలే వెన్నెల కురిసినట్లుంది..
నా ఎదురుచూపులు ఫలించినందుకే..
5943. నీవో అక్షరమేలే..
నా కవితల్లోకి అలవోకగా చొరబడుతూ..
5944. వేరే తొలకరులెందుకనుకున్నా..
నీ చూపులే వెన్నెలజల్లులై కురిసిపోతుంటే..
5945. మదిలో చిత్రించుకోవలసిందే అపురూపాలన్నీ..
కనికరించని క్షణాలు కదిలిపోతుంటే..
5946. నీ మనసునే చదవాలనుకుంటున్నా..
గుండెల్లో చోటిస్తావని నమ్మినందుకే..
5947. కొన్ని నిజాలు నీకు చెప్పనందుకే..
నిన్ను ఆనందంగా చూడాలనే సదా..
5948. విషాదాన్ని తాగేస్తున్నా..
ఆనందాన్ని నీకు పంచివ్వాలనే ఆత్రంలోనే
5949. సహకరించడం నా వంతయ్యింది..
మురిపాలను కాదనలేని సంతోషంలో..
5950. అపురూపమై ఒదిగిపోలేనా..
నీవంత ఆదరంగా నన్ను చేరదీస్తుంటే
5951. ఆకాశమెందుకో మౌనవించింది..
నీ ఆనందానికి అడ్డుచెప్పలేక కాబోలు..
5952. ప్రేమ విందుకు వేళయ్యిందనుకోలా..
ఆకలని నువ్వెంత గోలపెడుతున్నా..
5953. కాటుక పిట్టలన్నీ ఎగిరిపోయాయి..
తమ రెక్కలను అల్లాడించి మరింత చీకటి పెంచేస్తూ..
5954. కన్నీరుగా బయటపడుతోంది..
నాలోని విషాదానికి నల్లరంగు అంటిందేమో..
5955. ఆకులకెన్ని కిలకిలలో..
ఒక్కో చినుకూ ప్రేమగా పలకరించినందుకే..
5956. గ్రీష్మాన్ని తరమాలంటే చిరుజల్లు కురవాల్సిందే..
ద్వేషాన్ని సాగనంపాలంటే ప్రేమవిత్తు మొలకెత్తాల్సిందే..
5957. వాస్తవంతో పనేముందనిపిస్తోంది..
స్వప్నంలో మనసు మయూఖమై వెలిగిపోతుంటే
5958. నవ్వినా ఉలికిపడతావెందుకో..
మౌనంగా నేనుంటే సహించలేనంటూ నువ్వు..
5959. మందారాలకెప్పుడూ ఉడుకే..
మల్లెలను తప్ప మదిలోకి మరో పువ్వును రానివ్వనని..
5960. గతి తప్పిన కలల్ని విడిచేసా..
అభిమానాన్ని దాచుకొని ఆనందాన్ని అందుకోవాలనే
5961. పదేపదే వివశం చేస్తావెందుకో..
పెదవంటలేని అసహాయతను వెక్కిరిస్తూ
5962. విషాదమంటే అదేనేమో..
వేదనాతీతమైన భావాలు మదిలో కదిలినట్లు..
5963. అమ్మ చాకిరీ అందరికీ కావాలి..
నాన్న గురించే నా బెంగంతా..
5964. జ్ఞాపకాలతో ఆటలాడినప్పుడల్లా ఇదే అంటావు..
రహస్యమేదో ఆమె నీకు విన్నవించిందని..
5965. ఆనందాలెన్ని బయటపడ్డాయో..
నీ స్మృతులు నెమరేసుకొనే కొద్దీ..
5966. అంచనా వేస్తున్నా నీ వేగాన్ని..
నా మదిని దాటెంత ముందుకెళ్తావోనని..
5967. ప్రతీక్షణలో నేనిలా..
నిశీధిలో వేకువను వెతికే అభిసారికలా..
5968. ఊపిరప్పుడే అందుతుంది..
మదిలో నీ ధ్యానం చెదరనప్పుడే..
5969.దారి తప్పినా ఫరవాలేదనిపించే పయనం..
నీ ఎదలో విహరించే వైనం..
5970. జ్ఞాపకాలే ఊపిరైనవి..
రెప్పల్లో ఆగిన ఊహలను మేల్కొల్పలేనప్పుడు..
5971. ఆ రాత్రి వ్యర్ధమే అనిపిస్తుంది..
నిన్ను కలలో దర్శించని వేదనైనప్పుడు..
5972. మౌనమేగా నీకలంకారం..
అక్షరాలకు మంత్రమేయమని మనసు ఆదేశించినప్పుడు..
5973.  కనుకొలుకుల్లో నీరు..
విలువల సంఘర్షణలో ఉబికిన బిందువులు..
5974. వసంతం అనుసరిస్తోంది నన్నందుకే..
పచ్చచీరంటే నీకిష్టమని తెలిసినందుకే..
5975. ఒంటరితనమే మంచిది అప్పుడప్పుడు..
నిన్ను నిన్నుగా నియంత్రించేందుకు..
5976. నీలోకే రావాలని నా ప్రయత్నం..
నా ప్రపంచం నీవేననెప్పుడు తెలుసుకుంటావో..
5977. వలసపోయిన కలలు..
కన్నీరెండి కన్నులు పొడిబారి నెర్రలయ్యాక..
5978. కొన్ని స్వప్నాలంతే..
పగలని చూడక మనసును సంతోషపెడతాయ్..
5979. నీతో నీకు పనేముంటుందిలే..
నాలోకి రమ్మని నేనాహ్వానించాక..
5980. నీ మాటలెప్పుడూ వేడుకే నాకు..
తేనె పూసిన విషమైనా సమ్మతమనుకుంటూ..
5981. నీ భావమైతే చాలనుకున్నా..
అనుభూతొకటి నిజమని నీకనిపిస్తే..
5982. నీరవాన్ని నిందిస్తావెందుకో..
జ్ఞాపకాలు సవ్వడి చేసాయని విసుక్కుంటూ..
5983. మౌనగీతాన్ని మొదలెట్టా..
వలపంటే వాయిదా వేస్తూ నువ్వున్నావనే..
5984. ఆనందం విశాలమయ్యింది..
నీరవంలోనూ నువ్వు నన్నే ఆలకిస్తుంటే..
5985. నీ మత్తు నన్ను చేరింది..
గమ్మత్తుగా ఋతువంతా నన్ను నిద్రపుచ్చుతూ..
5986. మనసుకీ రెక్కలు మొలిచాయప్పుడే..
నీకన్న ముందుగా తానెగరాలనుకుంటూ
5987. ముసురేసినా ఫరవాలేదనుకున్నా..
పురివిప్పుకు నెమలిగా మారిపోవచ్చని మనసంటుంటే..
5988. అనుభూతులకు జీవం పోసిన అమ్మ..
నేనో కవితా మారింది నీవల్లనేగా.. 
5989. జీవమున్నప్పుడే గుర్తించేదెందరో.. 
 అంతిమసంస్కారాలకు ముందుగా కాక అమ్మను..
5980. అమ్మొక అద్భుతమే నాకు..
వడలని చిరునవ్వులతో నిత్యమూ..
5981. అమ్మ పట్టిన పాలు విరిగిపోయాయేమో..
అవకాశావదం బిడ్డ మదిని చేరగానే
5982. అమ్మానాన్న ఇద్దరూ రెండు కన్నులేగా..
ఒకరినొకరు చూసుకోకున్న కలిసి చూపునిస్తూ
5983. నిత్యయవ్వనం ప్రాప్తించాలి అమ్మానాన్నకు..
ఆశ్రమాల ముఖద్వారం ఎదురవరాదంటే..
5984. ఒక్క కృతినైనా నేర్వాలనుంది..
కోకిలమ్మకి శిష్యరికం చేసి..
5985. అమ్మా నాన్నలే ఇలలో దేవతలు..
సమాన బాధ్యతను పంచుకొని ప్రేమనందిస్తూ..
5986. కలిసుండటాన్నే కలగంటున్న..
నీ ఎడబాటుకు సుముఖం కాలేనని..
5987. తుమ్మెదలవుతూ నీ చూపులు..
హేమంతాన్ని నాలోనే కనుగొన్నట్లు..
5988. బడికెల్లక తప్పలేదు..
అమ్మ ఒడిని దాటి జీవిత పాఠాలు నేర్వాలంటే..
5999. మరో ప్రపంచముందని తెలుసుకుంది అమ్మ..
నిన్నటిదాకా ఒడిలోనే ప్రపంచముందని భ్రమించినందుకు..
6000. వేరే పరిమళాలెందుకులే..
అణువణువునా తలపుల సంపెంగలు గుభాళిస్తుండగా..


Virus-free. www.avast.com

No comments:

Post a Comment