Tuesday, 17 November 2015

ద్విపదాలు : 051 నుండి 100 వరకు

..................................... ********.....................................

51. నీ పదములే గమకాలు..
నా ఊసుల రాగాలకు

52. రససౌందర్యం ఇనుమడించాలి..మన కవితంటే
సాహిత్యవిలువలు ఆకర్షించాలి..మనస్తత్వాన్ని ప్రతిబంబించేలా

53. సంకీర్తనా సుమలేమో నీ శ్వాసలు..
మెడఒంపున ముంగురులకు గిలిగింతల సౌరభాలనిస్తూ..

54. నీ శ్వాసపరిమళంతో పులకించిపోయింది
వేరేఅత్తరులేవీ వలదంటూ మది

55. ప్రతీ క్షణం అపురూపమే..
నీవే శ్వాసై నిలిచే ఆ అమృత మధురక్షణాలలో

56. వలపు తెమ్మెరలే..
వేసంగిలో చల్లనై మదిని మురిపిస్తూ..

57. సౌందర్యసీమలెన్నని గాలిస్తావ్..
నీ శ్వాసలో సౌగంధినై నిక్షిప్తమైన నన్ను కనుగొనలేకనా..

58. చిత్తరువే అచ్చెరువయ్యింది..
చేరువైన చెలి విచిత్రాలు చేస్తోందని..

59. అల్లరే మల్లెలకి..
చనువుగా కొప్పునెక్కి సరసాన్ని సాగదీస్తూ..

60. నీరవం రవళిస్తోంది..
నీ శ్వాసకు తాళం కావాలనే..

61. ఎక్కడెక్కడో వెతికివెతికీ అలసిపోయా
నాలోనే నీవున్నావని గుర్తించక..

62. గతమయ్యిందిగా జ్ఞాపకం..
నీ శ్వాస నేను కాలేకపోయాక

63. శృతి చేసా శ్వాసని..
వాయులీనమై నీలో చేరినంతనే

64. నన్ను నేనే మరచానేమో..
రాతిరిరాణులను నిలువెల్లా శ్వాసించి

65. చిరుగాలీ చిన్నబోయింది..
చిన్నదాన్ని శ్వాసిస్తూ చిగురులా వణికావని..

66. ఏ శ్వాసనల్లుకుందో వెన్నెల..
పున్నమై ప్రకాశిస్తూ వెలుగుతోంది..

67. గుర్తించలేదా నన్నింకా
నీ గుండెకి లయనిస్తున్నా నీ ఊపిరికి శ్వాసనిస్తున్నా..

68. స్పందిస్తున్నాయిలే నవనాడులూ..
నీ సరాగ శ్వాసలకి నాదమవుతూ..

69. నిన్నటిదాకా వెదురుపుల్లనే..
నీ నిశ్వాసలోని ఊపిరులందాకే వేణువునయ్యా

70. నిన్నటి నీ శ్వాసలే..
రేపటికి నాలో ఊపిరిపోస్తూ..

71. దక్షిణలన్నీ స్వీకరిస్తాలే..
లక్షింతల శ్వాసలన్నీ అక్షంతలై నిన్నాశీర్వదించ..

72. ఋజువు చేద్దామనుకున్నా లోకానికి..
ప్రేమెప్పుడూ అనంతమేనని మనలాగా

73. మల్లలెప్పుడు తెలుసుకుంటాయో
తమలో లేని మకరందం నీలో ఉందనే నిజం

74. పాడానో విరహగీతం..
నీ ఎడబాటును గానం చేయాలనే

75. మెరుపులీనుతోందో ఆశ
మరుజన్మకైనా నీ శ్వాస కావాలని..

76. పరవశించింది ఆమని..
ఏ కోయిల కూజితానికి మైమరచిందో..

77. పరాచకాలే మల్లెలకు..
మరువాన్ని దారంలో దాచి తానే గొప్పని చెప్పుకుంటూ

78. నిముషానికి ఆయాసమే..
నిరీక్షణలో నిన్నోడించి పరుగందుకోలేనని కాబోలు..

79. నిన్నల్లోనే విడిచేసా అస్తిత్వం..
గతాన్ని శిధిలపుజాడల సమాధిచేసి..

80. మనసెప్పుడూ అలుసేగా..
విలువలెరుగని నిర్లక్ష్యాన్ని లక్ష్యమని భావించినందుకు..

81. మకుటంలేని మహరాణులే మల్లెలు..
గ్రీష్మాన్ని శరత్తుగా మార్చే మహత్తు తమదేనని కాబోలు..

82. కాలాన్ని కదపాలనే..
నా మువ్వలపాదాలతో ముచ్చటైన కబురంపాను..

83. ఎన్ని సుడిగుండాల్ని తప్పించుకోవాలో..
జీవనదిని అలవోకగా దాటాలనుకున్నందుకు..

84. చిరుగంటలు కట్టావెందుకో మెడలో..
నా ఉనికిని కనిపెట్టడానికేనేమో..

85. సౌందర్యసీమలన్నీ గాలిస్తున్నావుగా..
నీలో ఉన్న నన్ను కనుగొనలేకేనా

86. ఝల్లుమంది పరువం..
ఒంపులకు మరువంపు ఘుమఘుమలు తోడై..

87. తప్పవేమో  కొన్ని..
అన్నిట్లో గొప్పవాదం.. అవకాశావాదం అలవరచుకున్నాక

88. చెవికి పనికల్పిస్తేనేమిలే..
వదనం అరవిందమయ్యిందిగా..

89. నీ పిలుపు ప్రేమగీతమే
వాయులీనమై చెవిలో అమృతమొంపేస్తూ..

90. కన్నీరూ కావ్యాలు రాస్తోంది..
కరుణరసం నీకిష్టమని తెలిసినట్లుంది..

91. మనసుకి మేల్కొల్పులు..
కన్నుల్లో తడియారని నీ ఊహలచిత్రాలు

92. శ్వాసలు ముదిరిన సడి..
ఊపిరి ఒరవడి మొదలయ్యాక

93. వసంతోదయమయ్యింది..
శిశిరానికి మంగళం పాడి నవరాగాన్ని స్వాగతిస్తూ

94. షడ్రుచులు చిన్నబుచ్చుకున్నాయి..
పండుగనాడు సైతం అదరువైన అధరపు ఏడోరుచినే కలవరిస్తావని..

95. పదాలు ఆటవెలదులయ్యాయి..
నీ కవితలోని భావం చెప్పింది..

96. పెదవులపై పగడపుపూతలు..
నీ అరనవ్వుల రంగులు కాబోలు..

97. శిశిరానికి చోటివ్వక తప్పలేదు..
వసంతం ఆఘమేఘమై వచ్చినందుకు..

98. షడ్రుచులూ సమమయ్యాయి ఉగాదినాటికి
మనోవికారాలను తనువు జయించినందుకేమో...

99. అద్భుతానివే..
అరచేతిలో పాలపుంతను చూపిస్తూ..

100. జీవితం 'సూఫీగా' మార్చావుగా..
విషాదాన్ని పూర్తిగా పరిచయించి..

..................................... ********.....................................

No comments:

Post a Comment