Thursday, 19 November 2015

ద్విపదాలు : 2901 నుండి 2950 వరకు

..................................... ********.....................................
2901.  విషాదసంగీతాలే..
ముసుగు తీసిన చిరునవ్వులన్నీ..
2902. అపార్ధాలను రాల్చే కళ్ళు..
ముసుగు దాటి చూడకుండానే..
2903. ముచ్చటైన మేలిముసుగులే..
సమాజంలో సాటివారిగా గుర్తింపు మృగ్యమని..
2904. అలుకల నటన తేలికయ్యింది..
ముసుగులో నాటకం రక్తికడుతుంటే..
2905. చెల్లివంటూ ముసుగు..
చెలైతే బాగుండేదని మనసు రోదిస్తుంటే..
2906. ముసుగులు కొనుగోలు చేసుకు తీరాలేమో..
అవసరానికి తగినట్టు మనం మారాలంటే..
2907. అక్షరసంపద ఖర్చైపోతోంది..
నీ చిరునవ్వులు మాత్రం ఖరీదైనవి..
2908. ఆ మనసు మురిక్కాలవే..
విశ్లేషణకందని అవసరాల స్వార్ధంలో..
2909. భావాల బృందావమిప్పుడు గుర్తొచ్చిందేమో..
మౌనంలో నే నిద్దురపోయాక..
2910. నీ ఊసులన్నీ పోగేసా..
నీరవంలో నన్ను నేనోదార్చుకోవాలనే..
2911. లిపి నేర్వకుండా చేసావు..
మువ్వలతోనే ముచ్చట్లు మొదలెట్టి..
2912. ఉక్కిరిబిక్కిరవుతున్న దేహం..
సరిపడని ముసుగు వేసుకోవలసి వచ్చినందుకు..
2913. కనకాంబరంగా మారిపోయా..
సున్నితంగానే మనసును మాయ చేయాలని..
2914. గర్వపడుతున్న నా వలపులు..
ఒక్క నీ మాటతోనే
2915. మౌనాన్ని వీడలేకున్నా..
జ్ఞాపకాల్లో నిన్ను చేరువ చేస్తుందనే
2916. ప్రేమేగా దారం..
మల్లెలను మరువానికి ముడేసి పరిమళాలు పెంచే రాగం..
2917. నీ ప్రియమైన పలకరింపు..
మదిలో వెలుగురేఖల చిలకరింపు..
2918. నిన్నే అట్లతద్ది చేసుకున్నా..
మగపిల్లల ఆటలింక ఆడకూడదనుకుంటూ..
2919. చిగురాకు తొడిగిన చిన్ననాటి స్నేహం..
మారాకేసి మదిలో పెంచింది  దాహం..
2920. గుండె చెరువవుతోంది..
బరువెక్కిన భావాన్ని కాగితంపై రాయాలంటే..
2921. జోడు దొరికింది చానాళ్ళకు..
మాలికలను వండి వడ్డించేందుకు..
2922. అస్తిత్వాన్ని మరచిన ఆశలు..
అసంతృప్తిలో నిరంతరం వేగుతూ..
2923. కదం తొక్కిన ఊసులు..
నీ ప్రేమకు నీరాజనాలంటూ..
2924. వేషాన్ని మార్చుకోవాల్సొస్తుందేమో..
ఏ రూపంలో ఆమెకు నచ్చుతావోనని..
2925. మణిహారం చేసేస్తా చేతులను..
ఎప్పటికీ పెనవేతలు కొనసాగాలని..
2926. ప్రతిబింబంగా మారాలందుకే..
పగులగొట్టే ఆలోచనకు మదిలో చోటివ్వక..
2927. చాయాదేవిని చెరబట్టిన రాత్రి..
మబ్బుల్లో కలగలిసిన కోకిలగుంపులా..
2928. నన్నెవరూ చూడకూడదనే..
నీ భాగ్యానికి నలుగురూ నసుగుతారని..
2929. వివర్ణమైన విరహాలు..
వివరించకనే విహారనికొచ్చిన నీ తలపులతో..
2930. ప్రేమలోతు తెలుస్తోంది..
నీ చెక్కిలి చిరుగుంటల్లో పడ్డందుకే..
2931. తిరిగొచ్చేసా నీదరికే.
విరహమెందో ఈమధ్య ఒంటికి పడనందుకే..
2932. మొత్తుకుంటున్న మోహం..
ముద్దబంతిని కన్నులతోనే నువ్వు దోచేస్తుంటే..
2934. తలపులతోనే గాలమేస్తావు..
నాలోని వలపుకు వన్నె పెరిగేలా..
2935. తగ్గనంటున్న తాపం..
నువ్వింతగా ప్రేమించినందుకే
2936. గిచ్చుళ్ళపరం చేస్తావెందుకో మదిని..
అభిమానంతో నిన్నింత అభిషేకించినా..
2937. మెచ్చావనే గిచ్చుతున్నా..
వన్నెకెక్కిన ఒయారాలు ఓమారు చూడాలని..
2938. కొదవేముంది భావాలకు..
వెన్నెల ఒడిలో వికసించే నీకు..
2939. సుముహూర్తం కుదిరినందుకే..
ముద్దలూ ముద్దులూ ఏకమై వెన్నెలయ్యిందని..
2940. కన్నీరే మిగిలింది మదికి..
వలపువానలో ఒద్దన్నా తడిచినందుకు..
2941. మెరుపుల్లో తారకవే..
చీకట్లో వెలుగునిస్తూ..
2942. గిన్నీసు గుర్తు పెట్టుకుంటుందంటారా..
మాలికలు మరచిన నన్ను..
2943. మూతబడనంటున్న కళ్ళు..
నిద్దుర ముంచుతున్నా..నిశ్శబ్దం కరువైందనేమో..
2944. వివశాల గమకాలే..
తనువు లాస్యాలు పెదవిని కాస్తుంటే..
2945. బృందావనం బెంగపడుతోంది..
రాతిరైనా రాధమ్మ జాడ తెలియకపోతే..
2946. ముగ్ధమవుతోంది మోము..
రాగాలు మోవిని ప్రియమారా అలంకరిస్తుంటే
2947. మౌనమూ మనసవుతోంది..
నువ్వు పరిచయించినందుకేమో..
2948. నెయ్యిలానే కరిగింది చెలిమి..
చాటుగా కయ్యం కలగలిసినందుకే..
2949. పొందికయ్యింది అల్లిక..
జతలో జావళీలు జోడు కలిసినందుకే
2950. నిలువరించలేని ఆశలు..
అలలను ఆదర్శంగా తీసుకొని నింగికెగుస్తూ..
..................................... ********.....................................

No comments:

Post a Comment