Thursday, 19 November 2015

ద్విపదాలు : 2701 నుండి 2750 వరకు

..................................... ********.....................................
2701. మకరందమైన సంతోషాలు..
మదిలో సుధలు నీవల్లనేనని తెలిసాక..
2702. పారవశ్యమే మనసుకు..
సారసపు విద్యలన్నీ నాకే పంచావని..
2703. మోహించలేకున్నా మౌనాన్ని..
నీరవంలోనూ నా నవ్వులు నెలవంకలవుతుంటే..
2704. వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి..
అల్పమైన సిద్ధాంతాలకు నీరొదిలేస్తూ..
2705. నల్లపూసగా మారిన ముత్యానివేమో నీవు..
కన్నీటిలో తప్ప కంటికి ఆనకుండా..
2706. కమనీయమవుతున్న కలలు..
రాత్రికోసం పగలంతా నే వేచివుండేలా..
2707. ఇంద్రధనసు గురించి చెప్పినప్పుడే అనుకున్నా..
సరికొత్త వర్ణాలు పులుముకొనేందుకు ఆశిస్తున్నావని..
2708. తిరిగొచ్చిన వసంతాలు..
హేమంతంలో వెచ్చనైన నీ పలకరింపులు..
2709. ఊహలన్నీ దొంగిలించినవే..
ఊసులు మాత్రం రేయింబవళ్ళను మరిపిస్తూ..
2710. వేసవి వెనుదిరిగింది..
చిరుజల్లువై నన్ను ప్రేమగా ముంచెత్తాక..
2711. వెన్నెల రోజంతా కాసినట్లుంది..
ఆనందరాగం కలిసి ఆలపిస్తుంటే...
2712. భావధారలో తడిచిపోతున్నా..
నువ్వు రాసేదంతా కవిత్వమని భావించినందుకే..
2713. సశేషంగా మిగిలే జీవితాలు కొన్ని..
చచ్చినట్లు బ్రతుకుతున్నా పూర్తిగా చనిపోలేదంటూ..
2714. తడియారని హృదయాలు..
సమ్మోహన జలపాతాల నిరంతర ప్రవాహాలలో..
2715. గమ్యమెరుగని పయనం..
అపస్వరమైన జీవితాన్ని శృతిచేసుకోవడం తెలియక..
2716. మండిస్తుంది గతం అప్పుడప్పుడూ..
కుదుటపడ్డ భావోద్వేగాలను పరీక్షించేందుకేమో..
2717. అభిమానాన్ని కాపాడుకోవడం తప్పదుగా..
అవమానం జరగకుండా ఆపాలంటే..
2718. కలం కదిలి కవితయ్యింది..
కాలాలూ గాయాలూ మరపించేలా..
2719. ఊహల ప్రపంచం పిలిచినట్లుంది..
ప్రాణమయ్యి నువ్వలా రమ్మంటుంటే..
2720. మరపురాని నీ జ్ఞాపకాలు..
వెన్నెల్లో దోబూచులాడే క్రీనీడలు..
2721. లోకువయ్యా నీడకి సైతం నేడు..
నిన్నటిదాకా నావెంట నిన్ను తిప్పుకున్నందుకు...
2722. అనుసరిస్తున్న అమాసవనుకోలేదు..
నీడల్లోనే నువ్వు మాయమయ్యే వరకూ..
2723. నీలినీడల వెతుకులాటెందుకు..
తోడునై నీ వెంట లేనా..
2724. తడబడుతున్న అడుగులు..
నీడలమెట్లను అధిరోహించడం సాహసమని మరచినందుకు..
2725. నీలికన్నులు నల్లబడ్డాయి..
కృష్ణపక్షపు నీడలు నువ్వు కానుకిచ్చాక..
2726. మంచుబిందువులే నీ ఊహలు..
నిశీధినీడలపై పన్నీరు చిలకరిస్తూ..
2727. వెలిసిపోయిన నీడనే..
అమాయకంగా నిన్ననుసరించి..
2728. నీ నీడకూ అనుమానమేనేమో..
నిద్దట్లోనూ నన్నులికిపాటుకు గురిచేస్తూ..
2729. నీడకూ నిద్దరొచ్చింది...
వెలుగు కిరణమై నువ్వు వాటేసాక..
2730. రాతిరి ఒంటరిదయ్యింది..
మన ఊసులు కరువైన వెన్నెలదారుల్లో..
2731. సందేహాలే నీ మనసుకెప్పుడూ..
నిశ్శబ్దగతులలో అడుగులేసి తడబడుతూ..
2732. కురుస్తోందందుకే వెన్నెల మనపై..
మదిలో విరిసిన పువ్వులబంతిలా..
2733. ఆనందోత్సాహాలు నా మనసుకి..
నన్ను పాటగట్టి పాడావని
2734. తంగేడుపువ్వుల తుళ్ళింతలు..
బతకమ్మ ఆటపాటల్లో చోటు దొరికిందని.
2735. రాయలేని భావమేదో మిగిలున్నట్లుంది..
నీ మౌనాన్ని అనువదిస్తుంటే..
2736. నీ జ్ఞాపకాల వెల్లువ చాలేమో..
నన్ను నిలువెల్లా సంతోషంలో ముంచేందుకు..
2737. ఎదురుచూపుకు వెలుతురులేనేమో..
సిరివెన్నెల పంచే నీ కన్నులు..
2738. నీవింకా కలల్లోనే..
కేరింత కోసం నన్నెదురు చూడమంటూ..
2739. నా ప్రాణం నిలబెట్టావు..
నీ మరణానికి నే కారణం కాదని వివరించి..
2740. కలల కనుగప్పావెందుకో..
కల్పనను జోడించి కావ్యం చేస్తాననేమో..
2741. భావాక్షరాలుగా మిగిలిన కలలు..
వాస్తవంగా మారలేని నిస్సహాయతలో..
2742. ప్రశ్నావళివే..
జవాబులేని సందేహాన్ని నాకు విడిచిపెట్టేస్తూ..
2743. జ్వరమంటున్నారందరూ..
నా నిశ్వాసలు వెచ్చగా బయటపడుతుంటే..
2744. దిగులంతా మటుమాయమే..
నీ మాటలు చందనాలై పరిమళిస్తుంటే..
2745. నిద్దురలేచిన భావుకత్వమేదో..
నిన్న లేని అందంలా నాలో.
2746. సింధూరపువ్వని భావించినందుకేమో..
రెక్కలు రాలి మిగిలింది సాయంత్రానికి..
2747. వలపు సుమగంధం..
అలసిన మనసుకి అనురాగం అలదేస్తూ..
2748. నిన్ను నీకు కొత్తగా పరిచయించాలనుకున్నా..
చెలినై నీ గుండెలోనే దాగుండి..
2749. అందం అరుణిమవుతోంది..
నీవలా భావుకత్వంలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే..
2750. రాద్ధాంతం తగ్గింది..
సిద్ధాంతం పట్టుబడ్డాక..
..................................... ********.....................................

No comments:

Post a Comment