Thursday, 19 November 2015

ద్విపదాలు : 3151 నుండి 3200 వరకు

..................................... ********.....................................
3151. అనుభవం అనుభూతయ్యింది..
మదిలో భావాలను మాలికలుగా అల్లుకొని..
3152. వేసవిలోనే వేకువ..
కువకువలను సైతం యాంత్రికంగా ఆలకిస్తూ..
3153. మాటలైన భావాలెన్నో..
పెదవిని దాటి ముత్యాలై ప్రవహిస్తూ..
3154. ఉలికిపడుతున్న మౌనాలెన్నో..
అనువదించని మాటలు సడిలేని స్వప్నాలవుతుంటే..
3155. స్వేదమూ చందనమై పరిమళించింది..
చిలికింది అనురాగపు మౌనాలనే..
3156. చూపులు బాసికాలయ్యాయి..
పేరుబలాలూ పెనవేసాక..
3157. రాతిరిని గమనించానప్పుడే..
బ్రహ్మాండంతా బూజుపట్టినట్లు కృష్ణవర్ణంలో అగుపిస్తుంటే..
3158. రేపటిని నిన్నే కలగన్నావెందుకో..
వెలుగునీ నీడల్లో పాటిపెడుతూ..
3159. ఆ చిరునవ్వుల పరిమళమో మహేంద్రజాలమే..
రహస్య నివేదన కోరింది ఆరాధనే..
3160. ఒక్క మంచితనం మిగిలుంటే చాలేమో..
మొత్తం బరువునంతా మోయగలదు భూమి..
3161. నా పరిమళం అక్షయమే..
అడవిమల్లెలా నిన్ను ముసిరేందుకు..
3162. ఆనందాన్ని రాల్చేసా..
భాష్పాల భాష్యం నిన్ను చేరుతుందనే..
3163. కాలుతున్న కడుపుకే తెలుసు..
వడ్ల కోసం..వంట కోసం..ఆకలిని ఆపుకోవడం..
3164. ఇరులు మెరుస్తున్నవి నిన్నే..
చెమరింపును చూపులో పోగేస్తూ..
3165. నీరవంలోనూ శబ్దిస్తూనే ఉంటా..
నా సాంగత్యం గుర్తుచేయాలని..
3166. నేటి సంతోషం ఆవిరయ్యింది..
నిన్నటి వియోగం గుర్తుకొచ్చి..
3167. మౌనాన్ని తిరగ రాస్తావెందుకో నువ్వు..
మనసుకి వైరాగ్యం తప్పించాలని నేనెదురుచూస్తుంటే..
3168. పట్టుదలేగా స్ఫూర్తి..
కట్టెలమ్మిన చోటే పూలను తివాచిగా పరచి చూపిస్తూ..
3169. వెన్నెలను నా నవ్వుల్లో దాచేసా..
చూపుతో గిచ్చితేనే నన్ను చూస్తావని..
3170. తెల్లమొహమేసినప్పుడే అనుకున్నాను..
నా భావమొక్కటీ నిన్ను మీటనేలేదని..
3171. కన్నీరంతా కన్నుల్లోనే ఇంకిపోయింది..
లోతెరుగని నీ మనసులోకి దూకే సాహసం చేయలేక..
3172. ఒంటరి ఊహ ఎగిరిపోయినట్లుంది..
ప్రకృతి ఎదలో శబ్దాలనాలకిస్తుంటే..!
3173. మిధ్యాబింబాల జీవితాలంతేగా..
నిద్దురపొద్దులూ పద్దులనే లెక్కలు కట్టుకుంటూ..
3174.చెంపలు చప్పుడైనప్పుడే తెలుసుకున్నా..
నీ ప్రేమ రవళిస్తోందని..
3175. మౌనాన్ని ముక్కలు చేసేసా..
మనమాలపించే ఆనందాలకి అడ్డొస్తోందని..
3176. మంచిపన్లు చేయడం నేర్చానందుకే..
నేనెప్పుడూ సజీవమై ఉండాలనే
3177. హృదయాన్ని తవ్వుతున్నావెందుకో..
కన్నుల్లో కన్నీటి లోతులు కనుగొనలేనందుకా.
3178. హేమంతానికి తొందరెందుకో..
మంచువెన్నెల్లో తడిచే యోగం ముందుండగా
3179. అనురాగం అందమై మెరిసింది..
ఆనందంగా నీతో ఆలపించబట్టే
3180. మౌనాన్ని తెమ్మెర చేసేసా..
మోహావేశపు వెల్లవనై నిన్నల్లుకుందామనే
3181. తీపి గోదారినై తేలిపోతున్నా..
మదిలో ప్రవహించమని కోరావనే..
3182. రాతిరయ్యిందిగా మరి..
కలలేమో కన్నుకొట్టి రమ్మని పిలిస్తున్నవని..
3183. ఎన్ని రాత్రుల జాగారమో..
కార్తీకాన్ని శివరాత్రిగా మార్చేస్తూ.
3184. నీ పిలుపుల పారిజాతాలు..
వేకువ పారవశ్యంలో ముంచెత్తుతూ..!
3185. అణువణువూ ప్రవహించమని వేడుకుంటున్నా..
విశ్వమంతా మహసముద్రమై విస్తరించేట్టు..
3186. జీవితం ప్రవహిస్తుందిలే..
మనఃసమూహం అనుభూతై ఆహ్వానాలు పలికితే.
3187. నీ ఊసులు తలచుకుంటూనే మిగిలున్నా..
నువ్వెన్ని కోతలు కోసినా నిజమనుకుంటూ..
3188. కలతలైన కధలెన్నో..
శూన్య మందిరమై మిగిలున్న హృదయంలో..
3189. కిన్నెరసానిగా విడిపోయా..
నీ గుండెకవాటంలో దారి ఇరుకైందనే..
3190. నునుచెమటలకే చెంగల్వలు..
నీ తలపులు ఆవిర్లకు పూతొచ్చినట్లు.
3191. ఒక్కోచినుకూ ఒక్కోశబ్దమై వినబడుతున్నప్పుడే అనుకున్నా..
నీ చెక్కిళ్ళలో మృదంగమేదో దాచావని...
3192. ఆ తలపులు మరందాలే..
తుమ్మెదలా పదేపదే తిరుగాడుతూ..
3193. పెదవులు మరచిన నవ్వులేనవి..
మౌనంలో కన్నులు బయటపెడుతూ.
3194. సద్దు చేయని ముద్దులడిగా...
కనీసం కన్నులైనా మాట్లాడుకుంటాయనే..
3195. మానవత్వం ఒక్కటీ చాలుగా..
చెదిరిన మనసును హత్తుకొని చెమరింపు దూరం చేసేందుకు
3196. .జీవితమంతే..
మిణుగురు వెలుగులో దీపావళి చేసుకోమంటూ
3197. నిశ్చలమైంది నాలో సంగీతం..
జీవితం శూన్యాన్ని కౌగిలించిందనే
3198. నా మనసుకి మూగనోము నేర్పించా..
మౌనాన్ని తాను మాత్రమే చదవగలదని
3199. గుండె కవాటం తెరిచుంచా..
ఒక్క గదిలోంచీ మరో గదిలోకి నువ్వొచ్చి చేరతావనే
3200. పావురాలు గాయపడితేనేమి..
శాంతి కొరకే రెక్కలు కొట్టుకుంటున్నాయిగా.
..................................... ********.....................................


No comments:

Post a Comment