Thursday, 19 November 2015

ద్విపదాలు : 2151 నుండి 2200 వరకు

..................................... ********.....................................
2151. యాంత్రికంగానే కొన్ని జీవితాలు..
ఇష్టంగా మలచుకొనే అవకాశాలున్నా
2152. విజయసూత్రాలను ఔపాసన పడుతున్నా..
అవరోధాలను అవకాశంగా మార్చుకోవాలనే..
2153. ఎడతెగని సంతోషాలు..
నీ విరహంలో చోటు దొరికినందుకే..
2154. అరవిందమేగా మోము..
నీ తలపులతో నిద్దురకు వీడ్కోలిస్తుంటే..
2155. విరహమే నీ వలపు..
దావాగ్నిలా మనసును దహిస్తూ..
2156. ప్రతిస్పందనాలే..
జన్మజన్మల పాపాలూ మజిలీల్లేక కొట్టుకుపోతూ..
2157. అరుదైన జంటజావళి..
నీ జ్ఞాపకాల్లో నేను సజీవమై..
2158. మరుపురానిదే నిరీక్షణ..
నీ అడుగులు నను చేరేంతవరకూ..
2159. రాలిపోయిన శిశిరమే..
నిన్నుకాదని వీడిపోయిన నా మనసు..
2160. అడుగంటిన అనుభవాలు వెతుకుతున్నందుకేమో..
కొట్టుకుపోతున్న జ్ఞాపకాలను విడిచేసి..
2161. అలౌకికస్పర్శకేమో..
వేదనలన్నీ వేణువులూదినట్లుగా మారిపోతూ..
2162. చెలిమిసాగు తీపవుతుంది..
నాలుగు చేతులు కలిసి రెండైతేనే..
2163. కన్నీటికడలి ఆగనంటోంది..
చెలియలకట్ట వేసే చెలిమి చేయిచ్చిందని..
2164. నిత్యపరవశాలే మదికి..
ప్రేమలో మనసు పువ్వురేకై గుబాళిస్తుంటే..
2165. రాతిరి వెచ్చదనం తెలుస్తోంది..
గోరువెచ్చని సాహచర్యపు తాదాత్మ్యంలోనే..
2166. పాదాల్లోనూ పద్మరాగాలే..
నీకై ముందడుగేసే వెన్నెల సమయాన..
2167. రాగమొక్కటి వినిపించాలి..
మౌనాన్ని విరిచి వలపును గెలిపించేలా..
2168. ఎన్నిఅలుకలు నేర్చిందో చిలిపివెన్నెల..
సరసానికి సూత్రధారి కాలేకపోయినందుకు..
2169.శ్వాసలో కోరికను వేడుకున్నా..
నిద్దురరాని రాత్రులను వేధించవద్దంటూ..
2170. అడవిగాచిన వెన్నలనేగా..
నీడనై చాటుగా నిన్నెంత వెంటాడినా..
2171. మందాకినినేగా..
నీ తనువంతా చైతన్యమై ప్రవహించేవేళ
2172. మాటలోనూ స్పష్టత..
నీ గొంతులో నే మకరందమయ్యాక..
2173. ఏకాంతాన్ని తోడు తెచ్చుకున్నందుకేమో..
వెన్నెల్లో ఒకరికొకరం బయటపడిపోతూ..
2174. జగమెరిగిన సత్యమేగా..
ఒకరికిఒకరం మనమిద్దరమని..
2175. కన్నుల్లో ఎందుకు దాక్కున్నావ్..
మనసంతా నువ్వేనని చోటిచ్చాక..
2176. వెలకట్టలేని కానుకవే నువ్వు..
నా మనసుకు ఆభరణమవుతూ..
2177. జ్ఞాపకాలను ఆదరిస్తున్నా...
నాలో వసంతాలు  నింపుతూ బ్రతికిస్తుందని..
2178. మధురఘడియలు వెతుక్కుంటున్నా..
నీ స్మృతులలో కాలం పొద్దుపుచ్చుతూ..
2179. ప్రవచనాలుగా పల్లవిస్తాయేమో..
పరిపక్వత సాధించిన మానసిక సంఘర్షణలు..
2180. సింధువై ప్రవహిస్తోంది మది..
అణువణువూ నీలో విహరించాలని..
2181. గుబాళిస్తున్న మనసు..
మాలికగా గుదిగుచ్చి మెడలో వేసావని..
2182. కిరణాలకు దారిస్తున్నా..
నావైపు ఆకాంక్షగా ప్రసరిస్తూ ఉరికొస్తున్నాయని..
2183. నా భావం మురిసిపోతుంది..
గొలుసుకట్టుగా తనను అల్లుకున్నావని..
2184. నా మనసు చిగురిస్తోంది..
నీ భావవసంతపు చెమరింతకు ..
2185. విహంగవీక్షణమే మదికి..
నీ భావాలు గువ్వలై ఎగిరొస్తుంటే..
2186. నువ్వో మనోరంజనానివే..
గంధపు రేకుల సుగంధాన్ని మోసుకొస్తూ..
2187. నీ మనసు తీయనని తెలుస్తోంది..
పదేపదే మకరందాన్ని నాపై చిలికిస్తుంటే..
2188. నా మౌనమూ మురిసిపోతోంది..
నీ స్వరానికి నిశ్శబ్దతాళాలేస్తూనే..
2189. అనుభూతిని కవ్విస్తావెందుకలా..
అక్షరాలతో సయ్యాటలాడక...
2190. కలలోనూ కుహూనాదాలే..
నీవొస్తే వసంతమని నే భ్రమపడినందుకే..
2191. ఆగిపోదెందుకో ఊపిరి..
నీవులేని ఒంటెద్దు జీవితాన్ని లాగలేకపోతున్నా
2192. నీ ఊపిరులు..
ఎదపై జీరాడే గిలిగింతల మణిపూసలు
2193. శిశిరానికి సెలవిచ్చేసా..
కొత్త ఆశలతో చిగురించే అవకాశమొచ్చిందని
2194.  మౌనరాగాలు వింటున్నా..
నీ కన్నులు చేసే మూగసైగలలో
2195. చేమంతినై మురిసిపోయా..
కావ్యసరస్సులో తేలియాడే హృదయంలో చోటిచ్చావనే
2196. నీ కన్నుల్లో నా బొమ్మలు..
నా కనుబొమ్మలను చిత్రంగా మెలివేస్తూ
2197. సద్దు చేయనంటూ రెప్పలు..
నీ ఆర్ద్రతకు అరమూతలవుతూ..
2198. వాస్తవానికి తప్పని ఘర్షణ..
నిన్నా..నేటికి..యుగసంధిలో..
2199. రేపటికై ఎదురుచూస్తున్నా..
కన్నీరు దిగమింగి ముందడుగు వేద్దామని.
2200. ఊపిరి సైతం రాగరంజితమే..
మెడఒంపున నీ ఊసులతో..
..................................... ********.....................................

No comments:

Post a Comment