Thursday, 19 November 2015

ద్విపదాలు : 1901 నుండి 1950 వరకు

..................................... ********.....................................

1901. పుట్టినరోజెప్పుడూ పండుగే..
నీవారు గుర్తించి సంబరం చేసినప్పుడు..
1902. జన్మించాలనుంది మళ్ళీ..
నీ ఆశలను విగతం చేయరాదనే..
1903. నా మనసు ననదనవనమై విరిసింది..
నీ తలపులు పూలై వికసించగానే
1904. గెలిచేసావుగా..
నా మనసు నీదంటూనే..
1905. మనస్సందడి మానసానికే ఎరుక..
చిరునవ్వులు పెదవులవేగా మరిక..
1906. వెంటపడుతూనే కొన్ని వేదనలు..
జీవితానికి పండుగెందుకని ప్రశ్నిస్తూ..
1907. జ్ఞాపకాలను నెత్తావులుగా మోసుకొచ్చా..
నీకత్తరుగా పూసి ఆనందించాలనే..
1908. ఆ మూడురోజులూ పండుగే..
నాతో నేను ఏకమవుతూ..
1909. నిన్నటి ఊపిరి పీల్చడం మానేయాలి..
నగ్నత్వపు నునుపును పరిశీలించడం మానాలంటే..
1910. కలలు దాడి చేసాయి కన్నులపై..
నిద్రాదేవి ప్రేమగా ఒడిలో చేరదీసిందనే..
1911. స్వభావోక్తిని విడిచేసానుగా..
అతిశయోక్తిని కనిపెట్టగానే..
1912. ఏమార్చలేక నీరసించింది మనసు..
ఓదార్చుదామన్నా ఓటమే మిగులుతుంటే.
1913. ఆర్తిగా వేడుకుంటున్నాయి..
మాటలకు చోటిమ్మంటూ మనమధ్యనున్న మౌనరాగాలు..
1914. ఊగిసలాటే జీవితం..
నొప్పించక తానొవ్వక మిగలాలనే ఆరాటంలో..
1915. చెలిమిని శాశ్వతం చేసేద్దాం..
అక్షరాలసాక్షిగా మౌనాన్ని వెలివేస్తూ..
1916. అశ్రువులను దాచుకోవాలి..
ఎదుటివారి మలినాల్ని మనకన్నులతో కడిగేందుకు..
1917. బదులివ్వలేని మౌనం...
చెలిమిని శాశ్వతం చేయాలన్న ఆలోచనలోనే..
1918. అనుమానం పుట్టినప్పుడే పుట్టారు..
ఊగిసలాడుతూ నడిమధ్యన నిలిచిపోయారందుకే..
1919. మౌనం కాదిది..
అణుచుకోలేని ఆక్రోశం..
1920. మెరుపుగా వెలిగిపోతా..
మబ్బు వంకే నువ్వు చూస్తుంటే..
1921. కల్లోల సాగరాలే కొన్ని జీవితాలు..
చుక్కానిలేని పడవలో ప్రయాణం కొనసాగిస్తూ..
1922. పచ్చదనం పులుముకున్నా....
ప్రకృతిని నువ్వు ఆరాధిస్తావని తెలిసే..
1923. అతుకు వేయలేని నీ జ్ఞాపకాలు..
వేళాపాళాలేక మనసును చిందరవందర చేసేస్తూ..
1924. మువ్వన్నెల గలగలలు..
స్వేచ్ఛను సంతోషంగా గగనంలో విహరింపజేస్తూ..
1925. భావమెరుగని కన్నీరే అది...
భాష్పంగా మారి రాలిపోతూ..
1926. నీవు పరచిన తివాచీ అనుకున్నా..
నీ హృదయపు మెత్తదనం పాదాన్నంటితే..
1927. అతని గెలుపు..
ఆమె సరిహద్దుల్లో మాత్రమే గీసుకుంటూ..
1928. గులాబీనైనా కాకపోతిని..
నీ ఊహలో తానమాడి మెప్పించేందుకు..
1929. రహస్యాలెన్నీ చాలవు..
మనిషిగా మిగిలున్నందుకే
1930. బతకనేర్చినోడే నాయకుడు..
స్వాతంత్ర్యాన్ని పూర్తిగా పుస్తకాలకే పరిమితంచేసి..
1931. ప్రేమకర్ధం మారిపోతుందేమో..
అనుబంధంలో నిశ్శబ్దాన్ని లెక్కపెట్టుకుంటూ కూర్చుంటే..
1932. పువ్వై వికసించాలనుకుంది ప్రేమ..
కన్నీటితో మొలకెత్తమని శాసించకుంటే..
1933. విశేషమే మరి..
స్వాతంత్ర్యానికి కొత్త అర్ధాలు పుట్టుకొచ్చి కలిసిపోతుంటే..
1934. కనికట్టులేమీ నేర్వలేదుగా..
బంధానికి ముచ్చటైన మంత్రమేసి నిలబెట్టుకొనేందుకు..
1935. తొలకరులే కన్నుల్లో..
అమూల్యమైన నీ ప్రశంసకు ప్రతిస్పందనవుతూ.
1936. మౌనాన్ని ధరించడం మానేసా..
జ్ఞాపకాన్ని ప్రేమించడం అలవరచుకున్నందుకే
1937.  ఆనందాలన్నీ అరవిందాలే..
నీ వలపు మరందమై కురుస్తుంటే
1938. కలలోనే కొన్ని నవ్వులు..
వర్తమానం విషాదంలో కూరుకుపోతూ..
1940. ప్రేమతో మనసు గెలుచుకున్నాను..
మౌనాన్ని శిశిరానికి సాగనంపి..
1942. మిరుమిట్లే నా కలలోనూ..
కావ్యనాయికగా నీవు కదిలొస్తే..
1943. గుండె బరువెక్కుతోంది..
క్షణక్షణం నీ స్మృతులు తడుముతూంటే...
1944. మది గర్వపడుతోంది..
తాళందాచేసి బంధించేంత ప్రేమ నీకుందని..
1945. మనసుకు సంకుచితం తెలియదు..
నమ్మకాన్ని ఆచరించడం తప్ప..
1946. మనోతటాకం నిశ్చలమే..
నువ్వో మెరుపుతీగవై తొంగి చూసేదాక..
1947. కంటికి కానుకవుతా..
కాటుకలో చోటిస్తానంటే..
1948. స్వేచ్ఛ కోల్పోయిన రాగమనుకుంటా..
మౌనంగా పాడమని వేడుకుంటూ
1949. జ్ఞాపకాలెప్పటికీ పదిలమే..
మనసు ముక్కలైనా ఆరాధన నిక్కమంటూ..
1950. మనసేమో నవ్వుకుంది..
అల్లిబిల్లి చూపుల అల్లిక గమ్మత్తుగుందని..

..................................... ********.....................................

No comments:

Post a Comment