Wednesday, 18 November 2015

ద్విపదాలు : 1551 నుండి 1600 వరకు

..................................... ********.....................................

1551. అపజయానికి ఎదురెళ్ళా..
జయం ముందు నిలబడలేదని తెలిసే..
1552.  రాలిపోయేవేగా కొన్నిక్షణాలు
అందుకే అక్షరబద్దం చేసేస్తున్నా ఆపేక్షను
1553.  ప్రతీజన్మకీ కావాలి..
ఒక్కజన్మతో తీరే అనుబంధమా ప్రియతమా..!
1554. బోయిలులేని పల్లకీలో మనం..
త్రిశంకుస్వర్గంలో ఒక్కటై విహరిస్తున్నట్లుగా
1555.  గుడిసెకు కన్నమైనా ఉంది వెలుతురందుతూ..
ఎముకులకే బలంలేదు..అవసరపు తిండిలేక
1556.  నీ మౌనం గెలుస్తూనే ఉందిగా..
అలిగిన నిన్ను నేను అనునయించినప్పుడల్లా..!
1557.  ఎన్ని నవ్వుల విత్తులు పంపనూ..
ఊరంతా నవ్వులకొరతలంటూ పంచుతూ నువ్వుంటే..
1558.  వాయిదా వేయకు వర్తమానాన్ని..
భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది..
1559. ఒక్కనేనే అనేకమయ్యా..
ఆశక్తిలోనే ఆనందం వెతుక్కున్న ప్రయత్నములో
1560.  జయానికి మొదటిమెట్టే
అపజయపు పాకుడుమెట్టు
1561. పరిమళమంటిందేమో నీకు..
సస్మిత వదనసరోజాన్ని చూపులతోనే చుంబించావుగా
1562.  విధి సైతం తలవొంచాల్సిందేగా
గెలుపొందిన ధైర్యం ముందు..!!
1563.  ఏకాకిగా ఉండటమే ఇష్టమట
లోకో భిన్నోరీతికి స్పందించలేక..
1564.  ఓటమి ఒరిగిపోయింది..
విజయాల బరువుకేనేమో..
1565.  తొలికవితతో మనసుకు హత్తుకొనే..
తొలిగేయమే యెదకి తీయనిగాయమయే
1566. నువ్వంటే నాకు భయమే..
అక్షరాల తోడు తెచ్చుకున్నానందుకే..
1567. అనుభూతిస్తున్నా...
తవ్వేకొద్దీ ఉబుకుతున్న భావజలాలను గ్రోలినందుకేమో.
1568. అమృత విరహానివే
దూరమై మనసుకి మధువులు పంచుతూ..
1569. ముత్యానికే వెలుగులద్దావు..
ఆణిముత్యం నీవంటూ..!!
1570. అంతా బంధుసముద్రులే..
అవసరములో దప్పిక తీర్చలేని ఆప్తులవుతూ
1571. తేలికపడింది మనసు..
నీ వలపుహాయి పంచామృతములో తేలియాడి
1572.  ద్వేషాగ్ని కీలల్లో మండించకు మనసుని..
ఎక్కడా చల్లదనం దొరకదిక లోకంలో..
1573.  నా సర్వం నువ్వయ్యావు..
నన్ను తలచీ తలచీ..
1574.  తనివితీరని రాతలేగా అన్నీ..
ప్రతీ పుటమూ పరిమళిస్తూ
1575.  మౌనానికి మాటలొచ్చాయి..
నీ మౌనానికి భాష్యం చెప్పేందుకే..
1576. మనసంతా మాయే..
ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లూహిస్తూ..
1577. .ఎంతవిచిత్రమో..శిలల్ని శిల్పాలుగా చేస్తారు..
కనికరించకపోతే..హృదయం లేదంటారు జనాలు.
1578. చలి చురుక్కుమంది..
నీ చూపుల కత్తిని వాడుతుందేమో..
1579.  వెన్నెలదుప్పటి కప్పుకున్నాయట చుక్కలు..
రేరాజు చూపులకు తడబడేనేమో..
1580.  విషాదం విశాలమవుతోంది..
విరహపుజ్వాల మండిస్తూంటే
1581. ..నిషాని నమ్ముకోమన్నా..
హిమాన్ని తట్టుకోలేవనే
1582. ఆత్మరక్షణ కవచాలు కావాలేమో ఆడవారికి..
నిరంతరం వేటాడే డేగకళ్ళకు కనపడకుండగా
1583. భవిష్యత్తుకు నిత్యం జలుబేగా
గతాన్ని పదేపదే తోడుకొని మరీ నీళ్ళు చల్లుకుంటుంటే.
1584.  భావాలవీధులెన్నని గాలిస్తావు..
నీ నులివెచ్చని హృదయంలో సేదతీరిన నన్ను గుర్తించలేకనేనా.
1585.  అతిశయమూ అలంకారమే..
అభిమానమున్న నీకు
1586. మనసైనపువ్వువేగా నువ్వు
నిత్యం నా పూజకు సిద్ధమవుతూ
1587. జీవితమదే..
ఎండిపోయిన బీడులోంచి కూడా పచ్చగా మొలకెత్తడం
1588. జీవితమదే
కష్టాలకొలిమిలో కూడా నవ్వుతూ నిలబడటం.
1589. భాష్పాలన్నీ ఎండిపోయాయి..
వెచ్చని నీ తలపులనెగడు తగిలేనేమో.
1590. నమ్మకం నీరొదిలేసింది..
నిజాయితీకే నిలువనీడ లేదని తెలుసుకొని.
1591. వినోదాలపండుగకి ఆహ్వానించు..
నీలోనే ఉన్న నన్ను వెతుక్కోవచ్చు..
1592.  నులివెచ్చనయ్యింది హేమంతం..
రసోదయమై నీ రాకను స్వాగతిస్తూ
1593.  నిశ్చింతే కరువవుతోందిగా మనిషికి
ఎంతసేపూ జీవితాన్ని గెలుపు ఓటముల పోరాటపటిమతో స్వీకరిస్తుంటే
1594. గుండెగుండెకి ఎన్ని కధలో..
జీవితశకలాలను కదిలిస్తేనేగా తెలిసే
1595.  నాకూ ప్రాణమొచ్చింది..
శిలనైన నన్ను శిల్పంగా మలచాక..
1596. నీళ్ళే ప్రాణాధారం కదా..
అన్నం అందని అమృతమైతే..
1597. అక్షరానికి ఆనందమే..
అమృతంతో అభిషేకిస్తుంటే
1598. బృందావనం వెళ్ళుంటారు..
ఏ పెదవి మురళై పిలిచిందో
1599. గెలిచే తీరతావులే
ప్రతీమలుపులో నిన్ను మలుచుకున్నది నేనేగా
1600. సూర్యుడొచ్చి సంతకం పెట్టినా పోలేదు..
మన ముచ్చట్లకు మత్తెక్కిందేమో మంచుకి

..................................... ********.....................................

No comments:

Post a Comment